ఆనీ లార్సెన్ వ్యవహారం అనేది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నుండి భారతదేశానికి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం. [1] భారతీయులకు చెందిన గదర్ పార్టీ, ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్‌హుడ్, జర్మన్ విదేశాంగ కార్యాలయం - ఈ మూడూ కలిసి చేసిన కుట్ర కార్యక్రమాలైన హిందూ జర్మను కుట్రలో ఇది భాగం. [2] 1917 లో జరిగిన హిందూ -జర్మన్ కుట్ర విచారణలో ఇదే ప్రధానమైన నేరం. అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన విచారణగా దీన్ని వర్ణించారు. [3]
1914 నాటికి, యావద్భారత విప్లవం కోసం ప్రణాళికలు రూపొందించబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, గదర్ ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని జర్మనీ నిర్ణయించుకుంది. దీని కోసం, జర్మనీలోని భారతీయ, ఐరిష్ ప్రజల మధ్య ఏర్పడిన లింకులను (రోజర్ కేస్‌మెంట్‌తో సహా), అమెరికా లోని జర్మనీ విదేశాంగ కార్యాలయాలనూ వాడి అమెరికా లోని ఇండో-ఐరిష్ నెట్‌వర్కుతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. 1914 సెప్టెంబరులో జర్మనీ ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్‌మన్-హాల్‌వెగ్, బ్రిటిషు భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టేందుకు అధికార మిచ్చాడు. ఈ ప్రయత్నాలకు పురావస్తు శాస్త్రవేత్త, ప్రాచ్యదేశాల కోసం కొత్తగా ఏర్పడిన నిఘా సంస్థ అధిపతీ అయిన మాక్స్ వాన్ ఒపెన్‌హీమ్ నాయకత్వం వహించాడు. భారతీయ విద్యార్థి సంఘాలను ఒక సంఘటిత సమూహంగా ఏర్పాటు చేసే బాధ్యత ఒప్పెన్‌హీమ్‌పై పడింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల గురించి ఒప్పెన్‌హీమ్, హర్ దయాళ్‌ను ఒప్పించాడు. అమెరికాలో గదర్ పార్టీతో సంబంధాన్ని ఏర్పరచుకోగలిగాడు. అక్టోబరులో జరిగిన ఇంపీరియల్ నావల్ ఆఫీస్ సమావేశంలో, కాలిఫోర్నియాలోని గదర్ నాయకులతో సంప్రదింపులు జరిపే బాధ్యతను శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మను రాయబార కార్యాలయానికి అప్పగించారు. నావల్ లెఫ్టినెంట్ విల్హెల్మ్ వాన్ బ్రింకెన్, తారక్ నాథ్ దాస్ ద్వారా, చార్లెస్ లాటెండోర్ఫ్ అనే మధ్యవర్తి ద్వారా గదర్ పార్టీ అధ్యక్షుడైన రామచంద్రతో పరిచయాన్ని ఏర్పరచుకోగలిగాడు.
శాన్ ఫ్రాన్సిస్కో లోని జర్మను వైస్ కాన్సల్ EH వాన్ షాక్ ఆమోదంతో, నిధులు, ఆయుధాలను ఏర్పాట్లు చేసారు. రామచంద్రకు నెలవారీ చెల్లింపుగా $ 1,000 అందుతుంది. అదే సమయంలో జర్మను మిలిటరీ అటాచీ అయిన కెప్టెన్ ఫ్రాంజ్ వాన్ పాపెన్, హన్స్ టౌషర్ అనే క్రుప్ కంపెనీ ఏజెంటు ద్వారా $2,00,000 విలువైన చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రీ పొందాడు. ఈలోపు పాపెన్, ఐరిష్-అమెరికన్ షిప్పింగ్ సంస్థ అయిన మల్లోరీ స్టీమ్‌షిప్ కంపెనీ ద్వారా న్యూయార్క్ నుండి గాల్వెస్టన్ వరకు ఆయుధాలను రవాణా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి జోసెఫ్ మెక్‌గారిటీని నియమించాడు. గాల్వెస్టన్ నుండి తుపాకులు రైలు ద్వారా శాన్ డియాగోకు పంపించారు. అక్కడి నుండి వాటిని బర్మా ద్వారా భారతదేశానికి పంపుతారు. అయితే, శాన్ డియాగోకు రవాణా ఏర్పాట్లు చేసిన చార్లెస్ మార్టినెజ్ అనే కస్టమ్స్ అధికారికి, తుది గమ్యం ఏది అనేది చెప్పలేదు. తుది గమ్యానికి రవాణా చేసేందుకు ఆనీ లార్సెన్ అనే ఓడను మాట్లాడుకున్నారని కూడా అతనికి తెలియదు. [4][5] అసలు విషయాన్ని కప్పిపుచ్చడం కోసం, ఈ ఆయుధాలు మెక్సికో అంతర్యుద్ధంలో పోరాడుతున్న వర్గాల కోసం అని ఒక మోసపూరిత కథను అల్లారు. ఆయుధాలను అనీ లార్సెన్ ఓడ లోకి ఎక్కించే బాధ్యత వహించిన జె. క్లైడ్ హిజార్ అనే కొలరాడో న్యాయవాది, తాను మెక్సికో లోని కారన్జా వర్గానికి ప్రతినిధినని నమ్మబలికాడు. ఈ వ్యవహారం మొత్తానికి విశ్వసనీయత కలిగించేందుకు గాను, మెక్సికోలో కారన్జా వర్గానికి ప్రత్యర్థి వర్గమైన విల్లా ఫ్యాక్షనుకు ఆ ఆయుధాలను మళ్ళిస్తే $15,000 చెల్లిస్తామనే ఆఫర్‌ను విల్లా నుండి సంపాదించాడు. [6]
అయితే, ఆనీ లార్సెన్ పసిఫిక్ మహా సముద్రాన్ని దాటటానికి అనువైనది కాదు. ఇందుకోసం జర్మనీ రాయబార కార్యాలయంతో సన్నిహిత సంబంధాలున్న జర్మనీ రిజర్వ్ నావికాదళ అధికారి ఫ్రెడరిక్ జెబ్సెన్, SS మావెరిక్ అనే మరొక నౌకను కొనుగోలు చేయాలని భావించారు. దీనిని "అమెరికన్-ఏషియాటిక్ ఆయిల్ కంపెనీ" అనే నకిలీ ఆయిల్-ట్రేడింగ్ కంపెనీ ఉపయోగిస్తున్నట్లుగా నమ్మించి, దాన్ని చైనా, బోర్నియోల మధ్య నిలిపి ఉంచాలి అని ప్రణాళిక వేసారు. ఆనీ లార్సెన్ శాన్ డియాగోనుండి పూర్తి లోడుతో బయలుదేరిన సమయంలోనే, మావెరిక్ కూడా శాన్ పెడ్రో నుండి ఖాళీగా బయల్దేరాలనేది వారి ప్రణాళిక. ఈ రెండూ మెక్సికో సమీపంలోని సోకోరో ద్వీపంలో కలుసుకుంటాయి. ఆనీ లార్సెన్ లోని లోడును తీసుకుని మావెరిక్, ఆగ్నేయాసియా వైపు వెళ్తుంది. [7][8] ఇందు కోసం, జెబ్సన్ తన న్యాయవాది రే హోవార్డ్‌ను భాగస్వామిగా తీసుకొని, ఓడ యజమానిగా చూపించేందుకు ఒక నకిలీ కంపెనీని స్థాపించాడు. [9][10] శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు జర్మనీ నౌకలలో తొలగించబడిన నావికులను మావెరిక్ కోసం సిబ్బందిగా నియమించుకున్నారు. జాన్ బి. స్టార్-హంట్ అనే అమెరికను నావికుడు మావెరిక్‌లో సూపర్‌కార్గోగా పనిచేశాడు. మిత్రరాజ్యాల యుద్ధనౌకలు అడ్డుకుంటే ఓడను ముంచివేయాలనేది అతనికున్న ఆదేశాలు. [11] జావా, బోర్నియోల్లోని కొబ్బరి పరిశ్రమలో ఉన్న రద్దీ నుండి ఉపశమనం కలిగించడమే ఈ నౌక ఉద్దేశమని రేవులో భ్రమ కల్పించారు.
1915 మార్చి 8 న ఆనీ లార్సెన్, కెప్టెన్ పాల్ ష్లూటర్ నేతృత్వంలో బయలుదేరింది. టోపోలోబాంపో వద్ద SS మావెరిక్ను కలవడం దాని లక్ష్యం. వాల్టర్ పేజ్ అనే వ్యక్తిని ఓడలో సూపర్ కార్గోగా నియమించారు. పేజ్ అసలు పేరు L. ఓథర్. అతను అట్లాస్ అనే జర్మన్ పడవకు కెప్టెన్, దీనిని గతంలో అమెరికా ప్రభుత్వం శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్బంధించింది. ఓడ కదలికలపై పేజ్‌కు పూర్తి అధికారం ఇచ్చారు. అతను బాజా కాలిఫోర్నియా తీరానికి దగ్గర్లో ఉన్న సోకోరో ద్వీపానికి ప్రయాణించాడు. [12][13]
అయితే, ఈ దశలో ఆ ప్రణాళిక విఫలమవడం మొదలైంది. ఆ సమయంలో డ్రైడాక్‌లో ఉన్న మావెరిక్ మరో నెల రోజుల వరకూ ప్రయాణించలేక పోయింది. ఈ సమయంలో, ఆగ్నేయాసియాలో ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారనే పుకార్లు వచ్చాయి. ఈ నౌకను కస్టమ్స్, సెక్యూరిటీ ఏజెంట్లు అనేకసార్లు శోధించారు. ఓడ ఖాళీగా ఉండడం మాత్రమే వారికి కనబడింది. అది బయలుదేరే ముందు దాని సిబ్బందిలోకి నకిలీ పర్షియన్ పాస్‌పోర్టులున్న ఐదుగురు భారతీయ గదర్ పార్టీ కార్యకర్తలు చేరారు. వారు పెద్ద మొత్తంలో గదర్ సాహిత్యాన్ని తీసుకువెళ్లారు. భారతీయ విప్లవకారులతో పరిచయాలను ఏర్పరచుకోవడం, ఆయుధాలను లోతట్టుకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయడం రామచంద్ర వారికి అప్పజెప్పిన పని. [14][15] ఇదిలా ఉండగా, దాదాపు ఒక నెలపాటు మావెరిక్ కోసం ఎదురుచూస్తూ ఉన్న ఆనీ లార్సెన్‌లో మంచినీళ్ళు అయిపోయాయి. ఓడలో కండెన్సరు కూడా లేనందున ఓడ, మంచినీళ్ళ కోసం మెక్సికో ప్రధాన భూభాగం వైపు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేటపుడు పేజ్ అక్కడ ఇద్దరు సిబ్బందిని విడిచివెళ్ళాడు. మావెరిక్ రెండెజౌస్ పాయింటు (కలిసే చోటు) వద్దకు వచ్చాక వాళ్ళు ఆనీ లార్సెన్ మెక్సికో వైపు వెళ్ళిన సంగతిని చెప్పారు. ఆనీ లార్సెన్ తిరిగి రావడం కోసం మావెరిక్, ఇరవై తొమ్మిది రోజులు అక్కడే వేచి చూసింది. ఈ సమయంలో, దీనిని బ్రిటిషు నౌకాదళానికి చెందిన HMS కెంట్ అనే యుద్ధ నౌక చూసింది. ఓవైపు కెంట్ సిబ్బంది ఓడలో గాలింపు జరుపుతోంటే, గదర్ ఏజెంట్లు బాయిలరు గదిలో తమ విప్లవ సాహిత్యాన్ని తగలబెట్టారు. ఆ తరువాత ఒక అమెరికన్ యుద్ధనౌక కూడా ఓడలో గాలింపు జరిపింది గానీ, వారికి కూడా ఖాళీ ఓడ తప్ప మరేమీ కనబడలేదు. [16][17]
ఆనీ లార్సెన్ తన సరఫరాలను తిరిగి నింపుకోడానికి అకాపుల్కోకు వెళ్ళింది. అయితే, సిబ్బందిలో ముగ్గురు, ఆ ఓడ సముద్రయానానికి తగదని చెప్పి ప్రయాణించడానికి నిరాకరించడంతో, ఇబ్బందులు ఎదురయ్యాయి. కెప్టెన్ షెల్ట్జర్, USS యార్క్‌టౌన్ను సహాయం కోసం అర్థించగా, అతనికి సాయం అందింది. యార్క్‌టౌన్ సిబ్బందికి ఆనీ లార్సెన్ లోని నిషేధిత సరుకు కనబడలేదు. యార్క్‌టౌన్ లోని వైర్‌లెస్‌ను వాడుకునే అనుమతి లభించడంతో, జర్మన్ సిబ్బంది తమ స్థానం గురించి, విఫలమైన రెండెజౌస్ గురించీ జర్మన్ కాన్సులేట్‌కు తెలియజేసారు. అకాపుల్కో నుండి ఆనీ లార్సెన్, మళ్లీ సోకోరో ద్వీపం వైపు బయలుదేరింది. ఐతే, ప్రతికూల వాతావరణం కారణంగా, ఈ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇరవై రెండు రోజుల తరువాత, షెల్ట్జర్ తన ప్రయత్నాలను విరమించి, వాషింగ్టన్ లోని హోక్వియం రేవుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. [18][19]
ఆనీ లార్సెన్ను కలుసుకోవడంలో విఫలమైన మావెరిక్ శాన్ డియాగో చేరుకున్నాక, దాన్ని హవాయి లోని హిలోకు వెళ్ళాలని ఫ్రెడ్ జెబ్సన్ ఆదేశించాడు. అక్కడ నుండి దాన్ని జాన్స్టన్ ద్వీపానికి వెళ్ళి అక్కడ ఆనీ లార్సెన్తో కలవాలని జర్మన్ కాన్సలేట్ ఆఅదేశించింది. కానీ, ఇది కూడా విఫలమైంది. తదనంతరం, జావాలోని అంజర్‌కు వెళ్ళాలని ఆదేశించారు. [20][21] అంజర్ వద్ద, ఓడను వదలివేయాలని థియోడర్ హెల్ఫ్రిచ్స్ అనే జర్మన్ ఆపరేటివ్‌కు చెప్పారు. అయితే, దీనిని డచ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్టార్-హంట్ తో పాటు నలుగురు గదర్ పార్టీ కార్యకర్తలు ఓడలో పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ బ్రిటిష్ క్రూయిజర్ HMS న్యూకాజిల్ వీళ్ళను పట్టుకుని సింగపూర్ తీసుకెళ్ళింది. స్టార్-హంట్ ఈ ప్రణాళికలో తన పాత్రను ఒప్పుకున్నాడు. [22]
అమెరికాలోని ఐరిష్, భారతీయ మార్గాల ద్వారా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వారు ఈ ప్రణాళిక గురించి విజయవంతంగా తెలుసుకోగలిగారు. పసిఫిక్ తీరంలో గదర్ కార్యకలాపాల గురించి భారతదేశంలో పెరిగి, హిందీ చక్కగా మాట్లాడ గలిగే డబ్ల్యుసి హాప్‌కిన్సన్ తెలుసుకున్నాడు. [23] ఈ సమయంలో, బ్రిటిష్, ఐరిష్, యూరోపియన్, మెక్సికన్ మూలాలకు చెందిన నిఘా వనరుల ద్వారా, న్యాయ శాఖ వద్ద ఈ కుట్ర గురించి, మావెరిక్. ఆనీ లార్సెన్ ల నిజమైన లక్ష్యాల గురించీ స్పష్టమైన చిత్రం ఉంది. అమెరికా తూర్పు తీరంలో భారతీయ విద్రోహవాదులను చురుకుగా ట్రాక్ చేసే పనిని బ్రిటిషు భారత ప్రభుత్వపు హోం శాఖ 1910 లోనే ప్రారంభించింది. న్యూయార్క్‌లోని హోం ఆఫీస్ ఏజెన్సీకి నాయకత్వం వహిస్తున్న అధికారి ఫ్రాన్సిస్ కన్‌లిఫ్ ఓవెన్, క్లాన్-నా-గేల్ సభ్యులుగా నటిస్తున్న జార్జ్ ఫ్రీమాన్, మైరాన్ ఫెల్ప్స్‌తో బాగా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. SS మోరైటిస్ ప్రణాళికను అడ్డుకోవడంలో ఓవెన్స్ ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. యాదృచ్ఛికంగా ఐరిష్ రిపబ్లికన్ల తర్వాత స్థాపించబడిన గద్దర్ పార్టీ, పార్టీ లోకి చొరబాట్లు జరిగే అవకాశాలను గ్రహించి, ప్రత్యేకంగా భారతీయ సమాజాన్ని మాత్రమే పార్టీలో చేరేందుకు ప్రోత్సహించింది. దీంతో, ఉద్యమంలో చొరబడేందుకు "స్థానిక" భారతీయ నిఘా అధికారిని ఏర్పాటు చేయడం, అలాగే ప్రఖ్యాతి చెందిన పింకర్టన్ డిటెక్టివ్ ఏజెన్సీని ఉపయోగించడం వంటి అనేక విధానాలను బ్రిటిషు ప్రభుత్వం అవలంబించింది. [24]
చార్లెస్ లాంబ్ అనే ఐరిష్ డబుల్ ఏజెంటు కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ప్రాసిక్యూషనుకు అందించి కేసు నిర్మాణానికి సహాయపడ్డాడు. "C " అనే సంకేతనామం కలిగిన ఒక భారతీయ కార్యకర్త, - బహుశా చంద్రకాంత చక్రవర్తి (తరువాత విచారణలో చీఫ్ ప్రాసిక్యూషన్ సాక్షి) అయి ఉండవచ్చు - కుట్ర వివరాలను బ్రిటిషు, అమెరికన్ నిఘా వర్గాలకు కుట్ర సమాచారాన్ని పంపించాడు. 1915 జూన్ 29 న, హోక్వియామ్‌లో ఆనీ లార్సెన్ పై దాడి చేసి, దాని నిషేధిత సరుకును స్వాధీనం చేసుకున్నారు.[25] అయితే, పేజ్ తప్పించుకుని, జర్మనీ చేరుకున్నాడు. ఆనీ లార్సెన్ లోని సరుకు జర్మనీ తూర్పు ఆఫ్రికాకు చెందినదని వాదిస్తూ ఆ సరుకును తమకు ఇవ్వాలని జర్మన్ రాయబారి కౌంట్ జోహన్ వాన్ బెర్న్‌స్టాఫ్ వాదించినప్పటికీ, దాన్ని వేలం వేసారు. పైగా, ఇండియన్ బెర్లిన్ కమిటీకి సంబంధించిన కొన్ని ప్రణాళికలను చెక్ విప్లవకారుల ద్వారాను, అమెరికా లోని వారి మిత్రులతో సన్నిహితంగా ఉన్న గూఢచారి నెట్‌వర్క్‌ల ద్వారానూ బయటకు వచ్చాయి. EV వోస్కా నేతృత్వంలోని చెక్ సంస్థకు చెందిన అమెరికన్ నెట్‌వర్కు జర్మను ఆస్ట్రియా దౌత్యవేత్తలపై నిఘా వేసిన ప్రతి-గూఢచర్య నెట్‌వర్కు. చెక్ యూరోపియన్ నెట్‌వర్కు నుండి ఈ ప్రణాళిక గురించి తెలుసుకున్న వోస్కా, అమెరికన్ అనుకూల, బ్రిటీష్ అనుకూల, జర్మన్ వ్యతిరేకులు, టోమే మసారిక్‌తో మాట్లాడి, ఆ సమాచారాన్ని అమెరికన్ అధికారులకు పంపారు. అమెరికన్లు బ్రిటిష్ గూఢచారానికి సమాచారం ఇచ్చారు.
ఆనీ లార్సెన్ లోని సరుకును స్వాధీనం చేసుకున్న తరువాత, 1917 నవంబరు 12 న శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టులో హిందూ-జర్మన్ కుట్ర విచారణ ప్రారంభమైంది. మాజీ కాన్సల్ జనరల్, వైస్ కాన్సల్, గదర్ పార్టీ సభ్యులు, శాన్ ఫ్రాన్సిస్కోలోని జర్మన్ కాన్సులేట్ సభ్యులతో సహా నూట ఐదు మందిని విచారించారు. విచారణ 1917 నవంబరు 20 నుండి 1918 ఏప్రిల్ 24 వరకు కొనసాగింది. ఈ విచారణ సమయం లోనే ప్రధాన కుట్రదారుడు రామచంద్ర హత్య జరగడం సంచలనాత్మకమైంది. విచారణ చివరి రోజున చంద్రను అతని తోటి నిందితులలో ఒకరైన రామ్ సింగ్ కిక్కిరిసిన కోర్టు గదిలో హత్య చేశాడు. సింగ్‌ను వెంటనే యునైటెడ్ స్టేట్స్ మార్షల్ కాల్చి చంపారు. 1917 మే లో, బ్రిటన్‌కు వ్యతిరేకంగా సైనిక సంస్థను ఏర్పాటు చేయడానికి కుట్రపన్నిందని గద్దర్ పార్టీకి చెందిన ఎనిమిది మంది భారతీయ జాతీయవాదులపై ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. తరువాతి సంవత్సరాలలో ఈ విచారణ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రదర్శనగా విమర్శించబడింది. పైగా, రిపబ్లికన్ అభిప్రాయాలు లేదా సంఘాలతో సంబంధం ఉన్న ఐరిష్ వ్యక్తులను మినహాయిస్తూ జ్యూరీని జాగ్రత్తగా ఎంపిక చేశారు. భారతీయులను దోషులుగా నిర్ధారించాక, వారిని అమెరికా నుండి తిరిగి భారతదేశానికి బహిష్కరించబడతారని బ్రిటిష్ అధికారులు ఆశించారు. అయితే, భారతీయులకు అనుకూలంగా ప్రజల మద్దతు ఉన్న నేపథ్యంలో, అమెరికా న్యాయ శాఖ అధికారులు అలా చేయకూడదని నిర్ణయించుకున్నారు.