కాకినాడ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 16°58′N 82°16′E / 16.97°N 82.26°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా కేంద్రం | కాకినాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,019.79 కి.మీ2 (1,165.95 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 20,92,374 |
• జనసాంద్రత | 690/కి.మీ2 (1,800/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా.[2] ఇది పూర్వపు తూర్పు గోదావరి జిల్లా నుండి కొన్ని మండలాలను విడగొట్టుట ద్వారా ఆవిర్బంచింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా వున్న కాకినాడ, కొత్త జిల్లా కేంద్రమైంది. పంచారామాల్లో ఒకటైన కుమారభీమారామం, పిఠాపురంలో పాదగయ క్షేత్రంగా పేరొందిన కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, తునిలో తలుపులమ్మ లోవ జిల్లాలోగల కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
జిల్లా ప్రాంతాన్ని పరిపాలించినవారిలో మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, చోళులు, కాకతీయలు, ముసునూరి ముఖ్యులు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతిలు, కుతుబ్‌షాహీలు ఆ తర్వాత పాలించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా 2022 ఏప్రిల్ 4న అవతరించింది.[1]
జిల్లాకు ఉత్తరాన అనకాపల్లి జిల్లా,అల్లూరి సీతారామరాజు జిల్లా, దక్షిణాన కోనసీమ జిల్లా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 3020 చ.కి. కి.మీ. భారతీయ ప్రామాణిక కాలమానానికి అధారమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి.
జిల్లా కేంద్రం కాకినాడ నుండి రాష్ట్ర రాజధాని అమరావతి 255 కి.మీ. దూరంలో ఉంది.
వాతావరణం సమతుల్యంగా వుంటుంది. సాధారణంగా మేలో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 38.90 °C, జనవరి నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 19.90 °C వుంటుంది.[3]
2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 20.92 లక్షలు. జన సాంద్రత 693/చ.కి.మీ.[1]
కాకినాడ రెవెన్యూ డివిజన్‌లో 11, పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలు ఉన్నాయి.మొత్తం రెవెన్యూ డివిజన్లలో 21 మండలాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఈ జిల్లాలో 385 గ్రామ పంచాయితీలున్నాయి.[3]
జిల్లాలో 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలున్నాయి.[3]
కాకినాడ జిల్లాలో ఒక లోక్‌సభ నియోజకవర్గం పూర్తిగా, రెండు లోక్‌సభ నియోజక వర్గాలు పాక్షికంగా ఉన్నాయి. వీటి పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరు పూర్తిగా, మూడు పాక్షికంగా ఉన్నాయి.
కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట - కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషనులలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషను పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడింది.
214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. రాజమహేంద్రవరం, జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన వాకలపూడి, వలసపాకల, సామర్లకోట, పెద్దాపురం లను 5వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో నిర్మించిన ఎడిబి రోడ్డు ఉంది. కాకినాడ నుండి ద్వారపూడి, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, ఖమ్మం మీదుగా సూర్యాపేటకి పోయే రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయి.[4] ఇవే కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ నుండి విశాఖపట్నం వరకూ, సముద్ర తీరం వెంబడి నాలుగు-ఆరు వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదన ఉంది.[5]
కాకినాడ జిల్లాల్లో 1128 ప్రాథమిక పాఠశాలలు, 378 ప్రాథమికోన్నత పాఠశాలలు, 495 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 87 జూనియర్ కళాశాలలు 1091 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు.కాకినాడ జిల్లాల్లోని కళాశాలలు అన్ని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి, కాకినాడ జిల్లాలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి.[3]
కాకినాడ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వరి, అరటి, కొబ్బరి వంటి వ్యవసాయంపై ఆధారపడి ఉంది, రొయ్యలు, పీతలు, చేపలకు సంబంధించిన ఆక్వాకల్చర్, పౌల్ట్రీ ఫామ్‌లు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి అధికంగా ఉంటాయి.[3]
కాకినాడ జిల్లాలో 34 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.వాటిలో బియ్యం, చక్కెర, ఎరువులు, కాగితం, వస్త్రాలు పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో 1 టెక్స్‌టైల్ తయారీ పరిశ్రమ, ఒక చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. జిల్లాలో రెండు పెద్ద ఎరువులు, రసాయనాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమల చట్టం ప్రకారం 1948న నమోదైన మొత్తం 972 ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి.వాటిలో 33694 మంది పురుషులు ఉండగా 19664 మంది మహిళా కార్మికులు మొత్తం 53358 మంది కార్మికులు పనిచేస్తున్నారు.[3]
కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం,సామర్లకోటలో రిలయన్స్ ఎనర్జీ సంస్థకి చెందిన 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం, పెద్దాపురంలో జి.వి.కే సంస్థకి చెందిన 469 మెగావాట్ల (కంబైన్డ్ సైకిల్) గౌతమి విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి.[6][7] అయితే, గెయిల్ సంస్ఠ సరఫరా సరిగా లేకపోవడం వలన, రిలయన్స్ అధీనంలో ఉన్న కె.జి-డి6 బేసిన్లో ఉత్పత్తి మందగించడం వలన, ఈ విద్యుత్ కేంద్రాలకి గ్యాసు అందడం లేదు.[8] అందువలన, ప్రస్తుతం ఈ కేంద్రాలలో విద్యుదుత్పత్తి బహుకొద్దిగా జరుగుతున్నది. కాకినాడ సముద్రతీరం వద్ద నిర్మిస్తున్న ఎల్.ఎన్.జి టర్మినల్, వినియోగంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సరఫరా ఇబ్బందులని అధిగమించవచ్చునని ఈ సంస్థలు ఆశిస్తున్నాయి.[9]
కోటయ్య కాజాలు, నూర్జహాన్ కిళ్ళీ అనబడే తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ పేరుపొందినవి. కాకినాడలోని సుబ్బయ్య హోటలులో సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే భోజనం కూడా ప్రసిద్ధి పొందినది.