అబ్బాస్ త్యాబ్జీ | |
---|---|
జననం | బరోడా సంస్థానం, బాంబే ప్రెసిడెన్సీ | 1854 ఫిబ్రవరి 1
మరణం | 1936 జూన్ 9 | (వయసు 82)
ఇతర పేర్లు | గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
అబ్బాస్ త్యాబ్జీ (1854 ఫిబ్రవరి 1 - 1936 జూన్ 9) గుజరాత్కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. మహాత్మా గాంధీ సహచరుడు. అతను బరోడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు. చరిత్రకారుడైన ఇర్ఫాన్ హబీబ్ అతని మనవడు.[1]
అబ్బాస్ త్యాబ్జీ గుజరాత్‌లోని కాంబేకి చెందిన సులైమాని బోహ్రా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అతను షంసుద్దీన్ త్యాబ్జీ కుమారుడు. తాత ముల్లా త్యాబ్ అలీ వ్యాపారి. అతని పెదనాన్న బద్రుద్దీన్ త్యాబ్జీ, బారిస్టర్ అయిన తొలి భారతీయుడు. తరువాతి కాలంలో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసాడు. భారత జాతీయ కాంగ్రెస్ తొలినాళ్ళలో అధ్యక్షుడు కూడా.
అబ్బాస్ త్యాబ్జీ బరోడా రాష్ట్రంలో జన్మించాడు, అక్కడ అతని తండ్రి గైక్వాడ్ మహారాజా కొలువులో పనిచేసాడు. అతను ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. అక్కడ అతను పదకొండు సంవత్సరాలు నివసించాడు. అతని మేనల్లుడు, పక్షి శాస్త్రవేత్త సలీం అలీ తన ఆత్మకథలో ఇలా చెప్పాడు -
[అబ్బాస్ త్యాబ్జీ], ఒక మితవాద జాతీయవాది అయినప్పటికీ, బ్రిటిషు ప్రజల పైన గానీ, బ్రిటిషు ప్రభుత్వంపై గానీ ఎలాంటి ప్రతికూల విమర్శలు చేయలేదు. రాజు-చక్రవర్తి లేదా రాజకుటుంబం గురించి కొంచెం అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం కూడా అతనికి నచ్చేది కాదు. అతనికి స్వదేశీ గురించి బలమైన భావాలు ఉన్నాయో లేదో గానీ, ప్రవచించడం ద్వారా గానీ, పాటించడం ద్వారా గానీ అతను వాటినైతే ప్రదర్శించలేదు. ఇది ఇలా ఉంటే, అతను గాంధీజీతోను, అతని రాజకీయ సామూహిక ఆందోళన పద్ధతులతోనూ తీవ్రంగా విభేదించాడు. ఇతర అంశాలకు సంబంధించి, మితవాది ఐనప్పటికీ అతనిలో అంతర్గతంగా రగులుతూ ఉండే జాతీయతా భావం, న్యాయమూర్తిగా అతని సంపూర్ణ చిత్తశుద్ధి, నిష్కాపట్యాలను వామపక్ష కాంగ్రెసువాదులు, బ్రిటిష్ వ్యతిరేక తీవ్రవాదులు కూడా విస్తృతంగా గుర్తించారు, ప్రశంసించారు.[2]
ఇంగ్లాండ్‌లో చదువుకున్న బారిస్టరుగా, త్యాబ్జీ బరోడా స్టేట్ కోర్టులో న్యాయమూర్తిగా ఉద్యోగం పొందాడు. చక్కటి జీతానికి తోడు, వారసత్వంగా వచ్చిన ఆస్తి, ఉన్నత ప్రభుత్వోద్యోగంతో వచ్చిన గౌరవమర్యాదల వలన ఆ కుటుంబం ఉన్నత స్థాయి, పాశ్చాత్య సమాజంలో మమేకమైంది. తన కెరీర్ మొత్తం, త్యాబ్జీ రాజ్‌కి విధేయుడిగానే ఉన్నాడు. అతను తన పిల్లలను పాశ్చాత్య పద్ధతిలో పెంచి, ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్‌కు పంపాడు. కాలక్రమేణా, అతను బరోడా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి పదవీ విరమణ పొందాడు.
అతను మహిళా విద్య, సాంఘిక సంస్కరణలకు మద్దతు ఇస్తూ మహిళల హక్కులకు తొలి మద్దతుదారుగా నిలిచాడు. పరదా ఆంక్షలను పట్టించుకోకుండా తన కుమార్తెలను పాఠశాలకు పంపడం ద్వారా ఆనాటి ఆచారాలను వ్యతిరేకించాడు.[3][4] అతని కుమార్తె సోహైలా, ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్‌కు తల్లి.[1]
1917 లో గోద్రాలో జరిగిన సోషల్ కాన్ఫరెన్స్‌లో మహాత్మా గాంధీతో పాటు అబ్బాస్ త్యాబ్జీ హాజరయ్యాడు.[4] ఆ సమయంలో, పాశ్చాత్య జీవనశైలిని అవలంబిస్తూ, చక్కటి ఇంగ్లీష్ సూట్‌లను ధరించిన త్యాబ్జీని బ్రిటిష్‌నెస్ మోడల్‌గా అందరూ భావించారు.[5] 1919 లో జలియన్‌వాలా బాగ్ మారణకాండ తర్వాత, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అతనిని స్వతంత్ర నిజనిర్ధారణ కమిటీ ఛైర్మన్‌గా నియమించినప్పుడు, ఇవన్నీ మారిపోయాయి. అతను వందలాది మంది ప్రత్యక్ష సాక్షులను, రెజినాల్డ్ డయ్యర్ చేసిన అఘాయిత్యాల బాధితులను క్రాస్ ఎక్జామినేషను చేసే సమయంలో అతనికి "వికారమూ, విరక్తీ" కలిగాయి. ఆ అనుభవంతో అతను గాంధీకి విశ్వాసపాత్రుడైన అనుచరుడిగా మారాడు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యక్రమానికి బలమైన మద్దతుగా నిలిచాడు.[2][4]
త్యాబ్జీ తన పాశ్చాత్య శైలి కులీన జీవితశైలిని విడిచిపెట్టి, గాంధీ ఉద్యమానికి సంబంధించిన అనేక చిహ్నాలను స్వీకరించాడు. తన ఆంగ్ల దుస్తులను తగులబెట్టి, ఖద్దరు ధరించాడు.[5] మూడవ తరగతి రైలుపెట్టెల్లో దేశమంతటా పర్యటించాడు. సాధారణ ధర్మశాలలు, ఆశ్రమాలలో బసచేసి, నేలపై పడుకుని, మైళ్ల దూరం నడిచి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అహింసా పూర్వక అవిధేయతను బోధించాడు. అతను ఈ కొత్త జీవనశైలిని బ్రిటిష్ జైళ్లలో అనేక సంవత్సరాలతో సహా, డెబ్భై ఏళ్లు దాటిన తరువాత కూడా కొనసాగించాడు.[2][4] 1928 లో, అతను బార్డోలీ సత్యాగ్రహంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మద్దతు ఇచ్చాడు. ఇందులో బ్రిటిషు వస్త్రాలను, వస్తువులనూ బహిష్కరించరు. త్యాబ్జీ కూతురు సోహైలా, తన తల్లికి చెందిన "ఉత్తమ ఐరిష్ దుప్పట్లు, టేబుల్ కవర్లతో సహా ...", తండ్రి "అంగారఖా, చౌఘాలు, ఇంగ్లీష్ సూట్‌లు" సోహైలా స్వంతం "సిల్క్ వెల్వెట్ యొక్క ఇష్టమైన టోపీలు", తోనిండిన చేసుకున్న ఎద్దుల బండిని కుటుంబానికి చెందిన విదేశీ వస్త్రాలతో లోడ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అన్నీ కాలిపోవడానికి ఇవ్వబడ్డాయి.[1]
1930 ప్రారంభంలో, భారత జాతీయ కాంగ్రెసు పార్టీ పూర్ణ స్వరాజ్ను ప్రకటించింది. వారి మొదటి శాసనోల్లంఘన లాగానే మహాత్మా గాంధీ బ్రిటిష్ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అహింసా నిరసనను ఎంచుకున్నాడు. గాంధీని త్వరగా అరెస్ట్ చేస్తారని భావించిన కాంగ్రెస్ నాయకులు, గాంధీని అరెస్ట్ చేసినప్పుడు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించడానికి అతని వారసుడిగా త్యాబ్జీని ఎంచుకున్నారు. 1930 మే 4 న, దండికి ఉప్పు యాత్ర తర్వాత, గాంధీని అరెస్టు చేసినపుడు, త్యాబ్జీ ఉప్పు సత్యాగ్రహపు తదుపరి దశకు నేతృత్వం వహించాడు. ఈ దశలో వారు గుజరాత్‌లోని ధరసానా ఉప్పు క్షేత్రాలపై దాడి చేసారు.[4][6]
1930 మే 7న త్యాబ్జీ ధరసానా సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు, సత్యాగ్రహీయుల సమావేశంలో ప్రసంగిస్తూ, గాంధీ భార్య కస్తూర్బాతో కలిసి యాత్ర ప్రారంభించాడు. ఒక ప్రత్యక్ష సాక్షి "డెబ్భై ఆరేళ్ళ ఈ వృద్ధుడు, తెల్లటి గడ్డంతో సత్యాగ్రహ్ల శ్రేణులకు శీర్షాన నిలబడి కవాతు చేయడం, చాలా గంభీరమైన దృశ్యంగా కనిపించింది." [7] మే 12 న, ధరసానాకి చేరుకోవడానికి ముందు త్యాబ్జీని, మరో 58 మంది సత్యాగ్రహులను బ్రిటిషు వారు అరెస్టు చేశారు. ఆ సమయంలో, వందలాది సత్యాగ్రహులను కొట్టడంతో ముగిసిన ధరసానా సత్యాగ్రహానికి నాయకత్వం వహించడానికి సరోజిని నాయుడును ఎంచుకున్నారు. ఈ సంఘటనతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.[6]
1896 సంవత్సరం లో ప్లేగు వ్యాధి ముంబై ,[8] ఆ పరిసరాల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు ఏంతో మంది చని పోయారు. ఈ సమయం లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమి చేయ లేక పోయింది. అయితే ఉక్రేయన్ బ్యాక్టిరియాలిజిస్టు వాల్డెమర్ హాఫ్ కిన్ ఆధ్వర్యం లో ఒక టీకాను తయారు చేసింది . ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీ బాడీలు వృద్ధి పొంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇంత కష్ట పడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు . దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మకం లేక పోవడం, ప్రజలలో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది. ఈ సమయం లో బరోడా మహారాజ్ సయాజీ రావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రం లో పరీక్షించాలి అని పిలిచాడు , అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు . ఈ సమయం లో అబ్బాస్ త్యాబ్జీ ముందుకు వచ్చి , ప్రజలలో ఉన్న భయం , టీకాపై అపోహ పోగట్టడానికి తన కూతురి షరీఫా పై టీకా పరీక్ష చేయమని ముందుకు రావడం జరిగింది . టీకా తీసుకున్న షరీఫా ఆరోగ్య కరం గా ఉండటం తో ప్రజలలోనమ్మకం కిలిగింది . ఆ తరువాత బరోడాలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు టీకా పరీక్షించింది డాక్టర్ వాల్డెమర్ హాఫ్ కిన్ బృందం . టీకా తీసుకున్న తర్వాత తొంభైయేడు శాతం ప్లేగు మరణాలు తగ్గినవి.[9][10]
అబ్బాస్ త్యాబ్జీ 1936 జూన్ 9 న ముస్సోరీలో (ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో) మరణించాడు.[4] అతని మరణం తరువాత, గాంధీ హరిజన్ వార్తాపత్రికలో "GOM ఆఫ్ గుజరాత్" (గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్) పేరుతో ఒక వ్యాసం రాసాడు. త్యాబ్జీని ఇలా ప్రశంసించాడు:
ఆ వయస్సులో జీవితంలోని కష్టం ఎలా ఉంటుందో తెలియని వ్యక్తికి జైలు శిక్ష అనుభవించడం తమాషా కాదు. కానీ అతని విశ్వాసం ప్రతి అడ్డంకినీ జయించింది ... మానవతకు అతను అరుదైన సేవకుడు. అతను భారతదేశ సేవకుడు - ఎందుకంటే అతను మానవ సేవకుడు. అతడు దరిద్రనారాయణుడిగా దేవుణ్ణి విశ్వసించాడు. దేవుడు పూరి గుడిసెల్లో, అణగారినవారిలో కనిపిస్తాడని అతను విశ్వసించాడు. అబ్బాస్ మియా శరీరం సమాధిలో ఉంటే ఉండవచ్చుగాక అతను మన మనస్సులలో చనిపోలేదు. అతని జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.[11]