ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ (ఆంధ్రప్రదేశ్ శాసనాంగాలు) | |
---|---|
రకం | |
రకం | ఆంధ్రప్రదేశ్ ద్విసభ శాసనసభ |
సభలు | శాసన మండలి (ఎగువ సభ) శాసన సభ (దిగువ సభ) |
నాయకత్వం | |
ఎస్. అబ్దుల్ నజీర్ 2023 ఫిబ్రవరి 13 నుండి | |
నిర్మాణం | |
సీట్లు | 58 (శాసనమండలి) 175 (శాసనసభ) |
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (42)
ప్రతిపక్షం (12) ఇతరులు (2)
ఖాళీలు (2)
|
శాసనసభ రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (164)
|
ఎన్నికలు | |
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఓటింగ్ విధానం | ఒకే బదిలీ చేయగల ఓటు |
శాసనసభ ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చివరి ఎన్నికలు | 2023 మార్చి 13 |
శాసనసభ చివరి ఎన్నికలు | 2024 మే 13 |
సమావేశ స్థలం | |
అసెంబ్లీ భవనం అమరావతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ వెస్ట్ మినిస్టర్-ఉత్పన్న పార్లమెంటరీ వ్యవస్థను అనుసరిస్తుంది. దీనిలో రాష్ట్రపతిచే నియమించిన గవర్నర్, ప్రజలచే ఎన్నికైన శాసనసభ, పరోక్షంగా ఎన్నుకోబడిన శాసనమండలి ముఖ్యమైన అంగాలు. శాసనవ్యవస్థ తన అధికారాన్ని భారత రాజ్యాంగం నుండి పొందింది. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న 61 విషయాలపై చట్టాలు రూపొందించే ఏకైక అధికారంతో పాటు భారత పార్లమెంటుతో 52 రకాల విషయాలలో చట్టాన్ని రూపొందించే అధికారాన్ని పంచుకొనే అధికారం కలిగివుంది. ప్రాదేశిక నియోజకవర్గాల ద్వారా దిగువ సభకు సభ్యులను ఎన్నుకుంటారు. ఆధిక్యత గల వారే విజేత అనే పద్ధతి వాడుతారు. ఎగువ సభ సభ్యులు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడతారు లేదా గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ రాష్ట్ర అధిపతి కాబట్టి శాసనసభ నాయకుడిని ఎంపిక చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి భాషా రాష్ట్రం. ఒకప్పుడు భారతదేశంలో ఐదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 1956 నవంబరు 1 న ఆంధ్ర రాష్ట్రం, పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల ఏకీకరణతో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన పర్యవసానంగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 105 మంది సభ్యులతో తొలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడింది.
1956 లో ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ ఒకే సభతో ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సమావేశం 1956 డిసెంబరు 3 న జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటి సభాపతిగా అయ్యదేవర కాళేశ్వరరావు, మొదటి ఉపసభాపతిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నికయ్యారు.
1958 శాసనమండలి ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ ద్విసభగా మారింది. నియోజకవర్గాల పరిధులలో మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైన శాసనసభ సభ్యుల సంఖ్యలో మార్పులు జరిగాయి. సభ్యుల సంఖ్య1956 లో 245, 1962 లో 300, 1967 లో 287 1978 లో 294 గా ఉంది. 2014 లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా రాష్ట్రం విభజించబడింది. విడిపోయినతర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ బలం 175.
మూడవ, నాల్గవ ఆంధ్రప్రదేశ్ శాసనసభలలో 1962, 1967 లో రెండుసార్లు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనది బివి సుబ్బారెడ్డి. నాల్గవ శాసనసభలో 68 మంది అత్యధిక సంఖ్యలో స్వతంత్రులను కలిగి ఉంది. ఐదవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1972 లో సభాపతిగా ఎన్నికైన పి. రంగా రెడ్డి 1968 నుండి 1972 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. అందువలన అంధ్రప్రదేశ్ శాసనసభ ఉభయ సభలకు అధ్యక్షుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఏడవ శాసనసభ పదవీకాలం ప్రకారం అతి తక్కువది. ఏడవ అసెంబ్లీలో మొదటి అవిశ్వాస తీర్మానం 1984 సెప్టెంబరు 20 న సభలో ప్రవేశపెట్టబడింది. 1999 అక్టోబరు 10 న ఏర్పడిన పదకొండవ శాసనసభలో కె. ప్రతిభా భారతి, స్పీకర్ స్థానం అలంకరించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.
భారత అధ్యక్షుడు శాసనవ్యవస్థలో ప్రసంగించటం తొలిసారిగా నీలం సంజీవ రెడ్డి 1978 జూన్ 28 న, రెండవసారిగా ఎపిజె అబ్దుల్ కలాం 2004 జూలై 14 న జరిగింది.[1]
భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి గవర్నర్‌తో కూడిన శాసనసభ ఉంటుంది. అంతేకాకుండా, రాష్ట్ర శాసనసభ ఎగువ సభను రూపొందించాలని నిర్ణయించవచ్చు - ఎగువ సభను ఎప్పుడైనా రద్దు చేయమని తీర్మానించవచ్చు. రెండు సభల మధ్య ఈ ప్రత్యేకమైన సంబంధం పెద్ద, చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత కొరకు రాజ్యాంగంలో పేర్కొనబడింది. శాసనమండలి ఏర్పరచటం ఎక్కువ రాజకీయ భాగస్వామ్యం కొరకు కాగా, రద్దు చేయటం రెండు సభలను నిర్వహించడంలో ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఉపయోగపడుతున్నది. భారతదేశంలో ద్విసభ శాసనసభ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రం 1957 లో ఒక ఎగువ సభను ఉనికిలోకి తెచ్చింది, 1985 లో రద్దు చేయబడింది. 2007 లో తిరిగి స్థాపించబడింది. [2]
ఎగువ సభను శాశ్వత సభగా పేర్కొంటారు. దాని సభ్యులలో మూడోవంతు ప్రతి రెండవ సంవత్సరం పదవీ విరమణ చేస్తారు. శాసనసభ పదవీకాలం దాని మొదటి సమావేశానికి నియమించిన తేదీ నుండి ఐదేళ్ళు. మంత్రిమండలి దిగువ సభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది, దిగువ సభ విశ్వాసాన్ని పొందుతున్నంత కాలం అధికారంలో ఉంటుంది. మంత్రులు సాధారణంగా దిగువ సభలో సభ్యులు అయినప్పటికీ, వారు ఏ సభలోనైనా సభ్యులు కావచ్చు. [2]
ద్రవ్య బిల్లులు దిగువ సభలో మాత్రమే తొలిగా ప్రవేశపెట్టినప్పటికీ, ఇతర బిల్లులో దేనిలోనైనా తొలిగా ప్రవేశపెట్టవచ్చు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో మార్పులను మాత్రమే ఎగువ సభ సూచించగలదు. అసెంబ్లీ తన రెండవసారి చర్చలో ఎగువ సభ చేసిన మార్పులను విస్మరించాలని నిర్ణయించుకుంటే, శాసనమండలి బిల్లును శాసనసభ ఆమోదించిన అసలు రూపంలో అంగీకరించాలి. సాధారణ లేదా ద్రవ్య బిల్లులలో శాసనమండలి శాసన ప్రక్రియలో కొంత ఆలస్యాన్ని మాత్రమే చేయగలదు. చివరిగా బిల్లును గవర్నర్‌కు పంపుతారు, వారు బిల్లును చట్టంగా మార్చడానికి సంతకం చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. [2]
శాసన మండలి శాశ్వత సభ.[3] ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరుసంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వ కాలం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు.[3] శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఓటుహక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదేకాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు. [4]
20 మంది సభ్యులు (1/3 భాగం) శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు (1/3 భాగం) అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 5 మంది సభ్యులు (1/12 భాగం) పట్టభద్రులు, 5 గురు (1/12 భాగం) ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు . ఆంధ్రప్రదేశ్ గవర్నరు ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. [5]
శాసనసభ ఎన్నికలకు ఓటర్లు ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించబడ్డారు. ఆధిక్యం పొందిన అభ్యర్థులే విజేతలౌతారు. As of 2014[update], శాసనసభ 175 సభ్యులను కలిగివుంది .
సంఖ్య | పార్టీ | శాసనసభ సీట్లు | ఎం.ఎల్.సి. సీట్లు |
---|---|---|---|
1 | తెలుగుదేశం పార్టీ | 135 | 10 |
2 | జనసేన పార్టీ | 21 | 0 |
3 | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | 11 | 42 |
4 | భారతీయ జనతా పార్టీ | 8 | 0 |
5 | భారత జాతీయ కాంగ్రెస్ | 0 | 0 |
6 | ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) | 0 | 2 |
7 | స్వతంత్ర రాజకీయ నాయకులు | 0 | 2 |
8 | ఖాళీ | 0 | 2 |
మొత్తం | 175 | 58 |
చరిత్రలో వివిధ కాలాలలో శాసనసభ స్పీకర్లగా వ్యవహరించినవారి జాబితా ఈ క్రింద ఇవ్వబడింది[6]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి .
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితులు. [7]
అసెంబ్లీ | రాజ్యాంగం | రద్దు | వ్యాఖ్యలు |
---|---|---|---|
1వ | 1953 | 1955 | తొలి ఆంధ్ర శాసనసభ |
2వ | 1955 మార్చి 3 | 1962 మార్చి 1 | శాసనమండలి ఏర్పాటు |
3వ | 1962 మార్చి 3 | 1967 ఫిబ్రవరి 28 | |
4వ | 1967 మార్చి 1 | 1972 మార్చి 14 | |
5వ | 1972 | 1978 | |
6వ | 1978 | 1983 | |
7వ | 1983 | 1984 | |
8వ | 1985 | 1989 | శాసనమండలి రద్దు చేయబడింది |
9వ | 1989 | 1994 | |
10వ | 1994 | 1999 | |
11వ | 1999 | 2003 | |
12వ | 2004 | 2009 | శాసనమండలి తిరిగి స్థాపించబడింది |
13వ | 2009 | 2014 | |
14వ | 2014 | 2019 మే 23 [8] | రాష్ట్ర విభజన తరువాత మొదటి శాసనసభ |
15వ | 2019 | 2024 జూన్ 05[9] | రాష్ట్ర విభజన తరువాత రెండవ శాసనసభ |
16వ | 2024 జూన్ 12 | ప్రస్తుతం | రాష్ట్ర విభజన తరువాత మూడవ శాసనసభ |