ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (ఐఐఎల్) అనేది భారతదేశానికి వెలుపల నివసిస్తున్న భారతీయులను సమీకరించి భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనను తొలగించాలని డిమాండు చేసేందుకు ఏర్పడిన రాజకీయ సంస్థ. ఇది 1920 నుండి 1940 వరకు పనిచేసింది. భారతీయ జాతీయవాదులు స్థాపించిన ఈ సంస్థ ఆగ్నేయాసియాలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదటి భాగంలో జపాన్ చేసిన మలయా దండయాత్ర విజయవంతమైంది. జపాన్ ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ జాతీయవాదులు, భారతీయ ప్రవాసులూ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మలయా జపనీస్ ఆక్రమణలో ఉన్న సమయంలో, జపనీయులు మలయాలోని భారతీయులను లీగ్‌లో చేరమని ప్రోత్సహించారు. [1]
ప్రధానంగా భారతీయ జాతీయతను పెంపొందించడానికీ, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జపనీయుల మద్దతు పొందడానికీ ఈ సంస్థను స్థాపించారు. మోహన్ సింగ్ నాయకత్వంలో ఏర్పడిన మొదటి భారతీయ జాతీయ సైన్యానికి లీగ్ నేతృత్వంలో ఉంది. రాష్ బిహారీ బోస్ INA ని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించాడు. తరువాత, ఆగ్నేయాసియాలో సుభాష్ చంద్రబోస్ రాక, INA పునరుజ్జీవనం తరువాత, లీగ్ అతని నాయకత్వంలోకి వచ్చింది. ఈ లీగే తరువాతి కాలంలో ఆజాద్ హింద్‌కు దారితీసింది.
ఆగ్నేయాసియాలో జపాన్ ఆక్రమణలతో, పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయ జనాభా జపాన్ అధీనం లోకి వచ్చింది. యుద్ధం మలయాకు చేరకముందే స్థానిక భారతీయ సంఘాలు ఉనికిలో ఉన్నాయి. వీటిలో అతిపెద్ద వాటిలో సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్, సింగపూర్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తదితర సంస్థలు ఉన్నాయి. వారి సభ్యులలో KPK మీనన్, నేద్యం రాఘవన్, ప్రీతమ్ సింగ్, SC గోహో తదితర ప్రముఖ భారతీయ ప్రవాసులున్నారు. ఆక్రమించుకున్న దేశపు అధికారుల ప్రోత్సాహంతో, ఈ గ్రూపులు స్థానిక ఇండిపెండెన్స్ లీగ్‌ల లాగా విలీనమవడం ప్రారంభించాయి. స్థానిక భారతీయ జనాభాకు, జపాన్ ఆక్రమణ దళానికి మధ్య ఇవి ప్రధాన అనుసంధాన సంస్థలుగా మారాయి.
ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌లో చేరడం వల్ల భద్రత, ప్రోత్సాహకాలు లభించాయి. [2] ఐఐఎల్ కార్డును ప్రదర్శించడం వలన రైల్వే టికెట్ కొనుగోలు తేలికైంది. ఐఐఎల్ ప్రధాన కార్యాలయంలో టూత్ పేస్టు, సబ్బు వంటి వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చెయ్యగలిగారు. [2] రేషన్‌లు జారీ చేసే సాధనం కూడా ఇదే. అదనంగా, IIL స్విస్ రెడ్ క్రాస్‌తో కలిసి పనిచేయడానికి అనుమతించబడినందున, సభ్యులు సిలోన్ వంటి ప్రదేశాలకు లేఖలు పంపడం, అందుకోవడం చెయ్యగలిగేవారు. [2]
రాష్ బిహారీ బోస్ భారతీయ విప్లవకారుడు, అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింగ్‌ని హత్య చేయడానికి 1912 లో ఢిల్లీ-లాహోర్ కుట్రను ప్లాన్ చేసినందుకు, 1915 లో జరిగిన గద్దర్ కుట్రలో ప్రమేయమున్నందుకు గాను ప్రసిద్ధి చెందాడు. బ్రిటిషు వారు అతని కోసం వెతుకుతుండగా, రాష్ బిహారీ జపాను పారిపోయాడు. అక్కడ అతను జపాను దేశభక్తి సమాజాలలో ఆశ్రయం పొందాడు. తదనంతరం రాష్ బిహారీ జపనీస్ భాష నేర్చుకున్నాడు. జపనీస్ మహిళను పెళ్ళి చేసుకున్నాడు. జపాను పౌరుడయ్యాడు.
మలయా దండయాత్రకు ముందూ, అది జరిగే సమయంలోనూ, రాష్ బిహారీ భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ లక్ష్యాల పట్ల జపనీయులకు ఆసక్తి కలిగించేందుకు ప్రయత్నించాడు. ఫుజివారా నుండి ప్రోత్సాహకరమైన నివేదికలు అందడంతోను, స్థానిక స్వాతంత్ర్య లీగ్‌ల స్థాపనతోనూ, IGHQ భారతీయ ఉద్యమం రూపుదిద్దేందుకు, విస్తరింపజేసేందుకూ రాష్ బిహారీ సహాయాన్ని కోరింది.
ఒక రాజకీయ సంస్థగా అభివృద్ధి చెందుతున్న INA ని, ఆగ్నేయాసియా లోని భారతీయ జనాభా కోసం కూడా మాట్లాడే సంస్థగా కూడా చూడమని రాష్ బిహారీ IGHQ కి సలహా ఇచ్చాడు.
1942 మార్చిలో అతను, భారత స్వాతంత్ర్య లీగ్‌ల స్థానిక నాయకులను టోక్యోలో ఒక సమావేశానికి ఆహ్వానించాడు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రతినిధి బృందం 1942 మార్చి చివరలో టోక్యో హోటల్‌లో సమావేశమైంది.
అయితే, టోక్యో కాన్ఫరెన్స్ ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోలేకపోయింది. భారత ప్రతినిధి బృందంలో అనేక మందికి రాష్ బిహారీతో విభేదాలున్నాయి. ప్రత్యేకించి జపాన్‌తో అతనికి ఉన్న సుదీర్ఘ సంబంధం పట్ల, ఆగ్నేయ ఆసియాలో ఆక్రమిత శక్తిగా జపాన్ ఉన్న ప్రస్తుత స్థానం పట్లా వారికి ఈ అభ్యంతరాలున్నాయి. జపనీయుల ఆసక్తుల పట్ల వారికి కొంత ఆందోళనలున్నాయి. భవిష్యత్తులో ఏదో ఒక రోజున బ్యాంకాక్‌లో మళ్లీ సమావేశం కావడానికి సమావేశం అంగీకరించింది. [3] ఏప్రిల్‌లో భారత ప్రతినిధి బృందం రాష్ బిహారీతో సహా సింగపూర్‌కు తిరిగి వచ్చింది.
సింగపూర్‌లో ఒక బహిరంగ సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ బిహారీని ఆహ్వానించారు. ఆ సమావేశంలో ఆల్-మలయన్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పెనాంగ్ బారిస్టర్, ప్రముఖ మలయన్ భారతీయుడైన నేతమ్ రాఘవన్ లీగ్‌కు నాయకత్వం వహించాడు. పాలక మండలిలో సింగపూర్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ చైర్మనైన ఎస్‌సి గోహో, కెపి కేశవ మీనన్ లున్నారు. కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ పేరుతో ఒక కార్యనిర్వాహక విభాగం ఏర్పాటు, ప్రాంతీయ లీగ్‌లు ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థ ఏర్పాటు ప్రకటనలతో పాటు, కౌన్సిల్‌కు INA కూ కౌన్సిల్‌కు జపానుకూ మధ్య సంబంధాలు గురించి అనేక ప్రతిపాదనలను లీగ్ చేసింది. [4] టోక్యోలో కలిసిన దానికంటే పెద్ద ప్రాతినిధ్యంతో జపనీస్ గడ్డపై కాకుండా మరెక్కడైనా సమావేశమై ఈ ప్రతిపాదనలపై ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. [5] యుద్ధ ఖైదీల క్యాంపులకు నేతృత్వం వహించిన నిరంజన్ సింగ్ గిల్‌తో సహా లీగ్ సభ్యులు లీగ్ పట్ల, స్వాతంత్ర్య ఉద్యమం పట్లా జపనీయుల ఉద్దేశాల గురించి భయపడుతున్నారనే సూచనలు కూడా ఉన్నాయి.
భారతీయ జనాభాలో లీగ్‌కు విస్తృత మద్దతు లభించింది; ఆగష్టు చివరలో సభ్యత్వం దాదాపు లక్షకు చేరువలో ఉన్నట్లు అంచనా వేసారు. లీగ్‌లో సభ్యత్వం ఉంటే అది యుద్ధ సమయ అత్యవసర పరిస్థితులలో ఆక్రమణ అధికారులతో వ్యవహరించేటప్పుడు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. లీగ్ సభ్యత్వ కార్డు ఉన్నవారిని భారతీయులుగా గుర్తించారు (అందువలన మిత్రుడు). వారికి రేషన్ జారీ చేసేందుకు దాన్ని ఉపయోగించుకున్నారు. ఇంకా, లీగ్ స్థానిక భారతీయ జనాభా పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేసింది, ఆ సమయంలో నిరుద్యోగులైన తోటల కూలీలతో సహా.
జూన్ 1942 లో, బ్యాంకాక్ సమావేశం జరిగింది. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ రాజ్యాంగాన్ని తయారు చేసింది. లీగ్‌లో కౌన్సిల్ ఫర్ యాక్షన్, దాని కింద ఒక ప్రతినిధుల కమిటీ ఉన్నాయి. కమిటీ క్రింద ప్రాదేశిక, స్థానిక శాఖలు ఉంటాయని భావించారు. రాష్ బిహారీ బోస్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించగా, కేపీ కేశవ మీనన్, నేద్యం రాఘవన్‌లు కౌన్సిల్ పౌర సభ్యులలో ఉన్నారు. మోహన్ సింగ్‌తో పాటు, గిలానీ అనే మరొక అధికారి INA తరపున సభ్యులుగా ఉంటారు. [6] భారతీయ జనాభా ఉన్న 12 భూభాగాల నుండి ప్రాతినిధ్య భారతీయ జనాభాకు అనులోమానుపాతంలో ప్రతినిధుల సంఘంలో సభ్యులుంటారు, [7] భారత జాతీయ సైన్యం లీగ్ అధీనంలో ఉండాలని బ్యాంకాక్ తీర్మానం నిర్ణయించింది. [8]
పంపించారుబ్యాంకాక్ కాన్ఫరెన్స్ ముప్పై నాలుగు అంశాల తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతి అంశంపై జపాన్ ప్రభుత్వం ప్రతిస్పందిస్తుందని ఆశించారు. జపాన్ ప్రభుత్వం భారతదేశాన్ని స్వతంత్ర దేశంగాను, లీగ్‌ను దేశ ప్రతినిధులుగాను, సంరక్షకులుగానూ స్పష్టంగా, బహిరంగంగా గుర్తించాలనే డిమాండు కూడా ఇందులో ఉంది. భారత సార్వభౌమత్వం పట్ల, దాని ప్రాదేశిక సమగ్రత పట్లా గౌరవాన్నిస్తామని జపనీయులు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లీగ్ సహకారం అందించాలంటే, ముందు జపాను దీనికి స్పష్టంగా, నిస్సందేహంగా కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాలని కూడా చెప్పింది. భారత జాతీయ సైన్యానికి మిత్రరాజ్య సైన్య హోదాను కల్పించాలని, దానితో ఆ విధంగానే వ్యవహరించాలనీ భారతీయ యుద్ధఖైదీలందరినీ INA కి విడుదల చేయాలని కూడా తీర్మానం డిమాండు చేసింది. జపనీయులు సైన్యానికి అవసరమైన రుణాల నివ్వాలి. భారతదేశ విముక్తి కోసం కాకుండా మరే ఇతర ప్రయోజనాల కోసమూ కవాతు చేయమని అడగకూడదు. [8] తీర్మానాన్ని అప్పటి జపనీస్ అనుసంధాన కార్యాలయం ఇవాకురో కికన్‌కు పంపించారు.
1943 నవంబరులో, టోక్యోలో గ్రేటర్ ఈస్ట్ ఆసియా కాన్ఫరెన్సు జరిగింది. గ్రేటర్ ఈస్ట్ ఆసియా కో-ప్రోస్పెరిటీ స్పియర్ సభ్యుడిగా ఉన్న దేశాధినేతలు ఇందులో పాల్గొన్నారు. ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా సుభాష్ చంద్రబోస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
1945 లో, జకార్తా లోని భారతీయ కమ్యూనిటీ నాయకుడైన ప్రీతమ్ సింగ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌లోనే కాకుండా, ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. [9]
1972 లో, భారత ప్రభుత్వం స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది [10]దాని ద్వారా స్వాతంత్ర్య ఉద్యమకారులు పింఛను పొందేందుకు అర్హులు. అయితే, ఈ పథకాన్ని అమలు చేయడానికి గణనీయమైన ప్రతిఘటన ఎదురైంది. ఉదాహరణకు, SM షణ్ముగంకు పింఛను ఇప్పించేందుకు లీగ్, 24 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసింది. చివరకు ఆగస్టు 2006 లో గానీ సాధించలేకపోయింది [11]
చలనచిత్ర నిర్మాత కెఎ దేవరాజన్ 1998 లో నిర్మించిన చిత్రం "గోపురం" లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు ప్రముఖ గుర్తింపు లభించింది.[12] ఈ చిత్రంలో, ఒక భారతీయ జర్నలిస్టు తాత 1930 లో జపాన్‌లో స్వాతంత్ర్య ఉద్యమకారుడు. అతని కోసం బ్రిటిష్ పోలీసులు వెతుకుతూంటారు. [13] చివరికి, తాత జపాన్‌లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌లో చేరతాడు. [14]
అమితావ్ ఘోష్ కల్పిత నవల ది గ్లాస్ ప్యాలెస్ (2000) లో, రాజ్‌కుమార్ రాహా అతని విస్తరించిన కుటుంబానికి చెందిన రంగూన్ టేకు వాణిజ్యాన్ని వివరించాడు. [15]ఆ పుస్తకంలో, ఉమా డే ఒక వితంతువు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ లో కార్యకర్త. పుస్తకంలోని తరువాతి భాగంలో ఆమె పాత్ర ద్వారా వలస పాలన అనంతరం వచ్చిన విభేదాలను వివరించాడు. [16]