క్రికెట్‌లో, ఎక్స్‌ట్రా అనేది బ్యాటింగ్ జట్టులో ఏ బ్యాటరుకూ చెందకుండా, జట్టుకు సమకూరే పరుగు. అవి బ్యాట్‌తో బంతిని కొట్టడం వలన కాక, ఇతర పద్ధతుల ద్వారా వస్తాయి.
ఎక్స్‌ట్రాలు స్కోర్‌కార్డ్‌పై విడిగా లెక్కిస్తారు. జట్టు స్కోర్‌లో మాత్రమే అవి కలుస్తాయి. ఎక్స్‌ట్రాలు ఎక్కువగా ఇవ్వడం అంటే నాణ్యత లేని బౌలింగ్‌గా పరిగణిస్తారు.
ఐదు రకాలు ఎక్స్‌ట్రాలు ఉన్నాయి: నో-బాల్ (nb), వైడ్ (w [1] లేదా wd), బై (b), లెగ్ బై (lb), పెనాల్టీ రన్ (pen[2] ).
బౌలరు బ్యాట్స్‌మన్‌కు బంతిని ఎలా వేసారు (అంటే వారు సరైన స్థానం నుండి బౌలింగ్ చేయకపోవడం, లేదా బంతి బ్యాట్స్‌మన్‌కు అందేంత దూరంలో లేకపోవడం వంటివి) లేదా లేదా ఫీల్డర్లు ఎక్కడ ఉండాలి అనే విషయంలో నిర్దుష్ట నిబంధనలను ఉల్లంఘించినపుడు ఇచ్చే ఎక్స్‌ట్రాలు ఇవి. ఇలాంటి ఎక్స్‌ట్రాల్లో బ్యాటరు ఔటయ్యే మార్గాలు కొన్ని పనిచెయ్యవు. ఇలాంటి చెల్లని డెలివరీలను ఓవరులోని 6 బంతుల లెక్కలోకి తీసుకోరు. అందువల్ల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెల్లని డెలివరీలు, ఇన్నింగ్స్‌లో వేయాల్సిన గరిష్ట సంఖ్య బంతుల సంఖ్యలోకి రావు.
బౌలరు గానీ ఫీల్డరు గానీ బౌలింగ్ సమయంలో చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడినప్పుడు అంపైర్ నో-బాల్ అని పిలవవచ్చు.
నో-బాల్‌కు అత్యంత సాధారణ కారణం బౌలరు ముందు పాదం పాపింగ్ క్రీజ్‌ను దాటి ముందుకు పడడం. రిటర్న్ క్రీజ్ వెలుపల బౌలర్ వెనక పాదం తాకినప్పుడు కూడా ఆ బంతి నో బాల్ అవుతుంది. అయితే ఇది అరుదుగా జరుగుతుంది. బౌలరు బంతిని విసిరినప్పుడు (లేదా చకింగు చేయడం ) లేదా బ్యాటరు నడుము కంటే ఎత్తుగా బంతి వెయ్యడం (బీమర్) లేదా ఫుల్ టాస్ బంతి వెయ్యడం లేదా ప్రమాదకరమైన లేదా అన్యాయమైన షార్ట్ పిచ్ బౌలింగ్ చేయడం వంటివాటిని కూడా నోబాల్‌లు గానే పరిగణిస్తారు.
నో-బాల్‌కు పెనాల్టీగా బ్యాటింగు జట్టుకు ఒక పరుగు (లేదా, కొన్ని వన్డే పోటీలలో, రెండు పరుగులు, ఫ్రీ హిట్) ఇస్తారు. ఇంకా, నో-బాల్ ఒక ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఒకటిగా పరిగణించరు. అదనంగా ఒక బాల్ వేయాల్సి ఉంటుంది.
నో బాల్‌కు లభించిన పరుగు అదనపుది. రన్నింగ్ ద్వారా లేదా బౌండరీ ద్వారా బ్యాట్స్‌మన్ ఏవైనా పరుగులు చేస్తే అవి నో బాల్‌కు లభించిన ఒక్క పరుగుకు అదనం. నో-బాల్ వైడ్ కూడా అయితే, అది నో-బాల్‌గానే పరిగణిస్తారు, ఒక్క పరుగే కలుపుతారు.
1980ల నుండి బౌలర్‌కు వ్యతిరేకంగా నో-బాల్‌ను స్కోరు చేస్తున్నారు. ఇది బౌలింగ్ గణాంకాలను మరింత ఖచ్చితమైనదిగా చేస్తుంది.
బ్యాట్స్‌మన్‌కు కొట్టడానికి అందనంత దూరంగా బంతిని వేస్తే అది వైడ్ అవుతుంది. బ్యాట్స్‌మన్ శరీరాన్ని గానీ, సామగ్రిలో ఏ భాగాన్ని గానీ బంతి తాకదు. అంపైర్ దాన్ని వైడ్ అంటాడు. వైడ్ బంతి వేసినపుడు, బ్యాటింగ్ చేసే జట్టుకు ఒక పరుగు కలుపుతారు. అదనంగా, ఆ ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఒకటిగా వైడ్‌ను పరిగణించరు. ఒక బంతి అదనంగా వేయాల్సి ఉంటుంది. అన్ని వైడ్‌లు బౌలర్ స్కోర్‌కు జోడించబడతాయి.
బౌలరు వేసిన బంతి బ్యాట్‌కు గానీ, బ్యాటరు శరీరంలోని ఏ భాగానికి గానీ తగలకపోయినా, పరుగుకు అవకాశం ఉందని బ్యాటరు భావిస్తే పరుగులు తీయవచ్చు. అపుడు వచ్చే పరుగులను బై లు అంటారు. ఒకవేళ బంతి బౌండరీకి చేరితే, బ్యాట్స్‌మెన్ పరుగెత్తినా, పరుగెత్తకపోయినా, నాలుగు బైలు ఇస్గ్తారు. అలా వచ్చిన బైలను ఎక్స్‌ట్రాలుగా లెక్కిస్తారు.
చట్టబద్ధమైన డెలివరీల నుండి ఎలా బైలు చేస్తారో నో-బాల్‌ల నుండి కూడా అలాగే బైలు చేయవచ్చు.
ఆధునిక క్రికెట్‌లో, వికెట్ కీపర్ గణాంకాలలో బైలును కలుపుతారు.
బంతి బ్యాట్స్‌మన్ శరీరానికి తగిలి, బ్యాట్స్‌మన్ లెగ్ బిఫోర్ వికెట్ (lbw) అవనంత దూరంగా ఉంటే, బ్యాట్స్‌మన్ కొట్టే ప్రయత్నం చేసినా చేయకున్నా పరుగులు తీయవచ్చు. ఈ సందర్భంలో వచ్చే పరుగులను, బంతి తాకిన అవయవంతో సంబంధం లేకుండా, లెగ్-బైలు అంటారు. బ్యాట్స్‌మెన్ పరిగెత్తినా, చేయకపోయినా బంతి బౌండరీకి చేరుకుంటే, నాలుగు లెగ్-బైలు ఇస్తారు.
నో-బాల్‌లు, చట్టబద్ధమైన డెలివరీలు రెంటి నుండీ లెగ్-బైలను స్కోర్ చేయవచ్చు. వీటిని ఎక్స్‌ట్రాలుగా లెక్కిస్తారు.[3] బ్యాట్‌ని పట్టుకున్న చేతులు గానీ, వాటికి ధరించే చేతి తొడుగులు గానీ బంతిని తాకితే బ్యాట్‌లో భాగంగానే లెక్కిస్తారు. అందువల్ల, వారి నుండి స్కోర్ చేయబడిన పరుగులు బ్యాట్స్‌మాన్‌కు జమ అవుతాయి. అవి లెగ్-బైలు కావు. [4]
నో-బాల్‌లు, వైడ్‌ల మాదిరిగా కాకుండా, బైలు, లెగ్-బైలు బౌలరు లెక్క లోకి రావు.
సాధారణంగా అన్యాయమైన ఆట లేదా ఆటగాడి ప్రవర్తనకు సంబంధించిన వివిధ చట్టాల ఉల్లంఘనలకు గాను పెనాల్టీ పరుగులు ఇస్తారు. వీటిలో చాలా వరకు 2000 తరువాత వచ్చినవ్జే. అన్యాయమైన ఆటకు[5] గాను, చట్టం 41 ప్రకారము, ఆటగాళ్ల ప్రవర్తనకు గాను 2017 నుండి చట్టం 42 ప్రకారమూ జరిమానాలు విధిస్తున్నారు.[6]
ఒక టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు 76 (35 బైలు, 26 లెగ్ బైలు, 0 వైడ్లు, 15 నో బాల్‌లు), 2007లో 3వ టెస్టులో భారత్, పాకిస్తాన్‌కి ఇచ్చింది. [7]
వన్ డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు 59. ఇది పాకిస్థాన్‌పై రెండుసార్లు సాధించబడింది: వెస్టిండీస్ 1989లో 9వ వన్‌డేలో, స్కాట్లాండ్ 1999 ప్రపంచకప్‌లో.[8]
ట్వంటీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు 41, 2022 జులైలో ఇస్వాతినిపై మొజాంబిక్ సాధించింది. [9]