అమరావతి స్తూపం | |
---|---|
ప్రదేశం | అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 16°34′31″N 80°21′29″E / 16.5753°N 80.3580°E |
ఎత్తు | నిర్మించినపుడు బహుశా 73 m (241 ft) |
నిర్మించినది | క్రీ.పూ 3వశతాబ్దం |
అమరావతి లో గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం. ఇది ఒక పర్యాటక అకర్షణ. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది, బౌద్ధం క్షీణతతో మరుగున పడి. 1797 లో మరలా వెలుగులోకి వచ్చింది. అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకు ఈ శిల్పకళ విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాల వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి నాలుగు దశలను తెలుపుతుంది. శాసనాలు, శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నైలో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటీష్ మ్యూజియము లలో భద్రపరచబడ్డాయి.
ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, బౌద్ధమతము మౌర్య కాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), భట్టిప్రోలు, జగ్గయ్యపేట బేతవోలు,ఘంటసాల, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప నిర్మాణము జరిగింది. కార్బన్ డేటింగ్ ద్వారా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. స్తూపం క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడింది.[1] ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.[2]
అమరావతి, ధరణికోట పరిసరములలో, చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీ. పూ 4-3 శతాబ్దాలనాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్తంభాలు వెలుగు చూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచట నాగ, యక్ష తెగల జనపదం (గణతంత్ర రాజ్యం) ఉండేదని తెలుస్తోంది. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారనాథుని ప్రకారము గౌతమ బుద్ధుడు ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు.[3][4] బహుశా ఈ కారణము వల్ల బుద్ధుని మరణానంతరము అమరావతిలో గొప్పస్తూప నిర్మాణము జరిగివుండవచ్చును. మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆనంద గోత్రీయులు, చాళుక్యులు, చోళులు, కోట వంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహి నవాబులు వరుసగా ఈ ప్రాంతాన్ని పాలించారు. సా.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దము వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.
స్తూపం లేక చైత్యం అనగా బుద్ధుని, లేదా ఇతర "అర్హతుల" ధాతు విశేషాలను లేదా వారు వాడిన పాత్రలు ఒక్కోసారి కేవలం గౌరవ ప్రదంగా లేదా స్మృతి చిహ్నంగా లేదా పూజా సంకల్పంతో భద్రపరచిన నిర్మాణం. బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. దీనిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు.[5] కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి.[6]
సా.శ. 14వ శతాబ్దం తర్వాత మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికాడు. అటు తర్వాత సర్ వాల్టర్ స్మిత్ (1845), రాబర్ట్ సెవెల్ (1877), జేమ్స్ బర్జెస్ (1881), అలెగ్జాండర్ రే (1888-1909), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1958-59), యం. వెంకటరామయ్య (1962-65), ఐ. కార్తికేయ శర్మ (1973-74) మున్నగు పురాతత్వవేత్తలు సాగించిన త్రవ్వకాలలో శిథిలమై విఛ్ఛినమైన మహా చైత్యము బయల్పడింది.[7]
మహాచైత్యం ధాతుగర్భం. శాతవాహనుల కాలములో ఈ స్తూపం ఉచ్చస్థితి పొందింది. స్తూపనిర్మాణంలో 5 దశలు గుర్తింపబడ్డాయి. అలాగే ధాన్యకటకంలో 5 సాంస్కృతిక దశలు గుర్తించారు.
క్రీ. పూ. 4-3 శతాబ్దాలు. దీనిని మరల రెండు దశలుగా అధ్యయనం చేశారు. మొదటి దశలో అశోకునికి పూర్వమునుండే (క్రీ. పూ. 3వ శతాబ్ది ఉత్తరార్థం) చైత్య కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో నగిషీ ఉన్న మట్టిపాత్రలు లభించాయి. అశోకుని పూర్వపు బ్రాహ్మీ లిపిలో "ధిసపాత", "మలస" అని వ్రాసి ఉన్న పెంకులు దొరికాయి. అశోకుని శాసనమున్న రాతి ఫలకం దొరికింది. అశోకుని కాలంనాటి రాతి ప్రాకారం, ఆ రాతి స్తంభాలపై శాసనాలు లభించాయి.
ఇది అశోకుని అనంతర దశ. క్రీ. పూ. 2 శతాబ్ది నుండి క్రీ. శ. 1వ శతాబ్ది మధ్యకాలం. ఈ కాలానికి చెందిన మట్టి పాత్రలు, విద్ధాంక నాణేలు, ఇటుకలు లభించాయి. రాతిప్రాకారం సున్నపురాతితో పునర్నిర్మాణం పొందింది. అనేక శాసన, శిల్ప ఫలకాలు చెక్కబడినాయి. వైశాలి, శ్రావస్తి, కుశినగర ప్రదేశాలలోని బుద్ధుని జీవిత సంఘటనలతో కూడిన ఫలకాలున్నాయి.
క్రీ. పూ. 1-2 శతాబ్దాలు. శాతవాహనుల సీసపు, రాగి నాణేలు లభించాయి. చైత్య శిల్పకళ మహోన్నత దశను చేరింది. అచార్య నాగార్జునుడు చైత్యాన్ని పునరుద్ధరించి, అభివృద్ధిచేసి అందమైన శిల్పాలతో తిరిగి నిర్మించాడు. ఈ దశలో మూడు స్పష్టమైన చారిత్రక ఆధారాలు గుర్తించవచ్చు.
క్రీ. శ. 3వ శతాబ్ది నుండి 6వ శతాబ్ది మధ్యకాలం. ఇక్ష్వాకుల నాణేలు విరివిగా లభించాయి. కొన్ని మొక్కుబడి చైత్యాల నిర్మాణం జరిగింది.
మొదటి పల్లవుల నుండి మధ్య యుగాంతం వరకు (సా.శ. 14వ శతాబ్దం). భూమిస్పర్శ ముద్రలోనున్న బుద్ధుడు, సింహనాద అవలోకితేశ్వర, మంజుఘోష రాతి విగ్రహాలు, మైత్రేయి, మంజుశ్రీ, లోకేశ్వర, వజ్రపాణి మున్నగు రాతి విగ్రహాలు కంచు ప్రతిమలు లభించాయి. మహాయాన బౌద్ధం వజ్రయానంగా మారిన క్రమం స్పష్టంగా గ్రహించవచ్చు.
లభించిన ఆధారాల కనుగుణంగా చరిత్రకారులు, పురాతత్వవేత్తలు క్రీ. శ. 2వ శతాబ్దిలో చైత్యం ఎలా ఉండేదో అలాంటి నమూనాని నిర్మించారు. పెర్సీ బ్రౌను నిర్మించిన నమూనా చైత్యం చెన్నయి (మద్రాసు) సంగ్రహాలయంలో ఉంది. ప్రాకారం వలయాకారంలో ఉండేది. ప్రాకారంలో నిలువు స్తంభాలు (136), అడ్డకమ్మీలు (348), మదురు (244 మీ) ఉండేవి.
ఆయక వేదికలు శిల్పఫలకాలతో కప్పబడి ఉండేవి. ప్రాకారంలోని నిలువు స్తంభాలు, అడ్డకమ్మీలు, మదురు సుందరశిల్పాలతో ఉండేవి. మదురు వెలుపలి వైపున పెద్దపూలదండ శిల్పీకరించబడింది. దీనిని స్త్రీలు, పురుషులు మోస్తూ ఉంటారు. పూలదండ వంకీలలో బోధిచెట్టు, ధర్మచక్రం, స్తూప నమూనాలు ఉన్నాయి. పూలదండ మకరం నోటినుండి వెలువడుతున్నట్లు ఉంది. మదురు లోపలివైపున బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతక కథలు చెక్కి ఉన్నాయి. నిలువు స్తంభాలపై పద్మాలున్నాయి. వీటిపై భక్తులు బుద్ధచిహ్నాలను ఆరాధిస్తున్న శిల్పాలున్నాయి. జగ్గయ్యపేటలోని చిన్న స్తూపం నమూనాగా తీసికొని ఈ స్తూపాన్ని నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
మట్టిని పొరలు పొరలుగా పోసి, ఒక్కో పొరను బాగా దిమ్మిస కొట్టిన తరువాత దానిపై ఇటుకలను పేరిచి అతికి, ఆ పైన రాతిఫలకములను అతికించి స్తూపాన్ని నిర్మించేవారు. శతాబ్దాల తరబడి క్రుంగిపోకుండా స్తూపం ఉన్నదంటే మట్టిని ఎంత బాగా కూర్చారో అర్ధం చేసుకోవచ్చును. అలాగే ఒక్క చుక్కయినా నీరు లోపలికి పోకుండా శిలాఫలకాలను అతికించారు.
ప్రాకార వైశాల్యం 17,000 చ. అడుగులు, చుట్టు కొలత 600 అడుగులు. ఈ ప్రాకారం రెండువైపులా ఎంతో అందమయిన శిల్పాలున్నాయి. ఆ శిల్పాల సందాల కారణంగానే ఈ వెలుపలి ప్రాకారానికి దీటు వచ్చేది హిందూదేశంలో మరెక్కడా కానరాదని పరిశోధక పండితుల అభిప్రాయం. ఈ ప్రాకారాన్ని రాతి కట్టడం లాగా కాకుండా చెక్క కట్టడంలాగా నిర్మించారు. ప్రాకారం అంతా నిలువు రాతి స్తంభాలతో ఏర్పడింది. రెండేసి నిలువు స్తంభాలకు మూడేసి అడ్డ రాతి కమ్మలు బిగించారు. స్తంభం పైన "కుసులు" (ముడులు?)గా తీర్చి దిద్దారు. ఈ కుసులను ఆ పై రాతి దూలాలలో తొలిచిన తొలలలో (తొర్రలలో) దూర్చబడ్డాయి. ఇలా పైన ఉండే రాతి దూలాలు ప్రాకారం పైన అంచులాగా ఏర్పడ్డాయి. అది ఉష్ణీషము (తలపాగా) లాగా ఉండడం వలన దానిని ఉష్ణీషము అని వ్యవహరించేవారు. ఉష్ణీషం వెలుపలినైపున పూలదండలను మనుష్యులు మోస్తున్నట్లుగాను, ఆ ఉష్ణీషం వెడల్పు పెరిగిన చోట దాగొబా, బోధివృక్షం, త్రిరత్నాలు, నాగములు, యక్షులు వంటి చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.
నాలుగు ప్రక్కలా నాలుగు ద్వారాలున్నాయి. ఒకో ద్వారం వెడల్పు 26 అడుగులు. పొడవు 16 అడుగులు. అరుగు నుండి ద్వారానికి రెండు ప్రక్కలా మూడేసి నిలువురాతి స్తంభాలున్నాయి. ఈ ప్రాకార ద్వారా స్తంభాలపై వెనుకటి కాళ్ళమీద కూర్చున్నట్లు సింహాల ప్రతిమలున్నాయి.
అండమునకు దిగువ భాగము వేదిక (ఆరుగు లాంటిది). వేదిక ఎత్తు ఆరడుగులు. ఈ వేదిక ఉపరితలంపై కప్పిన శిలాఫలకాలపై చక్కని అనేక చిత్రాలను చెక్కారు. అలా చెక్కబడినవాటిలో అమరావతి చైత్యం ఆకృతినే వారు చెక్కడం మన అదృష్టం. ఆ శిలా ఫలకాల మూలానే మనకు నేడు అమరావతి చైత్యం ఆకారం తెలియవస్తున్నది.[6] ఇలాంటి ఫలకాలలో ఉత్తమమైనదొకటి మద్రాసు మ్యూజియంలో ఉంది. ఈ వేదిక నాలుగు దిక్కులలో అరుగు ముందరకు వచ్చినట్లు, ఆయా నాలుగు ద్వారాలకు ఎదురుగా, నిర్మింపబడింది. ప్రాకారాలకంటే వేదిక రాయి మెత్తనయినది గనుక వేదిక రాతి ఫలకాలమీద చెక్కిన శిల్పాలు మరింత ప్రశస్తమయినవి. వీటిలో దాగొబాలు (చైత్యం నమూనాలు), నాగములు వంటి శిల్పాలున్నాయి. దాగొబాలు చెక్కిన ఫలకాల కుడియెడమల విడి రాళ్ళమీద చెక్కిన స్తంభాలున్నాయి. వాటిలో బోధివృక్షము, ధర్మచక్ర పరివర్తనము, మార ప్రలోభనము వంటి శిల్పాలు ఉన్నాయి.
వేదికకు పొడుచుకు వచ్చినట్లున్న నాలుగు అరుగులపైన, అంటే ద్వారాలకు ఎదురుగా, ఐదేసి ఆయక కంబములు (ఆర్యక స్తంభములు - పూజనీయ స్తంభాలు) ఉన్నాయి. అంటే మొత్తం 20 స్తంభాలున్నాయి. ఇలా ఒక్కో దిక్కున అయిదేసి స్తంభాలుండడం ఆంధ్రదేశం లోని స్తూపాలలో కనిపించే విశేష లక్షణం. ఈ ఐదు స్తంభాలు బుద్ధుని జీవితంలో పంచ కళ్యాణములు (బుద్ధావతరణము, మహాభినిష్క్రమణము, మార ప్రధ్వంసము, సంబోధి, ధర్మ చక్ర పరివర్తనము, మహాభినిష్క్రమణము ) అనబడే ఐదు ఘట్టాలకు ప్రతీక. ఈ స్తంభములుమతసంబంధములైన పూజ్యభావములకు చిహ్నములు గనుక సందర్శకులు ముందుగా వాటకి మ్రొక్కి ఆ తరువాత చైత్యమునకు ప్రదక్షిణ చేయువారు - ఇలా వాటిపేరు "ఆయకకంబములు" అయినది.
స్తంభము అడుగు చతురస్రాకారంగాను, మధ్యభాగం అష్టకోణాకారంగాను ఉండగా పై భాగం చూళిక (Capital) అండంరూపంలో ప్రతి దిక్కున తోరణంగా మలచబడింది. దీనికే చైత్యతోరణం అని పేరు. చూళికల పైభాగంలో జెండాలు పెట్టడానికి గుంటలుగా తొలిచారు. ఈ తోరణాల దిగువ భాగం గూళ్ళగా మలచబడి, ఆ గూండ్లలో యక్ష ప్రతిమలు చెక్కారు. ఈ గూండ్లకు చైత్య వాతాయనములని పేరు. అమరావతి చైత్యవాతాయనములలో చెక్కబడిన యక్ష ప్రతిమలు అత్యంత సుందరమైనవని, ఇట్టి కళా కౌశలానికి సరివచ్చేవి మరెక్కడా కానరావని కళావిమర్శకుల అభిప్రాయం.[6]
అండము వేదిక పైన ఉంటుంది. అండం చుట్టు కొలత 435 అడుగులు, వ్యాసం 142 అడుగులు, ఎత్తు 20 మీ. చైత్యానికి ప్రదక్షిణం చేసేటపుడు కనిపించే బౌద్ధ ధర్మ చిహ్నాలు అండం దిగువ భాగంనుండి ఆరంభమౌతాయి. క్రింది వరుసలో బోధివృక్షం (జ్ఞానదీక్ష చిహ్నంగా) శిల్పాలు, ఆ పై వరుసలో ధర్మ చక్రం చిహ్నాలు (జ్ఞానబోధ చిహ్నంగా), ఆ పైని వరుసలో స్తూపం (బుద్ధుని నిర్వాణం చిహ్నంగా) చెక్కబడినాయి. దిగువ వరుసలో మధ్య మధ్యలో (పూర్తి ఫలకం పట్టుటకు వీలు లేని చోట) పూర్ణ ఘటకములను చెక్కిన శిలాఫలకములను అతికి "ఆబద్ధము" చేశారు. కనుక వీటికి "ఆబద్ధమాల" (ఆ సమంతాత్ బద్ధ మాలా) అని పేరు. శాసనాలలో ప్రాకృతంగా "అబతమాల" అని పేర్కొన్నారు.
ఈ మూడు వరుసలకు ఎగువగా సింహ ప్రతిమలు చెక్కబడినాయి. వాటికిపైన త్రిరత్నములకు చిహ్నంగా త్రిశూలాలవంటి శిల్పాలు ఉన్నాయి. వాటికిపైన పుష్ప మాలికలు, ఆ పుష్పమాలికల మధ్య చిన్ని చిన్ని వృత్తాలలో బుద్ధ జీవిత గాథలు చెక్కబడ్డాయి. వాటికి పైన "హర్మిక" మొదలవుతుంది.
హర్మిక, అండానికి పైని, గళము (ఛత్రం నిలిపే కడ్డీ)కు ఆధారంగా ఉంది. ఇది చతురస్రంగా, ఒక పెట్టెవలె, ఉండే నిర్మాణం. ఈ హర్మిక అంతర్భాగంలోనే బుద్ధుని ధాతువులు నిక్షప్తమై ఉండేవని కొందరి అభిప్రాయం. హర్మిక ప్రక్కటంచులలో (సాంచీ స్తూపం వలె) చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.
ఇలా చైత్యం వివిధ భాగాలలో చెక్కబడిన శిలాఫలకాలే కాకుండా విడివిడిగా ఉన్న విగ్రహాలు, చాలావరకు శిథిలమైపోయినవి, లభించాయి. వీటిలో బుద్ధుని విగ్రహములే కాక ఇతర విగ్రహాలు (యక్షులవి కావచ్చును) కొన్ని ఉన్నాయి. వీటిలో తల లేని విగ్రహమొకటి ఎవరిదోనని పురాతత్వశాస్త్రజ్ఞులలో కొన్ని విభేదాలున్నాయి. ఆ విగ్రహం చేతిలో పద్మములవంటి పుష్పాలున్నాయి. అది గౌతమీపుత్ర శాతకర్ణిదన్న అభిప్రాయం కూడా ఉంది. కాని అది బహుశా బుద్ధుని విగ్రహం కాని, లేదా బుద్ధుని పూజింపడానికి వచ్చిన యక్షుని విగ్రహం కాని కావచ్చును.[6]
విడిగా లభించిన శిల్పాకృతులలో బుద్ధుని పాదాలు విశేషంగా పేర్కొనదగినవి. ఈ శ్రీపాదాలలో స్వస్తిక చిహ్నము, సహస్రార చక్రము, త్రిరత్న చిహ్నమైన త్రిశూలము కనుపిస్తున్నాయి.
పౌర్ణమి, అమావాస్యలలోను, ఇతర ఉత్సవాలలోను ఈ చైత్యం మొత్తాన్ని వేలకొలది దీపాలతో అలంకరించేవారు. రాత్రులలో ఇది దీపాల తిమ్మెలాగా కనిపించేది. ఇందువల్లనే ఈ స్తూపంనకు "దీపాలదిన్నె" అని పేరువచ్చి ఉండవచ్చును.
మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. మహాచైత్య గర్భంలో లభించిన మొదటి మంజూషిక శిలాపేటిక. గొవింద్ అంటే ప్రాణం ఇందులో ఒక స్ఫటికపు మంజూషిక, అందులో ఒక ముత్యం, స్వర్ణపత్రాలు ఉన్నాయి. రెండవ మంజూషిక మహాచైత్య పరిధిలో లభించిన గుండ్రని మట్టిపాత్ర. 3 1/2 అంగుళాల ఎత్తున్న స్వర్ణ అవశేషం, ఛత్రం ఉన్నాయి. ఈ కరండానికి మూత, గిన్నె ఉన్నాయి. గిన్నెలో శల్యశకలం, దంత వస్తువులు, బ్రాహ్మీ లిపిలో ఉన్న ముద్రిక, ఆరు చిన్న స్వర్ణపుష్పాలు ఉన్నాయి.
మూడు నుండి ఏడవ మంజూషిక వరకూ అన్నీ స్ఫటికపు కరండాలు. ఈ ఐదు మంజూషికలు దక్షిణ ఆయకవేదికకు అమర్చిన శిలాఫలకంలోని రంధ్రాలలో లభించాయి. ప్రతి మంజూషికలోనూ ఒక శల్యశకలం, స్వర్ణపుష్పాలు, ముత్యాలు, కోరల్ పూసలున్నాయి. ఎనిమిదవ స్ఫటికపు మంజూషిక పశ్చిమ ఆయకవేదిక పునాదిలో ప్రదక్షిణాపథానికి 35 సెం.మీ లోతున లాభించింది. మంజూషిక ఎర్రటి కుండలో ఉంది. పన్నెండు గుండ్రటి శంఖపు పూసలు, ఒక శిలాస్ఫటికపు గొలుసు, అస్ఠికతో తయారైన గొలుసు, నీలపు బెరిల్ పూసలు ఉన్నాయి. తొమ్మిదవ మంజూషిక స్ఫటికపు కరండం. తూర్పు దిశలోని ఆయక వేదికపైని సున్నపు స్లాబ్ లో 42సెం.మీ గుండ్రటి రంధ్రంలో దొరికింది. ఎనిమిది ముత్యపు పూసలు, ఒక స్ఫటికపు పూస ఉన్నాయి. పదవ మంజూషిక దంతపు పేటిక. లభించినవి పేటిక ముక్కలు మాత్రమే.
ధాన్యకటకములోనిది మహావిహారం. అనగా ఒకే ప్రాకారంలో అనేక విహారాలున్నాయి. హుయాన్ త్సాంగ్ వ్రాతలలో 'పూర్వశైల సంఘారామం' అనబడింది. ఒక శాసనం ప్రకారం పాటలీపుత్ర బౌద్ధ భిక్షువుల కోసం ఒక ప్రత్యేక విహారముంది. మహాచైత్యానికి నైరుతీ దిశలో ఉన్న నేటి బచ్చలమ్మ గుడి ముందున్న కుంటను మంజుశ్రీ విహారంగా గుర్తించారు. విహారంలో దేశ విదేశాలనుండి వచ్చిన శ్రమణులు, పండితులు, యాత్రికులు, భిక్షువులు వివిధ అంగాలను అభ్యసించేవారు. ధమ్మమేకాక లౌకిక విషయాలపై కూడా బోధన, పరిశోధన జరిగేవి. ఖగోళ శాస్త్రము, జ్యోతిష్యము, న్యాయము, వ్యాకరణము, తర్కము మున్నగు శాఖలలో బోధన జరిగేది.
విశ్వవిద్యాలయములో 8000 మంది ఉన్నతవిద్య నభ్యసించడానికి అవకాశాలుండేవి. నలందా విహారము తర్వాత పెద్ద విహారమిదే. ధాన్యకటకవిద్యాపీఠం నమూనాగా టిబెట్ రాజధాని లాసాలో డాపంగ్ విశ్వవిద్యాలయము నిర్మించబడిందని లామా తారానాథుడు పేర్కొన్నాడు.[5] అశోకుడు పంపిన మహాదేవభిక్షు ధాన్యకటక చైత్యశాలలో నివసించి ధర్మప్రచారం చేశాడు. బోధిసత్వమంజుశ్రీ ఇచటినుండే పరిసరారణ్యములోని నాగజాతి ప్రజలకు బౌద్ధం బోధించినట్లు, 'బోధిచర్యావతారం' అనే గ్రంథానికి జన్మభూమి అయినట్లు 'గండవ్యూహ' అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది.
ఆచార్య నాగార్జునుడు ఇచటి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిథిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇరవై విహారాలలో మాత్రం బౌద్ధ సాంఘికులు నివసిస్తున్నట్లు వ్రాశాడు.[5] అనగా అప్పటికే వైదికమతము పుంజుకున్నట్లు తెలుస్తున్నది. క్రీ. శ. 1344నాటి గదలదేనియ (కాండీ, శ్రీలంక) శాసనం ప్రకారం బౌద్ధ థెర ధర్మకీర్తి రెండంతస్తుల విహారానికి జీర్ణోద్ధరణ చేశాడు.
ధాన్యకటకంలో నాగార్జునుని కాలంనుండి మహాయానమే ముఖ్యసంప్రదాయమైనా గాని, ఇతర సంప్రదాయాలు కూడా ఆదరణ పొందాయి. వజ్రయానం విస్తరించినపుడు కూడా తాంత్రిక పద్ధతులకు ధాన్యకటకం ప్రధాన కేంద్రంగా ఉండి ఉండవచ్చును. ఎందుకంటే ఇది దక్షిణాపథంలో తంత్రప్రతిష్ఠాపనములకు చాలా పేరు పొందిందని టిబెట్ దేశపు బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. "దశవలుడు" అనే బౌద్ధ సాధువు శ్రీధాన్యకటకం చైత్యం వద్ద తంత్రములన్నీ నేర్చుకొన్నాడట.[5] "మాతృ తంత్ర కాలచక్రము" ఈ ధాన్యకటక చైత్యం దగ్గరకు చేర్చబడిందని, ఇక్కడ బుద్ధుడు కాలచక్రమనే ధ్యాన సమాధిలో కూర్చున్న చోట "వజ్రపాణి" అనే బోధిసత్వుడు దివ్యమైన రమ్య హర్మ్యమును తన మహిమతోనే నిర్మించెనని, టిబెట్టు బౌద్ధ గ్రంథాలలో ఉంది. ఈ టిబెట్ గ్రంథాల ఆధారంగానే నాగార్జునుడికి ఇక్కడ మహాకాలతంత్రం లభించిందని గాథలు ఉన్నాయి.
స్తూప సమూహములో భిక్షువులకు ఆవాసములు, విద్యాసంబంధిత కట్టడాలుకూడ ఉన్నాయి. వీటిలో చాలవరకు స్థానికుల, భక్తుల విరాళాలతో కట్టబడ్డాయి. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ స్తూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్తూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్తూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". అమరావతి శిల్ప, శాసనాలవల్ల ఆ కాలము నాటి వృత్తులు, కులాలు, కుటుంబ వ్యవస్థ, ఐహిక జీవితం, స్త్రీల స్థానం, వస్త్ర సంస్కృతి, మతం, ఇతర సామాజిక స్థితులు విశదంగా వెల్లడవుతాయి. అమూల్యమైన ఈ శిల్పకళాఖండాలు కొన్ని బ్రిటిష్ మ్యూజియములో చూడవచ్చును.[8][9]
శిల్ప దశలు: అమరావతి స్తూపం నిర్మాణంలో వివధ దశలున్నట్లే శిల్పరీతులలోను వివిధ సంప్రదాయాలు గోచరిస్తాయి. మొదటి దశలోని శిల్పంలో బుద్ధుని కథావిన్యాసము సంగ్రహంగా చూపబడింది. అనగా సామాన్య జనులకు బుద్ధుని గురించి, అతని బోధలగురించి అవగాహన కలిగించడానికి బుద్ధుని కథలు సంకేత రూపంగా చెప్పబడ్డాయి. ఉదాహరణకు బుద్ధుని జననాన్ని పద్మంతోను, మహాభినిష్క్రమనాన్ని గుఱ్ఱంతోను, సంమ్యక్సంబోధిని బోధివృక్షంతోను, బోధనను ధర్మచక్రంతోను - ఇలా చూపారు. అప్పటికి ఇంకా బౌద్ధమతంలో సాహిత్యం, శిల్పం పూర్తిగా ప్రభవించలేదు గనుక శిల్పులు తమ సంకేతాలను తామే రూపొందించుకోవలసివచ్చి ఉండవచ్చును. తరువాతి కాలంలో చెక్కబడిన శిల్పాలు మరింత మనోహరమైనవి.
దేశీయం: అమరావతి శిల్పకళ ప్రధానంగా దేశీయమైనది. గ్రీకు శిల్పకళ గురించి అమరావతి శిల్పులకు పరిచయమున్నట్లు అనిపిస్తుంది. కాని బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను ఆంధ్రదేశపు శిల్పుల ప్రత్యేకత, నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీ ప్రతిమలను చెక్కడంలో అమరావతి శిల్పి స్వేచ్ఛ, కళానిపుణత అద్భుతమైనవి. కొన్నిచోట్ల నగ్నంగా స్త్రీలను చెక్కినా గాని, ధార్మిక భావనకు భంగం వాటిల్లకుండా, బుద్ధుని గాథతో వాటికి సంబంధం లేకుండా చెక్కారు.[6]
సంగీతం, నృత్యం: సంగీత, నృత్య కళాసంబంధమైన శిల్పాలు కూడా అమరావతి శిల్పాలలో చాలా ఉన్నాయి. అనేక విధాలైన వాయిద్యాలు, భంగిమలు ఉన్నాయి. వేణువు, తాళములు, ఒక విధమైన వీణ (Harp), సితారు. తాళపుచిప్పలు, మృదంగము, తబలా, ఢక్కి, ఖంజిర, తప్పెటలు, వీరణము - ఇలా ఎన్నో వాయిద్యాలు శిల్పాలలో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో వాడే హార్ప్ (Harp) అమరావతి శిల్పాలలో అతి సాధారణంగా కనిపించడం ఒక విశేషం.
ప్రజల జీవనానికి, ప్రధానంగా క్షాత్ర జీవనానికి చెందిన అనేకానేక శిల్పాలు అమరావతిలో కనిపిస్తాయి. సైన్యము, రథములు, గుఱ్ఱములు, ఆయుధాలు,, ఆయుధ ధారుల వేషభూషాలు - ఇటువంటి చాలా సమాచారం అమరావతి శిల్పాలద్వారా తెలుస్తున్నది. ధనుస్సు, బాణము, ఈటె, ఖడ్గము, డాలు, చక్రము, బల్లెము వంటి ఆయుధాలనుపయోగించేవారని తెలుసుకోవచ్చును. ఒంటెలను కూడా యుద్ధాలలో వాడినట్లు చూపడం మరొక విశేషం. అలాగే వివిధములైన వేష భూషాదులను, శిరోజాలంకరణ పద్ధతులను అమరావతి శిల్పాలలో గమనించవచ్చును. సామాన్యులు, ప్రభువులు, భిక్షుకులు, ఆడువారు, మగవారు - ఇలా ఒకో రకం ప్రజలు వేసుకొనే దుస్తులు, ధరించే ఆభరణాలు, చేసికొనే అలంకారాలు ఈ శిల్పాల కారణంగా మనకు తెలుస్తున్నాయి. అమరావతి శిల్పాలలోని స్త్రీమూర్తులను గమనించినట్లయితే ఆ కాలపు స్త్రీలు సౌందర్య, శృంగారములమీద ఎంతటి శ్రద్ధ వహించేవారో అని ఆశ్చర్యం కలుగక మానదు.
అప్పటి కట్టడాలు, ద్వారా తోరణాలు, గడ్డితో కప్పిన గుడిసెలు, రాజ భవనాలు, ఇటుకలతో కట్టిన గోడలు, మేడలు, మిద్దెలు - ఇవన్నీ అమరావతి శిల్పాలలో చూడవచ్చును. ఉద్యానవనాలలో చలువరాతి వేదికలుండేనవి, నాటిలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించేవారని తెలుస్తున్నది. పెద్ద భవనాలకు చిత్రవిచిత్రమైన అలంకారాలతో కూడిన పెద్దపెద్ద ద్వారాలుండేవి. బౌద్ధభిక్షువులుండే కట్టడాల నిర్మాణాలలో వారి జీవనానికి అనుకూలమైన అమరికలను, విభాగాలను గమనించవచ్చును.
"ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్యాలంకార విషయమున కలిగించిన ప్రతి పరిణామము ఇప్పటికి షుమారు రెండువేల యేండ్ల క్రిందనే విలసిల్లిన అమరావతి కళలోనే గోచరించుట ఆశ్చర్యకరము."[6]
కళాక్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైనది. వీటి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట.[10] అమరావతి శిల్ప కళారీతి (Amaravati school of art) శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని నిర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం.[11]
డా. ఉల్రిక్ వాన్ ష్రోడర్ (Dr. Ulrich Von Schroeder) అనే అధ్యయనకారుడు శ్రీలంకలోని బౌద్ధ శిల్పంపై కూలంకషమైన మౌలిక పరిశోధన చేసి తన అధ్యయనాన్ని విస్తారమైన ఆధారాలతో ప్రచురించాడు. శ్రీలంక లంకలోని వవిధ నిర్మాణాలలోని సున్నపురాయి శిల్పాలను వాటి కొలతలతో సహా జాబితా తయారు చేశాడు. అతని ప్రచురణలోని అధ్యాయాల పేర్లు "ప్రారంభ అమరావతి రీతి కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from Early Amaravati School), "అనంతర అమరావతి రీతి (నాగార్జున కొండ) కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from late Amaravati (Nagarjunakonda)). దీన్నిబట్టి అమరావతి, నాగార్జునకొండలలోని శిల్పులు శ్రీలంకకు, ఇతర దక్షిణాసియా దేశాలకు బౌద్ధ, ఇతర శిల్పాలను ఎగుమతి చేస్తుండేవారని స్పష్టంగా తెలుస్తున్నది.
వ్యాపార వర్గాల మధ్య సంబంధాలు, అనుబంధాలు నెలకొనడానికి మతైక్యత ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ విధంగానే బౌద్ధ, హిందూ శిల్పాలు ఆగ్నేయాసియా, శ్రీలంక వంటి ప్రాంతాలకు ఎగుమతి అవడం సుగమం అయి ఉండవచ్చును.[12] సెలెబస్‌లోని సెంపాంగా (Sempaga in Celebes)లో అమరావతి రీతిలోని కంచు బుద్ధవిగ్రహం లభించింది. సియాంలోని డోగ్-డువోంగ్.డోంగ్‌టక్ (Dong-Duong. Dong Tuk (Siam))లోని ప్రారంభకాలపు శిల్పాలు అమరావతి రీతిలో చెక్కబడ్డాయి. సెలెబస్ పశ్చిమ తీరంలోని దక్షిణ జెంబర్ (South Djember), సికెందంగ్ (Sikendeng) లోని కంచు బుద్ధవిగ్రహం, బుకిట్ (Bukit) లోని పెద్ద బుద్ధ విగ్రహం పూర్తిగా అమరావతి శిల్ప రీతులలో ఉన్నాయి. ఇవి ఆంధ్ర ప్రాంతంనుండి వలస వచ్చినవారు తెచ్చి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పాలెంబాంగ్ (Palembang) అనబడే చోట ఉన్న చాలా పెద్ద రాతి బుద్ధ విగ్రహం రవాణా చాలా కష్టమై ఉండాలి. ఈ ద్వీపకల్పంలో ఇది అన్నింటికంటే పాతదనిపించే అమరావతి శిల్పం. మచిలీపట్నం, ఘంటసాల వంటి రేవు పట్టణాల ద్వారా ఇండినేషియాకు అమరావతి శిల్పులతో సంబంధాలు వర్ధిల్లి ఉండాలి
అమరావతి శిల్పచిత్రాలు వాటి యోగ్యత వల్లనే దిగంత విశ్రాంతములయినవి. భారతీయ శిల్ప కళావిన్యాసంలో "అమరావతి రీతి" అనే పేరు మీద ఒక విశిష్ట కళా విభూతికి సూత్రములు పన్నిన ప్రాచీనాంధ్ర శిల్పాచార్యులు రచించిన కృతుల గొప్పదనానికి అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ వంటి చోట్ల బయటపడిన భగ్న శిల్ప శిథిలాలే నిదర్శనాలు.[5]
ధాన్యకటకములో లభించిన శాసనాలు ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలోలభించాయి. ఈ శాసనాలు బ్రాహ్మీ, ఇతర లిపులలో ఉన్నాయి. వీటిలో చాలావరకు దాన శాసనాలు. శాసనాలలో తెలుగు లిపి పరిణామక్రమంలో నాలుగు దశలు గుర్తించవచ్చు.
" ...... ....... సెనగపస ముడకుతలస ధభో .........."
(......... సేనాధిపతియగు ముడకుతలుని (ముడుకుంతలుని) స్తంభము .......)
గుంటూరు జిల్లాలోనిదే అయిన భట్టిప్రోలు స్తూపం ధాతుకరండం శాసనాలు మాత్రమే అమరావతి లిపికి దగ్గఱగా కానవచ్చే మొదటి శాసనాలు. భట్టిప్రోలు శాసనాలనుబట్టి బ్రాహ్మీలిపి కృష్ణానదీప్రాంతంలో క్రీ.పూ.3వ శతాబ్ది (ఆశోకునికి పూర్వమే) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాని అమరావతి లిపిలోని ద, ధ, భ, చ, జ, ష, ళ వంటి కొన్ని అక్షరాలు అశోకుని కాలపు లిపికి దగ్గఱగా ఉన్నాయి.[6]
అమరావతి శాసనాలలో వాడిన భాష ప్రాకృతం. దీనికి, వ్యాకరణ శాస్త్రజ్ఞుల పైశాచీప్రాకృతానికి దగ్గరి సంబంధం ఉంది. కాశ్మీరదేశ గాథననుసరించి పైశాచీప్రాకృతమున బృహత్కథను రచించిన గుణాఢ్యుడు ఆంధ్రరాజస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు. ఆ గాథనుబట్టి ఆంధ్రరాజ్యమున పైశాచి భాషలో కృషి జరుగుతున్నట్లు ఊహించడానికి ఆస్కారం ఉంది.
ఈ శాసనాలలో రాజవంశములకు (చరిత్రకు) సంబంధించిన విషయాలు ఏమీ తెలియడంలేదు. ఆంధ్ర రాజులలో వాసిష్ఠీపుత్ర శ్రీ పుళుమావి, శివశ్రీశాతకర్ణుల శాసనాలు మాత్రమే లభిస్తున్నాయి. ఆచార్య నాగార్జునుని మిత్రుడు అయిన ఆంధ్రరాజు వాసిష్ఠీపుత్రుడేనని, నాగార్జునుని ప్రోత్సాహంతో ఆంధ్రరాజులు ఈ మహానిర్మాణానికి మరిన్ని సొబగులు అందించారని భావించవచ్చును.
చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో అమరావతి స్తూపం సందర్శించునాటికి క్షీణదశ ప్రారంభమైనది. ఐతే సా.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల సా.శ. 1700 నాటికి స్తూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు. ఈ స్తూపం కోల్పోయిన వైభవం గురించి సుప్రసిద్ధ చరిత్ర కారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ ఇలా వ్రాశాడు.[5]
{{cite book}}
: CS1 maint: extra punctuation (link)
{{cite book}}
: CS1 maint: location missing publisher (link)