ఇండియా హౌస్, 1905 - 1910 మధ్య కాలంలో ఉత్తర లండన్‌లో, హైగేట్ లోని క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసేది. ఈ భవనం వేగంగా రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. ఇది విదేశీ విప్లవ భారత జాతీయవాదానికి అత్యంత ప్రముఖమైనది. వివిధ సమయాల్లో భవనాన్ని ఉపయోగించిన జాతీయవాద సంస్థలను అనధికారికంగా సూచించడానికి "ఇండియా హౌస్" అనే పేరే వాడేవారు.
ఇండియా హౌస్ నిర్వాహకులు ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే వలసవాద వ్యతిరేక వార్తాపత్రికను ప్రచురించేవారు. బ్రిటిష్ భారత పాలకులు దీనిని "దేశద్రోహి" అని ముద్ర వేసి నిషేధించారు. [1] వినాయక్ దామోదర్ సావర్కర్, భికాజీ కామా, VN ఛటర్జీ, లాలా హర్ దయాల్, VVS అయ్యర్, MPT ఆచార్య, PM బాపట్‌లతో సహా అనేకమంది ప్రముఖ భారతీయ విప్లవకారులు, జాతీయవాదులకు ఇండియా హౌస్‌తో సంబంధం ఉండేది. 1909లో, ఇండియా హౌస్ సభ్యుడు, మదన్ లాల్ ధింగ్రా, భారతదేశ వ్యవహారాల మంత్రికి రాజకీయ సహాయకుడైన సర్ WH కర్జన్ విల్లీని హత్య చేశాడు.
హత్య తర్వాత స్కాట్లాండ్ యార్డ్, ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ చేసిన దర్యాప్తుతో సంస్థ బీటలు వారింది. మెట్రోపాలిటన్ పోలీసులు ఇండియా హౌస్ కార్యకలాపాలపై చేపట్టిన అణిచివేత చర్యల వలన దాని సభ్యులు బ్రిటన్ వదిలి ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళిపోయారు. చాలా మంది సభ్యులు భారతదేశంలో విప్లవాత్మక కుట్రలలో పాల్గొన్నారు. ఇండియా హౌస్ సృష్టించిన నెట్‌వర్కు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంలో జాతీయవాద విప్లవం కోసం హిందూ-జర్మన్ కుట్రలో కీలక పాత్ర పోషించింది. తదనంతర దశాబ్దాలలో, ఇండియా హౌస్ పూర్వ విద్యార్థులు భారత కమ్యూనిజం లోను, హిందూ జాతీయవాదం స్థాపనలోనూ ప్రముఖ పాత్ర పోషించారు.
ఇండియా హౌస్ 65 క్రోమ్‌వెల్ అవెన్యూ, హైగేట్, నార్త్ లండన్ లో ఉన్న వద్ద ఒక పెద్ద విక్టోరియన్ భవంతి. దాదాభాయ్ నౌరోజీ, షార్లెట్ డెస్పార్డ్, భికాజీ కామా [2] 1905లో స్టూడెంట్-హాస్టల్‌గా ప్రారంభించినప్పుడు, ఇందులో ముప్పై మంది విద్యార్థులు నివసించేవారు. [3] విద్యార్థి-హాస్టల్‌తో పాటు, ఈ భవనం అనేక సంస్థలకు ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేసింది. వాటిలో మొదటిది ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ (IHRS).
కృష్ణవర్మ, స్వామి దయానంద సరస్వతి సాంస్కృతిక జాతీయవాదానికి ముగ్ధుడయ్యాడు. హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పిన "దాడిని ప్రతిఘటించడాన్ని ఎవరూ సమర్థించరు, కానీ అది తప్పదు" అనే సిద్ధాంతాన్ని అతను నమ్మాడు. [4] ఆక్స్‌ఫర్డ్‌లోని బల్లియోల్ కళాశాలలో గ్రాడ్యుయేట్ అయిన అతను, 1880 లలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. రత్లాం, జునాగఢ్‌లతో సహా అనేక సంస్థానాలకు దివాన్ (నిర్వాహకుడు)గా పనిచేశాడు. ఈ ఈ పదవిని అతను, బ్రిటన్ నుండి వేరుగా ఉండే పాలనగా భావించి దాన్ని నిర్వహించేందుకు ఇష్టపడాడు. [4] అయితే, జునాగఢ్‌లోని స్థానిక బ్రిటిషు అధికారుల కుట్ర వలన, రాష్ట్రాలకు సంబంధించి క్రౌన్ అథారిటీ, బ్రిటిషు రాజకీయ నివాసితుల మధ్య విభేదాల వలన వర్మ ఆ పదవిని కోల్పోయాడు. [5] ఆ తరువాత అతను ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛకు మరింత అనుకూలంగా ఉందని గమనించాడు. వర్మ అభిప్రాయాలు వలసవాదానికి గట్టిగా వ్యతిరేకంగా ఉండేవి. 1899లో రెండవ బోయర్ యుద్ధంలో బోయర్స్‌కు మద్దతు కూడా పలికాడు. [4]
కృష్ణవర్మ ఫిబ్రవరి 1905లో [6] భికాజీ కామా, SR రాణా, లాలా లజపత్ రాయ్ తదితరులతో కలిసి బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్‌కి ప్రత్యర్థి సంస్థగా IHRS ను స్థాపించాడు. [7] [8] [9] [10] తదనంతరం, 1857 తిరుగుబాటు నాయకుల జ్ఞాపకార్థం భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడానికి కృష్ణవర్మ తన స్వంత ఆర్థిక వనరులను గణనీయంగా ఉపయోగించాడు. స్కాలర్‌షిప్ గ్రహీతలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రిటిష్ రాజ్ నుండి జీతం వచ్చే పదవిని గాని, గౌరవ పదవిని గానీ అంగీకరించకూడదు అనే షరతు విధించాడు. [4] ఈ స్కాలర్‌షిప్‌లు రాణా ప్రతాప్ సింగ్ జ్ఞాపకార్థం SR రాణా మద్దతుతో 2000 రూపాయల చొప్పున మూడు ఇచ్చాడు. [11] "భారతీయులకు మాత్రమే" ఏర్పరచిన ఈ స్కాలర్‌షిప్‌పుల వలన IHRS కు భారతీయుల నుండి - ముఖ్యంగా బ్రిటన్‌లో నివసించే విద్యార్థుల నుండి - గణనీయమైన మద్దతు లభించింది. భారతీయ విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుండి అందిన స్కాలర్‌షిప్‌లు, బర్సరీలుగా వచ్చిన నిధులు కూడా సంస్థకు చేరాయి. విక్టోరియన్ ప్రభుత్వ సంస్థల నమూనాను అనుసరించి, [12] IHRS ఒక రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ రాజ్యాంగంలో స్పష్టంగా వివరించబడిన IHRS లక్ష్యం, "భారతదేశానికి హోం రూల్‌ను నెలకొల్పడం, ఈ దేశంలో అన్ని ఆచరణీయ మార్గాల ద్వారా నిజమైన భారతీయ ప్రచారాన్ని కొనసాగించడం". [13] ఇది యువ భారతీయ కార్యకర్తలను నియమించుకుని, నిధులను సేకరించింది. బహుశా ఆయుధాలను కూడా సేకరించింది. భారతదేశంలోని విప్లవ ఉద్యమాలతో సంబంధాన్ని కొనసాగించింది. సావర్కార్ వచ్చినప్పుడు అతను దానిని ఇండియన్ హోమ్ రూల్ సొసైటీగా మార్చాడు. [14] [15] ఈ బృందం తమ పట్ల సహానుభూతితో ఉన్న టర్కిష్, ఈజిప్షియన్, ఐరిష్ రిపబ్లికన్ జాతీయవాదం వంటి ఉద్యమాలకు మద్దతు నిచ్చింది. [8]
IHRS శాఖ అయిన పారిస్ ఇండియన్ సొసైటీ 1905లో భికాజీ కామా, సర్దార్ సింగ్ రాణా, BH గోద్రెజ్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. [16] తరువాతి కాలంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న అనేక మంది ఇండియా హౌస్ సభ్యులకు – VN ఛటర్జీ, హర్ దయాల్, ఆచార్య తదితరులు - ఈ పారిస్ ఇండియన్ సొసైటీ ద్వారానే IHRS తో పరిచయమైంది. [17] కామా స్వయంగా ఈ సమయంలో భారతీయ విప్లవాత్మక లక్ష్యంతో లోతుగా పాలుపంచుకుంది. ఆమె ఫ్రెంచి, బహిష్కరించబడిన రష్యన్ సోషలిస్టులతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది. [18] [19] లెనిన్ అభిప్రాయాలు ఈ సమయంలో కామా కృషిని ప్రభావితం చేశాయని భావిస్తున్నారు. లెనిన్ లండన్‌లో ఉన్న సమయంలో ఇండియా హౌస్‌ని సందర్శించినట్లు భావిస్తున్నారు. [20] [21] 1907 లో కామా, VN ఛటర్జీ, SR రాణాతో కలిసి స్టట్‌గార్ట్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్‌కు హాజరయింది. అక్కడ, హెన్రీ హైండ్‌మాన్ మద్దతుతో ఆమె, భారతదేశానికి స్వయం పాలనను గుర్తించాలని డిమాండ్ చేసింది. ఒక ప్రసిద్ధ సూచికగా భారతదేశపు జెండాను ఆవిష్కరించింది. భారతదేశపు తొలి జెండాల్లో అది ఒకటి. [22]
1904 లో కృష్ణ వర్మ, బ్రిటిషు కమిటీ వారి ఇండియన్ పత్రికకు పోటీగా ది ఇండియన్ సోషియాలజిస్ట్ (TIS) అనే మాసపత్రికను (స్పెన్సర్స్ డిక్టమ్ దాని నినాదంగా) [4] స్థాపించాడు. [14] బ్రిటన్ నుండి భారతదేశ స్వాతంత్ర్యానికి సైద్ధాంతిక ప్రాతిపదిక సామాజిక శాస్త్రమే అనే తన విశ్వాసాన్ని తెలియజేసేలా ఈ పత్రిక పేరు అలా పెట్టాడు. [23] బ్రిటిష్ ఉదారవాదం పట్ల గోపాలకృష్ణ గోఖలే వంటి మితవాదులు అవలంబించే విధేయతా విధానాన్ని TIS విమర్శించింది. TIS, భారత స్వయం పాలనను సమర్థించింది. ఇది బ్రిటిషు కమిటీని విమర్శించింది. దాని సభ్యుల్లో ఎక్కువగా ఇండియన్ సివిల్ సర్వీసుకు చెందినవారే. కృష్ణవర్మ దృష్టిలో వారంతా బ్రిటిషు వారి భారతదేశ దోపిడీకి సహకరించారు. [14] బ్రిటిష్ రచయితల రచనలను విస్తృతంగా ఉటంకిస్తూ TIS, బ్రిటిషు సామ్రాజ్య వలసవాద దోపిడీని, అవసరమైతే హింస ద్వారా అయినా సరే, వ్యతిరేకించే హక్కు భారతీయులకు ఉందని కృష్ణ వర్మ వ్యాఖ్యానించాడు. [14] అభ్యర్థన, సానుకూలతల కంటే ఘర్షణ, డిమాండ్లూ చేయడాన్నే అది సమర్ధించింది. [24] అయితే, కృష్ణవర్మ అభిప్రాయాలు, జాతీయవాద పోరాటంలో రాజకీయ హింస పట్ల అతని సమర్థన జాగరూకతతో కూడుకునే ఉండేవి; హింసను చివరి ప్రయత్నం గానే అతడు భావించాడు. అతని మద్దతు తొలుత మేధోపరంగానే ఉండేది, విప్లవాత్మక హింసను ప్లాన్ చేయడంలో అతను చురుకుగా పాల్గొనలేదు. [25] పత్రికా స్వేచ్ఛ, బ్రిటిష్ అవలంబించే ఉదారవాద విధానం కారణంగా కృష్ణవర్మ తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలువరించేవాడు. అదే భారతదేశంలో అయితే, అవే అభిప్రాయాలను వెంటనే అణచివేసేవారు. [14]
TIS లో వ్యక్తమైన అభిప్రాయాలపై బ్రిటిషు పత్రికల్లోను, పార్లమెంట్‌లోని మాజీ భారతీయ పౌర సేవకుల నుండీ విమర్శలు వచ్చాయి. కృష్ణవర్మ బ్రిటిషు రచయితలను ఉల్లేఖించడాన్ని, భారతీయ సంప్రదాయాన్ని, విలువలనూ ప్రస్తావించకపోవడాన్ని ఎత్తిచూపిస్తూ, అతను భారతీయ పరిస్థితి, భారతీయ భావాల నుండి దూరంగా ఉన్నాడనీ మేధోపరంగా బ్రిటన్‌పై ఆధారపడి ఉన్నాడనీ విమర్శకులు వాదించారు. [26] బ్రిటిషు భారతీయ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ది టైమ్స్ విదేశీ సంపాదకుడు వాలెంటైన్ చిరోల్, కృష్ణవర్మ భారతీయ విద్యార్థులకు "విశ్వసనీయ భావాలను" బోధిస్తున్నారని ఆరోపించాడు. అతనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. [27] [28] తర్వాత చిరోల్, ఇండియా హౌస్‌ను "భారతదేశం వెలుపల ఉన్న అత్యంత ప్రమాదకరమైన సంస్థ"గా అభివర్ణించాడు. [29] [30] కృష్ణ వర్మ, TIS లు కింగ్ ఎడ్వర్డ్ VII దృష్టిని కూడా ఆకర్షించారు. రాజు చాలా ఆందోళన చెందాడు. అటువంటి సందేశాల ప్రచురణను నిలిపివేయమని భారతదేశ వ్యవహారాల మంత్రి జాన్ మోర్లీని కోరాడు. [31] మోర్లీ తన ఉదారవాద రాజకీయ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి చర్య తీసుకోవడానికి నిరాకరించాడు. అయితే TIS, కృష్ణ వర్మపై చిరోల్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు చేయవలసి వచ్చింది. [25] డిటెక్టివ్‌లు ఇండియా హౌస్‌ని సందర్శించి, దాని ముద్రాపకులను ఇంటర్వ్యూ చేశారు. కృష్ణవర్మ ఈ చర్యలను తన పనిని అణిచివేసే చర్యలకు నాందిగా భావించాడు. అరెస్టుకు భయపడి, 1907లో పారిస్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను బ్రిటన్‌కు తిరిగి రాలేదు. [27] [5]
కృష్ణవర్మ నిష్క్రమణ తర్వాత, సంస్థకు వినాయక్ దామోదర్ సావర్కర్ కొత్త నాయకుడయ్యాడు. అతను మొదటిసారిగా 1906లో కృష్ణవర్మ నుండి స్కాలర్‌షిప్‌పై లండన్‌కు చేరుకున్న న్యాయ విద్యార్థి. సావర్కర్ ఇటాలియన్ జాతీయవాద తత్వవేత్త గియుసెప్ప్ మజ్జినీ ఆరాధకుడు. భారత కాంగ్రెస్ నాయకుడు బాల గంగాధర్ తిలక్ ఆశ్రితుడు. [26] [32] [33] అతను 1906లో పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో చదువుతున్నప్పుడు అభినవ్ భారత్ సొసైటీని స్థాపించాడు. తద్వారా భారతదేశంలోని జాతీయవాద ఉద్యమంతో అతనికి సంబంధం ఏర్పడింది. (ఈ లింకులే, అతనికి అప్పటికి పెద్దగా తెలియని మోహన్‌దాస్ కరంచంద్ గాంధీతో పరిచయం కలిగించాయి. [26] [34] [35] ) లండన్‌లో, సావర్కర్ ఆవేశపూరిత జాతీయవాద దృక్పథాలు మొదట ఇండియా హౌస్ నివాసులను అతనికి దూరం చేశాయి -ముఖ్యంగా VVS అయ్యర్ ను. అయితే, కాలక్రమేణా, అతను సంస్థలో ప్రధాన వ్యక్తి అయ్యాడు. [36] అతను జాతీయవాద విషయాలను రాయడం, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించడం, [8] దేశంలో అభినవ్ భారత్ శాఖలను స్థాపించడం వగైరా కార్యక్రమాలకు తన ప్రయత్నాలను అంకితం చేశాడు. [37] అతను భారతదేశంలో BG తిలక్‌తో సన్నిహితంగా ఉండేవాడు. బాంబు తయారీకి సంబంధించిన మాన్యువల్‌లను అతనికి పంపాడు. [38]
ఇటాలియన్ స్వాతంత్ర్య యుద్ధాల పట్ల ఆకర్షితుడూ ప్రభావితుడూ అయిన సావర్కర్, భారతదేశంలో సాయుధ విప్లవం రావాలని విశ్వసించాడు. ఈ దిశగా జర్మనీ నుండి సహాయం కోరేందుకు సిద్ధమయ్యాడు. ఆస్ట్రియన్ దళాలలో పనిచేస్తున్న ఇటాలియన్లకు యంగ్ ఇటలీ ఉద్యమం బోధించినట్లే, బ్రిటిష్ సైన్యం లోని భారతీయ సైనికులకు బోధించాలని అతను ప్రతిపాదించాడు. [39] లండన్‌లో, సావర్కర్ ఫ్రీ ఇండియా సొసైటీ (FIS)ని స్థాపించాడు. 1906 డిసెంబరులో అభినవ్ భారత్ శాఖను ప్రారంభించాడు. [40] [41] ఈ సంస్థ PM బాపట్, VVS అయ్యర్, మదన్‌లాల్ ధింగ్రా, VN ఛటర్జీలతో సహా అనేక మంది రాడికల్ భారతీయ విద్యార్థులను ఆకర్షించింది. [42] సావర్కర్ కొంతకాలం పాటు పారిస్‌లో నివసించాడు. లండన్‌కు వెళ్లిన తర్వాత కూడా తరచూ పారిస్ పర్యటించేవాడు. [33] 1908 నాటికి, అతను పారిస్‌లో నివసిస్తున్న అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలను తన సంస్థలో నియమించుకున్నాడు. 1906, 1909లో గాంధీ ఇండియా హౌస్‌ని సందర్శించినప్పుడు సావర్కర్ అతన్ని కలిశాడు. అతని కఠినమైన అభిప్రాయాలు జాతీయవాద హింసపై గాంధీ అభిప్రాయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. [43]
ఈ సమయంలో అభినవ్ భారత్ సొసైటీ, దాని శాంతియుత రూపమైన ఫ్రీ ఇండియా సొసైటీ ఇండియా హౌస్‌లో ఉండేవి. IHRS నుండి పూర్తిగా భిన్నమైన విప్లవ వేదికగా ఇది వేగంగా అభివృద్ధి చెందింది. IHRS మాదిరిగా కాకుండా, దీనికి ఆర్థిక స్వావలంబన ఉండేది. ఇది యూరోపియన్ తత్వాలకు దూరంగా ఉండే స్వతంత్ర జాతీయవాద సిద్ధాంతాలను అభివృద్ధి చేసింది. సావర్కర్ ప్రభావంతో, ఇది గత భారతీయ విప్లవ ఉద్యమాలు, మత గ్రంథాలు (భగవద్గీతతో సహా), భారత స్వాతంత్ర్య సంగ్రామంతో సహా భారతీయ చరిత్రలో సావర్కర్ స్వంత అధ్యయనాల నుండి ప్రేరణ పొందింది. [12] సావర్కర్ గియుసేప్ మజ్జినీ ఆత్మకథను మరాఠీలోకి అనువదించాడు. రహస్య సమాజాల సద్గుణాలను అందులో కీర్తించాడు. [28]
ఇండియా హౌస్ త్వరలోనే బ్రిటన్‌లోని భారత విప్లవోద్యమానికి ప్రధాన కార్యాలయంగా మారిపోయింది. [3] భారతదేశం నలుమూలల నుండి వచ్చిన లండన్‌లోని యువతీ యువకులు దీని సరికొత్త సభ్యులు. [44] మొత్తం సభ్యత్వంలో చెరో నాల్గవ వంతు మంది బెంగాల్, పంజాబ్ నుండి వచ్చినవారే ఉండేవారు. అయితే బొంబాయి, మహారాష్ట్ర నుండి వచ్చిన ముఖ్యమైన సమూహం కూడా ఉండేది. [44] ఫ్రీ ఇండియా సొసైటీకి పాక్షికంగా మతపరమైన దీక్ష ఉండేది. అభినవ్ భారత్ సొసైటీ సమావేశాలకు ఇది ముసుగుగా పనిచేసేది. [42] సభ్యులు ప్రధానంగా హిందువులు. చాలా మంది ఇరవైలలో ఉన్న విద్యార్థులు. వారంతా సాధారణంగా మిలియనీర్లు, మిల్లు యజమానులు, న్యాయవాదులు, వైద్యుల కుటుంబాలు, భారతీయ సామాజిక ఉన్నత వర్గాలకు చెందినవారు. అనేక మంది మహిళలతో సహా దాదాపు డెబ్బై మంది ప్రజలు ఆదివారం సాయంత్రం సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. దీనిలో సావర్కర్ విప్లవం తత్వశాస్త్రం నుండి బాంబు తయారీ, హత్య పద్ధతుల వరకు పలు అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవారు. [3] ఈ రిక్రూట్‌లలో కొద్ది భాగం మాత్రమే గతంలో భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలు లేదా స్వదేశీ ఉద్యమంలో సంబంధం ఉన్నట్లు తెలిసింది. [44]
అభినవ్ భారత్ సొసైటీకి రెండు లక్ష్యాలు ఉండేవి: ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ప్రచారం ద్వారా జాతీయవాద విప్లవానికి అనుకూలంగా భారతీయ ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం, అటువంటి విప్లవాన్ని నిర్వహించడానికి నిధులు, జ్ఞానం, సరఫరాలను సేకరించడం. [45] ఇది భారతదేశ ప్రయోజనాల కోసం సంస్థ సభ్యులు చెయ్యాల్సిన త్యాగాల గురించి నొక్కి చెప్పేది. ఇవి ప్రజానీకం అనుకరించగలిగే విప్లవాత్మక కార్యకలాపాలే గానీ, దాని కోసం ప్రజా ఉద్యమం జరపాల్సిన అవసరమేమీ లేదు. [44] ఇండియా హౌస్ లోని అవుట్‌బిల్డింగ్‌ను "యుద్ధ క్షేత్రంగా" మార్చారు. ఇక్కడ కెమిస్ట్రీ విద్యార్థులు పేలుడు పదార్థాలను తయారు చేయడానికి, బాంబులను తయారు చేయడానికీ ప్రయత్నించేవారు. అక్కడి ముద్రాలయంలో బాంబు తయారీ మాన్యువల్‌లు, భారతదేశంలోని యూరోపియన్ల పట్ల హింసను ప్రోత్సహించే కరపత్రాలతో సహా "విద్రోహ" సాహిత్యాన్ని ముద్రించేవారు. భవనంలో చిన్న ఆయుధాగారం ఉండేది. ఆ ఆయుధాలను అడపాదడపా వివిధ మార్గాల ద్వారా భారతదేశానికి పంపేవారు. [3] వీటన్నింటిలో సావర్కర్ ప్రధాన పాత్ర పోషించేవాడు. పేలుడు పదార్థాల వర్క్‌షాప్‌లో ఎక్కువ సమయం గడిపేవాడు. సాయంత్రం వేళల్లో బయటికి వచ్చినపుడు అతని "చేతులపై పిక్రిక్ యాసిడ్ కు చెందిన పసుపు మరకలు ఉండేవ"ని తోటి విప్లవకారుడు పేర్కొన్నాడు. [46] ఇండియా హౌస్ నివాసితులు, అభినవ్ భారత్ సభ్యులు సెంట్రల్ లండన్‌లోని టోటెన్‌హామ్ కోర్ట్ రోడ్‌లోని ఒక రేంజ్‌లో షూటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. వారు చేయాలనుకున్న హత్యలను రిహార్సల్ చేసేవారు. [46]
చతుర్భుజ్ అమీన్, చంజేరి రావు, VVS అయ్యర్‌లు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తమతో పాటు అనేక బ్రౌనింగ్ పిస్టల్స్‌తో సహా ఆయుధాలను అక్రమంగా రవాణా చేసారు. [47] భారతీయ పోస్టల్ అధికారులు గుర్తించకుండా నిరోధించడానికి విప్లవ సాహిత్యాన్ని తప్పుడు కవర్లతో, వివిధ చిరునామాల నుండి రవాణా చేసేవారు. [46] సావర్కర్ ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రచురించబడింది. దాన్ని రెచ్చగొట్టే సాహిత్యంగా భావించి భారతీయ విద్యార్థులు దానిని చదవకుండా నిరోధించడానికి బ్రిటిష్ లైబ్రరీ కేటలాగ్ నుండి దాన్ని తొలగించారు. [48] 1908లో ఇండియా హౌస్ బాంబుల తయారీకి సంబంధించిన మాన్యువల్‌ని కొనుగోలు చేసింది. పారిస్‌లో నికోలస్ సఫ్రాన్స్కీ అనే రష్యన్ విప్లవకారుడు, అనుశీలన్ సమితికి చెందిన బెంగాలీ విప్లవకారుడు హేమచంద్ర దాస్‌కు ఇచ్చిన బాంబు మాన్యువల్ నుండి, సావర్కర్ ఫ్రెంచ్ రాజధానిలో దాన్ని సంపాదించాడని కొందరు అన్నారు. [49] మరికొందరు, బాపత్ పారిస్‌లోని రష్యన్ విప్లవకారుల ద్వారా దాన్ని సంపాదించారని అభిప్రాయపడ్డారు. [50] 1909 నాటి అలీపూర్ బాంబు కేసు తేరువాత, బెంగాల్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ క్యారేజీపై ఖుదీరామ్ బోస్ బాంబు దాడికి ప్రయత్నించిన తర్వాత, బాపట్ పరారయ్యాడు. [51]
1908 నాటికి, ఇండియా హౌస్ సమూహం ప్రజాదరణ 1865లో దాదాభాయ్ నౌరోజీ స్థాపించిన లండన్ ఇండియన్ సొసైటీ (LIS)ను అధిగమించింది. అప్పటి వరకు లండన్‌లోని భారతీయులకు అదే అతిపెద్ద సంఘంగా ఉండేది. తదనంతరం, ఆ సంవత్సరం (1908) జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో, ఇండియా హౌస్ సభ్యులు లండన్ ఇండియన్ సొసైటీ పగ్గాలను చేపట్టి, సొసైటీ పాత నాయకత్వాన్ని తొలగించింది. [52]
ఇండియా హౌస్ కార్యకలాపాలు ప్రభుత్వ దృష్టిని దాటిపోలేదు. అధికారిక భారతీయ, బ్రిటిషు సర్కిల్‌లలో లేవనెత్తిన ప్రశ్నలతో పాటు, డైలీ మెయిల్, మాంచెస్టర్ గార్డియన్, డిస్పాచ్‌తో సహా ఆంగ్ల వార్తాపత్రికలలో సావర్కర్ అనియంత్రిత అభిప్రాయాలను ప్రచురించారు. 1909 నాటికి, ఇండియా హౌస్, స్కాట్లాండ్ యార్డ్, ఇండియన్ ఇంటెలిజెన్స్ వారి నిఘాలో ఉంది. దాని కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. [53] సావర్కర్ అన్నయ్య గణేష్ ఆ సంవత్సరం జూన్‌లో భారతదేశంలో అరెస్టయ్యాడు. విద్రోహ సాహిత్యాన్ని ప్రచురించినందుకు అతన్ని అండమాన్‌లోని జైలుకు పంపించారు. [54] సావర్కర్ ప్రసంగాలు మరింత కఠినంగా మారాయి. విప్లవం, విస్తృత హింస, భారతదేశంలోని ఆంగ్లేయులందరినీ చంపాలని పిలుపునిచ్చాయి. [54] ఈ సంఘటనలకు పరాకాష్టగా 1909 జూలై 1 సాయంత్రం లండన్‌లోని ఇంపీరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన భారతీయ విద్యార్థుల సమావేశంలో, భారతదేశ కార్యదర్శికి రాజకీయ సహాయకుడైన సర్ విలియం హెచ్. కర్జన్ విల్లీని మదన్‌లాల్ ధింగ్రా హత్య చేశాడు. [54] ధింగ్రాను అరెస్టు చేసి, విచారించి, ఉరితీశారు.
హత్య తరువాత కొద్దికాలానికే ఇండియా హౌస్ మూతబడింది. ఇండియా హౌస్ నుండి జరిగిన విస్తృతమైన కుట్రలను పరిశోధించేందుకు హత్యా దర్యాప్తును విస్తరించారు. అటువంటివి ఏమీ లేవని స్కాట్లాండ్ యార్డ్ పేర్కొన్నప్పటికీ, భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం భిన్నంగా భావించాయి. [55] ధింగ్రా అసలు లక్ష్యం స్వయంగా భారతదేశ వ్యవహారాల మంత్రి జాన్ మోర్లే యే నని ఈ వర్గాలు సూచించాయి. ధింగ్రా వ్రాతపూర్వక రాజకీయ ప్రకటన కాపీ సావర్కర్ వద్ద ఉంది. అతని అరెస్టు సమయంలో దాన్ని జప్తు చేసారు. అయితే అలాంటిదొకటి ఉన్నదన్న విషయాన్ని పోలీసులు తిరస్కరించారు. కానీ ధింగ్రాకు మరణశిక్ష విధించబడిన రోజున సావర్కర్, ఐరిష్ సానుభూతిపరుడైన డేవిడ్ గార్నెట్ ద్వారా దాన్ని డైలీ న్యూస్‌లో ప్రచురింపజేసాడు. [56] నిజానికి ఈ హత్య సావర్కర్ ఆలోచన అని, బ్రిటన్‌తో పాటు భారత్‌లో తదుపరి చర్యను అతను ప్లాన్ చేశాడనీ అనేక ఆధారాలు సూచించాయి. [55] 1910 మార్చిలో సావర్కర్, పారిస్ నుండి లండన్‌కు తిరిగి వచ్చినపుడు అరెస్టయ్యాడు. తరువాత అతని దేశ బహిష్కరణ శిక్ష విధించి, భారతదేశానికి పంపేసారు. [57] బహిష్కరణ విచారణ సమయంలో అతను బ్రిక్స్టన్ జైలులో ఉండగా, 1910 మేలో ఇండియా హౌస్‌లో మిగిలి ఉన్న కొందరు, జైలు వ్యాన్‌పై దాడి చేసి అతనిని విడిపించడానికి ప్రయత్నించారు. మౌడ్ గొన్నె నేతృత్వంలోని ఐరిష్ రిపబ్లికన్ల సహాయంతో ఈ ప్రణాళికలను సమన్వయం చేసారు. అయితే, సావర్కర్‌ను వేరే మార్గంలో తరలించారు. కుట్రదారులు ఈ సంగతి తెలియక, ఖాళీగా వెళ్తున్న నకిలీ వ్యాన్‌పై దాడి చేయడంతో పథకం విఫలమైంది. [58] మరుసటి సంవత్సరంలో పోలీసులు, రాజకీయ వర్గాలు ఇండియా హౌస్ నివాసితులపై ఇంగ్లండ్‌ను విడిచి వెళ్లాలని ఒత్తిడి తెచ్చాయి. కృష్ణవర్మ వంటి నాయకులు ఇప్పటికే యూరప్‌కు పారిపోగా, ఛటోపాధ్యాయ వంటి మరికొందరు జర్మనీకి వెళ్లారు. చాలా మంది పారిస్‌కు తరలివెళ్లారు. [59] పెద్ద సంఖ్యలో జాతీయవాద విద్యార్థులు పారిస్ నగరానికి తరలివెళ్లడంతో, పారిస్ ఇండియన్ సొసైటీ క్రమంగా ఐరోపాలో భారత జాతీయవాదానికి కేంద్రంగా, ఇండియా హౌస్ స్థానాన్ని ఆక్రమించింది. [60]
ఇండియా హౌస్‌లో రాజకీయ కార్యకలాపాలు ప్రధానంగా బ్రిటన్‌లోని యువ భారతీయులను, ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ సమయంలో ఈ సమూహంలో రాజకీయ అసంతృప్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలోని వృత్తిపరమైన తరగతితో సన్నిహితంగా ఉన్నవారు, యూరోపియన్ ఉదారవాదం తత్వాలను లోతుగా అధ్యయనం చేసేవార వారిలో ఉన్నారు. [61] వారి అసంతృప్తిని బ్రిటిష్ విద్యా, రాజకీయ వర్గాల్లో చాలా ముందుగానే గుర్తించారు. ఈ విద్యార్థులు తీవ్రవాద రాజకీయాల్లో చేరతారని కొందరు భయపడ్డారు. [61]
బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో రాజకీయ అశాంతిని పరిశోధించడానికి సర్ విలియం లీ-వార్నర్ ఆధ్వర్యంలో 1907లో ఏర్పాటైన ఒక కమిటీ, ఈ బృందంపై ఇండియా హౌస్ చూపిన బలమైన ప్రభావాన్ని గుర్తించింది. [62] [63] ఇండియా హౌస్, శ్యామ్‌జీ కృష్ణవర్మ ఆధ్వర్యంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. [64] ఆ సమయంలో సంఘం గురించి చర్చించిన భారతీయ విద్యార్థులు ఇండియా హౌస్ పెరుగుతున్న ప్రభావాన్ని- ముఖ్యంగా 1905 బెంగాల్ విభజన సందర్భంలో - వివరించారు. ప్రభుత్వ పోస్టులు, ఇండియన్ సివిల్ సర్వీస్ కోసం భారతీయ దరఖాస్తుదారుల సంఖ్య తగ్గడానికి దీని ప్రభావమే కారణమని చెప్పవచ్చు. ఇండియన్ సోషియాలజిస్ట్ లండన్ వార్తాపత్రికల దృష్టిని గణనీయంగా ఆకర్షించింది. [65] అయితే మరికొందరు ఈ అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ఇండియా హౌస్ ప్రభావం పరిమితమైనదేనని వారు అభివర్ణించారు. ఇండియన్ క్రిస్టియన్ యూనియన్ ప్రెసిడెంట్ SD భాబా ఒకప్పుడు కృష్ణవర్మను "కాటు కంటే అరుపే ఎక్కువగా ఉండే వ్యక్తి" అని అభివర్ణించాడు. [65]
సావర్కర్ హయాంలో, ఈ సంస్థ విదేశాలలో భారతీయ విప్లవ ఉద్యమానికి కేంద్రంగా మారింది. భారతదేశం, బ్రిటన్‌లలో విప్లవాత్మక హింసకు అత్యంత ముఖ్యమైన లింక్‌లలో ఇది ఒకటి. [54] [57] [66] సంస్థ మితవాదులు, తీవ్రవాద దృక్కోణాలు కలిగిన వారిని స్వాగతించినప్పటికీ, వారిలో మితవాదుల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేది. [65] విశేషమేమిటంటే, చాలా మంది నివాసులకు, ప్రత్యేకించి సావర్కర్ అభిప్రాయాలతో ఏకీభవించిన వారికి, అంతకు ముందు భారతదేశంలోని జాతీయవాద ఉద్యమాలలో పాల్గొన్న చరిత్ర లేదు. ఇండియా హౌస్‌లో ఉన్న సమయంలోనే వారికి జాతీయవాద బోధనలు అందాయనడానికి ఇది సూచిక. [44]
మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయుధాలు, దేశద్రోహ సాహిత్యానికి మూలం ఇండియా హౌసే. వీటిని భారతదేశంలో వేగంగా పంపిణీ చేసారు. ది ఇండియన్ సోషియాలజిస్ట్‌తో పాటు, బందే మాతరం, సావర్కర్ రాసిన ఓ మార్టిర్స్! వంటి కరపత్రాలు విప్లవ హింసను కీర్తించాయి. ఆ సమయంలో భారతదేశంలో హత్యలతో సహా అనేక రాజకీయ హింసాత్మక సంఘటనలలో ఇండియా హౌస్ ప్రత్యక్ష ప్రభావాలు, ప్రేరేపణలు ఉన్నట్లు గుర్తించారు. [40] [48] [67] బొంబాయిలో విచారణ సమయంలో సావర్కర్‌పై వచ్చిన రెండు అభియోగాలలో ఒకటి - 1909 డిసెంబరులో అనంత్ కన్హేరే నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ AMT జాక్సన్ హత్యకు సహకరించడం. ఇండియా హౌస్‌కి ఇటాలియన్ కొరియర్ ద్వారా అందిన ఆయుధాలే ఆ హత్యలో వాడినట్లు తేలింది. వంచి అయ్యర్ చేతిలో రాబర్ట్ డి'ఎస్కోర్ట్ ఆషే హత్యతో సహా, రాజకీయ హత్యలకు సహకరించి, ప్రభావితం చేసినట్టు రౌలట్ నివేదికలో మాజీ-ఇండియా హౌస్ నివాసులు MPT ఆచార్య, VVS అయ్యర్లు గుర్తించారు. [40] 1907లో బెంగాల్‌లో లెఫ్టినెంట్-గవర్నర్ సర్ ఆండ్రూ ఫ్రేజర్ ప్రయాణిస్తున్న రైలును పట్టాలు తప్పించే ప్రయత్నంలో ప్యారిస్-సఫ్రాన్స్‌కి సంబంధం ఉందని ఫ్రెంచ్ పోలీసులు గట్టిగా సూచించారు. [68] విదేశాల్లోని జాతీయవాదుల కార్యకలాపాల వలన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లోని అనేక స్థానిక రెజిమెంట్ల విధేయత సడలిందని భావిస్తారు. [69] కర్జన్ విల్లీ హత్య బాగా ప్రచారం పొందింది. [70] వలస అధికారులపైన, ధింగ్రా చర్యల ప్రతీకాత్మక ప్రభావం ఆ సమయంలో భారతీయ విప్లవ ఉద్యమంపై తీవ్రమైంది. [71] బ్రిటిషు సామ్రాజ్యపు స్వంత మహానగరంలో ఏనాడూ ఎవరూ దాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. [70] ధింగ్రా చేసిన చివరి ప్రకటన విన్‌స్టన్ చర్చిల్ ప్రశంసలను పొందిందని వార్తలొచ్చాయి. దేశభక్తి పేరుతో చేసిన అత్యుత్తమమైన చర్యగా దాన్ని చర్చిల్ అభివర్ణించాడు. [70]
ఇండియా హౌస్, దాని కార్యకలాపాలు గాంధీ తదనంతర కాలంలో అనుసరించిన అహింసా తత్వశాస్త్రంపై కొంత ప్రభావం చూపాయి. [43] అతను సావర్కర్‌తో సహా కొంతమంది ఇండియా హౌస్ సభ్యులను లండన్‌లోను, భారతదేశం లోనూ కలుసుకున్నాడు. పశ్చిమం నుండి జాతీయవాద, రాజకీయ తత్వాలను స్వీకరించడాన్ని అతను అంగీకరించలేదు. గాంధీ ఈ విప్లవాత్మక హింసను అరాచకవాదంగాను, దాని అభ్యాసకులను "ఆధునికవాదులు" గానూ కొట్టిపారేశాడు. [43] హింద్ స్వరాజ్‌తో సహా అతని కొన్ని రచనలు సావర్కర్, ధింగ్రాల కార్యకలాపాలను వ్యతిరేకించాయి. జాతీయవాద గుర్తింపు కింద లేదా వలసవాద బాధితుల ముద్ర కింద హింసకు పాల్పడడం దోషమేమీ కాదనే వాదనను గాంధీ వివాదాస్పదం చేసాడు. [43] ఈ విప్లవాత్మక హింసకు వ్యతిరేకంగానే గాంధేయ అహింసా సిద్ధాంతానికి నిర్మాణాత్మక నేపథ్యం రూపొందింది. [43]
1909 - 1910లో ఇండియా హౌస్ రద్దయ్యాక, దాని సభ్యులు క్రమంగా ఐరోపాలోని ఫ్రాన్స్, జర్మనీతో పాటు యునైటెడ్ స్టేట్స్‌తో సహా వివిధ దేశాలకు చెదిరి పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషు రాజ్‌కు వ్యతిరేకంగా భారతీయ విప్లవ ఉద్యమం చేసిన ప్రయత్నాలలో ఇండియా హౌస్‌లో స్థాపించబడిన నెట్‌వర్కే కీలకమైనది. యుద్ధ సమయంలో జర్మనీలోని బెర్లిన్ కమిటీ, ఉత్తర అమెరికాలోని గదర్ పార్టీ, భారతీయ విప్లవాత్మక అండర్‌గ్రౌండ్లు బ్రిటిషు ఇండియన్ ఆర్మీలో విప్లవం, తిరుగుబాటు కోసం ఉద్దేశించిన యునైటెడ్ స్టేట్స్ నుండి, తూర్పు ఆసియా నుండీ విప్లవకారులను, ఆయుధాలనూ భారతదేశానికి రవాణా చేయడానికి ప్రయత్నించారు. కుట్ర సమయంలో, విప్లవకారులకు ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్‌హుడ్, సిన్ ఫెయిన్, జపనీస్ దేశభక్తి సంఘాలు, ఒట్టోమన్ టర్కీ, ప్రముఖంగా జర్మన్ విదేశాంగ కార్యాలయాలు విస్తృతంగా సహకరించాయి. అప్పటి నుండి ఈ కుట్రను హిందూ-జర్మన్ కుట్ర అని పిలుస్తారు. [72] [73] ఇతర ప్రయత్నాలతోపాటు, బ్రిటిషు ఇండియాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌ను కూడగట్టేందుకు కూడా ఈ కూటమి ప్రయత్నించింది . [74]
భారతదేశంలో 1914,1915 లలో అనేక విఫలమైన తిరుగుబాట్లు చెలరేగాయి, వాటిలో గదర్ కుట్ర, సింగపూర్ తిరుగుబాటు, క్రిస్మస్ డే ప్లాట్లు చాలా ముఖ్యమైనవి. భారత రక్షణ చట్టం 1915 ఆమోదం ప్ందడంలో కుట్ర ద్వారా ఎదురయ్యే ముప్పే కీలకమైనది. ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు వారికి, దాదాపు పదేళ్లపాటు అంతర్జాతీయ కౌంటర్-ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. [75] ఈ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో రిక్రూటు చేసుకున్న అత్యంత ప్రసిద్ధులలో ఇంగ్లీషు రచయిత W. సోమర్‌సెట్ మామ్ కూడా ఒకడు. బెర్లిన్ కమిటీతో కలిసి పనిచేసిన VN ఛటర్జీని హత్య చేయడానికి అతను పనిచేసాడు. [76]
ఇండియా హౌస్ నుండి, ముఖ్యంగా VD సావర్కర్ రచనల నుండి ఉద్భవించిన జాతీయవాద, విప్లవాత్మక తత్వశాస్త్రపు శాఖ ఒకటి, 1920 లలో భారతదేశంలో హిందూ జాతీయవాదపు భావజాలంగా సంఘటితమైంది. హిందూ మహాసభ ద్వారా ప్రకటితమైన ఈ భావజాలం, గాంధేయ భక్తివాదం కంటే విభిన్నంగా ఉంటూ, [43] ఒక సామూహిక ఉద్యమంగా మద్దతు పొందింది. కొందరు దీన్ని మతోన్మాదవాదంగా వర్ణించారు. [43] పౌరుషయుత హిందూ మతం అనే ఆలోచనలను రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో సావర్కర్ రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అత్యంత ప్రభావవంతమైన రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. [77] ఇండియా హౌస్‌లో ఉన్న సమయంలో సావర్కర్ చేసిన రచనల్లో మరాఠా కాన్ఫెడరసీ చరిత్ర కూడా ఒకటి. దీనిని అతను ఆదర్శప్రాయమైన హిందూ సామ్రాజ్యంగా (హిందూ పద్పాద్‌షాహి) అభివర్ణించాడు. [43] ఇంకా, ఇండియా హౌస్‌లో సావర్కర్ పరిశీలించిన పరిణామవాదం, క్రియాత్మకవాదం స్పెన్సేరియన్ సిద్ధాంతాలు అతని సామాజిక, రాజకీయ తత్వశాస్త్రాన్ని బలంగా ప్రభావితం చేశాయి. తొలి హిందూ జాతీయవాదానికి పునాదులు వేయడానికి అవి సహాయపడ్డాయి. [45] దేశం పట్ల, సమాజం పట్ల, వలసవాదం పట్ల హిందూ జాతియవాదపు విధానాన్ని రూపొందించడానికి దారితీసాయి. స్పెన్సర్ సిద్ధాంతాలు సావర్కర్‌ను జాతీయ పరిణామానికి "హేతువాద", "శాస్త్రీయ" విధానాన్ని, అలాగే జాతీయ మనుగడ కోసం సైనిక దురాక్రమణనూ నొక్కి చెప్పేలా చేసింది. అతని అనేక ఆలోచనలు సావర్కర్ రచనలలోను, హిందూ మహాసభతో కలిసి పని చేయడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాయి. [45] [78]
2003లో స్విట్జర్లాండ్ నుంచి కృష్ణవర్మ అస్థికలు, ఆయన భార్య భానుబెన్ చితాభస్మాన్నీ భారత్‌కు తరలించారు. గుజరాత్ ప్రభుత్వం స్థాపించిన కచ్ యూనివర్సిటీకి ఆయన గౌరవార్థం పేరు పెట్టారు. 2010లో, క్రాంతి తీర్థ్ పేరుతో ఒక స్మారక చిహ్నాన్ని గుజరాత్‌లోని అతని స్వస్థలమైన మాండవిలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించాడు. [79] 52 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ మెమోరియల్ కాంప్లెక్స్‌లో కృష్ణవర్మ, అతని భార్య విగ్రహాలతో పాటు హైగేట్ వద్ద ఇండియా హౌస్ భవనం ప్రతిరూపం కూడా ఉంది. కృష్ణ వర్మ చితాభస్మం, అతని భార్య చితాభస్మం, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పూర్వపు కార్యకర్తల కోసం అంకితం చేసిన గ్యాలరీ స్మారక చిహ్నంలో ఉంచారు. కృష్ణ వర్మను 1909 లో లండన్ లోని ఇన్నర్ టెంపుల్ నుండి బహిష్కరించారు. 2015లో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, అతనిని మరణానంతరం తిరిగి నియమించడానికి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. [21] ఇండియా హౌస్‌లో సావర్కర్ బస చేసిన జ్ఞాపకార్థం ఇంగ్లీష్ హెరిటేజ్ వారు అందులో నీలిరంగు ఫలకాన్ని ఉంచారు. స్వతంత్ర భారతదేశంలో కూడా వివిధ సమయాల్లో ఇండియా హౌస్ సభ్యులను స్మరించుకున్నారు. భికాజీ కామా, కృష్ణ వర్మ, సావర్కర్ వంటి వారి స్మారక తపాలా స్టాంపులను ఇండియా పోస్ట్ విడుదల చేసింది. న్యూ ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో VN ఛటర్జీ పేరు, ఫోటో లను భారతీయ విప్లవకారుల గదిలో ప్రదర్శించారు. 1989లో మూసివేయడానికి ముందు, లీప్‌జిగ్‌లోని డిమిత్రోవ్ మ్యూజియంలో ఛటర్జీపై ఒక విభాగం ఉండేది. [80]