ఎచ్చంపాటి గాయత్రి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
సంగీత శైలి | భారతీయ శాస్త్రీయ సంగీతం, సినిమా సంగీతం |
వృత్తి | ఉపకులపతి, తమిళనాడు సంగీత, లలితకళల విశ్వవిద్యాలయం |
వాయిద్యాలు | వీణ |
ఎచ్చంపాటి గాయత్రి (జన్మనామం గాయత్రి వసంతశోభ), (జననం 9 నవంబరు 1959)[1] ఒక వీణ కళాకారిణి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈమెను తమిళనాడు సంగీత, లలితకళల విశ్వవిద్యాలయానికి మొదటి ఉపకులపతిగా నవంబరు 2013లో నియమించింది..[2][3]
ఇ.గాయత్రి 1959, నవంబరు 9న అశ్వత్థామ, కమల దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి అశ్వత్థామ తెలుగు సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడు. తల్లి కమల వీణా విద్వాంసురాలు.[4] ఈమె తండ్రి ఈమెకు గాయత్రి వసంతశోభ అని నామకరణం చేశాడు. గాయత్రి మొదట తన తల్లిదండ్రుల వద్ద సంగీత శిక్షణ పొందింది. తరువాత టి.ఎం.త్యాగరాజన్[5] వద్ద కర్ణాటక గాత్ర సంగీతం అభ్యసించింది.
ఈమె తన 9వ యేట మొదటిసారి 1968లో త్యాగరాయ ఉత్సవాలలో భాగంగా ట్రిప్లికేన్ శ్రీ పార్థసారథి స్వామి సభలో ప్రదర్శన ఇచ్చింది. అది మొదలు ఈమె దేశవిదేశాలలో అనేక సంస్థల నుండి బహుమతులు, సన్మానాలు పొందింది.[6] ఈమె అనేక ఆల్బమ్‌లను విడుదల చేసింది. 2011లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈమెను తమిళనాడులోని చెన్నై, తిరువయ్యూరు, మదురై, కొయంబత్తూరు ప్రభుత్వ సంగీత కళాశాలలకు గౌరవ డైరెక్టరుగా నియమించింది. 2017లో ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం ఈమెను సత్కరించింది. .
ఈమె అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, మలేసియా వంటి అనేక దేశాలలో తన ప్రదర్శనలను ఇచ్చింది. ఎ.ఆర్.రహమాన్ స్వరకల్పన చేసిన జాతీయ గీతం "జనగణమన" లో పలువురు కళాకారులతో పాటు ఈమె కూడా పాల్గొనింది.