చందమామ చిత్రకారుడు శంకర్ | |
---|---|
జననం | కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ 1924 జూలై 19 |
మరణం | 2020 సెప్టెంబరు 29 | (వయసు 96)
వృత్తి | చిత్రకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1946-2020 |
కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (కె.సి.శివశంకరన్) "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. అతను తెలుగులో బాలల పత్రిక చందమామ లో చిత్రకారునిగా "విక్రం, భేతాళ" కథలలో చిత్రాలు వేయడం ద్వారా గుర్తించబడ్డాడు. అతని చిత్రాలలో "శంకర్" అనే సంతకం ఉంటుంది. చందమామ పత్రికను రూపొందించిన వ్యక్తులలో ఇతను ఒకడు. చందమామలో మొట్టమొదట పనిచేసిన చిత్రకారులైన వడ్డాది పాపయ్య, తోడా వీరరాఘవన్ (చిత్రా) లతో పాటు ఇతను పనిచేసాడు.[1]
అతను 1924 జూలై 19 న తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.అతనికి నలుగురు సోదరులున్నారు. అతని పూర్వీకులు తమిళనాడులోని కరాతొలువు గ్రామానికి చెందినవారు. 1934 లో మద్రాసులో నివసిస్తున్న దగ్గరి బంధువు మరణించినప్పుడు, శంకర్ తన తల్లి, తోబుట్టువులతో కలిసి దుఃఖిస్తున్న ఆ కుటుంబంతో కలసి ఉండటానికి మద్రాసు వచ్చాడు. అతని అన్నయ్య అప్పటికే మద్రాసులో ఉండి పాచయప్ప కళాశాలలో చదువుకుంటున్నాడు. ఖాళీగా ఉండకుండా వారిని ఏదైనా కార్పొరేషన్ పాఠశాలలో చేర్పించవలసినదిగా అతని తండ్రి తన తల్లికి చెప్పాడు. కర్పొరేషన్ పాఠశాలలో ఎటువంటి ఫీజులు వసూలు చేసేవారు కాదు. అతని తల్లి శంకర్, అతని తమ్ముడిని బ్రాడ్‌వేలోని కార్పొరేషన్ పాఠశాలలో చేర్పించింది. అక్కడ ప్రారంభ పరీక్షలో భాగంగా అతనిని "జార్జ్ వి ఈస్ అవర్ కింగ్" అనే వాక్యాన్ని రాయమన్నారు. వెంటనే అతను రాసాడు. అతని అందమైన దస్తూరిని చూసి అతనిని ఐదవ తరగతిలో, అతని తమ్ముడిని మూడవ తరగతిలో చేర్పించుకున్నారు. అతని అందమైన చేతి రాత కారణంగా ఉపాధ్యాయులు అతనిని రోజువారీ సామెతను నోటీసు బోర్డులో వ్రాసేలా చేశారు - ఇది హైస్కూల్ వరకు కొనసాగింది.[2]
శంకర్ తన బాల్యం నుండే కళ పట్ల మక్కువ పెంచుకున్నాడు. తన చరిత్ర పరీక్షలలో అతను చారిత్రక పాత్రల చిత్రాలను గీసేవాడు. అతని కుటుంబం అతని అభిరుచికి అవసరమైన ఖర్చులను భరించలేకపోయింది. నాగిరెడ్డి కూడా చదువుకుంటున్న కుతియాల్ పేట్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాద్యాయుడు అతనిలోని ప్రతిభను గుర్తించాడు. ఆదివారాలలో అతని వద్దకు వచ్చేటట్లు చేసాడు. అక్కడ శంకర్ ఇతర విద్యార్థులు గీచిన చిత్రాలను సదిదిద్దడంద్వారా తన డ్రాయింగ్ ఉపాధ్యాయునికి సహాయం చేస్తూ అందుకు బదులుగా చిత్రలేఖనానికి ఆవసరమైన సామాగ్రి అయిన డ్రాయింగ్ పుస్తకాలు, పెన్సిల్స్, ఎరేజర్లను సంపాదించాడు. ఆ ఉపాద్యాయుడు తనకు బి.ఎ, ఎం.ఏ చేయవద్దని తన ఆసక్తిని తగినట్లు ఆర్ట్స్ స్కూలులో చేరాలని సలహా యిచ్చాడు.
స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఐదేళ్ల కోర్సులో ప్రవేశం పొందడం అంటే ఉపాధ్యాయులు ఇచ్చే నియోజనాన్ని మూడువారాల పాటు చేసి వారిని సంతృప్తి పరచడం. ఒక నియోజనంలో అతను తన పెయింటింగ్ బ్రష్ సహకరించడం లేదని గమనించాడు. తన మొండి బ్రష్ తో కాగితంపై గీచిన చిత్రం ప్రభావం అక్కడి ప్రిన్సిపాల్ డి.పి.రాయ్ చౌదరిని ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. "పెన్ అండ్ నైఫ్" చిత్రలేఖనాని ఎక్కడ నేర్చుకున్నావని అతను అడిగాడు. శంకర్ మౌనంగా ఉన్నాడు. అప్పుడు అతను శంకర్ ను రెండవ సంవత్సరంలో ప్రవేశం కల్పించాడు.
ఉత్తీర్ణుడైన తరువాత అతను 1946లో తమిళ పత్రిక కలైమగై లో చిత్రకారునిగా నెలకు 85 రూపాయల వేతనంతో చేరాడు. 1952 లో అతని సంపాదన 150 రూపాయలు. అది తన పెద్ద కుటుంబానికి పోషించడానికి సరిపోదు. అందువల్ల అతను మరొక 150 సంపాదించడానికి ఇతర పత్రికలను ఆశ్రయించాడు. ఆ సంవత్సరం నాగిరెడ్డి చందమామ పత్రికలో చిత్రకారునిగా 350 రూపాయల నెల జీతంతో నియమించాడు. కానీ రికార్డులలో వేతనం 300 మాత్రమే చూపించేవారు. ఎందుకంటే అప్పటికే పనిచేస్తున్న ప్రధాన చిత్రకారుడు చిత్రాకు కూడా జీతం 350 రూపాయలు.
చందమామ పత్రికలో పనిచేసేటప్పుడు చిత్రా, శంకర్ లు ప్రత్యర్థులుగా వృత్తిజీవితం ప్రారంభించినా 1978లో చిత్రా మరణించే వరకు మంచి స్నేహితులుగా ఉన్నారు. నాగిరెడ్డి ఒక సందర్భంలో " చిత్రా, నాగిరెడ్డి చందమామ పత్రికకు రెండు ఎద్దులు. రెండూ లేకుండా ఎద్దుల బండి గ్రామానికి చేరుకోలేదు" అని అన్నాడని శంకర్ హిందూ పత్రికతో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. అతనితో పని చేసిన మరో ఇద్దరు సమకాలీనులు రాజి, వడ్డాది పాపయ్యలు.
శంకర్ తన భార్యతో విరుగంబక్కంలో నివసిస్తున్నాడు. తని ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె చెన్నైలో నివసిస్తున్నారు; మరో ఇద్దరు కుమారులు విదేశాలలో నివసిస్తున్నారు - ఒకరు కెనడాలో, మరొకరు మలేషియాలో.
శివశంకర్ 2020, సెప్టెంబరు 29న చెన్నై సమీపంలోని పోరూర్‌లోని స్వగృహంలో మరణించాడు.[3][4]