ఉత్తేజ్ | |
---|---|
![]() | |
జననం | ఆకుపత్ని ఉత్తేజ్ జూన్ 2, 1969 ![]() |
ఎత్తు | 5"7 |
ఉత్తేజ్ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.
ఉత్తేజ్ 1969, జూన్ 2న ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. తండ్రి ఆకుపత్ని శ్రీరాములు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు. తల్లి సుద్దాల శకుంతల.
ఏప్రిల్ 8న ఉత్తేజ్ వివాహం జరిగింది. భార్య పేరు పద్మావతి. వీరికి ఇద్దరు అమ్మాయిలు (చేతన ఉత్తేజ్, పాట). చేతన బద్రి, చిత్రం చిత్రాల్లో బాలనటిగా, పిచ్చిగా నచ్చావ్ చలన చిత్రంలో కథానాయికగా నటించింది.
ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు నాటకాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు. ఆ ప్రభావమే ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే నటన పై ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.[1]
ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే చలనచిత్రాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే చిత్రంలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ తెలుగు చిత్ర రంగంలో గీత రచయిత.
సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఉత్తేజ్, కళ్ళు చిత్రానికి అప్రెంటిస్ డైరక్టర్‌గా పనిచేసి, రావుగారిల్లు సినిమాతో అసిస్టెంట్ అయ్యాడు. అప్పుడు రాంగోపాల్ వర్మతో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు. శివ, గాయం, మనీ, మాస్టర్ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు. 1989 నుంచి ఉత్తేజ్ 197 చిత్రాలలో నటించాడు.
ఉత్తేజ్ సహాయ దర్శకుడు, హాస్యనటుడిగానే కాక సంభాషణల రచయితగా కూడా సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు. మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ మొదలైన తొమ్మిది సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.
చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు.