ఆపరేషన్ బ్రాస్‌టాక్స్ | |
---|---|
రకం | భారత సైన్యపు సైనిక కసరత్తులు |
ఆలోచన | జనరల్ కృష్ణస్వామి సుందర్జీ, భారత సైనిక ప్రధానాధికారి |
ప్రణాళిక రచించినది | పశ్చిమ కమాండు దక్షిణ కమాండు |
లక్ష్యం | దక్షిణ పాకిస్తాన్ |
తేదీ | 1986 నవంబరు 18 – 1987 మార్చి 6 |
అమలు జరిపినది | భారత సైన్యం |
ఫలితం | కసరత్తులను ఆపేసారు; పాకిస్తాను సైన్యపు పునర్మోహరింపు క్రికెట్ దౌత్యం పరిస్థితిని చల్లబరచింది |
ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో భారత సాయుధ దళాలు చేసిన సంయుక్త సాయుధ సైనిక కసరత్తు. ఇది 1986 నవంబరు 18 న మొదలై, 1987 మార్చి 6 న ముగిసింది. [1]
భారత సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యాలను పరీక్షించే కసరత్తుల శ్రేణిలో భాగంగా దీన్ని చేపట్టారు. ఇది రెండు సైనిక కమాండుల సంయుక్త బలగాలు - దాదాపు 5,00,000 మంది సైనికులు - చేపట్టిన విన్యాసాలు. భారత సైన్యంలో సగం మంది ఇందులో పాల్గొన్నారు. భారత ఉపఖండంలో ఇది అతిపెద్ద సమీకరణ. ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్‌కు రెండు లక్ష్యాలున్నాయి: ప్రారంభ లక్ష్యం నేలపై దళాల మోహరింపు. [2] పాకిస్తాన్ నావికా స్థావరానికి సమీపంలో భారత నావికాదళం ద్వారా ఉభయచర దాడి కసరత్తులు నిర్వహించడం రెండవ లక్ష్యం.[2] ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్‌లో పదాతిదళం, మెకనైజ్డ్, వైమానిక దాడి విభాగాలు, 5,00,000 మంది సైనిక సిబ్బందీ పాల్గొన్నారు. వీరికి పాకిస్తాన్‌కు 160 కి.మీ. దూరంలో సమీకరించారు. [2] భారత నావికా దళాల నుండి ఏర్పడిన ఉభయచర దాడి బృందాన్ని పాకిస్తాన్‌లోని కరాచీ డివిజన్‌లోని కోరంగి క్రీక్‌కు సమీపంలో మోహరించారు. [2] అయితే, ఈ యుద్ధ హెచ్చరిక కసరత్తుల అతి ముఖ్యమైన లక్ష్యం, వ్యూహాత్మక అణు వ్యూహాన్ని నిర్థారించుకోవడం. [2]
పాకిస్తాన్ సైనిక వ్యూహకర్తలు ఈ యుద్ధ క్రీడను అసంఖ్యాకమైన సాంప్రదాయిక బలాన్ని చూపి బెదిరించే ప్రదర్శనగా భావించారు. భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలలో అత్యంత క్లిష్టమైన క్షణంగా దీన్ని పరిగణించారు. భద్రతా సమాచార వెబ్‌సైటు, గ్లోబల్ సెక్యూరిటీ.ఆర్గ్, ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్‌ను "నాటో చేసిన ఏ కసరత్తుల కంటే కూడా పెద్దది - రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్దది" అని పేర్కొంది. [2] నేటికీ, పాకిస్తాన్ సైనిక విశ్లేషకులు వ్యూహకర్తలూ దీనిని, మధ్య పాకిస్తాన్‌లోని దట్టమైన ప్రాంతాలలోకి చొరబడేందుకు "మెరుపుదాడి లాంటి" సమగ్రమైన, లోతైన దాడి వ్యూహంగా భావిస్తారు. మరోవైపు, "ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్ ప్రధాన లక్ష్యం భారత సైన్యం రూపొందించిన యాంత్రీకరణ, చలనశీలత, వైమానిక మద్దతు యొక్క కొత్త భావనలను పరీక్షించడమే" అని భారత్ పేర్కొంది. [3] [4]
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, భారత సైన్యం భూతల యుద్ధం, వృత్తి నైపుణ్యం యొక్క ఆధునిక పద్ధతులను అభ్యసించాలని చాలా కాలం పాటు తలపోసింది. [4] భారత సైన్యపు ప్రధానాధికారి, జనరల్ కృష్ణస్వామి సుందర్‌జీ, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించిన అధికారి. అతను భారత సైన్యపు ఆధునికీకరణ దిశగా చురుగ్గా చర్యలు తీసుకున్నాడు. [4] యాంత్రికీకరణ, చలనశీలత, వాయు సేన మద్దతు యొక్క కొత్త భావనలను పరీక్షించడానికి పెద్ద ఎత్తున సైనిక కసరత్తులు చేసేందుకు ప్రభుత్వం అతనికి అనుమతినిచ్చింది. [4] యాంత్రిక, సాయుధ విభాగాలను సమీకరించడానికి అతను ఆదేశాలు జారీ చేసాడు. థార్ ఎడారిలో సాయుధ ట్యాంకులను మోహరించారు. [4] 1986 డిసెంబరులో, పశ్చిమ ఎడారిలో మోహరించిన పదివేలకు పైగా సాయుధ వాహనాలతో భారత్, భారీ సైనిక కసరత్తుల చివరి దశను ప్రారంభించింది. ఇది పాకిస్తాన్‌తో కొత్త ఉద్రిక్తతలను రేకెత్తించింది.
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) చేపట్టిన ఏ కసరత్తు కంటే కూడా ఇది పెద్దది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక కసరత్తు ఇది. [5] ప్రారంభంలో, దాదాపు 6,00,000–8,00,000 మంది సైనికులను సమీకరించారు. పాకిస్తాన్ నుండి 160 కి.మీ. కంటే తక్కువ దూరంలో రాజస్థాన్ రాష్ట్ర పశ్చిమ సరిహద్దులో ఈ సైన్యాన్ని ఉంచారు. [6] భారత సైన్యపు పశ్చిమ కమాండ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్ నాథ్ హూన్, "ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్ అనేది, యావత్తు భారత సైన్యపు సమీకరణే" అని పేర్కొన్నాడు. [7]
1971 నాటి భారత పాక్ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్‌లో చేసినట్లుగా, భారతదేశం అఖండమైన సాంప్రదాయిక ఆధిపత్యాన్ని ప్రదర్శించి, పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు చేసి ఛిన్నాభిన్నం చేయాలని యోచిస్తోందన్న పెద్ద ఎత్తున పాక్ భయపడేందుకు ఈ కసరత్తుల భారీతనం దారితీసింది. జనరల్ హూన్ జ్ఞాపకాల ప్రకారం, పశ్చిమ కమాండు సుందర్‌జీకి ఒక లేఖ పంపింది, "ఇంత పెద్ద కసరత్తు జరిగినప్పుడు, భారత బలగాల కదలికలు పాకిస్తాన్ దృష్టిని ఆకర్షించబోతున్నాయి." [8] ఈ ఆపరేషన్ స్థాయి గురించి జనరల్ సుందర్జీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి తెలియజేయలేదని, దాని వివరాలను అతనికి చెప్పకుండా దాచారనీ జనరల్ హూన్ పేర్కొన్నాడు. [9] హూన్ తన జ్ఞాపకాలలో ఇలా రాసాడు: "బ్రాస్‌స్టాక్స్ సైనిక కసరత్తు కాదు. పాకిస్థాన్‌తో నాల్గవ యుద్ధానికి దారితీసే పరిస్థితిని కల్పించే ప్రణాళిక ఇది". భారత అధ్యయనకారుడు పాల్ కపూర్ ఇంకా వాదిస్తూ, "ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్ సమయంలో పాకిస్తాన్‌పై దాడి చెసేందుకు ఒప్పించేందుకు భారత సైన్యం అనేకమార్లు విఫలయత్నాలు చేసింది" అని అన్నాడు.
బ్రాస్‌స్టాక్స్ సంక్షోభం, ప్రధానంగా విస్తారమైన రాజస్థాన్ ఎడారి రంగానికి పరిమితమై, రెచ్చగొట్టే విధంగా పెద్ద ఎత్తున భారత సైన్యం చేసిన కసరత్తును పాకిస్థాన్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనుకోకుండా, ప్రమాదవశాత్తు ఏర్పడిన సంక్షోభం కాదని రచయిత రాబర్ట్ ఆర్ట్ తదితరులు సిద్ధాంతీకరించారు. [10] స్పష్టంగా, పాకిస్తాన్‌ను ప్రతిస్పందించేలా రెచ్చగొట్టి. తద్వారా పాకిస్తాన్‌పై వరుసగా దాడులు చేసి దాని అణు బాంబు ప్రాజెక్టులను నిర్మూలించేందుకు వేసిన ప్రణాళికలను అమలు చేయడానికి భారతదేశానికి ఒక సాకును అందించేలా జనరల్ సుందర్‌జీ వ్యూహం ఉంది. [10]
1981లో ఒసిరాక్‌లోని ఇరాకీ అణు విద్యుత్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం అకస్మాత్తుగా చేసిన ఆపరేషన్ ఒపెరా వైమానిక దాడి విజయవంతం అయిన తర్వాత, పాకిస్తాన్ సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి. అణు వ్యూహకర్త, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మునీర్ అహ్మద్ ఖాన్ జ్ఞాపకాల ప్రకారం, అణుశక్తి దేశంగా మారే క్రమంలో ఉన్న పాకిస్తాన్‌పై భారతదేశం దాడి చేస్తుందనే భయాల మధ్య, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య ప్రతిరోజూ తీవ్రమైన చర్చలు జరిగేవి. అటువంటి దాడులను ఎదుర్కోడానికి పాకిస్తాన్ సాయుధ దళాల కమాండర్లు తమ బలగాలను ఒకేసారి, అన్ని దిశల నుండి, వీలైనంత త్వరగా సమీకరించాలని 1981 నుండే వారికి ఆదేశాలున్నాయి. [11]
బ్రాస్‌స్టాక్స్ అమలు చేసినప్పుడు, పాకిస్తాన్ తన బలగాల యుక్తులతో త్వరగా ప్రతిస్పందించింది. మొదట మొత్తం V కార్ప్స్‌ను, ఆ తరువాత సదరన్ ఎయిర్ కమాండ్‌ను భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి సమీపంలో సమీకరించింది. [11] కొన్ని వారాల వ్యవధిలో, ఉత్తర అరేబియా సముద్రంలో నిఘా కోసం పాకిస్తాన్ నేవీ యుద్ధ నౌకలను, జలాంతర్గాములనూ మోహరించారు. [11] పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సైనిక విన్యాసాన్ని పాకిస్తాన్ భౌతిక అస్తిత్వానికి ప్రత్యక్ష ముప్పుగా భావించింది. [11] మొత్తం సాయుధ బలగాలను V కార్ప్స్‌తో సహా ముందు వరుసలకు తరలించడానికి కూడా ఆదేశాలున్నాయి. [11] 1987 జనవరి మధ్య నాటికి, పాకిస్తానీ సాయుధ దళాలు, భారత దళాలు రెండూ, సరిహద్దు ప్రాంతం వెంబడి పరస్పర కాల్పుల పరిధిలో నిలిచాయి. [11] పాకిస్తాన్ అధ్యక్షుడు జియా-ఉల్-హక్‌తో అత్యవసర సమావేశమై తిరిగి వచ్చిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి జైన్ నూరానీ, పాకిస్తాన్‌లోని భారత రాయబారి SK సింగ్‌ను అర్ధరాత్రి పిలిపించాడు. ప్రెసిడెంట్ జియా నుండి తనకు ఒక ముఖ్యమైన సందేశం ఉందని నూరానీ భారత రాయబార కార్యాలయానికి సలహా ఇచ్చాడు. [11] భారతదేశం పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ ఉల్లంఘించినట్లైతే, పాకిస్తాన్ "భారత్‌కు తట్టుకోలేనంత నష్టాన్ని కలిగించగలదు" అని నూరానీ సింగ్‌కు అధికారికంగా చెప్పాడు. [11] అంటే బొంబాయిపై [అణు] దాడిని సూచిస్తున్నారా అని సింగ్ నూరానీని అడిగ్గా, నూరానీ "కావచ్చు" అని అన్నాడు.
ఈ పరిస్థితి వాస్తవ అణ్వాయుధాలున్న దేశానికి (భారత్), అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని భావిస్తున్న దేశానికీ (పాకిస్తాన్) మధ్య యుద్ధానికి దారితీయవచ్చు.
1987 జనవరిలో పాకిస్తాన్ తన మొత్తం అణు స్థావరాలను "హై-అలర్ట్ "లో పెట్టింది. సంక్షోభ వాతావరణం మరింత పెరిగింది. [12] ఈ సమయంలో, అబ్దుల్ ఖదీర్ ఖాన్ భారత దౌత్యవేత్త కులదీప్ నాయర్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అతను "పాకిస్తాన్ తన ఉనికికి ముప్పు కలిగితే తన అణ్వాయుధాలను ఉపయోగిస్తుందని" స్పష్టం చేశాడు. అయితే తాను అలాంటి ప్రకటన చేయలేదని తరువాతి కాలంలో అతను ఖండించాడు. [12] పాకిస్థాన్‌పై దాడి చేస్తే తాము అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని ఇస్లామాబాద్‌లోని తమ దౌత్యవేత్తలను పాకిస్తాన్ హెచ్చరించినట్లు భారత దౌత్యవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రకటనల వాస్తవికతను పాకిస్థాన్ ఖండించింది. [12]
1987 మార్చిలో ఉద్రిక్తతలు తగ్గాయి. కాశ్మీర్ ప్రాంతంలో 1,50,000 మంది సైనికులను ఉపసంహరించుకోవాలని రెండు దేశాల ఒప్పందం, అదే నెలలో, ఎడారి ప్రాంతంలో మరిన్ని దళాలను ఉపసంహరించుకోవడానికి కుదిరిన రెండవ ఒప్పందం ఉద్రిక్తతలు తగ్గడానికి దోహదం చేసాయి. [13] ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నప్పుడు భారతదేశం, బ్రాస్‌స్టాక్స్ కొనసాగుతుందని వక్కాణిస్తూ, పాకిస్తాన్‌ను రెచ్చగొట్టినట్లు భావించడానికి ఎటువంటి కారణం లేదని పేర్కొంది. [14] తాజా ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పుడు, ఆపరేషను చివరి దశ ప్రారంభాన్ని తదుపరి వారం వరకు భారతదేశం వాయిదా వేసింది. [15] తన ఉద్దేశాలు శాంతియుతంగా ఉన్నాయని నిరూపించుకోవడానికి దౌత్యవేత్తలు, జర్నలిస్టులను ప్రత్యేకంగా ఆపరేషన్‌ను పరిశీలించేందుకు ఆహ్వానించే అసాధారణ చర్యను కూడా భారత్ తీసుకుంది. [16] పాకిస్థానీ ఫారిన్ సర్వీస్ అధికారులు, సీనియర్ దౌత్యవేత్తలు, రాజనీతిజ్ఞులను ఆహ్వానించారు. [17] పేరుతెలపని ఒక పాశ్చాత్య దౌత్యవేత్త, "ఇది మూడవ ప్రపంచపు సైన్యమేంఈ కాదు. ఇది చైనీయులు, కొరియన్లు లేదా ఫ్రెంచి వారిలా ఎలాంటి మిషన్నైనా సులభంగా చేసే పూర్తి సమర్థత కలిగిన ఆధునిక సైన్యం." అని అన్నాడు. [18]
పాకిస్తాన్ ప్రెసిడెంట్ జియా 1987 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించారు/. రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అతన్ని ఆహ్వానించారు. [19] జియా, భారత ప్రధాని రాజీవ్ గాంధీ చాలా స్నేహపూర్వకంగా కలుసుకోగలమని, అయితే వాస్తవిక విషయాలపై ఏకీభవించలేమనీ చెప్పాడు. [19]
జరిగిన సంఘటనలు, భారత సైన్యం తీసుకున్న వైఖరిల ప్రకారం, బ్రాస్‌స్టాక్స్ ఒక కసరత్తు మాత్రమే, రెచ్చగొట్టేది కాదు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా మీడియా, ముఖ్యంగా పాశ్చాత్య మీడియా, కలగజేసుకోవడం, శత్రుత్వాలు మరింత పెరగకుండా నిరోధించడానికి గట్టి దౌత్యపరమైన వత్తిడులు తేవడం జరిగాయి. అనేక సందర్భాల్లో, జనరల్ సుందర్‌జీ ఇలా అన్నాడు: "గతంలోను, ఇప్పుడూ, ఎప్పుడూ ఇది శిక్షణ కోసం చేసిన కసరత్తే. కొన్ని వర్గాలలో దీని గురించి అపోహలు ఎందుకు ఉన్నాయో నేను సమాధానం చెప్పలేను." [20] అణు బాంబులపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగిస్తోందని భారత్ పదేపదే పాకిస్థాన్‌పై ఆరోపణలు చేసింది. అయితే పాకిస్థాన్ ఆ వాదనలను తీవ్రంగా తిరస్కరించింది. కొన్ని రోజుల తర్వాత, AQ ఖాన్ కూడా అణు బాంబు అభివృద్ధికి సంబంధించి తాను జారీ చేసిన ప్రకటనలను తిరస్కరించాడు. "తన వ్యాఖ్యలను అసందర్భంగా ఉల్లేఖించారు" అని అతను చెప్పాడు. [21]
ఈ వివాదాస్పద సైనిక కసరత్తు వెనుక అసలు ఉద్దేశాలు తెలియవు, అస్పష్టంగా ఉన్నాయి. 1999లో, భారత సైన్యం మాజీ సీనియర్ కమాండర్, లెఫ్టినెంట్-జనరల్ PN హూన్, ఈ ఆపరేషనులో భారత సైన్యం మొత్తాన్నీ పాకిస్తాన్ తూర్పు సరిహద్దు వరకు సమీకరించిందని వ్యాఖ్యానించాడు. [22] పాకిస్తాన్‌తో నాల్గవ యుద్ధానికి రంగాన్ని సిద్ధపరచేందుకు బ్రాస్‌స్టాక్స్ ఒక ప్రణాళిక అని అతను పేర్కొన్నాడు. పాశ్చాత్య పండితులు కూడా బ్రాస్‌స్టాక్స్ భారత సైన్యం అనుకోకుండా చేసిన రెచ్చగొట్టే చర్య అని, పాకిస్తాన్ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ప్రమాదవశాత్తూ ఏర్పడిన సంక్షోభం అనీ సిద్ధాంతీకరించారు. [10] నేటికి కూడా, పాకిస్తాన్ సైనిక విశ్లేషకులు, వ్యూహకర్తలూ దీనిని " మెరుపుదాడి లాంటి" [23] సమగ్ర లోతైన దాడి వ్యూహమనీ, పాకిస్తాన్ దట్టమైన ప్రాంతాల్లోకి చొరబడే వ్యూహమనీ అంటారు. [24] సైనిక సాంకేతికత కోసం భారతదేశం వేగంగా వేస్తున్న అడుగుల వలన పాకిస్తాన్, అణు బాంబులను అణు నిరోధకంగా నిల్వచేసేందుకు తగు హేతువును అందించిందనిన్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. [25]