అసద్ అలీ ఖాన్ | |
---|---|
![]() 2009 లో అసద్ అలీఖాన్ ప్రదర్శన | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1937 అల్వార్, భారత రాజ్యం |
మరణం | 14 జూన్ 2011 (వయస్సు 74) న్యూఢిల్లీ, భారతదేశం |
సంగీత శైలి | హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం |
వాయిద్యాలు | రుద్ర వీణ |
అసద్ అలీ ఖాన్ (1937 డిసెంబరు 1 - 2011 జూన్ 14) ఒక భారతీయ సంగీతకారుడు. అతను రుద్ర వీణ వాద్యకారుడు. ఖున్ శైలి ధ్రుపద్ లో ప్రదర్శన ఇచ్చాడు. భారతదేశంలో ఉత్తమ రుద్ర వీణ వాద్యకారునిగా ది హిందూ పత్రిక అభివర్ణించింది. అతనికి 2008 లో భారత అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది.[1]
ఆసద్ అలీ ఖాన్ రుద్రవీణ వాద్యకారుల నేపథ్యం ఉన్న కుటుంబంలో 17వ తరంలో 1937 డిసెంబరు 1న ఆళ్వారులో జన్మించాడు.[2][3] అతని పూర్వీకులు 18 వ శతాబ్దంలో రాంపూర్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లోని జైపూర్ సంస్థానాలలో ఆస్థాన సంగీత విద్వాంసులు.[4] [5]
అతని ముత్తాత రాజాబ్ అలీ ఖాన్ జైపూర్ అస్థాన సంగీతకారులకు అధిపతిగా ఉండి, గ్రామంలో కొంత భూమిని కలిగి ఉన్నాడు.[5][6] అతని తాత ముషారఫ్ ఖాన్ (మ.1909) అళ్వార్ సంస్థానంలో సంగీతకారునిగా పనిచేయడమే కాక,1886 లో లండన్‌లో సంగీత కచేరీ కూడా ప్రదర్శించాడు.[5][7] ఖాన్ తండ్రి సాదిక్ అలీ ఖాన్ అల్వార్ రాజాస్థానంలో, రాంపూర్ నవాబు వద్ద 35 సంవత్సరాల పాటు సంగీతకారుడిగా పనిచేశారు.[8] [9]ఖాన్ సంగీత నేపథ్యం ఉన్న వ్యక్తుల మద్య పెరిగాడు. అతను జైపూర్ బీంకర్ ఘరానా (రుద్ర వీణ వాద్య శైలీకృత పాఠశాల) లో పదిహేను సంవత్సరాలు సంగీతం నేర్పించాడు. [10][5][7]
అతను ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్త రాష్త్రాలు, ఆఫ్ఘనిస్థాన్, ఇటలీ, అనేక యూరోపియన్ దేశాలలో తన ప్రదర్శనలనిచ్చాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంగీత విద్యా కోర్శులను నిర్వహించాడు.[11][12] అతను ఆల్ ఇండియా రేడియోలో సితార్ వాద్య సంగీత పాఠాలను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లలిత కళల విభాగంలో 17 సంవత్సరాల పాటు పనిచేసాడు. అతను తన పదవీ విరమణ తరువాత విద్యార్థులకు సంగీత విద్యా బోధన కొనసాగించాడు[13][11][14] ఖాన్ శిష్యులలో తన కుమారుడు జాకీ హైదర్ తో పాటు, కార్‌స్టెన్ వికీ, బిక్రంజీత్ దాస్, జ్యోతి హెగ్డే, మధుమితా రాయ్ వంటి వారు ఉన్నారు.[15][16] రుద్రవీణ అభ్యసనంలో భారతీయ విద్యార్థుల కంటే విదేశాల విద్యార్థులు ఎక్కువగా యిష్టపడతారనీ, భారతీయులకు అభ్యసనా సంసిద్దత తక్కువగా ఉందని విమర్శించాడు.[12]
ఖాన్ 1977 లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, 2008 లో భారత గౌరవ పౌర పురస్కారం పద్మ భూషణ్ సహా పలు జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. పద్మభూషణ పురస్కారాన్ని అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రదానం చేసింది. హిందూ పత్రిక అతనిని భారతదేశంలో ఉత్తమ రుద్ర వీణ వాద్యకారునిగా అభివర్ణించింది.
ఖాన్ 14 జూన్ 2011 న న్యూఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరణించారు. ఖాన్ వివాహం చేసుకోలేదు.