అస్త్ర | |
---|---|
రకం | గాల్లోంచి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | భారతదేశం |
ఉత్పత్తి చరిత్ర | |
తయారీదారు | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ |
తయారీ తేదీ | 2017 నుండి |
విశిష్టతలు | |
బరువు | 154 కి.గ్రా. |
పొడవు | 3570 మి.మీ. |
వ్యాసం | 178 మి.మీ. |
వార్‌హెడ్ | 15 కి.గ్రా. (33 lb) HE fragmentation directional warhead |
పేలుడు మెకానిజమ్ | Radar proximity fuse |
ఇంజను | ఘన ఇంధన రాకెట్ |
వింగ్‌స్పాన్ | 254 మి.మీ. |
ఆపరేషను పరిధి | 80-110 కి.మీ. ముఖాముఖి దాడిలో chase 20 కి.మీ. వెంటాడే దాడిలో[1][2] |
ఫ్లైట్ సీలింగు | 20.1 కి.మీ. |
వేగం | మ్యాక్ 4.5+ [3] |
గైడెన్స్ వ్యవస్థ | Inertial, mid-course update and terminal active radar homing (15 km) |
లాంచి ప్లాట్‌ఫారం | ఎస్‌యు30-ఎమ్‌కెఐ |
అస్త్ర (ఆంగ్లం: Astra missile), భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజి గాలి-నుండి-గాల్లోకి ప్రయోగించే క్షిపణి. ఇది ప్రత్యామ్నాయ ప్రొపల్షన్ పద్ధతులను వాడి, తక్కువ పరిధి (20 కి.మీ. లోపు) లోని లక్ష్యాలను, సుదూరపరిధి (80 కి.మీ.) లోని లక్ష్యాలనూ కూడా ఛేదించగలదు.[4][5] ఒక్క పరీక్ష తప్పించి, మిగతా అన్ని పరీక్షలనూ అస్త్ర విజయవంతంగా పూర్తి చేసింది. భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30MKI యుద్ధవిమానంలో అస్త్ర క్షిపణిని మోహరించారు. మిరాజ్ 2000, మిగ్-29 విమానాల్లో కూడా దీన్ని మోహరిస్తారు. అభివృద్ధి దశలో పరీక్షలన్ని అయ్యాక, 2017 లో ఈ క్షిపణి తయారీ మొదలైంది.[6]
అస్త్రలో అమర్చి ఉన్న జామరు శత్రు రాడారు సిగ్నళ్ళను జాం చేసి, క్షిపణిని కనుక్కోవడం కష్టతరం చేస్తుంది. ఇది 3.8 మీ. పొడవు ఉండి, రెక్కలకు ముందు సన్నగా ఉంటుంది. ఘన ఇంధనాన్ని వాడుతుంది. దీని వార్‌హెడ్ 15 కి.గ్రా. పేలుడు పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది ప్రాక్సిమిటీ ఫ్యూజు ద్వారా పేలుతుంది. అస్త్ర, మ్యాక్ 4.5 పైచిలుకు వేగంతో ప్రయాణిస్తుంది.[7] ఇది 20 కి.మీ. ఎత్తుకు చేరగలదు. బహుళ లక్ష్యాలతో వ్యవహరించేటపుడు అస్త్ర పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రయోగానికి ముందు, తరువాతా కూడా లక్ష్యాన్ని గుర్తించి, గురిని లాక్ చెయ్యగల సామర్థ్యం అస్త్రకు ఉంది.[8]
భారతీయ వాయుసేనకు చెందిన మిరాజ్, మిగ్-29, సీ హారియర్, సుఖోయ్-30MKI, మిగ్-21 బైసన్, తేజస్ విమానాల్లో మోహరించేందుకు అస్త్రను అభివృద్ధి చేసారు. ఆకాశ్ క్షిపణిలో వాడిన ర్యామ్‌జెట్ ప్రొపల్షను వ్యవస్థను వాడి, దీని పరిధిని పెంచే ప్రయత్నం జరుగుతోంది.
2003 మే 9 నుండి 12 వరకూ నియంత్రణ, గైడెన్స్ వ్యవస్థలు లేకుండా అస్త్రను పరీక్షించారు. 2007 మార్చి 25 తిరిగి అస్త్రను పరీక్షించారు.[9] మార్చి 27 న, క్షిపణిని నిట్టనిలువుగా ప్రయోగించారు. ఈ పరీక్ష, అస్త్రను భారతీయ నావికాదళంలో కూడా వాడే ఆలోచన ఉందన్న సూచననిచ్చింది.[10] 2008 సెప్టెంబరు 13 న అస్త్రను తిరిగి విజయవంతంగా పరీక్షించారు.
2009 మేలో డ్యూయల్ మోడ్ గైడెన్స్ ను పరీక్షించారు.[11] 2009 నవంబరులో కాప్టివ్ ఫ్లైట్ పరీక్షలు నిర్వహించారు.[12] 2010 జనవరి 11 న చాందీపూర్‌లో జరిపిన పరీక్ష ఎలక్ట్రానిక్ వ్యవస్థలోని లోపం కారణంగా విఫలమైంది.[13]
2010 జూన్ 6 న చేసిన రాత్రి పరీక్ష, జూన్ 7 న చేసిన ప్రతికూల వాతావరణంలో చేసిన పరీక్ష రెండూ కూడా విజయవంతమయ్యాయి.[14][15]
2015 మార్చి 19 న సుఖోయ్-30MKI నుండి అస్త్ర పూర్తి స్థాయి పరీక్షను విజయవంతంగా జరిపారు. మోహరింపుకు ముందు చేసిన ఈ పరీక్షలో నియంత్రణ వ్యవస్థను, స్థిరత్వాన్నీ పరీక్షించారు. 2015 మే 20 న సుఖోయ్-30MKI నుండి రెండు సార్లు విజయవంతంగా పరీక్షించారు. అత్యధిక వేగంతో జి-విన్యాసాలు చేస్తున్న విమానాన్ని అడ్డుకోవడం ఈ పరీక్షల లక్ష్యం.[16]
2015 మే 21 న జరిపిన పరీక్ష విజయవంతమైంది. 25 కి.మీ. ఎత్తున ప్రయోగించిన తరువాత, క్షిపణి 150 సెకండ్ల పాటు ప్రయాణించింది, మ్యాక్ 4.5 వేగాన్ని అందుకుంది. ఆయుధ వ్యవస్థను, నియంత్రణ, గైడెన్స్ వ్యవస్థలను అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పరీక్షించాం, అని DRDO శాస్త్రవేత్త చెప్పాడు.
2015 డిసెంబరు 25 న భారతీయ వాయుసేన అస్త్రను పరీక్షించింది. జామింగుకు వ్యతిరేకంగా క్షిపణిలోని ECCM వ్యవస్థ పనితీరును మూల్యాంకనం చెయ్యడం ఈ పరీక్ష లక్ష్యం. ఇదే కాకుండా, డిసెంబరులోనే పుణేవద్ద భూస్థిత పరీక్షలు కూడా చేసారు.[17][18]
2016 మార్చి 18 న, ఐరన్ ఫిస్ట్ 2016 విన్యాసాల్లో భాగంగా తొలిసారి సుఖోయ్-30MKI అస్త్రను బహిరంగంగా ప్రయోగించింది.[19][20]
2016 డిసెంబరు 7 న భారతీయ వాయుసేన చేసిన వాడుకరి పరీక్ష విఫలమైంది. ప్రయోగించగానే క్షిపణి వేగం కోల్పోయి కిందపడి పేలిపోయింది.[21][22] 2016 డిసెంబరు 12 న సుఖోయ్-30MKI నుండి రెండు పరీక్షలు జరిపింది. బన్‌శీ మానవ రహిత ఆకాశ వాహనంపై ఈ ప్రయోగాలు జరిపారు. అవి లక్ష్యాన్ని "దాదాపుగా ఛేదించాయి". దాదాపుగా ఛేదించడాన్ని విజయవంతమైన పరీక్షగా భావిస్తారు. యుద్ధాన్ని పోలిన వాతావరణంలో ఈ పరీక్షలు జరిపారు. ఈ పరీక్ష తరువాత అస్త్ర వాయుసేనలో చేరిక వేగవంతమౌతుందని వార్తలు వెలువడ్డాయి.[23]
2017 సెప్టెంబరు 11-14 తేదీల మధ్య జరిపిన ఏడు పరీక్షలు విజయవంతమయ్యాయి.[24] 2018 లో సెప్టెంబరు 26 అక్టోబరు 3 మధ్య ఆరు పరీక్షలు జరిపారు. అవన్నీ విజయవంతమయ్యాయి. క్షిపణిని వాయుసేనకు అప్పగించే ముందు జరిపిన పరీక్షలు ఇవి. [25][26] ఆ తరువాత 2019 సెప్టెంబరు 17 న భారతీయ వాయుసేన సుఖోయ్-30MKI నుండి క్షిపణిని పరీక్షించింది. అది విజయవంతమైంది.[27] ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్న లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించింది.[28]
ముఖాముఖి దాడి చేసేటపుడు అస్త్ర పరిధి 110 కి.మీ. ఉంటుంది. వెంటాడే దాడిలో ఇది 20 కి.మీ. ఉంటుంది. దీన్ని వివిధ ఎత్తుల నుండి ప్రయోగించవచ్చు. 15 కి.మీ. ఎత్తు నుండి ప్రయోగించినపుడు దీని పరిధి 110 కి.మీ, 8 కి.మీ. ఎత్తు నుండి ప్రయోగించినపుడు 44 కి.మీ., సముద్ర మట్టం నుండి ప్రయోగించినపుడు 21 కి.మీ. ఉంటుంది. సముద్ర మట్టం దగ్గరలోని కదులుతున్న లక్ష్యాన్ని ఛేదించేటపుడు ఈ క్షిపణి 40 g మలుపులు తీసుకుంటుంది.
అస్త్ర యొక్క మార్క్ 2 కూర్పులో గరిష్ఠ పరిధి 100 కి.మీ.లు ఉండేలా డిఆర్‌డివో అభివృద్ధి చేస్తోంది. ఈ క్షిపణిలో వివిధ రకాల ఇంధనాలను వాడే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది.[29][30]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)