కె.ఎస్.నారాయణస్వామి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | పాలఘాట్, కేరళ | 1914 సెప్టెంబరు 27
మరణం | 1999 (aged 84–85) |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వీణ విద్వాంసుడు |
వాయిద్యాలు | వీణ |
కొడువాయూర్ శివరామ అయ్యర్ నారాయణస్వామి(1914 – 1999) తంజావూరు శైలికి చెందిన వీణ విద్వాంసుడు.[1]
ఇతడు కేరళ రాష్ట్రం, పాలక్కాడు జిల్లా, కొడువాయూరు గ్రామంలో 1914, సెప్టెంబరు 27వ తేదీన శివరామ అయ్యర్, నారాయణి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతడు కర్ణాటక సంగీతాన్ని తొలుత తన సోదరుడు కె.ఎస్.కృష్ణ అయ్యర్ వద్ద తన 7వ సంవత్సరం నుండి అభ్యసించాడు. తరువాత ఇతడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాలలో చేరాడు. అక్కడ మహమహులైన టి.ఎస్.సబేశ అయ్యర్, తంజావూరు పొన్నయ్య పిళ్ళై వంటి విద్వాంసుల వద్ద గాత్రం నేర్చుకున్నాడు. దేశమంగళం సుబ్రహ్మణ్యపిళ్ళై వద్ద వీణ, తంజావూరు పొన్నయ్య పిళ్ళై వద్ద మృదంగంలో తర్ఫీదు పొందాడు. 1937 నుండి 1946 వరకు ఇతడు తాను చదివిన సంగీత కళాశాలలోనే అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, అరుణాచల కవి మొదలైన వాగ్గేయకారుల కృతులను ప్రచురించడంలో తోడ్పడ్డాడు.[2]
తిరువాంకూరు మహారాజా ఆహ్వానంపై ఇతడు "స్వాతి తిరుణాళ్ సంగీత కళాశాల"లో వీణ నేర్పించే అధ్యాపకుడిగా చేరాడు.[3] అక్కడ ప్రధానాచార్యుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌తో కలిసి స్వాతి తిరునాళ్ కృతులను పరిష్కరించి ప్రచురించాడు.[1][4][5] ఇతడు అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నాడు. రష్యా, తూర్పు ఐరోపా దేశాలలో 1954లో పర్యటించిన భారత సంగీత, సాంస్కృతిక బృందంలో ఒక సభ్యుడిగా ప్రభుత్వం తరఫున వెళ్ళాడు. 1970లో అంతర్జాతీయ వయోలిన్ విద్వాంసుడు యెహూది మెనూహిన్ ఆహ్వానంపై ఇతడు "బాత్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్"కు హాజరయ్యాడు. ఆ పర్యటనలో ఇతడు లండన్, బ్రిస్టల్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, బర్మింగ్‌హాం నగరాలలో వీణ కచేరీలు చేశాడు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ తరువాత ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొంది 1970లో రిటైర్ అయ్యాడు.[2]
1970లో ముంబైలోని షణ్ముఖానంద లలితకళలు & సంగీత సభకు చెందిన సంగీత విద్యాలయానికి ప్రిన్సిపాల్‌గా చేరి అక్కడి విద్యార్థులకు 1985 వరకు వీణా వాదనను, గాత్ర సంగీతాన్ని నేర్పించాడు.[1][2][3] 1974లో ఆస్ట్రేలియా పెర్త్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సోసైటీ ఆఫ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ 11వ సదస్సుకు కర్ణాటక సంగీత ప్రతినిధిగా హాజరయ్యాడు. 1977లో బెర్లిన్‌లో జరిగిన భారతీయ సంగీత నృత్యోత్సవాలలో పాల్గొన్నాడు.[2]
ఇతడు అనేక పురస్కారాలను, సత్కారాలను పొందాడు.
వాటిలో ముఖ్యమైన కొన్ని పురస్కారాలు:
ఇతని వద్ద సంగీతం నేర్చుకున్న వందలాది శిష్యులలో రుక్మిణీ గోపాలకృష్ణన్,[9][10] కళ్యాణీ శర్మ,[1] సరస్వతి రాజగోపాలన్,[11] త్రివేండ్రం వెంకటరామన్,[12] అశ్వతి తిరునాళ్ రామవర్మ,[13] గీతా రాజ,[3] నిర్మలా పార్థసారథి,[14] జయశ్రీ అరవింద్, అరుణా సాయిరాం[15] మొదలైన వారున్నారు.