ఓజర్ వినాయక దేవాలయం | |
---|---|
![]() ఓజర్ వినాయక దేవాలయ ప్రవేశ ద్వారం | |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మహారాష్ట్ర |
జిల్లా: | పూణే జిల్లా |
ప్రదేశం: | ఓజర్ |
భౌగోళికాంశాలు: | 19°11′17.07″N 73°57′34.70″E / 19.1880750°N 73.9596389°E |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | దేవాలయ శైలీ |
ఓజర్ వినాయక దేవాలయం,[1] మహారాష్ట్ర, పూణే జిల్లాలోని ఓజర్ ప్రాంతంలో ఉన్న వినాయకుడి దేవాలయం. మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయాలలో ఇదీ ఒకటి.
పూణే నుండి సుమారు 85 కి.మీ.ల దూరంలో,[2] పూణే - నాసిక్ హైవే నుండి నారాయణంగావ్ కి ఉత్తరాన సుమారు 9 కి.మీ.ల దూరంలో ఈ ఓజార్ ప్రాంతం ఉంది.[3] లేన్యాద్రిలోని మరొక అష్టవినాయకుడి దేవాలయంతోపాటు ఓజర్, పూణే జిల్లాలోని జున్నార్ తాలూకాలో ఉంది.[4] ఓజార్ కుకాడి నది ఒడ్డున దానిపై నిర్మించిన యెడగావ్ ఆనకట్టకు సమీపంలో ఉంది.[2]
పీష్వా బాజీ రావు I తమ్ముడు, సైనిక కమాండరైన చిమాజి అప్ప, పోర్చుగీసు వారి నుండి వసాయి కోటను స్వాధీనం చేసుకున్న తరువాత ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. దేవాలయ గోపురం బంగారు తాపడంతో కప్పబడింది. వినాయక భక్తుడైన అప్పశాస్త్రి జోషి 1967లో దేవాలయాన్ని మరోసారి పునరుద్ధరించాడు.[5]
ఇక్కడ అనుకూలమైన మార్గం ఉండడంతో భక్తులు ఈ దేవాలయాన్ని తరచుగా సందర్శిస్తుంటారు.[6] ముద్గల పురాణం, స్కంద పురాణం, తమిళ వినాయక పురాణం ప్రకారం యాగాన్ని నాశనం చేస్తున్న కాల రాక్షసుడిని సంహరించి, ఋషులకు సహాయం చేయడంకోసం వినాయకుడు రాక్షసుడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో గెలవడం అసాధ్యమని భావించిన ప్రత్యర్థి వినాయకుడికి లొంగిపోయాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఋషులు ఓజర్ వద్ద వినాయకుని ప్రతిమను ప్రతిష్టించారు.[7][8]
తూర్పు ముఖంగా ఉన్న ఈ దేవాలయంలో విశాలమైన ప్రాంగణం, ప్రవేశ ద్వారం, శిల్పాల, గోడలు ఉన్నాయి. ఇరువైపులా రెండు పెద్ద రాతి ద్వారపాల శిల్పాలు ఉన్నాయి. మధ్య దేవాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు చెక్కబడి ఉన్నాయి. దేవాలయంలో రెండు హాలులు ఉన్నాయి. దేవాలయ గోడలకు చిత్రాలు, రంగురంగుల శిల్పాలు నిండి ఉన్నాయి.[9][10][11] శిఖరం - గర్భగుడిపై - బంగారు రేకుతో కప్పబడి ఉంటుంది.[12] ఈ దేవాయలం రెండు విశాలమైన రాతి ప్రాకారం (హిందూ గర్భగుడి వెలుపల బయటి మార్గం) కూడా కలిగి ఉంది.[9]
ఈ దేవాలయంలో వినాయకునికి సంబంధించిన వినాయక చవితి వంటి సాధారణ పండుగలు జరుపబడుతాయి. కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభమయ్యే ఐదు రోజుల పండుగ కూడా ఇక్కడ జరుపుకుంటారు.[5]