కశ్యప మాతంగ లేదా Jia Yemoteng (చైనా: 迦葉摩騰) లేదా Jia Shemoteng (చైనా: 迦攝摩騰) లేదా Zhu Yemoteng (చైనా: 竺葉摩騰) లేదా Zhu Shemoteng (చైనా: 竺攝摩騰) క్రీ. శ. 1 వ శతాబ్దానికి చెందిన భారతీయ బౌద్ధ సన్యాసి. బౌద్ధమత ప్రచారకుడు. తూర్పు చైనా చక్రవర్తి మింగ్ ఆహ్వానం మేరకు తన సహచర బౌద్ధ సన్యాసి ధర్మరత్నతో కలసి చైనా దేశానికి క్రీ. శ. 68 లో చేరుకొన్నాడు. కశ్యప మాతంగ, ధర్మరత్న లిరువురూ భారతదేశం నుండి చైనాకు వచ్చిన తొలి బౌద్ధ సన్యాసులుగా ప్రసిద్ధికెక్కారు. వీరిరువురిని చైనాలో బౌద్ధ ధర్మాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తులుగా ప్రాచీన చైనీయ సంప్రదాయం పేర్కొన్నది.
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కశ్యప మాతంగ[1] బాల్యం నుండి బౌద్ధమతం పట్ల ఆకర్షితుడై, హీనయాన, మహాయాన శాఖలను లోతుగా అభ్యసించాడు[2]. చదువుల కోసం తక్షశిలకు వెళ్ళాడు, అక్కడ నుండి అతను తన సహచరుడైన ధర్మరత్న అనే బౌద్ధ సన్యాసితో కలిసి మద్య అసియాలో మత ప్రచారాని వెళ్ళారు, కశ్యప మాతంగ గురించిన వివరాలు చైనీయ ఆధారాల నుండి మాత్రమే లభ్యమవుతున్నాయి. చైనీయు గ్రంథాలలో కశ్యప మాతంగుడు షిమొటెంగ్ (SheMoteng) గా పిలవబడ్డాడు. ఇతను మధ్య భారత దేశానికి చెందిన బౌద్ధ సన్యాసి. బౌద్ధ ధర్మ గ్రంథాలలో నిష్ణాతుడు. ఇతని సహచర బౌద్ధ సన్యాసి ధర్మరత్న. హాన్ వంశానికి చెందిన తూర్పు చైనా చక్రవర్తి మింగ్ (Ming) (క్రీ. శ. 28-75) బౌద్ధాచార్యుల కొరకు, బౌద్ధ ధార్మిక సాహిత్యం సముపార్జన కొరకు పశ్చిమ దిశగా (భారతదేశానికి) ఒక దౌత్య బృందాన్ని పంపడం జరిగింది. తగినన్ని బౌద్ధ ధర్మ గ్రంథాలను సంపాదించి, తిరుగు ప్రయాణంలో వున్న ఈ దౌత్య బృందానికి గాంధార (నేటి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్) ప్రాంతంలో కశ్యప మాతంగ, ధర్మరత్నలు కనిపించటం తటస్థించింది. చైనా చక్రవర్తి ఆహ్వానం మన్నించి ఇరువురు బౌద్ధ సన్యాసులు ఆ దౌత్య బృందంతో కలసి ప్రయాణించి క్రీ. శ. 68 లో చైనా రాజధాని లోయాంగ్' (Luoyang) చేరుకొన్నారు. చక్రవర్తి వీరి కోసం నూతనంగా నిర్మించిన వైట్ హార్స్ ఆలయం (white horse temple) లో వీరు స్థిర నివాసం ఏర్పరుచుకొని బౌద్ధ గ్రంథాలను చైనీయ భాషలోనికి అనువదించారు. వీటిలో “నలభై రెండు విభాగాల సూత్రం” (Sutra of Forty Two Chapters) ముఖ్యమైనది. ధర్మరత్న వలె కశ్యప మాతంగ కూడా తన జీవిత చరమాంకం వరకూ చైనా లోనే గడుపుతూ బౌద్ధ ధర్మ ప్రచారం చేసాడు.
ప్రాచీన చైనీయ బౌద్ధ సంప్రదాయానుసారం తూర్పు చైనా పాలకుడైన “మింగ్” (Ming) చక్రవర్తికి క్రీ. శ. 68 లో ఒక స్వప్నం వచ్చినట్లు తెలుస్తుంది. ఆ స్వప్నంలో తల చుట్ట్టూ కాంతివలయంతోను, బంగారు వర్ణంతోను వున్న ఒక తేజోమూర్తి ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపించింది.[3] ఆ కలను విశ్లేషించిన అతని సలహాదారులు ఆ తేజోవలయ మూర్తిని బుద్ధుని ఆత్మగా పేర్కొని, ఆ స్వప్నం పశ్చిమం నుండి బౌద్ధ ఆగమనాన్ని సూచిస్తున్నదని చక్రవర్తికి తెలియచేసారు. అయితే ఆ స్వప్న వృత్తాంతాన్ని పండితులు చారిత్రక పరంగా విభేదించారు. మింగ్ చక్రవర్తి స్వప్న వృత్తాంతం (క్రీ. శ. 68) నాటికి ముందుగానే బౌద్ధ మతం చైనాలో ప్రవేశపెట్టబడిన సాక్ష్యం వున్న కారణంగా వారు స్వప్న వృత్తాంతం యొక్క చారిత్రిక ప్రామాణికతను ప్రశ్నించారు.
మింగ్ చక్రవర్తి ఆదేశాలమేరకు భారతదేశం నుండి బౌద్ధాచార్యులను తీసుకొని రావడానికి జాంగ్ కియాన్ (Zhang Quian) [3] ఆధ్వర్యంలో ఒక దౌత్యబృందం పశ్చిమ దిక్కుగా బయలుదేరింది. బౌద్ధ ధార్మిక గ్రంథాలను సంపాదించి తిరుగు ప్రయాణంలో వున్న ఆ దౌత్య బృందానికి గాంధార ప్రాంతంలో కశ్యప మాతంగ, ధర్మరత్న అనే ఇద్దరు బౌద్ధ సన్యాసులు సాయపడటం జరిగింది. ఆ సమయంలో వాయవ్య భారతదేశాన్ని చారిత్రకంగా కుషాణులు పరిపాలిస్తున్నట్లు తెలుస్తున్నది. చైనా చక్రవర్తి ఆహ్వానాన్ని మన్నించిన ఈ ఇరువురు ధర్మ ప్రచారకులు భారతదేశం విడిచి ఆ దౌత్య బృందంతో కలసి వేలాది మైళ్ళు ప్రయాణించారు. క్రీ. శ. 68 లో తిరిగి చైనాకు చేరుకొన్న ఆ దౌత్య బృందం తమతోపాటు భారతదేశం నుండి తీసుకొని వచ్చిన కశ్యప మాతంగ, ధర్మరత్నలను చక్రవర్తి ఆస్థానానికి తీసుకొని వెళ్ళారు.
ఈ విధంగా భారతదేశం నుండి చైనాకు తరలి వెళ్ళిన మొట్టమొదటి బౌద్ధ సన్యాసులు కశ్యప మాతంగ, ధర్మరత్నలే. మహత్తరమైన బౌద్ధం చైనాకు చేరుకొన్న విషయానికి గౌరవసూచకంగా మింగ్ చక్రవర్తి తన రాజధాని 'లోయాంగ్'లో ఒక బౌద్ధ ఆలయాన్ని నిర్మించాడు. బౌద్ధ సన్యాసులను, బౌద్ధ ధర్మ గ్రంథాలను తమ దేశానికి మోసుకొని వచ్చిన అశ్వాల (Horses) పట్ల కృతజ్ఞతగా ఆ బౌద్ధ ఆలయానికి "వైట్ హార్స్ ఆలయం" (white horse temple) అని పేరు పెట్టాడు. కశ్యప మాతంగ, ధర్మరత్న సన్యాసులకు చక్రవర్తి ఈ ఆలయంలోనే నివాసం ఏర్పాటు చేసాడు. భారతీయ బౌద్ధ సన్యాసుల కోసం, చక్రవర్తిచే నిర్మించబడిన ఈ ఆలయమే చైనాలోని మొట్టమొదటి బౌద్ధ ఆలయంగా గుర్తించబడింది. క్రీ. శ. 68 లో నిర్మించబడిన ఈ ఆలయం 2000 సంవత్సరాలు గడుస్తూ వున్నప్పటికీ ఇంకా నిలిచేవుంది. చరిత్రలో ఎన్నోమార్లు నాశనమై పునర్నిర్మించబడుతూ వచ్చిన ఈ ఆలయం నేడు ప్రధానంగా 16 వ శతాబ్దపు వాస్తు నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. కశ్యప మాతంగ, ధర్మరత్న సన్యాసులు తమ జీవిత చివరికాలం వరకూ ఈ ఆలయ మఠంలోనే నివసిస్తూ ధర్మ ప్రచారం చేసారు. ఈ ఆలయంలోనే వీరు బౌద్ధ గ్రంథాలను చైనీయ భాషలోనికి అనువదించారు. చైనాలో తొలిసారిగా బౌద్ధాన్ని ప్రవేశపెట్టిన కశ్యప మాతంగుడు, ధర్మరత్నలు- ఈ ఆలయంలోనే నివసించిన కారణంగా దీనిని స్థాపకుల నివాసం (Founder's Home) అని, చైనీయ బౌద్ధానికి మూల స్థానమని (Cradle of Chinese Buddhism) కూడా పిలుస్తారు.బౌద్ధం భారతదేశం నుండి చైనాకు చేరిన పిదప, అధికారయుతంగా నిర్మించిన మొదటి ఆలయం కూడా ఇదే కనుక ప్రజలు దీనిని గ్రాండ్ ఫాదర్ అఫ్ టెంపుల్స్ (Grand father of temples) అని పిలుస్తారు.
కశ్యప మాతంగ, ధర్మరత్నలిరువురి కృషిగా ఆపాదించబడిన అనువాదాలు మొత్తం ఆరు ఉన్నాయి. వీటిలో చివరి ఐదు కాలగర్భంలో అంతరించిపోగా మొదటిదైన "నలభై రెండు విభాగాల సూత్రం" ఒక్కటే ప్రస్తుతం లభ్యమవుతుంది.
అయితే "నలభై రెండు విభాగాల సూత్రం" గ్రంథానికి ఆపాదించబడిన అనువాద కాల నిర్ణయంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ గ్రంథ అనువాదకాలాన్ని సా.శ. 1 వ శతాబ్దంతో ముడిపెట్టడంపై సమంజసం కాదని, దానికి విశ్వసనీయ యోగ్యత లేదని భావిస్తున్నారు. ఈ సూత్రంలో వున్న శైలిని బట్టి లియాంగ్ కిచావో (Liang Qichao) వంటి చైనా పండితులు, ఈ సూత్రాలు క్రీ. శ. 4 వ శతాబ్దానికి చెంది వుంటాయని పేర్కొన్నారు. సాకినో కోయో (Sakino Koyo) వంటి జపాన్ దేశపు పండితులు, ఇది క్రీ. శ. 6 వ శతాబ్దానికి చెంది వుంటాయనే అభిప్రాయం వెలుబుచ్చారు.
మరికొంతమంది పండితులు అసలు దీనిని అనుమానాస్పద రచనగానే భావించారు. వారి ప్రకారం మూలంలో సంస్కృతంతో సహా ఏ భారతీయ భాషలకు సంబంధం లేని ఈ గ్రంథం చైనాలోనే రాయబడింది. ఈవిధంగా అనువాద విషయంపైనా, అనువాద కాలంపైనా ఎన్నో అభిప్రాయ భేదాలున్నప్పటికీ పురాతన చైనీయ సంప్రదాయాలు ఈ "నలభై రెండు విభాగాల సూత్రం" గ్రంథాన్ని చైనాకు తీసుకొని రాబడిన మొట్ట మొదటి బౌద్ధ గ్రంథంగా పేర్కొంటాయి.
చైనాలో బౌద్ధ ధర్మ ప్రచారానికి పాటుపడిన కశ్యప మాతంగ చివరకు 'లోయాంగ్'లో మరణించాడు. తన జీవిత కాలమంతా వైట్ హార్స్ ఆలయ మఠంలోనే గడిపిన కశ్యప మాతంగుని మరణాంతరం, అదే ఆలయ ద్వారానికి లోపలివైపున తూర్పు దిశలో ఖననం చేయడం జరిగింది. అతని సమాధికి (tomb) ఎదురుగా తరువాతి కాలంలో ఒక బెల్ టవర్ (bell tower) ను ఏర్పాటు చేసారు.