ఇ. కృష్ణ అయ్యర్ | |
---|---|
జననం | కల్లిదై కురిచ్చి, మద్రాసు ప్రెసిడెన్సీ | 1897 ఆగస్టు 9
మరణం | 1968 |
ఇ.కృష్ణ అయ్యర్ ( 1897 ఆగష్టు 9 – 1968 జనవరి) భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, శాస్త్రీయ కళాకారుడు, కార్యకర్త. ఇతడు ఇసై వెల్లాల కులపు సాంప్రదాయపు సాదిర్ నృత్యాన్ని (తరువాతి కాలంలో భరతనాట్యం) అనుసరించాడు.
ఇతడు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన కల్లిదరై కురిచ్చి అనే గ్రామంలో 1897, ఆగష్టు 9వ తేదీన జన్మించాడు.[1] ఇతడు అంబసముద్రం ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను చదివాడు. మద్రాసు క్రైస్తవ కళాశాలనుండి పట్టా పుచ్చుకున్నాడు. తరువాత మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు.[1] 1943 నుండి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు.
ఇతడు భారత జాతీయోద్యమంలో చేరి 1930లలో భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు.[1] సుబ్రహ్మణ్య భారతి రచించిన జాతీయ గీతాలకు ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేశాడు.
చదువు ముగిసిన వెంటనే ఇతడు నాటక రంగంలో ప్రవేశించి స్త్రీ పాత్రలను ధరించడం కొనసాగించాడు. సాంప్రదాయ కళల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరిచేవాడు. ఆ సమయంలోనే ఇతడు కర్ణాటక సంగీతాన్ని అభ్యసించాడు.[1]
కృష్ణ అయ్యర్ భరతనాట్యం పునరుద్ధరణ ఉద్యమంలో మమేకమయ్యాడు. ఇతడు సుగుణ విలాస సభ అనే నాటక కంపెనీలో చేరినప్పుడు "సాదిర్" ఆనే దేవదాసీ నృత్యాన్ని అభ్యసించాడు. ఈ నృత్యం పట్ల ఆ సమయంలో సమాజంలో చిన్నచూపు ఉండేది. ఈ సాదిర్ నృత్యం కేవలం దేవదాసీలకే పరిమితమై ఉండేది.[1] ఇతడు ఈ నృత్యకళలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కళ పట్ల సమాజానికి గౌరవం లేకపోవడానికి ఈ నృత్యంలో దేవదాసీల ప్రమేయం ఉండడం ఒక కారణంగా గుర్తించాడు. ఇతడు మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్థాపించి రుక్మిణీదేవి అరండేల్‌తో కలిసి అంతరించి పోతున్న సాదిర్ నృత్య సంప్రదాయాన్ని పునరుద్దరించడానికి కృషిచేశాడు.[1] ఇతడు కర్ణాటక సంగీతాన్ని కూడా ఆదరించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, దినమణి, కల్కి వంటి పత్రికలలో కళల గురించి విమర్శా వ్యాసాలు వ్రాశాడు.
మద్రాసు శాసనమండలికి ఎన్నికైన తొలి మహిళ ముత్తులక్ష్మి రెడ్డి 1920 దశకం చివరలోను, 1930 దశకం ఆరంభంలోను దేవదాసీ విధానాన్ని రద్దుచేయడానికి కృషి చేసింది. ఈమె దేవదాసీలకు సంబంధించిన సాదిర్ నృత్యాన్ని కూడా రూపుమాపాలని ప్రయత్నించింది.[1] కృష్ణ అయ్యర్ సాదిర్ నృత్యం పట్ల ముత్తులక్ష్మి అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మద్రాస్ మెయిల్ పత్రికలో వరుసగా లేఖలను ప్రచురించాడు. ఈ నృత్యానికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడానికి 1932లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సమావేశంలో ఈ నాట్యానికి భరతనాట్యం లేదా భారతీయ నాట్యం అనే పేరును ప్రతిపాదిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.[2]
దేవదాసీ విధానాన్ని ఒకవైపు వ్యతిరేకిస్తూ ఈ నృత్యానికి దేవదాసీలతో ఉన్న సంబంధాన్ని వేరు చేయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంలో బ్రాహ్మణ బాలికలను ఈ నృత్యాన్ని అభ్యసించి, ప్రదర్శనలు ఇచ్చే విధంగా ప్రోత్సహించాడు. రుక్మిణీదేవి సహకారంతో ఈ నాట్యంలో శృంగార వైఖరులను, భంగిమలను ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నించాడు.[2] కానీ 1947లో దేవదాసీల నిర్మూలన చట్టం వచ్చి పూర్తిగా దేవదాసీ విధానం రద్దు అయ్యేవరకు భరతనాట్యం పట్ల ఉన్న కళంకం రూపు మాసి పోలేదు.[3]
ఇతడు తన 71వ యేట 1968లో మరణించాడు.