కుమ్మనం రాజశేఖరన్ | |
---|---|
![]() | |
మిజోరం రాష్ట్ర 14వ గవర్నరు | |
In office 29 మే 2018 – 8 మార్చి 2019 | |
ముఖ్యమంత్రి |
|
అంతకు ముందు వారు | నిర్భయ శర్మ |
తరువాత వారు | జగదీష్ ముఖి |
భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్ష్యుడు | |
In office 2015 –2018 | |
అంతకు ముందు వారు | వి.మురళీధరన్ |
తరువాత వారు | పీఎస్.శ్రీధరన్ పిళ్ళై |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కుమ్మనం గ్రామం, కొట్టాయం జిల్లా, కేరళ రాష్ట్రం. | 1952 డిసెంబరు 23
జాతీయత | భారతీయుడు |
తల్లిదండ్రులు | అడ్వకేట్ వీకే రామకృష్ణ పిళ్ళై , పీ. పరుక్కుట్టి అమ్మ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
కుమ్మనం రాజశేఖరన్, (జననం:1952 డిసెంబరు 23) కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మిజోరం రాష్ట్ర మాజీ గవర్నర్.[1] అతను తన రాజకీయ జీవితాన్ని 1970లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో సేవక్ గా, సంఘ్ పరివార్ కార్యకర్తగా ప్రారంభించాడు. 2015 నుండి 2018 వరకు భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్ష్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. కేరళ రాష్ట్రం నుండి గవర్నర్ అయిన తొలి వ్యక్తి కుమ్మనం రాజశేఖరన్. ప్రస్తుతం అతను తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో పాలకవర్గ సభ్యుడిగా ఉన్నాడు.[2]
రాజశేఖరన్ 1952, డిసెంబరు 23న కుమ్మనం గ్రామం, కొట్టాయం జిల్లా, కేరళ రాష్ట్రంలో అడ్వకేట్ వీకే రామకృష్ణ పిళ్ళై, పీ. పరుక్కుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 10వ తరగతి వరకు కొట్టాయంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఎన్.ఎస్.ఎస్ హై స్కూల్ లో పూర్తి చేశాడు. బేస్లుస్ కాలేజ్ లో ఇంటర్మీడియేట్, సీ.ఎం.ఎస్ కాలేజ్ లో బీ.ఎస్.సీ (డిగ్రీ) పూర్తి చేశాడు. రాజశేఖరన్ జర్నలిజంలో డిప్లొమా చేసి జర్నలిస్ట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, పలు పత్రికల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశాడు.[3]
రాజశేఖరన్ 1970లో దీపిక దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ప్రారంభించి, తదనంతరం రాష్ట్రవార్త, కేరళదేశం, కేరళ భూషణం, కేరళ ధ్వని పత్రికల్లో పనిచేశాడు. ఆయన 1976లో ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎఫ్.సీ.ఐ ) లో ప్రభుత్వం ఉద్యోగం సాధించాడు. రాజశేఖరన్ 1979లో కొట్టాయం జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శిగా నియమితుడయ్యాడు, 1981లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. 1981లో రాజశేఖరన్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిగా సంఘ్ పరివార్ కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాడు.[1][4][5]
రాజశేఖరన్ 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ చేతిలో 15వేల 470 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[6] 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో మిజోరం గవర్నరుగా ఉన్న తన పదవికి రాజీనామా చేసి తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలయ్యాడు.[7] కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎన్‌డీఏ) కూటమి నుండి బీజేపీ పార్టీ తరపున తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నేమం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసాడు.
రాజశేఖరన్ ను మిజోరం గవర్నరుగా నియమిస్తూ 2018 మే 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశాడు..[8] మిజోరం రాష్ట్ర 14వ గవర్నరుగా 2018 మే 29న ప్రమాణ స్వీకారం చేశాడు. 2019లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో2019 మార్చి 8న గవర్నరు పదవికి రాజీనామా చేశాడు.[9] రాజశేఖరన్ కేవలం పది నెలలు మాత్రమే పదవిలో ఉన్నాడు.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)