భారత శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, వరల్డ్ మ్యూజిక్, మెల్‌హార్మనీ
వృత్తి
వాద్య కళాకారుడు, గాత్ర విద్వాంసుడు, స్వరకర్త
వాయిద్యాలు
చిత్రవీణ
క్రియాశీల కాలం
1969 – ప్రస్తుతం
నరసింహన్ రవికిరణ్ (జ.12 ఫిబ్రవరి 1967) ఒక భారతీయ గోటు వాద్యకారుడు, గాత్ర విద్వాంసుడు, స్వరకర్త, సంగీత ప్రాసంగికుడు. ఇతడు "మెల్‌హార్మొనీ" అనే క్రొత్త కాన్సెప్టును సృష్టించాడు. గోటువాద్య కళాకారుడు చిత్రవీణ నరసింహన్ ఇతని తండ్రి.[1]కర్ణాటక సంగీత విద్యాంసుడు నారాయణ అయ్యంగార్ ఇతని తాత.
రవికిరణ్ మైసూరు నగరంలో జన్మించాడు. ఇతడు రెండేళ్ళ వయసులో 1969 ఏప్రిల్, ఆగష్టు నెలలలో బెంగళూరులో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పండిట్ రవిశంకర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, టి.ఆర్.మహాలింగం[2] వంటి మహామహుల సమక్షంలో మొదటిసారి తన ప్రతిభను ప్రదర్శించాడు.[3] ఇతడు కర్ణాటక సంగీతానికి చెందిన 325 రాగాలను, 175 తాళాలను గుర్తించగలిగాడు.[4] 1969 డిసెంబరులో మద్రాసు సంగీత అకాడమీ వారి 43వ వార్షిక సంగీతోత్సవాలలో ఈ బాలమేధావి తన ప్రతిభను ప్రదర్శించాడు.[5] అకాడమీ ఇతడికి స్కాలర్‌షిప్పును ప్రకటించింది.[6] తరువాత ఇతడు బొంబాయిలోని షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్, కొయంబత్తూరులోని త్యాగరాజ సభ మొదలైన చోట్ల కూడా తన ప్రదర్శనలిచ్చాడు.[7]పండిట్ రవిశంకర్ ఇతడి ప్రదర్శనను చూసి "మీరు భగవంతుడు ఉన్నాడని నమ్మకపోతే ఒకసారి రవికిరణ్‌ను చూడండి. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు." అని వ్యాఖ్యానించాడు.[8]
తన తండ్రి చిత్రవీణ నరసింహన్ శిక్షణలో ఇతడు తన ఐదేళ్ళ ప్రాయంలో 1972లో కోయంబత్తూరులో తొలిసారిగా గాత్ర సంగీత ప్రదర్శన చేశాడు. ఇతనికి 10 సంవత్సరాల వయసు వచ్చే లోపు ఇతడు మద్రాసు, బెంగళూరు, మైసూరు వంటి నగరాలలో కచేరీలు చేశాడు. ఇతని కచేరీలు రెండున్నర గంటలకు పైగా వ్యవధిని కలిగి ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించి భారతీయ పత్రికలలో ప్రశంసలు వెల్లువెత్తింది.
ఇతడు పిన్న వయసులోనే గోటువాద్య కళాకారుడిగా తన సత్తాను నిరూపించుకున్నాడు.[9][10][11] 1985 జూలైలో ఇతడు చెన్నైలో 24 గంటల నిర్విరామ కచేరీ నిర్వహించాడు.[12] ఆకాశవాణి, దూరదర్శన్‌లు తమ నిబంధనలను సడలించి ఇతడికి 12వ యేటనే కచేరీలు చేయడానికి అనుమతినిచ్చాయి. ఇతడిని ఫ్రాన్సు (1985),[13] స్విట్జర్లాండు (1987), జర్మనీ (1992), బ్రెజిల్ (2012), పోలండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, యుగోస్లేవియా (1997) దేశాలలో జరిగిన సంగీతోత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించారు. ఇతడు చికాగో వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్,[14] థియేటర్ డి లా విల్లె పారిస్,[15] యూరోపాలియా ఫెస్టివల్, బెల్జియమ్,[16] మిలీనియం ఫెస్టివల్, మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, బుడాపెస్ట్[17] వంటి అనేక ప్రపంచస్థాయి కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.
1986-96ల మధ్య ఇతడు టి.బృంద వద్ద శిక్షణ పొందాడు.[18] ఇతడు యువతలో శాస్త్రీయ సంగీత విలువలు పునరుద్ధరించడానికి కృషి చేశాడు.[19]ఇతడు అనేక సోలో ప్రదర్శనలు, కంజీర/ఘటం/మృదంగం మొదలైన వాద్యాలు, గోటు వాద్యంతో జుగల్బందీ కార్యక్రమాలు, పియానో, కీబోర్డు, గిటారు ఇతర వాద్యాలతో భాగస్వామ్య కచేరీలు, అనేక గాత్ర కచేరీలకు పక్కవాద్య సహకారాలు ఇచ్చాడు.[20]
ఇతడు గాత్ర విద్వాంసుడిగా దేశ, విదేశాలలో అనేక కచేరీలు చేశాడు. వాటిలో క్లీవ్‌లాండ్ ఫెస్టివల్, చికాగో వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వంటివి ఉన్నాయి. ఇతడు పాడిన పాటలతో "జీనియస్ ఎట్ వర్క్" అనే ఆల్బం తీసుకువచ్చాడు. ఇతడు గోటువాద్యంలో అనేక సాంకేతికపరమైన మార్పులు తెచ్చాడు.[21]
రవికిరణ్ పాశ్చాత్య సంగీత సింఫనీలకు, ఆర్కెస్ట్రాలకు, స్ట్రింగ్ చతుష్కాలకు సంగీత సహకారాన్నందించాడు. తాజ్ మహల్,[22] లారీ కొరియెల్, మార్టిన్ సింప్సన్, జార్జ్ బ్రూక్స్, సైమన్ ఫిలిప్స్, రోనాల్డ్ వాన్ కాంపెన్‌హౌట్ వంటి ప్రపంచస్థాయి కళాకారులకు, బి.బి.సి.ఫిల్‌హార్మోనిక్,[23] విస్కాన్‌సిన్, గోట్టింగ్‌జెన్ క్వింటెట్, అపోలో ఛేంబర్ ప్లేయర్స్, [24]మిడిల్‌టన్ కమ్యూనిటీ సింఫనీ,[25] శాక్రిమెంటో సింఫనీ[26] మొదలైన ఆర్కెస్ట్రాలకు తోడ్పాటు నందించాడు.
ఇతడు 800కు పైగా శాస్త్రీయ, సమకాలీన రచనలకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతడు స్వరపరచిన భారత శాస్త్రీయ రచనలలో వర్ణాలు, కృతులు, జావళులు, తిల్లానాలు, పదాలు ఉన్నాయి. కర్ణాటక సంగీతంలోని 35 తాళాలకు ప్రతి తాళంలోను ఒక కృతికి,[30] 72 మేళ రాగమాలికా గీతానికి స్వరకల్పన చేశాడు.[31]
ఇతడు "వీతవనం",[32]చూడామణి,[33][34]కేశవప్రియ, వైష్ణవి, సామప్రియ, శివమనోహరి, అంధకారిణి[33] వంటి కొత్త రాగాలను సృష్టించాడు. [35] ఇతడు అనేక మంది అళ్వారుల,[36] వేదాంతదేశికుల,[37] పురందరదాస, డి.వి.గుండప్ప, మరికొందరు సమకాలీనుల కృతులకు సంగీతాన్ని సమకూర్చాడు.
ఇతడు జనవరి 2016లో చెన్నైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తమిళ్ స్టడీస్‌లో 1330 తిరుక్కురల్ శ్లోకాలకు 3రోజుల, 16 గంటల వ్యవధిలో సంగీతాన్ని సమకూర్చి రికార్డును సృష్టించాడు.[38][39]
ఇంకా ఇతడు లక్ష్మీప్రాభవం,[40] సావిత్రి,[41] వినాయకవైభవం,[42] రామాయణ - బాలకాండం, యుద్ధకాండం,[43] మహాభారత (కర్ణశపథం, గోతోపదేశం), త్రిమూర్తులు,[44][45] పంచక్రియ, పాంచాలి శపథం
మొదలైన సంగీత నృత్య రూపకాలను వ్రాసి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాడు.
#మీటూ ఉద్యమంలో భాగంగా తన శిష్యురాళ్ళతో, తోటి కళాకారిణులతో ఇతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి.[66] రవికిరణ్ తనపై వచ్చిన ఆరోపణలను ఇండియా టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోను, తన ఫేస్‌బుక్ అకౌంటులోను ఖండించాడు.[67][68]ఈ ఆరోపణల పర్యవసానంగా మద్రాసు సంగీత అకాడమీ 2018 డిసెంబరులో జరిగిన సంగీతోత్సవాలలో ఆరోపణలు ఎదుర్కొన్న 6గురు కళాకారులతో పాటు ఇతడి సంగీత కచేరీలను కూడా రద్దు చేసింది.[69][70][71] 2018 అక్టోబరులో ఫెడరేషన్ ఆఫ్ సిటీ సభాస్, చెన్నై వారు ఏర్పాటు చేసిన కమిటీ ముందు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎవరూ ఈ కళాకారులపై ఫిర్యాదు చేయక పోవడంతో వీరిపై చేయబడిన ఆరోపణలు వీగిపోయాయి.[72]