అయోధ్య ప్రసాద్ శర్మ

అయోధ్య ప్రసాద్ శర్మ
లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు
In office
1953–1959
అంతకు ముందు వారుతులసీ రాం శర్మ
తరువాత వారుబి.డి.లక్ష్మణ్
వ్యక్తిగత వివరాలు
జననం(1909-04-30)1909 ఏప్రిల్ 30
బుటానా, రోహ్‌తక్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం
మరణం1972 ఫిబ్రవరి 28(1972-02-28) (వయసు 62)
లౌటోకా, ఫిజీ[1]
రాజకీయ పార్టీనేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిజీ
నైపుణ్యంరైతు, కార్మిక నేత

అయోధ్య ప్రసాద్ శర్మ (1909 ఏప్రిల్ 30 – 1972 ఫిబ్రవరి 28) ఇండో-ఫిజియన్ రైతు నాయకుడు, రాజకీయ నాయకుడు. అతను ఫిజీలో అత్యంత విజయవంతమైన రైతు సంఘాన్ని స్థాపించాడు. ఫిజీ ఆర్థిక వ్యవస్థను 60 సంవత్సరాల పాటు పూర్తిగా నియంత్రించిన కలోనియల్ షుగర్ రిఫైనింగ్ కంపెనీపై వత్తిడి తెచ్చి, రైతులకు రాయితీలు కల్పించేలా చేసాడు. అయితే, ఇతర ఇండో-ఫిజియన్ నాయకులు పోటీ సంఘాలను ఏర్పాటు చేయడంతో అతని తొలి విజయం పునరావృతం కాలేదు. అతను 1953 - 1959 మధ్య శాసన మండలి సభ్యునిగా కూడా పనిచేశాడు.

ఫిజీకి మొదటి ప్రయాణం

[మార్చు]

అయోధ్య ప్రసాద్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం, రోహ్తక్ జిల్లా, బుటానా గ్రామంలో 1909 ఏప్రిల్ 30 న జన్మించారు. భారతదేశంలో చదువుతున్నప్పుడు, అతను విదేశాలలో ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ గురించి తెలుసుకుని, ఆ దేశాలలో ఏదో ఒకదానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తనను మూడు సంవత్సరాల పాటు విదేశాలకు వెళ్లనివ్వమని తండ్రిని ఒప్పించాడు. 1929 జనవరిలో ఫిజీ చేరుకున్నాడు. ఫిజీలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున అతను మూడవ తరగతి ఉపాధ్యాయ సర్టిఫికేట్ పొంది, లౌటోకాలోని సవేనిలోని గురుకుల ప్రాథమిక పాఠశాలలో బోధించడం ప్రారంభించాడు. ప్రజల డిమాండ్ కారణంగా అతను త్వరలోనే నాడి లోని తునాలియా వెళ్ళాడు. అక్కడ అతను పాఠశాల నిర్మాణానికి సహాయం చేశాడు. హిందీ బోధించడానికి సిలబస్ లేదు. ఫిజీ భారతీయులలో జాతీయవాద స్ఫూర్తిని రేకెత్తించే పుస్తకాన్ని ఉపయోగించి అతను హిందీని బోధిస్తున్నట్లు గుర్తించిన పాఠశాల ఇన్‌స్పెక్టర్, పుస్తకాన్ని ఉపయోగించడం మానేయాలని అయోధ్య ప్రసాద్‌కు చెప్పారు. అందుకు అతను నిరాకరించగా, అతని ఉపాధ్యాయ రిజిస్ట్రేషన్ను రద్దు చేసారు. 1931 లో అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు. వెళ్ళేటపుడు అయోధ్య ప్రసాద్ ఒక అమెరికన్‌ని కలిశాడు, అతనితో భారతదేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి చర్చించాడు. చర్చ ముగిసే సమయానికి, భారతీయులు విదేశీయుల నియంత్రణలో ఉండడానికి కారణం, ఆంగ్లేయులు చెడ్డవారు కాబట్టి కాదు, భారతీయులు ఐక్యంగా ఉండకపోవడం అని అతను గ్రహించాడు.

ఫిజీకి తిరిగి రాక

[మార్చు]

1932 ఏప్రిల్‌లో అయోధ్య ప్రసాద్ అమెరికాలో చదువుకోవడానికి సిద్ధపడేందుకు ఫిజీకి తిరిగి వచ్చాడు. తన యాత్రకు డబ్బు సంపాదించడానికి, అతను యాలలేవు, బాలో కొంత భూమిని సంపాదించి చెరుకు వ్యవసాయం ప్రారంభించాడు. అతను ఈ పొలంలో చాలా కష్టపడి పనిచేశాడు, కానీ అతని చెరకు చాలావరకు మొలాసిస్‌గా మారిందని, తన చెరకులో చక్కెర శాతం చాలా తక్కువగా ఉందనీ కలోనియల్ షుగర్ రిఫైనింగ్ కంపెనీ (CSR) అతనికి చెప్పింది. చెరుకు అమ్మగా వచ్చిన డబ్బు, ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. కంపెనీ తనకు ఇచ్చిన మొత్తంలో, ఎరువుల వంటి ఖర్చుల కోసం ఎంత మొత్తంలో తగ్గించుకున్నారనే వివరాలను కంపెనీ చెప్పలేదు. అమెరికా వెళ్లాలన్న అతని కల చెదిరిపోయింది. 1937 లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో అతను చతుర్ సింగ్‌కు మద్దతు ఇచ్చాడు. అతను తన ప్రత్యర్థి అయిన AD పటేల్‌ను స్వల్ప తేడాతో ఓడించాడు. అయితే ఈ ఫలితం, ఆ తరువాతి సంవత్సరాలలో AD పటేల్, అయోధ్య ప్రసాద్‌ల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నికల తర్వాత, ఎన్నికల ప్రచారంలో ఆయన చూపిన దృఢ సంకల్పాన్ని చూసిన ప్రజలు, అమెరికా వెళ్లాలనే కలను వదులుకుని, ఫిజీ రైతులను సంఘటితం చేసేలా ఒప్పించారు.

కిసాన్ సంఘ్ ఏర్పాటు

[మార్చు]

కంపెనీకి చెందిన ఫిజీ భారతీయ చెరకు రైతులలో చాలా భయం ఉందని బాగా తెలుసు, అతను సంఘంలోని యువ సభ్యులను రహస్యంగా సమీకరించి రైతు సంఘాన్ని ప్రారంభించాడు. 1937 సెప్టెంబరు లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల తర్వాత అతను లౌటోకా లోని ద్రాసాలో మొదటి రహస్య సమావేశాన్ని నిర్వహించాడు. 1937 నవంబరు 27 న వైలైలైలో జరిగిన సమావేశంలో, కిసాన్ సంఘ్ ను స్థాపించాడు. కొత్త యూనియన్ చేపట్టిన మొదటి పని కొత్త యూనియన్‌కు నాయకుడి కోసం వెతకడం. AD పటేల్, SB పటేల్, స్వామి రుద్రానంద, చతుర్ సింగ్, విష్ణు దేవులతో సహా అనేక మంది వ్యక్తులను సంప్రదించారు గానీ అందరూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయోధ్య ప్రసాద్ వెనక్కి తగ్గలేదు, మహాత్మా గాంధీ నుండి నేర్చుకోవడం, రైతుల మధ్య జీవించడమే ఉత్తమ పరిష్కారం అని నిర్ణయించుకున్నాడు. అతను వారికి యూనియన్ ప్రయోజనాల గురించి వివరించాడు. అతను, అతని సహాయకులూ వివిధ నివాస ప్రాంతాలలోని కంపెనీ భూమిలో గుడారాలు వేసి వాటి నుండి తమ కార్యక్రమాలను నిర్వహించారు. 1938 మే 18 న తన యువ వాలంటీర్ల సహాయంతో, అతను వీటి లెవు వాయవ్యంలో చెరకు సాగు చేసే నాద్రోగాలో ప్రారంభించి, తీరం వెంబడి ఉత్తర కొస దాకా గుడారాలను ఏర్పాటు చేశాడు. మొదట్లో స్థానిక రైతులు ఎవరూ డేరా వద్దకు రాలేదు. కానీ అయోధ్య ప్రసాద్, అతని యువ వాలంటీర్లు చేస్తున్న త్యాగాన్ని, కంపెనీ సూపర్వైజర్లు అతన్ని అడ్డుకోలేకపోవడాన్నీ చూసిన ప్రజలు క్రమంగా వారితో చేరడం ప్రారంభించారు. ఈ ప్రచారం విజయవంతం కావడంతో, అయోధ్య ప్రసాద్ తదుపరి నాలుగు నెలల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాడు. ఈ కమిటీలు సమావేశమై జిల్లా కమిటీలను ఏర్పాటు చేశాయి, ఇవి జిల్లా కమిటీ సభ్యత్వం ఆధారంగా కేంద్ర కమిటీకి సభ్యులను ఎంపిక చేశాయి.

చెరకు కాంట్రాక్ట్ కోసం ప్రచారం

[మార్చు]

చెరకు కాంట్రాక్టు కోసం చర్చలు జరపాలని కోరుతూ ఫిబ్రవరి 9 న కంపెనీకి ఒక లేఖ రాసారు. అయితే కంపెనీ కిసాన్ సంఘ్‌ను పట్టించుకోలేదు. కంపెనీ, సర్దార్ల ద్వారా రైతులను నియంత్రించింది. దాంతో అయోధ్య ప్రసాద్ సర్దార్ల కోసం జరిగిన ఎన్నికలలో తన అభ్యర్థులను నిలబెట్టాడు. ఈ స్థానాల్లో చాలా వరకు గెలిచారు. ఈ కొత్త సర్దార్లు కంపెనీ ఆదేశాలను స్వీకరించే ముందు కిసాన్ సంఘ్ సలహా తీసుకున్నారు. కిసాన్ సంఘ్ బలాన్ని చూసిన కంపెనీ, చెరకు చెల్లింపులతో ప్రకటనలను జారీ చేయడం ప్రారంభించింది. తరువాతి సీజన్‌లో పంట కోసం ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ రెండూ కిసాన్ సంఘ్ ఒరిజినల్ డిమాండ్లే. తగిన ఒప్పందం కుదుర్చుకునే వరకు వచ్చే ఏడాది పంటలు వేయవద్దని కిసాన్ సంఘ్ రైతులకు సూచించింది. ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడితో కంపెనీ, చెరకు ధర పెంచడంతో సహా అనేక ఇతర రాయితీలతో 10 సంవత్సరాల కాంట్రాక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది.

రాజకీయాల్లో చేరి

[మార్చు]

1940 నాటికి కిసాన్ సంఘ్ ఫిజీలో అత్యంత శక్తివంతమైన సంస్థగా అవతరించింది. 1940 జూలైలో విటి లెవులోని వాయవ్య జిల్లాల్లోని మొత్తం 5918 మంది చెరకు రైతులలో 4245 మంది సంఘ్‌లో సభ్యులే. 1940 లో జరిగిన శాసన మండలి ఎన్నికలలో కిసాన్ సంఘ్, అయోధ్య ప్రసాద్‌ల మద్దతుతో బి.డి.లక్ష్మణ్ వాయవ్య నియోజకవర్గం తరపున నిలబడి సులభంగా గెలిచాడు. 1941 జూన్ 15 న కిసాన్ సంఘ్‌కు పోటీగా AD పటేల్, మహా సంఘాన్ని స్థాపించాడు. అయోధ్య ప్రసాద్, అతని మద్దతుదారులు కొత్త యూనియన్ ఏర్పాటును ఆపడానికి ప్రయత్నించారు, కానీ విజయవంతం కాలేదు. 1940 లో రైతులు కుదుర్చుకున్న కాంట్రాక్టు పదేళ్ల కాలానికి ఉన్నప్పటికీ, 1943 లో కిసాన్ సంఘ్‌లోని కొందరు కార్యనిర్వాహక సభ్యులు కొత్త కాంట్రాక్టు కోసం మహాసంఘ్‌కు మద్దతు తెలపడంతో అయోధ్య ప్రసాద్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయోధ్య ప్రసాద్ చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, రైతులు సకాలంలో కోత ప్రారంభించలేదు. దాంతో వేలాది డాలర్లు నష్టపోయారు. ఈలోగా, AD పటేల్ ఉద్యమాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వలన అతనికి మద్దతు పెరిగింది. 1944 నాటికి, కిసాన్ సంఘ్ ఘోరంగా చీలిపోయింది. AD పటేల్, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని వాయవ్య నియోజకవర్గ స్థానానికి జరిగిన ఎన్నికలలో సులభంగా గెలిచాడు.

కిసాన్ సంఘ్ పునర్నిర్మాణం

[మార్చు]

కిసాన్ సంఘ్‌ను పునర్నిర్మించడానికి అయోధ్య ప్రసాద్‌కి 1950 వరకు పట్టింది, తద్వారా అది ఫిజీలో అతిపెద్ద రైతు సంస్థగా మారింది. రేవాలో క్రియాశీలకంగా ఉన్న కిసాన్ సంఘ్‌కు అనుబంధంగా కొత్త రైతు సంఘం ఏర్పడింది. అతను 1950లో కొత్త 10-సంవత్సరాల ఒప్పందానికి CSR పై వత్తిడి తెచ్చాడు. ఇది చెరకు ధరను మరింత పెంచింది. 1950 ఎన్నికలలో, అయోధ్య ప్రసాద్ మద్దతు ఉన్న అభ్యర్థి శాసన మండలిలో నార్త్ వెస్ట్రన్ ఇండియన్ డివిజన్ [2] లో AD పటేల్‌ను సులభంగా ఓడించాడు. 1937 నుండి రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పటికీ, అయోధ్య ప్రసాద్, 1953లో తొలిసారిగా శాసన మండలి ఎన్నికలకు నిలబడి, వాయవ్య నియోజకవర్గం తరపున 2718 ఓట్లకు గాను 1919 ఓట్లను పొంది, తన పాత శత్రువు AD పటేల్‌ను ఓడించాడు. 1956 లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో, అతను KS రెడ్డి, BD లక్ష్మణ్, చతుర్ సింగ్ అనే ముగ్గురు ఉన్నత స్థాయి మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, సులభంగా గెలిచాడు. 1959లో, షుగర్ మిల్లు కార్మికుల నాయకుడిగా పేరు తెచ్చుకున్న తన ఒకప్పటి మిత్రుడు బిడి లక్ష్మణ్‌తో పోటీపడి ఓడిపోయాడు.

చివరి రోజులు

[మార్చు]

1959లో, అయోధ్య ప్రసాద్‌కి చెందిన కిసాన్ సంఘ్ తదుపరి పదేళ్ల కాంట్రాక్ట్‌పై చర్చలు జరిపేందుకు, ఫెడరేషన్ ఆఫ్ కేన్ గ్రోవర్స్ అనే చెరకు పెంపకందారుల సమాఖ్య సంస్థలో చేరింది. అయోధ్య ప్రసాద్, AD పటేల్‌ల మద్దతుదారుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయి, ఫలితంగా అయోధ్య ప్రసాద్ మద్దతుదారులు కొత్త చెరకు ఒప్పందంపై సంతకం చేయగా, పటేల్ మద్దతుదారులు సమ్మెకు దిగారు. రైతులకు మంచి ఒప్పందాన్ని పొందడంలో కిసాన్ సంఘ్ విఫలమైందని ఆరోపించారు. 1963 లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో, పటేల్ అతని మద్దతుదారులు చెరకు పండించే ప్రాంతాల్లోని స్థానాలన్నిటినీ గెలుచుకున్నారు. 1965లో, లండన్ రాజ్యాంగ సదస్సు సందర్భంగా, అయోధ్య ప్రసాద్ ఫిజీ జాతీయ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసి, ఫిజీ భారతీయుల తరపున ఐక్యరాజ్యసమితికి ప్రాతినిధ్యం వహించాడు. 1965 చివరలో, అతను రతు మారాతో కలిసి అలయన్స్ పార్టీని స్థాపించాడు. 1966 లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో, అయోధ్య ప్రసాద్ మళ్లీ పటేల్‌కు వ్యతిరేకంగా నిలబడి, భారీ తేడాతో ఓడిపోయాడు.

అయోధ్య ప్రసాద్ 1972 ఫిబ్రవరి 28న మరణించారు. అతను నావియాగో, ద్రాసాలో స్థిరపడ్డాడు. ద్రాసా ఇండియన్ స్కూల్ మేనేజర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యారు. అప్పటి ప్రధాని రతు మారా కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడు. అతని పిల్లల పేర్లు: పండి. రమేష్ శర్మ, పండిట్ ఓం ప్రకాష్, క్రిమినల్ లాయర్ నరేష్ ప్రసాద్ శర్మ, లక్ష్మీ చంద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చంద్రావతి, విద్యావతి.

మూలాలు

[మార్చు]
  1. Pandit Ayodha Prasad Pacific Islands Monthly, April 1972, p108
  2. "Fiji Elections Archive: Elections for the Legislative Council, North Western Division 1929 – 1959". Archived from the original on 25 July 2007.