వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మోరపాక్కం జోస్యం గోపాలన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మద్రాసు, మద్రాసు ప్రెసిడెన్సీ | 1909 జూన్ 6|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2003 డిసెంబరు 21 చెన్నై | (వయసు 94)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 18) | 1934 జనవరి 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPN Cricinfo, 2020 20 May |
మోరపాక్కం జోస్యం గోపాలన్ (1909 జూన్ 6 - 2003 డిసెంబరు 21) క్రికెట్,[1] హాకీ రెండింటి లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడు.
గోపాలన్ చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని చెంగల్పట్టు జిల్లాలోని మోరపాక్కం గ్రామానికి చెందినవాడు. అతని చిన్నతనంలో కుటుంబం చెన్నైలోని ట్రిప్లికేన్‌కు వెళ్లింది. గోపాలన్ ప్రతిభను మద్రాస్ క్రికెట్ వ్యవస్థాపక పితామహులలో ఒకరైన CP జాన్‌స్టన్ కనుగొన్నాడు. జాన్‌స్టన్ ఇతర ప్రతిభావంతులకు ఇచ్చినట్లే గోపాలన్‌కు కూడా బర్మా షెల్‌లో ఉద్యోగం ఇచ్చాడు. గోపాలన్ త్వరలోనే ట్రిప్లికేన్ క్రికెట్ క్లబ్‌కు మారాడు. స్థానిక సర్కిల్‌లలో అతనికి వచ్చిన కీర్తి ప్రధానంగా ఈ క్లబ్బులో ఉండగా అతని ప్రదర్శనలకే వచ్చింది.
అతను ఒక ఫాస్ట్ మీడియం బౌలరు. అతను బంతిని రెండు వైపులా కదిలించేవాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ టోర్నమెంట్‌లో ఫస్ట్ క్లాస్ పోటీకి ఎంపికైనప్పుడు, అది అందరూ మెచ్చిన నిర్ణయం కాదు. మొదటి రోజు లంచ్ వరకు అతను వికెట్ తీసుకోలేదు. అందుకు ప్రేక్షకులు అతన్ని నిలదీశారు. కానీ ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదేసి వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో భారతదేశంలో పర్యటించిన ఆర్థర్ గిల్లిగాన్ నేతృత్వం లోని MCC జట్టుపై కూడా చక్కగా ఆడి ఆకట్టుకున్నాడు.
జాక్ హాబ్స్ కూడా ఆడిన విజయనగరం XI తో 1930 లో మద్రాస్ ఆడిన రెండు మ్యాచ్‌లలో గోపాలన్ మరొక చక్కని ప్రదర్శన చేసాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గోపాలన్, హాబ్స్‌ను అవుట్ చేశాడు. రెండో ఇన్నింగ్సులో లెగ్-కట్టర్‌తో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ బంతి లెగ్ స్టంప్‌పై పిచ్ అయి, ఆఫ్ బెయిలును తోసేసింది. 1933లో సిలోన్‌కి వ్యతిరేకంగా, అతను చెపాక్‌లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు. అతని ఎనిమిదో ఓవర్‌లో మొదటి, మూడవ, నాల్గవ, ఐదవ బంతుల్లో ప్రతిసారీ మిడిల్ స్టంప్‌ను కొట్టి నాలుగు వికెట్లు తీసాడు.[2]
1934 లో రంజీ ట్రోఫీని ప్రారంభించినప్పుడు, మద్రాసు, మైసూరులు మొదటి మ్యాచ్ ఆడాయి. టోర్నీలో తొలి బంతిని వేసిన ఘనత గోపాలన్‌కు దక్కింది. అతని ఏకైక టెస్ట్ మ్యాచ్ 1934 ప్రారంభంలో కలకత్తాలో ఇంగ్లండ్‌తో జరిగింది.
మద్రాస్‌లో హాకీ ఆడడంలో రాబర్ట్ సమ్మర్‌హేస్, గోపాలన్‌కు సహాయం చేశాడు. మద్రాసులో క్రికెట్‌కు జాన్‌స్టోన్ ఎలానో హాకీకి రాబర్ట్ సమ్మర్‌హేస్ అలా ఉండేవాడు. 1935 లో అతను, భారత హాకీ జట్టుతో కలిసి న్యూజిలాండ్‌లో పర్యటించాడు. అక్కడ భారత జట్టు అపారమైన విజయాన్ని సాధించింది. మరుసటి సంవత్సరం అతను ఇంగ్లండ్‌లో పర్యటించే క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మొహమ్మద్ నిస్సార్, అమర్ సింగ్ లు ఉండడం వల్ల ఇంగ్లండ్ టూర్ లో గోపాలన్ కి పెద్దగా పాత్ర ఉండదని ముందే తెలిసింది. అతను బెర్లిన్ ఒలింపిక్స్ కోసం హాకీ జట్టులో ఎంపికయ్యేవాడే, కానీ ఒలింపిక్ ట్రయల్స్‌ను వదిలేయడానికే నిశ్చయించుకున్నాడు. [3] ఈ నిర్ణయం చాలా తప్పని తరువాత తేలింది. హాకీ చరిత్రలోనే అత్యుత్తమ జట్లలో ఒకటైన ధ్యాన్ చంద్ సారథ్యంలోని హాకీ జట్టు పెద్దగా కష్టపడకుండానే బంగారు పతకాన్ని గెలుచుకుంది. గోపాలన్ ఇంగ్లండ్‌లో టెస్టు ఆడలేదు. పర్యటన అంతర్గత రాజకీయాలతో అతలాకుతలమై, అవమానకరంగా తిరిగి వచ్చింది.
కాలక్రమేణా గోపాలన్ బ్యాటింగ్ మెరుగుపడింది. తర్వాతి కాలంలో జాన్‌స్టోన్, "వికెట్ వద్ద నిలుచున్నపుడు అతని ఎడమ కాలి బొటనవేలు గాలిలో పైకి లేపి ఉండేది. ఇంగ్లండ్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధ క్రికెటరు, WG గ్రేస్ కూడా ఇలానే నిలుచునేవాడు కాబట్టి దీన్ని తప్పుపట్టలేం. అతనప్పుడు నం.10 బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. కానీ చక్కటి క్రమశిక్షణతో నిజాయితీగా ప్రయత్నించే బౌలరు బ్యాటింగ్‌లో ఎలాంటి అభివృద్ధిని సాధించగలడో అతను చూపించాడు. తరువాత చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు" అని రాసాడు.[4] [5] 1949లో వెస్ట్ ఇండియన్స్‌తో ఆటలో చేసిన 64 పరుగులు ఆ 'అనేక చక్కటి ఇన్నింగ్స్'లలో ఒకటిగా అత్యంత ప్రసిద్ధి చెందింది.[6]
1952లో, క్రికెట్, హాకీలోలో గోపాలన్ ఆడిన 25 సంవత్సరాలను పురస్కరించుకుని రజతోత్సవ నిధిని ప్రారంభించారు. MJ గోపాలన్ ట్రోఫీ కోసం మద్రాస్, సిలోన్ ల మధ్య వార్షిక క్రికెట్ మ్యాచ్‌ను ఏర్పాటు చేసారు. 1980ల ప్రారంభంలో శ్రీలంక టెస్ట్ హోదా పొందే వరకు ఈ వార్షిక టోర్నమెంటు, మధ్యమధ్యలో కొన్ని అంతరాయాలున్నప్పటికీ, కొనసాగింది. దీన్నే 2000 లో తమిళనాడు, కొలంబో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ల మధ్య జరిగిన మ్యాచ్‌గా పునరుద్ధరించారు. ఇది కూడా రెండేళ్ల తర్వాత రద్దయింది. గోపాలన్ 1950లలో కొన్ని సంవత్సరాలు జాతీయ సెలెక్టర్‌గా పనిచేశాడు.
గోపాలన్ మరణించే సమయంలో అప్పటికి జీవించి ఉన్న అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటరు. అతని ప్రకారం, అతను 1906 లో జన్మించినప్పటికీ, పుట్టిన సంవత్సరాన్ని పాఠశాల రికార్డులలో తప్పుగా నమోదు చేసారు.[7]
MA చిదంబరం స్టేడియం ప్రవేశ ద్వారాల్లో ఒకదానికి గోపాలన్ పేరు పెట్టారు.