అన్నాసాహెబ్ సహస్రబుద్ధే | |
---|---|
జననం | భారతదేశం |
వృత్తి | స్వాతంత్ర్య సమర యోధుడు |
వీటికి ప్రసిద్ధి | భూదానోద్యమం |
పురస్కారాలు | పద్మ భూషణ |
అన్నాసాహెబ్ సహస్రబుద్ధే స్వాతంత్ర్యోద్యమకారుడు, గాంధేయవాది, సామాజిక కార్యకర్త. అతను వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమ నాయకులలో ఒకరు. [1] వార్ధాలోని సేవాగ్రామ్ ట్రస్ట్ కార్యదర్శిగా ఉన్నాడు. 1960 లో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ పరిశ్రమల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. [2] భూదానోద్యమంలో భాగంగా వినోబా భావే గ్రామదాన్ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినప్పుడు ఒడిషా లోని కోరాపుట్ జిల్లాలో ఆ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యతను సహస్రబుద్ధేకి అప్పగించారు . దాన్ని అతను విజయవంతంగా అమలు చేసాడు. [3] [4] ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా ఆమ్టేకి అన్నాసాహెబ్ సన్నిహితుడు . [5]
అన్నాసాహెబ్ చేసిన సామాజిక కృషికి గాను 1970 లో భారత ప్రభుత్వం అతనికి పద్మ భూషణ పురస్కారాన్ని ప్రదానం చేసింది . [6] మజి జదన్ (నా పెంపకం) అనే పేరుతో తన ఆత్మకథ రాసాడు. [7] ఆర్గానిక్ ఫార్మింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (OFAI) వారు అతని జ్ఞాపకార్థం అన్నాసాహెబ్ సహస్రబుద్ధే పురస్కారం అనే వార్షిక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. [8]