అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా
అరకులోయ
Location of అల్లూరి సీతారామరాజు జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
Named forబ్రిటిషు వారిపై పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు స్మరణకు
ప్రధాన కార్యాలయంపాడేరు, రంపచోడవరం (కలెక్టర్ రెండు రోజులు అందుబాటులో వుంటారు)
విస్తీర్ణం
 • Total12,251 కి.మీ2 (4,730 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total9,53,960
 • జనసాంద్రత78/కి.మీ2 (200/చ. మై.)
Time zoneUTC+05:30 (ఐ ఎస్ డి)

అల్లూరి సీతారామ రాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల కొంత భాగాలను కలిపి 2022లో కొత్తగా ఏర్పరచిన జిల్లా. ఈ ప్రాంతం నుండి వచ్చిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది. జిల్లా కేంద్రం పాడేరు పట్టణం కాగా, వారానికి రెండు రోజులు జిల్లా కలెక్టరు రంపచోడవరం గ్రామంలో బసచేస్తారు.[2]

జిల్లాలో పాపి కొండలు, అరకులోయ ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.

చరిత్ర

[మార్చు]
అల్లూరి సీతారామరాజు విగ్రహం, ట్యాంక్ బండ్, హైదరాబాదు

కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, 18 వశతాబ్దంలో బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం (కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధి ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మ జిల్లాలో భాగంగా వున్న భద్రాచలం మండల గ్రామాలు, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు కావున తెలంగాణా వేరుపడిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో కలిపారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల గిరిజన ప్రాంతాలను కలిపి 2022లో కొత్తగా ఈ జిల్లాను ఏర్పరిచారు.[1][3]

భౌగోళిక స్వరూపం

[మార్చు]

జిల్లా విస్తీర్ణం 12,251 చ.కి.మీ. ఉత్తరాన, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్‌గఢ్లోని సుకుమా జిల్లా, ఒడిశాలోని మల్కానగిరి జిల్లాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉంది. అలాగే సొంత రాష్ట్రంలో తూర్పున పార్వతీపురం మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, దక్షిణాన అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలు, పశ్చిమంగా గోదావరి నది సరిహద్దులుగా ఉన్నాయి.

అరకులోయలో భాగమైన అనంతగిరి, సుంకరిమెట్ట రక్షిత అడవులు ఉన్నాయి.

ఖనిజాలు

[మార్చు]

జిల్లాలో బాక్సైట్, అపాటైట్ (రాక్ ఫాస్ఫేట్) కాల్సైట్, స్ఫటికాకార సున్నపురాయి నిక్షేపాలున్నాయి. రూబీ మైకా, క్వార్ట్జ్,వర్మిక్యులేట్, రసాయన గ్రేడ్ సున్నం తయారీకి ఉపయోగపడే లైమ్ షెల్, ఎరుపు, పసుపు రంగు ఓచర్ నిక్షేపాలున్నాయి.[4]

వాతావరణం

[మార్చు]

సగటు వర్షపాతం 1,700 మిల్లీమీటర్లు (67 అంగుళాలు), ఇందులో ఎక్కువ భాగం జూన్-అక్టోబరులో కురుస్తుంది.

జనాభా గుణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,53,960.[1] జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 2.49% ఉండగా షెడ్యూల్డ్ తెగలు 82.67% ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల్లో ఎక్కువగా కొండ దొర, భగత, కోటియ, నూక దొర, కమ్మరి, కోదు, పీటిజి, పోర్జ,, కొండకాపు, కోయ, వాల్మీకి తెగలు ఉన్నాయి. జనాభాలో 80% పైగా, తెలుగు లేదా ఒడియా విభిన్న మాండలికాలను మాట్లాడతారు. అత్యధికంగా హిందూ మతాన్ని పాటిస్తారు.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి పాడేరు, రంపచోడవరం, ఈ రెవెన్యూ డివిజన్లు 22 మండలాలుగా విభజించబడ్డాయి.

మండలాలు

[మార్చు]

పాడేరు, రంపచోడవరం డివిజన్లలో ఒక్కొక్కటి 11 మండలాలు ఉన్నాయి.ఈ రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 22 మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి:

గ్రామాలు

[మార్చు]

జిల్లాలో 2,972 గ్రామాలున్నాయి.[5]

రాజకీయ విభాగాలు

[మార్చు]

జిల్లాలో ఒక లోక్‌సభ మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[6]

లోక్‌సభ నియోజకవర్గం

[మార్చు]
  1. అరకు (ఎస్.టి) (పాక్షిక), మిగతా భాగం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది.

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]
  1. అరకులోయ (ఎస్.టి)
  2. పాడేరు (ఎస్.టి)
  3. రంపచోడవరం (ఎస్.టి)

రవాణా వ్యవస్థ

[మార్చు]

పాడేరు - రంపచోడవరం జిల్లాలో ఒక ప్రధాన రహదారి. ఈ రెంటినుండి సమీప నగరాలైన విశాఖపట్నం, రాజమండ్రికి రహదారులున్నాయి. జాతీయ రహదారి 516E జిల్లాగుండా పోతుంది. భద్రాచలం-రాజమండ్రి గోదావరి నదిపై లాంచీల సౌకర్యముంది.

విద్యా వ్యవస్థ

[మార్చు]

2019-20లో 2124 ప్రాథమిక పాఠశాలలలో 58000, 155 ప్రాథమికోన్నత పాఠశాలలలో 13000, 180 ఉన్నత పాఠశాలలలో 44000, 68 కళాశాలలు, సాంకేతిక సంస్థలలో 15000 నమోదైనారు.[7]

వైద్య వ్యవస్థ

[మార్చు]

848 మంచాలుగల 96 ఆల్లోపతి ప్రభుత్వ ఆసుపత్రులలో 147 వైద్యులు పనిచేస్తుండగా, 19 ఇతరవైద్యవిధానాల ఆసుపత్రులలో 18 వైద్యులు పనిచేస్తున్నారు.[7]

వ్యవసాయం

[మార్చు]

70% జనాభా వృత్తి వ్యవసాయం. వరి, రాగి, మొక్క జొన్న, సజ్జ, కొర్ర, నైగర్ పప్పు,కందులు, రజ్మా, మిరప, పసుపు, అల్లం, మొక్క జొన్న పంటలు పండుతాయి. భారీ నీటిపారుదల సౌకర్యాలు లేనందున, 40 శాతం వ్యవసాయ భూమి చిన్న నీటిపారుదల పద్ధతులైన చెక్ డాములపై ఆధారపడింది.[8]

ఉద్యానవన తోటలలో కాఫీ తోటల పెంపకం ఎక్కువగా ఉంటుంది. చింతపల్లి, మినీములూరు, అనంతగిరి ప్రాంతాల్లో సుమారు 5433 ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. ఇక్కడ ఆకురాల్చే అడవులు ఉన్నాయి.ఎక్కువగా గుగ్గిలం, తంగేడు, సిరిమాను, కంబ, యాగీస, నల్లమద్ది, గండ్ర, వేప తదితర వెదురు ఉన్నాయి.

సంస్కృతి

[మార్చు]
  • భారిజం పండగ, రామ్ డోలి, గైరమ్మ ఊరేగింపు, పోతురాజు స్వామి జాతర,
  • ధింసా నృత్యం : అరకు లోయలోని కొండ తెగలు చేసే నృత్యం. దాదాపు 15 నుండి 20 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, స్థానిక దేవతల పూజ ఆమోదం తెలుపుతూ మగ సహచరులతో, మోరీ, తుడుం, డప్పు వాయిద్య సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు.[9]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
దస్త్రం:Godavari at paapi hills.jpg
పాపికొండల మధ్య గోదావరి
భూపతిపాలెం జలాశయం, రంపచోడవరం

జిల్లా ప్రకృతి సంపదకు ప్రసిద్ధి. [10]

  • లంబసింగి, కొత్తపల్లి జలపాతం, తారభు జలపాతం, చాపరాయి జలపాతం, ఉప్పరోమ్ (గూనాలమ్మ వణం), రణజిల్లెడ జలపాతం, తోంకోటఅమ్మవారి జలపాతం, వంజంగిమేఘాల కొండ (శీతాకాలం), పాటిపల్లి గుహలు, చింతవానిపాలెం జలపాతం, డల్లపల్లి మేఘాల కొండ (శ్రీ శ్రీ శ్రీ మోధకొండమ్మతల్లి పాదాలు), అంజొడవనం,
  • పాపి కొండలు
  • అరకులోయ
  • బొర్రా గుహలు
  • అనంతగిరి కొండలు
  • అల్లూరి సీతారామరాజు సమాధి, కృష్ణ దేవి పేట
  • ఉమాచోడేశ్వర ఆలయం, దేవీపట్నం : 11 వ శతాబ్దపు ఆలయం.
  • గండిపోశమ్మ ఆలయం, గొందూరు: గిరిజనుల దేవత
  • శ్రీ మోదకొండమ్మ దేవాలయం. పాడేరు మండలం : విశాఖ-పాడేరు రోడ్డులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ప్రసిద్ధి. పాడేరు మోదకొండమ్మ ఆలయానికి వెళ్లే ముందు దర్శించుకుంటారు. ఇది పాదాలు మోధపల్లి (మినుములూరు గ్రామంలో ఉంది.
  • మినుమలూరు జలపాతాలు: మోడపల్లి జంక్షన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
  • మత్స్యగుండం : పాడేరు దగ్గరగల లోయ. చిన్న నదీపాయలో విస్తారంగా చేపలుంటాయి (మత్స్య కన్యలు). సందర్శకుల ఇచ్చే తినుబండారాలను తింటాయి. గిరిజనులు వీటిని దేవతలుగా భావించి పట్టకోరు. దగ్గరలోని చిన్న శివాలయంలో శివరాత్రి పండుగ ఆచరిస్తారు.
  • మారేడుమల్లి అటవీ ప్రాంతం: జీవ వైవిధ్యం గల ప్రాంతం. దగ్గరలోనే సీతాపల్లి సహజజలపాతం ఉంది.
  • రంప జలపాతాలు: రంపచోడవరం గ్రామానికి 4 కి.మీ దూరంలో నీలకంఠేశ్వర వనవిహార స్థలము, రంప జలపాతాలున్నాయి.

చిత్రమాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. "Andhra Pradesh: IAS officer travels 200 km to hold grievance cell in Maoist hotbed". The Hindu. 2022-04-11. Retrieved 2022-07-26.
  3. "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "ఎకానమీ". అల్లూరి సీతారామరాజు జిల్లా. Retrieved 2022-07-26.
  5. "చరిత్ర". Alluri Sitharama Raju district. Retrieved 2022-07-26.
  6. "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.
  7. 7.0 7.1 DHS-2022, p. 13.
  8. DHS-2022, p. 12.
  9. "సాంస్కృతిక పర్యాటకం - అల్లూరి సీతారామరాజు జిల్లా". అల్లూరి సీతారామరాజు జిల్లా. Retrieved 2022-07-26.
  10. DHS-2022, p. 14-16.

ఆధార గ్రంథాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]