ఉమయల్పురం కె.శివరామన్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | ఉమయల్పురం, తంజావూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1935 డిసెంబరు 17
వాయిద్యాలు | మృదంగం |
ఉమయల్పురం కాశీవిశ్వనాథ శివరామన్ ఒక కర్ణాటక సంగీత మృదంగ విద్వాంసుడు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.
ఇతడు తంజావూరు సమీపంలోని ఉమయల్పురం అనే గ్రామంలో పి.కాశీవిశ్వనాథ అయ్యర్, కమలాంబాళ్ దంపతులకు 1935, డిసెంబరు 17వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి వృత్తి రీత్యా వైద్యుడు అయినా ఇతడి సంగీతాభిరుచిని గమనించి ప్రోత్సహించాడు. ఇతడు మృదంగ వాద్యాన్ని అరుపతి నటేశ అయ్యర్, కుంభకోణం రంగు అయ్యంగార్‌ల వద్ద 15 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో అభ్యసించాడు. కొంత కాలం తంజావూరు వైద్యనాథ అయ్యర్ వద్ద కూడా నేర్చుకున్నాడు. ఒక వైపు మృదంగాన్ని నేర్చుకుంటూనే ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., బి.ఎల్. పట్టాలు సంపాదించాడు.
ఇతడు తన 10వ యేట కుంభకోణంలోని కాళహస్తీశ్వర ఆలయంలో తన మొట్టమొదటి కచేరీ చేశాడు.[1] ఇతడు కర్ణాటక సంగీతంలో మహామహులైన విద్వాంసుల కచేరీలకు మృదంగ సహకారం అందించాడు. వారిలో అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, పల్లడం సంజీవరావు, తిరుమకూడలు చౌడయ్య, కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై, పాపా వెంకటరామయ్య, ద్వారం వెంకటస్వామినాయుడు, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, మదురై మణి అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, అలత్తూర్ బ్రదర్స్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పాల్గాట్ కె.వి.నారాయణస్వామి, నేదునూరి కృష్ణమూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, ఎస్.బాలచందర్, టి.ఆర్.మహాలింగం మొదలైన వారున్నారు. ఇంకా ఇతడు పండిట్ రవిశంకర్, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రాం నారాయణ్, కిషన్ మహారాజ్, శాంత ప్రసాద్, అల్లా రఖా, జాకిర్ హుసేన్ మొదలైన హిందుస్థానీ సంగీత విద్వాంసులతో జుగల్బందీ కచేరీలు చేశాడు. ఇతడు అనేకమంది శిష్యులకు మృదంగం నేర్పించాడు.
1988లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.[2] 1992లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం - వాద్యపరికరాలు (మృదంగం) విభాగంలో అవార్డును ప్రదానం చేసింది. 2011లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. 1977లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం 1981 నుండి 6 సంవత్సరాల పాటు ఇతడిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది. కంచి కామకోటి పీఠం ఇతడిని "మృదంగ నాదమణి" బిరుదును ఇచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది. శృంగేరి శారదా పీఠము ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమిస్తూ "మృదంగ కళానిధి" బిరుదును ప్రదానం చేసింది.
2003లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చింది.[3] 2010లో ఇతడిని భారతదేశపు రెండవ అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ వరించింది.[4] 2010లో కేరళ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. [5] 1984లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ "సంగీత కళాశిఖామణి" అవార్డును ప్రకటించింది. 2001లో మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారంతో సన్మానించింది. 2019లో తమిళనాడు డా.జె.జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ డి.లిట్., ను ప్రదానం చేసింది.
ఇంకా ఇతనికి లయజ్యోతి, లయజ్ఞాన భాస్కర, మృదంగ చక్రవర్తి, నాద సుధార్ణవ, తాళ విలాస, లయ జ్ఞాన తిలక వంటి అనేక బిరుదులున్నాయి.
ఉమయల్పురం శివరామన్ అభిరామి శివరామన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరు చెన్నైలోని మైలాపూర్‌లో నివసిస్తూ ఉన్నారు. వీరికి ఇరువురు కుమారులు ఎస్.స్వామినాథన్, ఎస్.శివకుమార్‌లు ఉన్నారు. ఎస్.స్వామినాథన్[6] మార్కెటింగ్ నిపుణుడు. ఇతడు తన తండ్రి వద్ద మృదంగం నేర్చుకుని కచేరీలు చేశాడు.[7] తన తండ్రితో కలిసి దేశ విదేశాలలో అనేక సంగీత కచేరీలలో పాల్గొన్నాడు. శివరామన్ రెండవ కుమారుడు ఎస్.శివకుమార్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేస్తున్నాడు. శివకుమార్ వయోలిన్ నేర్చుకున్నాడు. సంగీత రసజ్ఞుడు. శివరామన్ మనుమడు విజ్ఞేష్ స్వామినాథన్ తాత వద్ద శిష్యరికం చేశాడు.[8] రెండవ మనుమడు ఆదిత్య స్వామినాథన్ వయోలిన్ నేర్చుకుంటున్నాడు. [9] ఇతని మనుమరాలు అపర్ణ శివకుమార్ భరతనాట్యం, వయోలిన్ అభ్యసించింది.
ఇతని శిష్యులలో కొంతమంది: