అహంగమాగె తుదొర్ అరియరత్నె | |
---|---|
![]() డాక్టర్. ఎ.టి.అరియరత్నె | |
జననం | ఉనవతునా, గల్లె జిల్లా, శ్రీలంక | 1931 నవంబరు 5
జాతీయత | శ్రీలంకన్ |
విద్యాసంస్థ | మహింద కాలేజి, గల్లె విద్యోదయ విశ్వవిద్యాలయం |
వీటికి ప్రసిద్ధి | సర్వోదయ శ్రమదానోద్యమ వ్యవస్థాపకుడు |
శ్రీలంకాభిమాన్య అహంగమాగె తుదొర్ అరియరత్నె (Sinhala:අහන්ගමගේ ටියුඩර් ආරියරත්න) శ్రీలంకలో సర్వోదయ శ్రమదానోద్యమ వ్యవస్థాపకుడు.
ఎ.టి. అరియరత్నె 5 నవంబరు 1931న శ్రీలంకలోని గల్లె జిల్లాలో ఉనవతునె గ్రామంలో జన్మించారు. గల్లెలోని మహింద కళాశాలలో పాఠశాల విద్యనభ్యసించారు. ఆయన ఉపాధ్యాయుల పాఠశాలలో విద్యను అభ్యసించారు, ఆ తర్వాత 1972 వరకూ కొలంబోలోని నలంద కళాశాలకు చెందిన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అరియరత్నె సర్వోదయ శ్రమదానోద్యమంలో కృషిచేయడం 1958 నుంచి ప్రారంబించారు. విద్యోదయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో బి.ఎ. పట్టాను పొంది, అనంతరం తన కృషికి గాను అదే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డి.లిట్. స్వీకరించారు. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఎమిలియొ అగునల్డొ కళాశాల నుంచి హ్యుమానిటీస్ రంగంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. అరియరత్నె బౌద్ధంలో అంకితభావం కలిగిన భక్తుడు, సమాజాభివృద్ధి సంబంధిత కార్యకలాపాల్లోనూ, శ్రీలంక రాజకీయాల్లోనూ చురుకుగా పనిచేస్తున్నారు.
1969లో ప్రజానాయకత్వానికి గాను రామన్ మెగసెసే పురస్కారం, 1996లో భారత ప్రభుత్వం నుంచి గాంధీ శాంతి బహుమతి, 1992లో నివానో శాంతి బహుమతి సహా అనేక అంతర్జాతీయ గౌరవాలను, పురస్కారాలను శాంతి, గ్రామాభివృద్ధి రంగాల్లో కృషికి పొందారు. 2006లో, 2005కు గాను ఆచార్య సుశీల్ కుమార్ అంతర్జాతీయ శాంతి బహుమతిని పొందారు. ఈ అవార్డును పొందినవారిలో జాన్ పొలాన్యి, 2004లో దలైలామా ఉన్నారు. 2007లో శ్రీలంకలో అత్యున్నత జాతీయ గౌరవమైన అరియరత్నె శ్రీలంకాభిమన్యను స్వీకరించారు.[1]
అరియరత్నె, గాంధేయవాద సిద్ధాంతాలైన అహింస, గ్రామీణాభివృద్ధి, త్యాగం వంటివాటిని గాఢంగా విశ్వసిస్తారు. ఈ సిద్ధాంతాల ద్వారానే సర్వోదయ ఉద్యమంలో బౌద్ధమతాదర్శాలైన స్వార్థత్యాగం వంటివాటికి, అభివృద్దికి సంబంధించిన లౌకిక సిద్ధాంతాలకు మధ్య బలమైన బంధాన్ని నిర్మించారు. అంకితభావం కలిగిన బౌద్ధునిగా, వేలాది కుటుంబ సమ్మేళనాలు, ధ్యాన కార్యక్రమాలలోనూ శ్రీలంకలోని, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాదిమందిని పాల్గొనేలా చేశారు. హ్యుబర్ట్ హెచ్. 1994లో హంఫ్రే అంతర్జాతీయ పురస్కారాన్ని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి సంబంధించిన హ్యుబర్ట్ హెచ్. హంఫ్రే ప్రజాసంబంధాల పాఠశాల ద్వారా పొందినప్పుడు ఆయన శిష్యుడు డాక్టర్ పాట్రిక్ మెండిస్ అరియరత్నెను శ్రీలంక గాంధీగా సంబోధించారు.[2]