ఉస్మాన్ సాగర్ | |
---|---|
ప్రదేశం | రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°23′N 78°18′E / 17.383°N 78.300°E |
రకం | జలాశయం |
సరస్సులోకి ప్రవాహం | మూసీనది |
వెలుపలికి ప్రవాహం | మూసీనది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉస్మాన్ సాగర్ ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది.[1] ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టిఎంసి అడుగుల సామర్థ్యం కలిగివుంది.[2] ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాలకు సమీపంలో ఈ గండిపేట జలాశయం ఉంది.
1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీనదికి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు త్రాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ 1920 లో మూసీనదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరుమీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది. సరస్సుకు ఎదురుగా సాగర్ మహల్ అనే ఒక భవనం ఉంది. చివరి నిజాం తన వేసవి విడిదికోసం ఈ భవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సాగర్ మహల్ వారసత్వ భవనంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
పర్యాటకులకు కొత్త అందాలను చూపించడంకోసం చారిత్రక గండిపేట చెరువు తీరంలో సుమారు 35 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో 5.50 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక గండిపేట పార్కును నిర్మించారు. ఇందులో స్వాగత ద్వారాన్ని అత్యంత భారీ ఆకృతిలో నిర్మించారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్‌లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, పిక్‌నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేశారు.[3] గండిపేట తీరంలో అత్యాధునిక డిజైన్లతో నిర్మించిన ఈ పార్కును 2022 అక్టోబరు 11న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[4]