అరకు లోయ | |
---|---|
కొండ ప్రాంతం(హిల్ స్టేషన్) | |
Coordinates: 18°20′00″N 82°52′00″E / 18.3333°N 82.8667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 531149 |
టెలిఫోన్ కోడ్ | 08936 |
Vehicle registration | AP |
అరకులోయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం, పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలు లోని అద్భుత పర్వతపంక్తి కలదు. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖనుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతం చాలా సినిమాలలో కనిపిస్తుంది.
ఇది తూర్పు కనుమల లో ఉంది.[1] ఇది విశాఖపట్నం నుండి 114 కి.మీ దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. జిల్లా కేంద్రమైన పాడేరు నుండి ఈశాన్యంగా 45 కి.మీ. దూరంలో వుంది.
అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇచట బాక్సైట్ నిక్షేపాలున్నాయి.[2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).[3] ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 చ.కి.మీ విస్తరించి ఉంది.[4]
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమలలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని పాములేరు లోయలో బ్రిటిష్ వారు 1898 లో మొట్టమొదటి సారి కాఫీ పంటను పరిచయం చేసారు. తరువాత అది 19వ శతాబ్ద ప్రారంభం నాటికి అరకు లోయ వరకు వ్యాపించింది. స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ ప్రాంతంలో కాఫీ తోటలను అభివృద్ధి చేసింది. 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి "ఆంధ్రప్రదేశ్ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్" (GCC) ను నియమించింది. స్థానిక రైతుల సహకారంలో జి.సి.సి కాఫీ పంటను ప్రోత్సాహించింది. 1985లో ఈ తోటలు ఎ.పి.ఫారెస్టు డెవలప్‌మెంటు కార్పొరేషన్, జి.సి.సి ప్రోత్సాహిత గిరిజన కార్పొరేషన్ కు అప్పగించారు. ఈ సంస్థలు ప్రతీ గిరిజన రైతు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున కాఫీ తోటలను కేటాయించాయి.[5]
అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.[6] సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున బొర్రాగుహలు ఉన్నాయి. పచ్చని చెట్లూ, కొండ చరియలూ, పచ్చని తివాచీ పరిచినట్టుండే పచ్చిక మైదానాలూ ఇక్కడికొచ్చే సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ గుహలను ఆగ్లేయ పరిశోధకుడు విలియం కింగ్ కనుగొన్నట్లు చారిత్రిక కథనం. ఈ గుహలు సున్నపు పొరల వల్ల 150మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని పరిశోధనల ద్వారా తెలిసింది. విశాఖపట్నం జిల్లాలో గల గోస్తనీ నది ఈ గుహ్గల్లో పుట్టి జలపాతంగా మారి తూర్పు దిశలో ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోస్తనీకి చెందిన కొండ ఏరులూ సెలయేరుల నీటి తాకిడికి సున్నపురాతిపొరలు కరిగి నిక్షేపాలుగా భూమి నుంచి పైకి, పైకప్పు నుంచి భూమికి వారధిగా ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు రకరకాల జంతు, వస్తు, మానవ ఆకృతులతో విద్యుత్తు కాంతులతో వెలుగులీనుతున్నాయి. ఇక్కడి గిరిజనులు ఈ ఆకృతులనే దేవతలుగా కొలుస్తున్నారు. బొర్రా గుహలకు వందమీటర్ల వ్యాసంతో ప్రవేశద్వారం ఉంది. కిలోమీటరు పొడవునా సొరంగం ఉంటుంది. ఇందులో చాలా చోట్ల మూడు అరలు కలిగిన సొరంగాలు ఉన్నాయి. అరకులోయలోని పద్మావతి ఉద్యానవన కేంద్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, అల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్‌లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.[7]
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు, పిల్లలకు వేర్వేరు ధరలతో ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్ లభిస్తుంది.
బొర్రా గుహలను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వేస్టేషన్ నుంచి అద్దాల రైలు బయలుదేరి బొర్రా స్టేషన్‌కు 6.05 గంటలకు వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్‌కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు.
గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో చాపరాయి జలపాతం ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము రూ.10. స్థానికంగా బొంగులో చికెన్ విక్రయాలు అధికంగా జరుగుతాయి. మాంసాహార ప్రియులు బొంగులో చికెన్‌ను ఇక్కడ రుచి చూడవచ్చు
అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్‌లో పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్ స్కేపింగ్ తదితరాలు ఉన్నాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.
చాపరాయి జలపాతం నుంచి 17 కి.మీ. దూరంలో డముకు వ్యూపాయింట్, కాఫీ తోటలు ఉన్నాయి. అక్కడి నుంచి 20 కి.మీ. దూరంలో బొర్రా గుహలకు ఉన్నాయి. బొర్రా గుహలను తిలకించేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. బొర్రా గుహల సమీపంలోనూ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్‌కు బొర్రా గుహల సమీపంలోని హోటళ్లు ప్రసిద్ధి. ముందుగా ఆర్డర్ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేస్తారు.వేడి గాలి బెలూన్లులో వెళ్లవచ్చు.
విశాఖపట్నం - కిరండూల్ వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకులోయ స్టేషన్‌లో అద్దాల బోగీని కలుపుకొని విశాఖపట్నం తీసుకువస్తుంది. ఈ బోగీలో మొత్తం 40 సీట్లున్నాయి. సీట్లు తక్కువ కావడం, డిమాండు అధికంగా ఉండటంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందుస్తు రిజర్వేషన్ చేయించుకుంటారు. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతి రోజూ ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది.
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)