ఈ సీరీస్‌లో భాగం |
బౌలింగు పద్ధతులు |
---|
ఇన్స్వింగర్ అనేది క్రికెట్ క్రీడలో బౌలర్లు వేసే ఒక రకమైన డెలివరీ. అలా వేసిన బంతి వంపు తిరుగుతూ-అంటే, "స్వింగ్" అవుతూ-బ్యాటరు మీదికి, వికెట్ల మీదికి పోతుంది. అవుట్‌స్వింగరు దీనికి విరుద్ధంగా, బ్యాటరు, వికెట్ల లైన్ నుండి దూరంగా పోతుంది. ఇన్స్వింగర్లు స్వింగ్ బౌలర్లు వేస్తారు.
ఈ పదం ఫుట్‌బాల్ లోకి కూడా వెళ్ళింది. ఆటగాడు బంతిని తన్నినపుడు, అది గాల్లో వంపు తిరుగుతూ గోల్ వైపు పోవడాన్ని ఇన్‌స్వింగరంటారు.
బంతి సీమ్‌ను నిలువుగా ఉంచి, మొదటి రెండు వేళ్లను సీమ్‌కి కొద్దిగా అడ్డంగా పట్టుకుని ఇన్‌స్వింగర్ వేస్తారు. తద్వారా సీమ్ లెగ్ సైడ్‌కు కొద్దిగా కోణంలో ఉంటుంది. అరిగిన బంతిని, ఒక వైపు గరుకుగా ఉండేలా రెండవవైపు పాలిష్ చేసి, అరిగిన వైపును లెగ్ సైడు ఉంచుతారు. బొటనవేలు లోపలి అంచు బంతికి ఆని ఉంటుంది. ఈ బొటనవేలు స్థానం వలన మణికట్టును లెగ్ సైడ్ వైపుకు వంపుతిరిగిన స్థితిలో లాక్ చేస్తుంది.
ఇన్స్వింగరును సైడ్-ఆన్, మిడ్-వే లేదా చెస్ట్ ఆన్ పొజిషన్‌లలో బౌల్ చేయవచ్చు. కానీ బౌలర్లు సాధారణంగా దానిని గుడ్ లెంగ్త్ స్పాట్‌లో లేదా బ్యాట్స్‌మన్ వరకు పిచ్ అయ్యేలా వేస్తారు. ఇందులో కీలకమైనది మణికట్టు ఉండే స్థానం, తుంటి లేదా భుజాలు ఉండే స్థానం కాదు. (పైన బొటనవేలు స్థానం చూడండి).
బౌలర్ బంతిని వేసినప్పుడు, అతను సీమ్‌ను కొద్దిగా లెగ్ సైడ్‌కు చూపేలా కోణాన్ని మారుస్తాడు. ఈ స్థితిని సాధించడంలో సహాయపడటానికి బౌలింగ్ చేయి నిలువుగా ఉండాలి, వేయి చెవికి ఆనుకుంటూ వెళ్ళాలి. విడుదల సమయంలో, సీమ్ దిశలో బ్యాక్‌స్పిన్‌ను అందించడంలో సహాయపడటానికి మణికట్టు కదలకుండా ఉండాలి. బంతి వెళ్ళే దిశకు, సీమ్‌కూ ఉండే కోణం వలన బంతి గాలిలో కదులుతున్నప్పుడు ఏరోఫాయిల్ ప్రభావం ఏర్పడి, బంతిని లెగ్ సైడ్‌కు నెట్టివేస్తుంది. గరుకైన, మృదువైన ఉపరితలాలపై గాలి కదలిక వలన వాయు పీడనంలో ఏర్పడే తేడా వల్ల ఇది మరింత ఎక్కువౌతుంది. ఇది కూడా బంతిని లెగ్ సైడ్‌కి నెట్టడంలో తోడుపడుతుంది. ఫలితంగా బంతి చాపాకారంలో ప్రయాణించి, బ్యాటరు మీదికి స్వింగ్ అవుతుంది.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కి ఇన్‌స్వింగర్‌ను ఆడడం, అవుట్‌స్వింగర్ ఆడటం లాగా అంత కష్టం కాదు. ఎందుకంటే, బంతి అతని శరీరం వైపు కదులుతుంది, అంటే అతని శరీరం బంతి వెళ్ళే రేఖకు వెనుక ఉంటుంది. బంతి బ్యాట్ అంచుకు తగిలితే, అది ఎగిరి ఫీల్డర్‌కి అందడానికి ముందే అది బ్యాటరు శరీరానికి తగిలి క్యాచ్‌కి వెళ్ళదు.
అయితే, ఇన్‌స్వింగర్‌లు బ్యాట్, ప్యాడ్‌ల మధ్య గుండా దూరి, వికెట్‌ని కొట్టి, బ్యాటరును ఔట్ చేయవచ్చు లేదా బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కి తగిలి లెగ్ బిఫోర్ వికెట్ కావచ్చు. ఇన్‌స్వింగర్లలో ఒక ప్రత్యేకమైన, ప్రభావవంతమైన డెలివరీ ఇన్‌స్వింగింగ్ యార్కరు. ఇది వేసినపుడు బ్యాటరు, తన పాదాలను బంతి మార్గం నుండి పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా బ్యాటరు బౌల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అతను కదలడంలో చాలా నెమ్మదిగా ఉంటే ఎల్‌బిడబ్ల్యు ఔట్ అవుతాడు. మరొక మోసపూరిత రకం ఏమిటంటే, ఆఫ్-స్టంప్ చుట్టూ పిచ్ అయి, బ్యాటరును దాటిపోతున్నట్లు కనిపించినప్పటికీ, విపరీతంగా స్వింగ్ అయి, స్టంప్‌ల మీదికి పోతుంది. 1983 ప్రపంచ కప్ ఆఖరి మ్యాచ్‌లో, బల్వీందర్ సంధు గార్డన్ గ్రీనిడ్జ్‌కు ఇలాంటి బంతి వేసినపుడు బ్యాటరు బ్యాటును ఎత్తిపట్టి బంతిని తప్పించుకోబోయాడు. బంతి ఇన్‌స్వింగై, బౌల్డ్ అయ్యాడు.