నవరత్న శ్రీనివాస రాజారామ్ (1943 సెప్టెంబరు 22 - 2019 డిసెంబరు 11) ఒక విద్యావేత్త, గణిత వేత్త.[1] వాయిస్ ఆఫ్ ఇండియా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ప్రచురణలకు అతను ప్రసిద్ది చెందాడు. " స్వదేశీ ఆర్యుల " పరికల్పనను అతను ముందుకు తీసుకువచ్చాడు. శాస్త్రీయ దృక్కోణం పరంగా వేద కాలం చాలా అభివృద్ధి చెందిందని అతను నొక్కిచెప్పాడు. సింధు లిపిని తాను అర్థంచేసుకున్నానని రాజారాం పేర్కొన్నాడు. అయితే కొందరు పండితులు దాన్ని తిరస్కరించారు. [2]
రాజారాం 1943 సెప్టెంబరు 22 న మైసూరు లోని దేశస్థ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తాత నవరత్న రామారావు ఒక వలస పాలనకు చెందిన పండితుడు. ప్రాంతీయంగా కీర్తి గడించిన స్థానిక భాషా రచయిత. [3]
రాజారాం ఇండియానా విశ్వవిద్యాలయం నుండి గణితంలో పిహెచ్.డి. డిగ్రీ పొందాడు. కెంట్ స్టేట్ యూనివర్శిటీ, లాక్హీడ్ కార్పొరేషన్లలో పనిచేసాడు. అనేక అమెరికా విశ్వవిద్యాలయాల్లో 20 సంవత్సరాల పాటు బోధించాడు. [4] అతను భారతదేశంలో ఇంజనీర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు.
అతను 2019 డిసెంబరు 11 న మరణించాడు. [5]
పురాతన భారతీయ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రానికి సంబంధించిన అంశాలపై రాజారాం విస్తృతంగా రచనలు చేసాడు. ఇండాలజీ, సంస్కృత పాండిత్యానికి సంబంధించిన విషయాల్లోఐరోపా దృష్టికోణ పక్షపాతం ఉందని ఆరోపించాడు. "స్వదేశీ ఆర్యన్లు" సిద్ధాంతం తరపున వాదించాడు. [6]
19 వ శతాబ్దపు ఐరోపా పక్షపాత "ఇండాలజిస్టులు / మిషనరీలు" వారి అనేక నిర్ణయాలకు వచ్చిన పద్ధతిని ఆయన విమర్శించాడు. చరిత్ర గురించి చర్చించేందుకు భాషా శాస్త్రాన్ని సాధనంగా వాడూకోవడాన్ని విమర్శించాడు. [7] 19 వ శతాబ్దపు యూరోపియన్ మతప్రచారక "ఇండోలాజిస్టులు/ ప్రచారకుల"లో చాలామంది, సంస్కృతంతో సహా భారతీయ భాషల్లో "క్రియాత్మకంగా నిరక్షరాస్యులు" అని పేర్కొంటూ అలాంటి వారు భారతీయ చరిత్రపై పరికల్పనలను అధ్యయనం చేయడం, అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమని రాజారామ్ ప్రశ్నించాడు. రాజారాం ఇలా అన్నాడు:
అతను స్వదేశీ ఆర్య పరికల్పనను సమర్థించాడు. ఇండో-ఆర్య వలస సిద్ధాంతాన్ని క్రైస్తవ మతప్రచాకరులు వలసవాద ప్రయోజనాల కోసం కల్పించిన చరిత్ర అని, ఆ తరువాత వామపక్ష-ఉదారవాదులు, మార్క్సిస్టులు దాన్ని సమర్ధించారనీ చెబుతూ అతడు దాన్ని తిరస్కరించాడు. [9] [10] వేదాలు సామాన్యశక పూర్వం 7000 నాటివి అని చెబుతూ, హరప్పా నాగరికత వేద యుగపు చివరి దశ కాలానికి చెందినదని, అందువల్ల ఇది వేద యుగంలో ఒక భాగమనీ అతడు ఊహించాడు.
"వేద భారతీయులు" ఈజిప్టులోని ఫారోలకు పిరమిడ్లను నిర్మించడం నేర్పించారని ఇండియన్ ఆర్కియాలజికల్ సొసైటీ వారి పత్రిక పురాతత్వ లో పేర్కొన్నాడు. [11] లౌకికవాదం అనే భావన బహుళత్వ రాజ్య భావనలో అసంబద్ధం అని ఆయన నొక్కిచెబుతూ, ప్రాచీన హిందూ భారతదేశం లౌకిక రాజ్యం అని పేర్కొన్నాడు. [12]
తాను సింధు లిపిని అర్థంచేసుకున్నానని, దానిని చివరి వేద సంస్కృతంతో సమానమనీ చెప్పాడు; అయితే ఆ తరువాత ఈ రెండూ తిరస్కరణకు గురయ్యాయి. [13]
భౌతిక శాస్త్రవేత్త, సంశయవాది అలన్ సోకల్, రాజారామ్ రచనలను సూడోసైన్స్ [14] గా వర్ణించాడు. ఇతర సమీక్షకులు "చెత్త" అని, "ముతక" అనీ "అర్ధంలేని" ప్రచారం అనీ విమర్శించారు . [15] సుదేష్ణా గుహా అతన్ని సెక్టారియన్ అపండితుడని పేర్కొంది. [16]
రాజారామ్ రచించిన పాలిటిక్స్ ఆఫ్ హిస్టరీని ఒక వివాదాస్పద రచనగా సింథియా ఆన్ హ్యూమ్స్ విమర్శించింది [17] సూరజ్ భన్ దీనిని చారిత్రక రివిజనిజానికి నిదర్శనమని చెప్పాడు. [18] మైఖేల్ విట్జెల్ అతన్ని ఒక స్థానిక రచయితగా వర్ణించాడు. అతని పుస్తకాలు చరిత్రను పౌరాణికతతో తిరగరాసినవి, 21 వ శతాబ్దపు ప్రవాస భారతీయుల కోసం రాసినవి అని విమర్శించాడు. ఈ ప్రవాసులు "తాము కోల్పోయిన ఊహాత్మకమైన, అద్భుతాలతో కూడుకున్న, సుదూర గతాన్ని" తిరిగి పొందాలని కోరుకుంటారు అని విమర్శించాడు.