ఎబాదత్ హుస్సేన్ చౌధురి ( జననం 1994 జనవరి 7), బంగ్లాదేశ్ క్రికెటరు. అతను 2019 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.[3] అతని వేగం, నైపుణ్యాల కారణంగా అతనికి 'సిల్హెట్ రాకెట్' అనే పేరు వచ్చింది.[4] అతను బంగ్లాదేశ్ వైమానిక దళంలో సైనికుడు కూడా.[5]
ఎబాదత్ హుస్సేన్ చౌధురి 1994 జనవరి 7న మౌల్విబజార్ జిల్లాలోని బార్లేఖాలోని కథల్తాలి గ్రామంలో చౌదరీలకు చెందిన సిల్హెటి ముస్లిం కుటుంబంలో జన్మించారు. [6] నిజాముద్దీన్ చౌదరి, సమియా బేగంల ఆరుగురు పిల్లలలో అతను రెండవవాడు. [7]
2012లో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో వాలీబాల్ ప్లేయర్‌గా ఎబాదత్ హుస్సేన్ చేరాడు. [8] 2016లో, అతను ఆకిబ్ జావేద్ పర్యవేక్షణలో BCB నిర్వహించిన పేసర్ హంట్ పోటీకి హాజరయ్యాడు. BCB హై-పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ కోసం ఎబాదత్‌ను ఆకిబ్ ఎంచుకున్నాడు. దాంతో, ఎబాదత్ వాలీబాల్ ఆటగాడి నుండి క్రికెటరుగా మారాడు.[9]
2016 సెప్టెంబరు 25న 2016–17 నేషనల్ క్రికెట్ లీగ్‌లో సిల్హెట్ డివిజన్‌కు ఎబాదత్ ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [10] 2017 మే 8న 2016–17 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ తరఫున తన తొలి లిస్టు Aమ్యాచ్ ఆడాడు.[11] 2017–18 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2017 నవంబరు 6న రంగ్‌పూర్ రైడర్స్ తరపున ట్వంటీ20 ల్లోకి అడుగుపెట్టాడు.[12] ఎబాదత్ 2017–18 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో సెంట్రల్ జోన్ తరపున ఆరు మ్యాచ్‌లలో పదమూడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[13]
2018 అక్టోబరులో ఎబాదత్, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్ జట్టులో చేరాడు. [14] మరుసటి నెలలో, 2018–19 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో నార్త్ జోన్ తరపున బౌలింగ్ చేస్తూ, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను తన తొలి పది వికెట్ల పంట సాధించాడు. [15] 2019-20 సీజన్‌కు ముందు శిక్షణా శిబిరంలో చేర్చిన 35 మంది క్రికెటర్లలో అతనొకడు. [16]
2016 నవంబరులో, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలో శిక్షణ పొందేందుకు 22 మంది ఆటగాళ్ళ సన్నాహక బృందంలో ఎబాదత్ ఎంపికయ్యాడు. [17]
2019 ఫిబ్రవరిలో, న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ టెస్టు జట్టులోకి ఎబాదత్‌ను తీసుకున్నారు. [18] అతను 2019 ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ తరపున టెస్టు రంగప్రవేశం చేసాడు. అతని మొదటి టెస్టు వికెట్ నీల్ వాగ్నర్. [19]
2022 జనవరిలో, సిరీస్‌లోని మొదటి టెస్టులో బే ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో అతను తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. [20] అతని 6/46, బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌పై మొదటి విజయం సాధించడంలోను, న్యూజిలాండ్‌పై వారి మొదటి టెస్టు విజయాన్ని సాధించడంలోనూ సహాయపడింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ఎబాదత్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. [21][22]
2022 ఫిబ్రవరిలో, అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [23] 2022 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [24] 2022 మేలో, ఈసారి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం అతన్ని జట్టు లోకి తీసుకున్నారు. [25] 2022 ఆగష్టులో, జింబాబ్వే పర్యటన కోసం వన్‌డే జట్టులో ఎంపికయ్యాడు. [26] 2022 ఆగస్టు 10న జింబాబ్వేపై తన తొలి వన్‌డే ఆడాడు.[27] అదే నెలలో, 2022 ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ T20I జట్టులో ఎంపికయ్యాడు. [28] 2022 సెప్టెంబరు 1న శ్రీలంకపై తన తొలి T20I ఆడాడు. [29]