కెప్టెన్ రాజు | |
---|---|
జననం | రాజు డేనియల్ 1950 జూన్ 27 ఒమల్లూర్, ట్రావెన్స్‌కోర్-కొచ్చిన్, భారతదేశం |
మరణం | 2018 సెప్టెంబరు 17 కొచ్చి, కేరళ, భారతదేశం | (వయసు 68)
వృత్తి | సినిమా నటుడు, సైనికాధికారి |
రాజు డేనియల్ (1950 జూన్ 27 - 2018 సెప్టెంబరు 17) సినిమా రంగంలో కెప్టెన్ రాజుగా సుపరిచితుడు. అతను సైనికాధికారి, నటుడు. అతను మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడం మొదలైన భారతీయ భాషలలో సుమారు 600 సినిమాలలో నటించాడు. అతను కారెక్టర్ పాత్రలు, ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. అతను టెలివిజన్ సీరయల్స్, వ్యాపారప్రకటనలలో కూడా నటించాడు.
రాజు డేనియల్ | |
---|---|
రాజభక్తి | India |
సేవలు/శాఖ | Indian Army |
సేవా కాలం | 1971-1976 |
ర్యాంకు | Captain |
అతను కేరళలోని పతనమిట్ట జిల్లాకు చెందిన ఒమల్లూర్ లో కె.జి. డేనియల్, అన్నమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో రెండవ వానిగా జన్మించాడు.[1] అతనికి ఎలిజిబెత్, సజి, సోఫీ, సుధా అనే సోదరీమణులు, జార్జ్, మోహన్ అనే సోదరులు ఉన్నారు. అతని తల్లిదండ్రులు ఒమల్లూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాద్యాయులుగా పనిచేసేవారు.[2] అతను ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోను, ఒమల్లూరు లోని ఎన్.సి.సి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలోనూ పూర్తిచేసాడు. అతను వాలీబాల్ క్రీడాకారుడు.[3] అతను పతనంతిత్త లోణి కాథొలికేట్ కళాశాలలో జంతుశాస్త్రంలో డిగ్రీని చేసాడు.[4] గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత తన 21వ యేట భారత సైనిక దళంలో చేరి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అతను భారత సైనిక దళంలో ఐదు సంవత్సరములు పూర్తిచేసిన తరువాత ముంబయిలోని లక్ష్మీ స్టార్చ్, గ్లూకోజ్ తయారీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తరువాత సినిమా రంగంలో ప్రవేశించాడు.[5] అతను కంపెనీలో ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ముంబయిలోని ప్రతిభా థియేటర్ లోని నాటక బృందాలతో కలసి నటించేవాడు. తరువాత సినిమాలలోనికి ప్రవేశించాడు. అతను 1997లో "ఎత ఓరు స్నేహగత" అనే మలయాళ చిత్రంద్వారా సినిమా అరంగేట్రం చేసాడు.
అతను ప్రమీళను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.[6][7] అతను పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పటికీ అన్ని మతాల దేవాలయాలను సందర్శించేవాడు. అతను సెయింట్ జార్జ్ ఆర్థడాక్స్ చర్చి, పలరివట్టంలో క్రియాశీలక సభ్యుడు.
అతను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సుమారు 500 చిత్రాల్లో వివిధ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. అందులో మలయాళం చిత్రాలే దాదాపు 450 ఉన్నాయి. ఎక్కువగా ప్రతినాయకుడిగానే కనిపించాడు. రౌడీ అల్లుడు, శత్రువు, మాతో పెట్టుకోకు, కొండపల్లి రాజా, జైలర్ గారి అబ్బాయి, గాండీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం, ప్రేమసందడి చిత్రాలు ఆయనకు పేరు తీసుకొచ్చాయి. రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.[8]
అతను చివరిదినాలలో డయాబెటిస్ తో బాధపడ్డాడు. కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో 2018 సెప్టెంబరు 17న తన 68వ యేట మరణించాడు. అతను అనేక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు.[9][10]