కంపెనీ శైలి చిత్రకళ (ఆంగ్లం: Company Style, హిందీ: कंपनी कलम्) 17వ శతాబ్దము నుండి భారతీయ చిత్రకారులచే ఆంగ్లేయుల అభిరుచులకు తగ్గట్టు భారతీయ చిత్రకళలో - పాశ్చాత్య చిత్రకళా శైలులను సమ్మిళితం చేసి ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు లేకుండా చిత్రీకరించబడ్డ చిత్రపటాలు.[1][2] ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణాసియా పై దృష్టి వేయటం, ఇంగ్లాండు నుండి పలువురు భారత దేశం వలస రావటం, పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా ఉండే ఇక్కడి సంస్కృతి వారికి నయనాందకరం కావటం, ఇక్కడి దైనందిన దృశ్యాలు కూడా వారికి ప్రత్యేకంగా కనబడటం, ఇక్కడి మొక్కలు, వృక్షాలు, పశు పక్ష్యాదులు, ప్రాచీన స్మారక కట్టడాలను, వివిధ సంస్కృతుల ప్రజలను చూచి వారు ముగ్ధులు కావటం, ఈ దృశ్యాలు చిత్రీకరించబడాలి, ఈ దృశ్యాల చిత్రపటాలు తమ వద్ద జ్ఞాపకాలుగా ఉంచుకోవాలి, తమతో తీసుకెళ్ళి తమ దేశ ప్రజలకు చూపించాలి అనే బ్రిటీష్ వారి కాంక్షయే ఈ కంపెనీ శైలి చిత్రకళకు బీజాలు వేసింది.[3] ఇంతే కాక అప్పటికే ముఘల్ పాలన అంతమవటం, కళలను ప్రోత్షహించేవారు కరువవటం, బ్రిటీషు వారు కళలను తమ అభిరుచులకు అనుకూలంగా ప్రోత్సహించదలచుకోవటం కూడా కంపెనీ శైలి చిత్రకళ విస్తరణకు ముఖ్య కారకం అయ్యింది. పాశ్చాత్య చిత్రకళను అనుకరణతో ప్రారంభం అయిన ఈ శైలి చిత్రకళపై స్థానిక అంశాలు, స్థానికంగా అభివృద్ధి చేయబడిననూ, పాశ్చాత్యులు జోక్యం కలిగిఉండటంతో కళపై పాశ్చాత్య ప్రభావాలు వెరసి కంపెనీ శైలి చిత్రకళ అప్పటి వరకూ భారతీయ చిత్రకళలో ఉన్న ఇతర శైలులకు భిన్నంగా ఉంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది.[3]
ప్రాచీన కాలంలో భారతీయ చిత్రకళ అద్భుతమైన కళాఖండాలను సృష్టించింది.[4] ఇక్కడి చిత్రకళ, ఇక్కడి ఆధ్యాత్మిక భావాలతో ముడి పడి ఉండేది. శాస్త్రీయ చిత్రకళ, ప్రపంచం యొక్క సమతౌల్యాన్ని తలపింపజేసేది. శాంతిని ప్రతిబింబింపజేసేది. అజంతా గుహలులో గోడల పై కుడ్య చిత్రాలు, ఆకర్షణీయంగానే ఉంటూ, ఆత్మావలోకనం చేసేవిగా కూడా ఉంటాయి. చిత్రకళ లోని ఈ జీవకళయే ప్రాచీన భారతదేశపు కళ అంతటిలోనూ వ్యాపించి ఉండేది. భారతీయ ఆధ్యాత్మికతలో కళ ప్రముఖమైన పాత్ర పోషించింది. చూడచక్కని కళాఖండాలు భక్తి వలన చేయబడతాయి అని, సృష్టి యొక్క సమతౌల్యపు లోతులను అర్థం తెలిపేలా ఉంటాయి అనే, ఇటువంటి కళాఖండాలు చూడగానే వీక్షకుడు బ్రహ్మనందం పొందేవాడని నమ్మకం ఉండేది. జ్ఞానాన్ని, తనను తాను అర్థం చేసుకొనే తత్త్వాన్ని పెంపొందించే కళే మానవాళికి అందించబడే గొప్పనిధి అనే భావన ఉండేది. తూర్పు భారతదేశానికి చెందిన పల రాజ్యపు బౌద్ధ చిత్రలేఖనాలు, ప్రార్థన, ధ్యానంలో మనిషినే దేవుడిని చేసేంత ప్రముఖ స్థానం వహించేవి. జైన చిత్రలేఖనాలలో నైరూప్యం (ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్) తో బాటు ఒక రకమైన శైలి (Style) తొణికిసలాడేది. జీవకళ ఉట్టిపడే సంజ్ఞలు, లయబద్దమైన భంగిమలతో వీటికంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. ఇవన్నీ భౌతిక లోకం నుండి మనిషిని దూరంగా తీసుకెళ్ళేవి.
ముఘల్ చక్రవర్తి అక్బర్ కళాప్రేమికుడు కావటం, కళలకు మద్దతును ఇవ్వటంతో సాంప్రదాయిక/శాస్త్రీయ/ఆధ్యాత్మిక లతో బాటు దైనందిన జీవన దృశ్యాలు సైతం భారతీయ చిత్రకళలో భాగం అయ్యాయి. అక్భర్ హయాం లోనే భారతీయ చిత్రకళ పై ఐరోపా ప్రభావాలు మొదలు అయ్యాయి. గోవాలో నివసిస్తున్న పోర్చుగీసుతో బాటు, ఇతర ఐరోపా దేశస్థులు ఫతేపూర్ సిక్రీలో అక్భర్ స్థాపించిన కళలను అభ్యసించే కేంద్రాలకు తీసుకు రాగా, చాలా మంది ముఘల్ చిత్రకారులు, వీటిని అనుకరించటం మొదలు అయ్యింది. భారతీయ చిత్రకళ పై పాశ్చాత్య ప్రభావాలకు ఇదే నాంది. పోర్చుగల్కు చెందిన వాస్కోడగామా భారతదేశానికి నౌకామార్గాన్ని కనుగొనటం, తర్వాత, ఫ్రాన్స్, డచ్, ఇంగ్లండులు కూడా భారతదేశపు దారి పట్టాయి. ఈ దేశాలన్నీ ఇక్కడ్ వర్తక కేంద్రాలు స్థాపించిననూ, 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ధాటికి మిగితా వర్తక కేంద్రాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. దినదినప్రవర్థమానం అవుతున్న కంపెనీ రానురాను రాజకీయాలలో సైతం జోక్యం చేసుకోవటం ప్రారంభించింది. వర్తకులతో బాటు, ఉద్యోగులు, ప్రయాణీకులు భారతదేశం రావటం పెరిగిపోయింది. ఇక్కడి మనోహరమైన దృశ్యాలను పాశ్చాత్య దేశస్థుల అభిరుచులకు అనుగుణంగా చిత్రీకరించటం ప్రారంభం అయ్యింది. ఇదే కంపెనీ శైలి చిత్రకళకు దారి తీసింది.[4] ముఘల్ పాలన ముగియటంతో కళను ఆదరించేవారు కరువయ్యారు. అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన కళాకారులు జీవనోపాధి కోల్పోయారు. కొన్ని సందర్భాలలో వారి కళాఖండాలను సాధారణ వస్తువుల వల్లె అమ్మవలసిన దుర్దశ కలిగింది. ఈ సమయంలో ఈస్టిండియా కంపెనీ తరఫున ఆంగ్లేయులు భారతదేశానికి రావటం పెరిగిపోవటంతో కంపెనీ చిత్రకళ జోరు అందుకొంది.
పూర్వపు స్థానిక సంప్రదాయాల ప్రభావాలను పుణికిపుచ్చుకొంటూ పలు నగరాలు కేంద్రాలుగా ఈ శైలి చిత్రకళ విలసిల్లింది.[1] ఒక్కొక్క చోటు ఉన్న కళకు ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది. బ్రిటీషు వ్యాపారానికి తొలి కేంద్రం అయిన కోల్‌కాతాలో ఈ శైలి చిత్రలేఖనం విలసిల్లటం కూడా ప్రారంభం అయ్యింది. పలు పశుపక్ష్యాదులను బంధించి స్థానిక చిత్రకారులచే వాటిని చిత్రీకరించబడటం మొదలు అయ్యింది. మొక్కలు, వృక్షాల చిత్రీకరణ కొరకు కంపెనీ ఉద్యానవనాలను సైతం స్థాపించింది. పుణ్యక్షేత్రమైన వారణాశి, ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, దక్షిణాన మద్రాసులు కూడా కంపెనీ శైలి చిత్రకళకు కేంద్రాలు అయ్యాయి.[2] 1803 లో ఢిల్లీని ఆక్రమించుకోవటంతో కంపెనీ శైలి అక్కడికి సైతం పాకింది. అక్కడి మొఘల్ శైలి స్మారక భవనాల చిత్రలేఖనాలు ఆంగ్లేయులకు ప్రీతిపాత్రమైన అంశాలు అయ్యాయి. పైగా అక్కడి కళాకారులు ఏనుగు దంతాలపై చిత్రలేఖనం చేయటం ప్రధాన ఆకర్షణ.
కంపెనీ కళలో మూడు ప్రధాన శైలులు గుర్తించబడ్డాయి.[3] అవి:
ముర్షిదాబాద్ జిల్లా, పాట్నా వంటి ప్రదేశాలలో అభివృద్ధి చెందిన ఈ శైలి చిత్రకళలో ఎక్కువగా పశుపక్ష్యాదులను, మొక్కలను, వృక్షాలను చిత్రీకరించబడటం జరిగింది.
పంజాబ్, అవధ్ వంటి ప్రదేశాలలో అభివృద్ధి చెందిన ఈ శైలి చిత్రకళలో మొఘల్ ల చే నిర్మించబడిన భవనాలు ప్రధాన అంశాలుగా చిత్రీకరించబడేవి. ఏనుగు దంతాలపై కంపెనీ శైలి చిత్రీకరణ కూడా ఢిల్లీలో నే ప్రారంభం అయ్యింది. ఇవే కాక ఇంకనూ గృహాలు, పనివారు, బండ్లు, గుర్రాలు వంటి వాటిని చిత్రీకరించటం జరిగింది.
కోస్తా, కేరళ, తంజావూరు వంటి ప్రదేశాలలో ఈ శైలి చిత్రకళ విలసిల్లింది. దేవతలు, పండుగలు, వివిధ కులాల/కులవృత్తుల ప్రజలు, సర్వసంగపరిత్యాగులు వంటి వాటిని చిత్రీకరించేవారు. తిరుచిరాపల్లిలో అయితే అభ్రకం పై కూడా చిత్రీకరణ జరిగింది. ఇవి చాలా ఖరీదు పలుకుతాయి.
బ్రిటీషు వారి చే ప్రభావితం అయిన చిత్రకళ జలవర్ణ చిత్రలేఖనంలో పలు ప్రయోగాలకు అవకాశం ఇచ్చింది. సమకాలీన చిత్రకళలో దృక్కోణం, వాష్ (wash) వంటి పలు సాంకేతికతలను అందిపుచ్చుకొంది.
సాధారణంగా చిత్రపటాలు కాగితం, మైకాల పైన, అరుదుగా (ప్రత్యేకించి ఢిల్లీలో) ఏనుగుదంతాలపై కూడా చిత్రపటాలు వేసేవారు.[1][2]
గృహాలు, పనివారు, అప్పటి గుర్రపు బళ్ళు, కంపెనీ ఉద్యోగులకు చెందిన వివిధ వస్తువులు ఈ శైలి చిత్రకళలో ప్రధానాంశాలుగా ఉండేవి.[1] భారతీయత ప్రతిబింబించే, ఈ శైలిలో చిత్రీకరించబడే ఏ చిత్రమైనను, వీధిన పోయే ఏ ఆంగ్లేయుడినైనా ఆకర్షిస్తుందని తెలుసుకొన్న స్థానిక కళాకారులు పండుగలను, వివిధ కులాల ప్రజలను, వారి వృత్తులను, వేషధారణను చిత్రీకరించేవారు. సభలలో ఆంగ్లేయులకు స్థానికులతో సమప్రాధాన్యత చూపుతూ కంపెనీ శైలి చిత్రలేఖనాలు ఉండేవి. వారు కూడా స్థానిక దుస్తులు ధరించి ఉండటం, భారతీయులు ఆసీనులు అయినట్టే వారు కూడా ఆసీనులు అయ్యి ఉండటం గమనించవచ్చు.
రాజస్థాన్, హైదరాబాదు, పంజాబ్ వంటి ప్రదేశాలు మాత్రం కంపెనీ శైలి చిత్రకళకు ప్రభావితం కాలేదు.[1] బ్రిటీషు వారిని ఆకర్షించేందుకు ఈ ప్రదేశాలలో ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు.
ఈ చిత్రలేఖనాలు జలవర్ణాలు (water colors) లో, సరళ దృక్కోణం (linear perspective), వెలుగు-నీడలను చూపించటానికి షేడింగులతో చిత్రీకరించబడేవి.[1][4] అదివరకూ భారతీయ చిత్రకళలో నీడకు స్థానం ఉండేది కాదు. కంపెనీ శైలి మాత్రం నీడకు స్థానాన్ని కల్పించింది. చిత్రీకరించే అంశాన్ని బట్టి రంగుల ఎంపిక కూడా ఈ శైలి చిత్రీకరణలో గమనించవచ్చు.[3] (ఉదా: పర్షియన్ దంపతులను ప్రకాశవంతమైన రంగులతో చిత్రీకరించబడగా, కేరళకు చెందిన బ్రాహ్మణ దంపతులను సున్నితమైన రంగులతో చిత్రీకరించారు.) పశు పక్ష్యాదుల, మొక్కల, వృక్షాల చిత్రీకరణలో ముఘల్ చిత్రకారుడు అయిన మన్సూర్ ప్రభావాలు కంపెనీ శైలిలో ప్రస్ఫుటంగా కనబడేవి. కంపెనీ శైలి చిత్రలేఖనం కేవలం అప్పటి భారతీయులకే పరిమితం కాక, ఆంగ్లేయులకు కూడా విస్తరించింది. కొందరు ఆంగ్ల చిత్రకారులు సైతం భారతీయ దృశ్యాలను చిత్రీకరించేవారు. మారుతోన్న భారతదేశపు రాజకీయ, ఆర్థిక, సాంఘిక స్థితిగతులకు కంపెనీ శైలి చిత్రలేఖనాలు నిలువుటద్దం లా నిలిచిపోయాయి.
భారతీయ చిత్రకారులకు బ్రిటీషు వారు చిత్రలేఖనంలో శిక్షణనిస్తూ మెళకువలు నేర్పేవారు. రాజా రవివర్మకు సైతం ఈ శిక్షణను ఇవ్వటం, మెళకువలు నేర్పటం జరిగింది.[4]
ఛాయాచిత్రకళ కంపెనీ శైలి చిత్రకళకు తెర దించింది.[1][3]
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)