తూర్పు చాళుక్యులు |
---|
కుబ్జ విష్ణువర్ధనుడు బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి తమ్ముడు. సా.శ. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించాడు. ముందు తన అన్న పులకేశికి గవర్నరుగా వేంగిని పాలించిన కుబ్జవిష్ణువర్ధనుడు తర్వాత క్రమంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని తూర్పు చాళుక్య వంశానికి పునాది వేశాడు.తూర్పు చాళుక్యులు వేంగి రాజ్యాన్ని దాదాపు అయిదు శతాబ్దాలు పాలించారు. వీరు చోళులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు.[1]
రెండవ పులకేశి (సా.శ. 608–644) తీరాంధ్ర దేశాన్ని సా.శ. 616 లో విష్ణుకుండిన చివరి పాలకులను ఓడించి ఆక్రమించుకున్నాడు. ఈ ప్రాంతానికి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనున్ని తన ప్రతినిధిగా నియమించాడు. రెండవ పులకేశి మరణం తర్వాత వేంగి స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.
విష్ణువర్ధనుడు నెల్లూరు నుండి విశాఖపట్నం మధ్య గల ప్రాంతాన్ని పరిపాలించాడు. 18 సంవత్సరాల పాటు అతని పాలన సాగింది. ఇతనికి విషమసిద్ధి (కష్టకాలంలో విజయం సాధించినవాడు) అనే బిరుదు ఉంది. అతను విష్ణుభక్తుడే కాక, కార్తికేయుని కూడా పూజించాడు. కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతీమాధవ ఆలయాన్ని నిర్మించాడు.[2] అతని భార్య అయ్యన మహాదేవి, జైనుల కోసం విజయవాడలో నుడుంబి వసతి అనే జైన దేవాలయాన్ని నిర్మించింది.[3]
కుబ్జ విష్ణువర్ధనుడు రెండవ పులకేశికి, పల్లవ రాజు మొదటి నరసింహవర్మకి మధ్య జరిగిన యుద్ధాలలో పాల్గొన్నాడు. ఇతడు బహుశా సా.శ.641 లో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఇతని తర్వాత కుమారుడైన మొదటి జయసింహుడు రాజయ్యాడు.
కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ ఇతని ఆస్థానాన్ని సందర్శించాడు.[4]