వ్యవస్థాపకురాలు-దర్శకుడు రంగకర్మీ నాటక సంస్థ (1976)
ఉషా గంగూలీ (1945 - ఏప్రిల్ 23, 2020) భారతీయరంగస్థలనటి, దర్శకురాలు. 1970ల, 1980లలో కోల్‌కతాలోని హిందీ నాటకరంగంలో పనిచేసింది. 1976లో రంగకర్మీ థియేటర్ గ్రూపును స్థాపించి, మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్, అంటార్యాత్ర వంటి నాటకాలు రూపొందించింది.[1][2][3] 1972లో పడతిక్‌కు చెందిన థెస్పియన్ శ్యామానంద్ జలన్ కాకుండా, కోల్‌కతాలోని హిందీ నాటకానికి చెందిన ఏకైక దర్శకురాలు.[4][5] రంగస్థల దర్శకురాలిగా 1998లో భారతదేశ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు,[6]గుడియా ఘర్ నాటకానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డులు అందుకుంది.[1]
ఉత్తరప్రదేశ్ లోని నెర్వా గ్రామంలోని కుటుంబానికి చెందిన ఉషా గంగూలీ 1945లో రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జన్మించింది. భరతనాట్యం నేర్చుకుని తరువాత కోల్‌కతాకి వెళ్ళింది. కోల్‌కతాలోని శ్రీ శిక్షాయతన్ కళాశాలలో చదువుకున్న ఉషా, హిందీ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసింది.[7] 1970లో కలకత్తా విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ భౌవానిపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి, 2008లో పదవీ విరమణ చేసంది.
శూద్రకుడు రాసిన మృచ్ఛకటికమ్ నాటకం ఆధారంగా 1970లో సంగిత్ కళామందిర్ సంస్థ ప్రదర్శించిన మిట్టి కి గాడి నాటకంలోని వసంతసేన పాత్రతో తన రంగస్థల ప్రస్థానాన్ని ప్రారంభించింది.[8] హిందీ అధ్యాపకురాలిగా బోధన కొనసాగిస్తూనే నాటకరంగంలో కృషిని కొనసాగించింది.[9]
1976, జనవరిలో రంగకర్మీ నాటక సంస్థను ఏర్పాటుచేసింది.[8] నర్తకిగా శిక్షణ పొందిన ఉషా, మదర్ నాటకానికి దర్శకత్వం వహించిన ఎంకె.అన్వాసే, ఇబ్సన్ నాటకం ఎ డాల్స్ హౌస్ అనుకరణైన గుడి ఘర్ నాటకాన్ని దర్శకత్వం వహించిన త్రిప్టి మిత్రాలను తన సంస్థ నాటకాలను దర్శకత్వం చేయడానికి ఆహ్వానించింది. త్రిప్టి మిత్రా, మృణాళ్ సేన్ ల ఆధ్వర్యంలో దర్శకత్వంలో శిక్షణ పొందింది.
1980లలో నాటక దర్శకత్వం ప్రారంభించిన ఉషా, కొద్దికాలంలోనే యువకులు, పేరొందిన నటులతో కలిసి కలకత్తా నగరంలో హిందీ నాటకానికి పునరుజ్జీవనాన్ని తెచ్చింది. మన్ను భండారి నవల ఆధారంగా 1984లో మహాభోజ్ నాటకం, 1987లో రత్నాకర్ మట్కారి లోక్ కథ (జానపద కథ) నాటకం, 1989లో నాటక రచయిత మహేష్ ఎల్కుంచ్వార్ హోలీ నాటకం, 1992లో మహాశ్వేతా దేవి కథను నాటకాకరణ చేసిన రుడాలి నాటకం, బ్రెహ్ట్ రాసిన మదర్ కరేజ్ ఆధారంగా హిమ్మత్ మాయి నాటకం, కోర్ట్ మార్షల్ నాటకం (అనుకరణ: స్వదేశ్ దీపక్) లకు దర్శకత్వం వహించంది.[9] 2003లో కాశినమా అనే నాటకాన్ని రాసింది.