ఒట్టేసి చెపుతున్నా | |
---|---|
దర్శకత్వం | ఇ. సత్తిబాబు |
రచన | చింతపల్లి రమణ (మాటలు), ఉదయ్ రాజ్ (కథ) |
స్క్రీన్ ప్లే | ఇ. సత్తిబాబు |
నిర్మాత | కె. అనిల్ కుమార్ |
తారాగణం | శ్రీకాంత్, స్రవంతి, శివాజీ, సునీల్ |
ఛాయాగ్రహణం | సి. రాంప్రసాద్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 11, 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒట్టేసి చెపుతున్నా 2003 లో ఇ. సత్తిబాబు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో శ్రీకాంత్, స్రవంతి, శివాజీ, సునీల్ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై కె. అనిల్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు.
సూర్యం ఒక అనాథ. అతనికి రావలిసిన ఆస్తి గొడవల్లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా అనుకున్న వాళ్ళంతా దూరమైపోవడంతో సూర్యం నిరాశావాదంలో కూరుకుపోయి తాను ఏం కోరుకున్నా అది జరగదనే ఏమీ కోరుకోకుండా ఉంటాడు. వినాయకుడు అతనికిష్టమైన దేవుడు. ఆయన బొమ్మ టేబుల్ మీద పెట్టుకుని బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. ఒక రోజు అతని చిరునామాకు పొరపాటుగా ఒక లేఖ వస్తుంది. అందులో ఓ అందమైన అమ్మాయి ఫోటో అంటించి ఉంటుంది. ఆ ఫోటో చూసిన తర్వాత అతని జీవితంలో అంతా మంచి జరగడం ప్రారంభమవుతుంది. అప్పటి దాకా ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్న అతనికి ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తన అదృష్ట దేవత అనుకుంటాడు సూర్యం. ఆమె ఫోటో పెద్దగా చేసి తన గదిలో పెట్టుకుంటాడు. మరొ కొద్ది రోజులకు అతని తరపున న్యాయవాది వచ్చి అతని పూర్వీకుల ఆస్తి అతనికి దక్కిందని తెలియజేస్తాడు. ఆమె ఫోటోను చూస్తేనే ఇంత మంచి జరిగిందంటే ఇక ఆమె తన జీవితంలోకి వస్తే ఇక తిరుగే ఉండదనుకుని ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
స్నేహితుడితో కలిసి ఆమె కోసం వెతకడం మొదలుపెడతాడు. ఆమె పేరు దివ్య అని తెలుస్తుంది. ఆమె ఉండే ఇంటికి దగ్గర్లోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెను ఆకట్టు కోవడానికి స్నేహితుడి సాయంతో అనేక ప్రయత్నాలు చేస్తాడు. భార్యా భర్తల మధ్య గొడవల్ని సూర్యం పరిష్కరించిన తీరు చూసి దివ్యకి అతని మీద గౌరవభావం ఏర్పడుతుంది. అంతే కాకుండా దివ్య వాళ్ళ ఇంట్లోనే అద్దెకు దిగుతారు. ఆమె అప్పటికే తమ ఇంట్లో అద్దెకుండే దిలీప్ అనే అతన్ని ప్రేమిస్తుంటుంది. దిలీప్ కి ఉద్యోగం, డబ్బులు ఉండవు. దివ్య తండ్రి మాత్రం తన కూతుర్ని ఉద్యోగస్తుడు, ధనవంతుడు అయిన వరుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తుంటాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం చూసిన సూర్యం తను ఆమెకు దూరంగా ఉండాలనుకుంటాడు. అప్పుడే దివ్య సూర్యంకి తమ పరిస్థితి గురించి చెప్పి తమ సమస్యను పరిష్కరించమని అడుగుతుంది. అతను పైకి వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తున్నా లోలోపల మాత్రం ఆమెను ఆరాధిస్తుంటాడు. సూర్యం స్నేహితుడు మాత్రం దివ్య, దిలీప్ లను ఎలాగైనా విడగొట్టి దివ్య సూర్యాన్ని పెళ్ళి చేసుకునేలా చూడాలనుకుంటూ ఉంటాడు. దిలీప్ ఒక మోసగాడని డబ్బు కోసం వేరే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడని గమనిస్తాడు. కానీ సూర్యం మాత్రం తన మీద ప్రేమతోనే వాళ్ళను విడగొట్టాలని చూస్తున్నాడని అతని మాటలు నమ్మడు. చివరికి దిలీప్ ఒక మోసగాడని గ్రహించి, సూర్యం దివ్యని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
ఈ సినిమా నిర్మాత అనిల్ శ్రీకాంత్ వ్యక్తిగత సహాయకుడు కూడా.
ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[2][3]