ఉద్ధవుడు హిందూ పురాణాలలో కనిపించే ఒక వ్యక్తి. ఈయన శ్రీకృష్ణుడికి స్నేహితుడూ, సలహాదారూ. భాగవత పురాణంలో ఈయన పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. ఇతనికి శ్రీకృష్ణుడే స్వయంగా యోగ, భక్తి విషయాలను బోధించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినది భగవద్గీత అయినట్లు ఈ బోధలు ఉద్ధవ గీత అనే పేరు గాంచాయి.[1] మహాభారతంలో ఈయనను వృష్ణి సేనలకు సలహాదారుగా పేర్కొన్నారు. వారందరూ ఈయనను అభిమానంతోనూ, గౌరవంతోనూ చూసేవారు.[2] భాగవత పురాణంలో ఈయనను బృహస్పతి శిష్యుడిగా పేర్కొన్నారు.[3]