కాంగ్రా తేనీరు అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాకు చెందిన తేనీరు. 19వ శతాబ్ద మంధ్యకాలం నుంచి కాంగ్రా లోయలో బ్లాక్ టీ, గ్రీన్ టీ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. 2005 లో కాంగ్రా తేనీరు భౌగోళిక గుర్తింపు హోదాను పొందింది.
19వ శతాబ్ది మధ్యకాలంలో మొట్టమొదటి సారిగా కాంగ్రా ప్రాంతంలో తేయాకు పెంచడం ప్రారంభమైంది. 1848లో సాధ్యాసాధ్యాలు సర్వే చేశాకా, ఆ సర్వే ఫలితంగా తేయాకు తోటలకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని తేల్చారు. ఈ ప్రాంతమంతటా కమెల్లియా సైనెన్సిస్ అనే చైనీస్ రకం తేయాకు పెంచడం ప్రారంభమైంది. ఈ ప్రయత్నం ఇతర ప్రదేశాల్లో విఫలమైనా పాలంపూర్, ధర్మశాలల్లో మాత్రం విజయవంతం అయింది.[1] 1880ల నాటికి, కాంగ్రా తేయాకు ఇతర ప్రాంతాల కన్నా ఉన్నతమైనదని, విలువైనదని అభిప్రాయం ఏర్పడింది. మధ్య ఆసియా, కాబూల్ వంటి ప్రాంతాల్లోనూ ఈ తేయాకును కొనేవారు. ఐతే, 1905 నాటి కాంగ్రా భూకంపం వేలాదిమంది మరణానికి, ఫాక్టరీల విధ్వంసానికి కారణమైంది, ఈ కారణంగా తప్పనిసరై బ్రిటీష్ వారు తోటలను అమ్ముకుని ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు ఆపైన కొన్ని దశాబ్దాల వరకూ కొత్త యజమానులు కొద్ది మొత్తంలోనే తేయాకు తయారుచేయగలిగారు.
21వ శతాబ్దంలో మరింత తగ్గుముఖం పట్టడంతో, ఈ బ్రాండ్ ఉత్పత్తి పెరుగుదల చెందాలనే లక్ష్యంతో పరిశోధనలు, వ్యవసాయ విధానాలూ రూపొందుతున్నాయి.[3][4][5]
కాంగ్రాలో అటు బ్లాక్ టీ, ఇటు గ్రీన్ టీ రెంటినీ పండిస్తున్నా, మొత్తంలో 90శాతం బ్లాక్ టీనే ఉత్పత్తి అవుతోంది. మే 2015 నాటికి, షాపూర్, పాలంపూర్, బైజ్ నాథ్ లలో 5,900 తేయాకు తోటలు 2,312 హెక్టార్లలో 8.99 లక్షల కేజీల వార్షిక ఉత్పత్తితో నెలకొన్నాయి.[6]
కాంగ్రా తేయాకు విశిష్టమైన రంగు, సువాసనకు పేరొందింది.[6] తేయాకు యొక్క విశిష్టమైన లక్షణాలకు ఈ ప్రాంతపు భౌగోళిక స్థితిగతులే కారణమని చెప్తారు.[2] 2005లో చెన్నైలోని పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ కంట్రోలర్-జనరల్ కార్యాలయం, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) చట్టం, 1999 ప్రకారం కాంగ్రా తేయాకుకు భౌగోళిక గుర్తింపు టాగ్ ను మంజూరు చేసింది.[7]