కల్నల్ నరేంద్ర కుమార్ | |
---|---|
జననం | రావల్పిండి, British India | 1933 డిసెంబరు 8
రాజభక్తి | India |
సేవలు/శాఖ | Indian Army |
సేవా కాలం | 1950–1984 |
ర్యాంకు | కల్నల్ |
పురస్కారాలు | మెక్‌గ్రెగర్ పతకం |
కల్నల్ నరేంద్ర కుమార్ భారతీయ సైన్యంలో అధికారి, పర్వతారోహకుడు.[1][2] 45 ఏళ్ళ వయసులో భారత సైన్యం తరపున 1978 లో సియాచెన్ హిమానీనదం, సాల్టోరో రిడ్జికి చేసిన యాత్ర కారణంగా ఆయన ప్రఖ్యాతి గాంచాడు.[3][4][5] ఈ యాత్ర తరువాతే సియాచెన్ గ్లేసియరుపై ఆధిక్యం సాధించాలని భారత్ నిశ్చయించింది. తత్ఫలితంగానే ఆపరేషన్ మేఘదూత్ జరిగింది, నేడు సియాచెన్ భారత్ నియంత్రణలో ఉంది. ఆయన ఆ యాత్ర చెయ్యకుండా ఉండి ఉంటే, బహుశా ఆ 10,000 చ.కి.మీ.సియాచెన్ గ్లేసియరు ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉండి ఉండేది.[6] నరేంద్ర కుమార్ పీర్ పంజల్ శ్రేణి, హిమాలయాలు, జన్స్కార్, లడఖ్, సాల్టోరో, కారకోరం, అగిల్ పర్వత శ్రేణులను కూడా అధిరోహించాడు.
నరేంద్ర 1933 డిసెంబరు 8 న రావల్పిండిలో జన్మించాడు. అతడి ముగ్గురు సోదరులూ కూడా భారత సైన్యంలో పనిచేసారు. 1947 లో పారిస్‌లో జరిగిన స్కౌట్స్ జాంబోరీలో నరేంద్ర పంజాబుకు ప్రాతినిధ్యం వహించాడు. ఓడలో మరో యాభైమందితో పాటు తిరిగి వస్తూండగా భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ప్రకటించారు. బొంబాయిలో ఓడ దిగి సిమ్లా వెళ్ళాడు. దేశ విభజన తరువాత అతడి కుటుంబం సిమ్లాలో స్థిరపడింది.
ఆయన చిన్న తమ్ముడు కె.ఐ.కుమార్ ఎవరెస్టును అధిరోహించి దిగి వస్తూండగా, 8500 మీ ఎత్తునుండి జారిపడి మరణించాడు..[7]
నరేంద్ర కుమార్ 1950 లో భారత సైన్యంలో చేరాడు. శిక్షణలో ఉన్నపుడు ఆయన బాక్సింగు, రైడింగు, సైకిల్-పోలో క్రీడల్లో పాల్గొన్నాడు. 1954 లో కుమావోన్ రైఫిల్స్ లో కమిషను అయ్యాడు. అప్పుడే శీతాకాల క్రీడల్లోను, పర్వతారోహణలోనూ ఆసక్తి పెంచుకున్నాడు. డెహ్రాడూన్‌లోని భారత సైనిక అకాడమీలో ఉండగా అతడు పాల్గొన్న తొలి బాక్సింగు పోటీలో అతడి ప్రత్యర్థి సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్. అతడే తరువాతి కాలంలో భారత ప్రధాన సైన్యాధికారి అయ్యాడు. ఆ పోటీలో కుమార్ ఓడిపోయినప్పటికీ, తాను పోరాడిన విధానానికి గాను, బుల్ అనే ముద్దుపేరు పొందాడు.
డార్జిలింగులోని హిమాలయన్ మౌంటెనీరింగు ఇన్స్టిట్యూట్‌లో ఆ సంస్థ డైరెక్టరు టెంసింగ్ నార్కే, ను కలవడంతో పర్వతాలతో అనుబంధం ఏర్పడింది. 1958 మార్చిలో నరేంద్ర సైన్య, నౌకాదళ బృందంతో కలిసి త్రిశూల్ శిఖరాన్ని విజయవంతంగా ఆరోహించాడు. 1959 లో కబ్రు శిఖరాన్ని, 1960 లో పసుపు సూదికొండనూ కూడా అధిరోహించాడు. 1960 ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే క్రమంలో 8,747 మీటర్లకు చేరి వాతావరణ పరిస్థితుల కారణంగా వెనుదిరిగాడు. ఆ ఎత్తుకు చేరిన తొలి భారతీయుడయ్యాడు. 1961 లో ఐదుగురు బృందానికి నాయకుడిగా గఢ్వాల్ హిమాలయాల్లోని నీలకంఠ పర్వతాన్ని అధిరోహించాడు. దిగేటపుడు ఫ్రాస్ట్‌బైట్ కారణంగా అందరూ గాయపడగా, కుమార్ నాలుగు కాలివేళ్ళు కోల్పోయాడు.
1964 లో నందాదేవిని అధిరోహించినపుడు ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడయ్యాడు. 1965 లో ఎవరెస్టును తొలి సారిగా అధిరోహించిన భారత సైనిక బృందానికి అతడు ఉప నాయకుడు. ఆ బృందానికి నాయకుడైన కెప్టెన్ మోహన్ సింగ్ కొహ్లి కుమార్ పర్వతారోహక కెరీరు అద్భుతం అని అన్నాడు. 1968 లో కుమార్ ఆల్ప్స్ పర్వతాల్లోని ఎత్తైన పర్వతం, మోంట్ బ్లాంక్‌ను ఎక్కాడు. 1970 లో భూటాన్‌లోని ఎత్తైన పర్వతం జోమోల్‌హరిని ఎక్కాడు. 1976 కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించాడు.
మూడేళ్ళ తరువాత, 1984 ఏప్రిల్ 13 న భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్‌ను మొదలుపెట్టింది. కల్నల్ కుమార్ తయారుచేసిన వివరమైన మ్యాపులు, ప్లాన్లు, ఫోటోలు, వీడియోలు ఆపరేషనులో ఉపయోగపడ్డాయి. వీటి సాయంతో భారత సైన్యం గ్లేసియరుతో పాటు దాఅనికి పశ్చిమాన ఉన్న ప్రధానమైన రిడ్జిలు, కనుమలను - సియా లా, బిలాఫోండ్ లా, గ్యోంగ్ లా, యర్మా లా, చులుంగ్ లా - కూడా స్వాధీనపరచుకుంది..[8] బిలాఫోండ్ లా (సీతాకోకచిలుకల కనుమ) ప్రాచీన సిల్క్ రూటులో భాగంగా ఉండేది
ఆయన మృదులను వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె -శైలజా కుమార్ (జననం:1964) భారతదేశపు తొలి మహిళా వింటర్ ఒలింపియన్. 1988 లో కాల్గరీ వింటర్ ఒలింపిక్స్‌లో ఆల్పైన్ స్కీయింగులో ఆమె పాల్గొంది.[9][10] వారి కుమారుడు అక్షయ్ కుమార్ (జననం 1969) సాహస యాత్రల నిర్వాహకుడు. ఆయన సంస్థ మెర్క్యురీ హిమాలయన్ ఎక్స్‌ప్లొరేషన్స్ గంగ, బ్రహ్మపుత్ర నదులలో పూర్తి పొడవునా ప్రయాణించిన తొలి సంస్థలలో ఒకటి.[11][12][13] ఆయన ఢిల్లీలో నివసిస్తున్నాడు.
2010 జూన్ 25 న, నరేంద్ర కుమార్‌ను మెక్‌గ్రెగర్ మెడల్‌తో సత్కరించారు. సైనిక నిఘాకు, మారుమూల ప్రాంతాల సర్వే కోసం నెలకొల్పిన ఈ పురస్కారాన్ని యునైటెడ్ సర్వీస్ ఇంస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు.
ఆయన పద్మశ్రీ పురస్కారం పొందాడు.[14] అర్జున పురస్కారం, భారత పర్వతారోహక సంస్థ వారి బంగారు పతకం కూడా పొందాడు. సాధారణంగా జనరల్‌లకు మాత్రమే ఇచ్చే పరమవీరచక్ర పురస్కారాన్ని పొందిన ఏకైక కల్నల్ ఆయన.
స్కీ శిక్షణకు గాను ఆయనకు ఐక్యరాజ్య సమితి పురస్కారం లభించింది. స్విట్జర్లండు, ఆస్ట్రియాలో 4 నెలల శిక్షణ పొందాడు. భారత్‌లో రివర్ రాఫ్టింగుకు ప్రచారం కల్పించడంలో భాగంగా సింధు, తీస్తా నదుల్లో రాఫ్టింగు చేసాడు.
ఆయన కీర్తి చక్ర, అతివిశిష్ట సేవా పతకాలను కూడా పొందాడు. సియాచెన్ గ్లేసియరులో 4,880 మీ ఎత్తున ఉన్న బెటాలియన్ స్థావరానికి "కుమార్ బేస్" అని పేరు పెట్టారు.[15]