ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఉండవల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′43″N 80°35′10″E / 16.495279°N 80.586198°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తాడేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,743 |
- పురుషుల సంఖ్య | 4,862 |
- స్త్రీల సంఖ్య | 4,881 |
- గృహాల సంఖ్య | 2,638 |
పిన్ కోడ్ | 522501 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
ఉండవల్లి, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతం. ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో ఒకటి. నూతన అమరావతికి తూర్పు ముఖద్వారం, ముఖ్యమైన మార్గం
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
ఉండవల్లి విజయవాడ నగరానికి ఒక ప్రధానమైన శివారు ప్రాంతం. ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణా నది, తూర్పున తాడేపల్లి పట్టణం, దక్షిణాన ఎర్రబాలెం గ్రామం, పశ్చిమాన పెనుమాక, వేంకటపాలెం గ్రామాలు హద్దులుగా ఉన్నాయి. గ్రామ ఉత్తర భాగంలో కొండవీటి వాగు ప్రవహిస్తున్నది.ఈ వాగు కృష్ణా నదిలో కలుస్తుంది. నివాస ప్రాంతాల ఆధారంగా ఈ గ్రామం ప్రధానంగా రెండు భాగాలుగా ఉంది. మొదటిది ఉండవల్లి గుహల నుండి కొండను ఆనుకుని తూర్పు వైపు విస్తరించిన ఉండవల్లి గ్రామం. రెండవది విజయవాడ - మంగళగిరి పాత ట్రంక్ రోడ్డును, విజయవాడ - అమరావతి ప్రధాన రహదారిని, తాడేపల్లి పట్టణ ప్రధాన రహదారిని కలిపే కలిపే ఉండవల్లి సెంటర్ ప్రాంతం. వీటికి గుంటూరు ఛానల్ కాలువ విభజన రేఖగా ఉంది. ఇవిగాక పోలకంపాడు లోని ట్రంక్ రోడ్డు దక్షిణాన ఉన్న ప్రాంతం, హరిజనవాడ ప్రాంతములు కూడా ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి.
ఉండవల్లి గ్రామానికి విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా చేరుకోవచ్చు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి అమరావతి గుడికి వెళ్ళే మార్గం సం. 301 సిటీ బస్సులు ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గ్రామంలో ఆగుతాయి. ఉండవల్లికి సమీపంలోని తాడేపల్లి పట్టణంలో కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్లు, మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్లు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం.
గ్రామంలో గాదె రామయ్య, సీతారావమ్మ మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల ఏర్పాటు కొఱకు ఈ గ్రామానికి చెందిన శ్రీ ఈమని శ్రీరామచంద్రమూర్తి గారు విశేష కృషి చేశారు. తరువాతి కాలంలో ఆయన అప్పటి ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు గారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ చదువుకొనవచ్చును. వంశీ అకాడమీ, జవహర్ విద్యానికేతన్ వంటి ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు కూడా ఉన్నాయి.
ఆంధ్రా బ్యాంక్ ఉండవల్లి శాఖ పంచాయతీ కార్యాలయం పక్క వీధిలో ఉంది. కోస్టల్ బ్యాంక్ ఉండవల్లి శాఖ లైబ్రరీ వీధిలో ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, గుంటూరు జిల్లా కో-ఓపెరటివ్ అర్బన్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకుల శాఖలు ఉండవల్లి సెంటర్ వద్ద అమరావతి రోడ్డులో ఉన్నాయి.
1983కి ముందు, ఈ గ్రామం 6 దీపాలను కలిగి ఉంది. గ్రామం నుండి దాని పరిసరాల గ్రామాలతో సరైన రహదారి సౌకర్యాలు లేవు. ఉండవల్లి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో (అంటే సుమారు 1979 నుండి 1981 వరకు) ప్రజలను చైతన్యపరిచేందుకు జొన్నా శివశంకరరావు, అతని బృందం అనేక 'విల్లా డ్రామ్స్' (నాటకాలు)లో పాల్గొన్నారు. శివశంకరరావు జొన్నా తన ఎ.ఫి.ఎస్.ఆర్.టి.సి ఉద్యోగానికి రాజీనామా చేసి, ఒక అడుగు వేసి 1982లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1983 నుండి 2001 వరకు మూడుసార్లు సర్పంచ్‌గా ప్రజలచే ఎన్నుకోబడ్డాడు. అతని పదవీకాలలో గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసారు. 2001 తరువాత, మంచి రహదారి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు వీధి దీపాలను 6 నుండి 600 కు పెంచారు. తరువాత గ్రామ సర్పంచ్‌గా, పుల్లగుగ్గు రాధా కుమారి బత్తుల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
ఉండవల్లిలో మూసివేయబడ్డ సినిమా హాల్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన శివాలయం ఉంది. రెడ్ల బజారులో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, నాయుళ్ళ బజారులో శ్రీ కోదండ రామాలయం, కృష్ణా కరకట్ట దిగువన ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం ఉన్నాయి.కరకట్ట దిగువన మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోటింగ్ పాయింట్ ఉంది. అక్కడ నుండి భవానీ ద్వీపానికి చేరుకోవచ్చు.
ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మధ్యలో స్తంభాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి సా.శ. 4, 5వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు.[2] ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది. ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవతలకు ఉద్దేశించినవి.[3] ఇవి గుప్తులు|గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి.[4] ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము ఉంది. ఈ గుహాలయములో దాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ, సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ ఉన్నాయి. పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి.
ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది.[5] ఆలయాల చుట్టూరా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి.
ఈ గుహాలయాలు సా.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఇక్కడ కొలువైన దేవుళ్ళు.[6]
విష్ణుకుండినుల చిహ్నము - సింహం - ఉండవల్లి గుహలలో కనబడుతుందనీ, అందువల్ల అవి వింష్ణుకుండునుల కాలము నాటివని కొందరి అభిప్రాయము. సింహము మాత్రమే కాదు, ఏనుగులు కూడా అర్ధ శిల్ప ఫలకాలలో - ఆ సింహాలతో పాటు -కనబడుతున్నాయి. సింహాలకు ప్రత్యేకత ఏమీలేదు. గుహా స్తంభాలయందు ఒక అంతస్తు మీద సింహాల బొమ్మలు నిండు శిల్పాలున్నాయి. ఈ సింహాలు అర్ధశిల్పసింహాలను పోలిలేవు; ఎల్లోరా గుహలు లోని దుముర్లేనా గుహలముందు కూడా సరిగ్గా ఇలంటి సింహాలే ఉన్నాయి. కనుక ఈ సింహాలు ఆదిలో ఉన్నవి కావు, ఆగుహల కాలక్రమ నిర్మాణములో తీరినవి అంటారు. ఈ నాటి ఋషుల బొమ్మలు కూడా ఉన్నవి ఈ సింహాల ప్రక్కన. అవి ఈనాటి భక్తుల నిర్మాణములు.
విష్ణుకుండినుల శిల్పములు విరివిగా లేనే లేవు.వారు శ్రీ పర్వతస్వామి పాదపద్మారాధకులూ, శైవులూ, శైవ శిల్పాలూ పశ్చిమ చాళిక్యుల శిల్పాలవలే కదలికను సూచిస్తున్నాయి కాని పల్లవుల శిల్పాలవలె రాయిగట్టి నిటారుగా లేవు. ఈ శిల్పాలు తూర్పుచాళిక్యల నాటివి గాని అంతకు ముందువు కావు. శాతవాహనులు, ఇక్ష్వాకులు మెత్తనైన చలువ రాతిలో తీర్పించిన శిల్పాలతరువాత ఘంటసాలలో తీర్చిన వైదిక శిల్పాలు సరస్వతి, కుమారస్వామి చైతన్య రహితాలు. బౌద్ధుల తరువాత కొంత నిలద్రొక్కుకొని పాలించినవారు విష్ణుకుండినుల . ఇక్ష్వాకుల నాడు అణగారిపోయిన శైవము వీరి ప్రాపు వల్ల మళ్ళీ ప్రచారములోనికి వచ్చింది. అయితే నటరాజు, మహిష మర్దినీ వీరి కాలములో కాక బాదామి చాళిక్యులు వమ్శానికి చెందిన తూర్పు చాళిక్యుల ప్రాభావముతో రూపొందినవి. బెజవాడ ద్వారపాలుడు - ఈనాడు మద్రాసు మ్యూజియములో ఉన్నవాడు - ఎర్రరాతి శరీరమువాడు, బాదామి చాళుక్యువంశానికి చెందిన తూర్పు చాళిక్యుల నాటివాడుకాని విష్ణుకుండినుల నాటి వాడు కాడు. ఈపోలికలు కల్యాణి చాళిక్యుల అలంపుర శిల్పాలలో కూడా కనబడుతున్నాయి.కనుక ఈ శిల్పాలు విష్ణుకుండినుల కాలమునాటివని కావని కొందరి అభిప్రాయము.
ఇక్కడ అనంతశయిన విగ్రహమూ, పాపపానుపూ, ఫణములూ, ఎగిరే కుంభాండులూ మహాబలిపురపు అనంతశాయనుని పోలికలు విరివిగా పెంచుకున్నవి కనుక పల్లవులు నిర్మాణములే అంటారు.మహాబలిపురం వలెనే ఈ అనంతశయనుడు గుహయొక్క పక్కగోడలో ఉన్నాడు.ఇక్కడ స్తంభాలమీద అడ్డుముక్క (Capital) పల్లవుల స్తంభాలమీద అడ్డుముక్కవలె ముందు సరళ ఋజురేఖలోతోను, తర్వాత రూళ్ళ కర్రలు పేర్పినటు వర్తుల రేఖల అంచుతోను ఉంది. ఉండవల్లిలోనిది బెల్లు బెల్లుగా ఊడిపోగలిగిన ఎర్రరాయి.పల్లవ బొగ్గము ప్రాంతంలో ఉండి చేజెర్లలోనూ ఉండవల్లి లోనూ అదును దొరికినప్పుడు పాలకులైన పల్లవులు తమ శిల్ప సమయాలన్నిటినీ ఒక్కమారు పెంచేసుకోలేదు, అందుచేతనే స్తంభాల దిగువున సింహాలు తయారు కాలేదు అంటారు.
పల్లవుల ప్రధాన చిహ్నము - కొమ్ముల కిరీటము-ఉన్న విగ్రహాలు పల్లవుల అవ్వచ్చును.మొగల్రాజపుర, విజయవాటికా గుహాలయాలు పల్లవులవే. అక్కడి స్తంభాలు ఉండవల్లి స్తంభాలవలె ఉన్నాయి. మొగల్రాజపుర గుహలముందు చూరుమీద గూళ్ళు, ఆ గూళ్ళలో ముఖాలు చెక్కడము పల్లవులూ, వారితర్వాత తూర్పు చాళుక్యులూ చేశారు. ఈముఖాలలో ఒక టి సరిగ్గా మహాబలిపురపు గంగావతరణ చిత్రములో దిగువున, కుంభము భుజముమీద పెట్టుకున్న మునిముఖము లాగ ఉంది. ఆశిల్పే ఇక్కడ ఇది చెక్కినాడవచ్చును. మొగల్రాజపురం గుహలు పల్లవుల నిర్మాణమే. బెజవాడ గుహలూ ఉండవల్లి కూడా అంతటా పల్లవుల శిల్పాలున్నాయి.
వరి, మిర్చి, అపరాలు, కాయగూరలు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ఉండవల్లి గ్రామానికి చెందిన బహు గ్రంథ రచయిత మహమ్మద్ నసీర్ అహ్మద్ కు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. విశాఖకు చెందిన సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ పురస్కారం ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుక గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇతనికి 2015వ సంవతరానికి గాను, ప్రతిష్తాత్మక కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,632. ఇందులో పురుషుల సంఖ్య 2,326, స్త్రీల సంఖ్య 2,306, గ్రామంలో నివాస గృహాలు 1,138 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,305 హెక్టారులు.