ఒట్టాప్లక్కల్ నంబియదిక్కల్ వేలు కురుప్ (మళయాళం: ഒറ്റപ്ലാക്കല് നമ്പിയാടിക്കൽ വേലു കുറുപ്പ്[1]), ఒ.ఎన్.వి.కురుప్గా లేదా ఒ.ఎన్.వి.గా ప్రాచుర్యం పొందారు. కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, కేరళకు చెందిన మలయాళ సినీపరిశ్రమలో ప్రాచుర్యం పొందిన సినీ గేయకర్త. భారతదేశంలో సాహిత్యరంగానికి లభించే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని 2007 సంవత్సరంలో పొందారు. ఒ.ఎన్.వి.కురుప్ మలయాళ సినీపరిశ్రమలో సినీకవిగా ఎన్నో సినిమాలకే కాక, నాటకాలకు, టి.వి.సీరియళ్ళకి కూడా గేయరచన చేశారు. 1998లో భారతప్రభుత్వం ప్రకటించే నాలుగవ అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2007లో ఆయన చదివిన తిరువనంతపురంలో కేరళ విశ్వవిద్యాలయమే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒ.ఎన్.వి. వామపక్ష అనుకూలవాదిగా పేరుపొందారు.[2] 1989 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామిక వేదిక (లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్) తరఫున తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు.[3]