కొండపల్లి కోట | |
---|---|
ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో భాగం | |
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ | |
![]() రాజభవన వీక్షణం | |
భవనం ముందు భాగం | |
భౌగోళిక స్థితి | 16°37′31″N 80°31′50″E / 16.625283°N 80.530667°E[1] |
రకము | Fort |
స్థల సమాచారం | |
నియంత్రణ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం |
పరిస్థితి | శిథిలాలు |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 14వ శతాబ్దం |
కట్టించింది | ముసునూరి కమ్మ రాజులు |
వాడిన వస్తువులు | గ్రానైటు రాళ్ళు, సున్నం |
Battles/wars | ముసునూరి కమ్మ రాజులు, కొండపల్లి కమ్మరాజులు, ఒరిస్సాకు చెందిన గజపతులు, కుతుబ్ షాహీ వంశం, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ సుల్తానులు, ఆంగ్లేయులు |
కొండపల్లి కోట, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడకు సమీపంలో ఉన్న ఒక శిథిలమైన కోట. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచారు.
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి అనే ప్రధాన కొండ శ్రేణిలో విజయవాడ నగరానికి పశ్చిమాన ఈ కోట ఉంది. కొండ శ్రేణి, సుమారు 24 కి.మీ. పొడవున, నందిగామ, విజయవాడల మధ్య విస్తరించి ఉంది. ఈ కొండ శ్రేణిలోని అటవీ ప్రాంతం 'పొణుకు' అని పిలువబడే ఒక రకమైన చెక్క విరివిగా లభిస్తుంది. ప్రసిద్ధ కొండ్పల్లి బొమ్మలను ఈ చెక్క తోనే చేస్తారు.[2] కొండపల్లి కోట సమీపంలోని కొండల చుట్టూ ఔషధ మొక్కలు చెట్లు లభిస్తాయి. నేల ఉసిరి, తెడ్లపాల, మొదలైనవి వీటిలో కొన్ని.[2]
ముసునూరి కమ్మ రాజులు కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు.అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు.
ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా, కొల్లూరులో శాసనం వేయించాడు. ముసునూరు (పెమ్మసాని), గుంటుపల్లి, అడపా, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 300 ఏళ్లు ఈ కోటని పాలించారు. ఈ కమ్మ వంశాల రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు.
సా.శ. 1370 లో ముసునూరి నాయకుల పతనం తరువాత, సా.శ. 1370 లో కొండవీడు రెడ్డి రాజవంశానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. ఒరిస్సా రాజు మరణం తరువాత, సింహాసనం కోసం అతడి కుమారులు హంవీరుడు, పురుషోత్తముడు యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో హంవీరుడు బహమనీ సుల్తాన్ సహాయం తీసుకుని, సోదరుడిని ఓడించి 1472 లో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ ఈ బేరసారాల్లో అతను కొండపల్లినీ రాజమండ్రినీ బహమనీ సుల్తాన్‌కు ఇచ్చాడు. తదనంతరం పురుషోత్తముడు 1476 లో హంవీరుడిని ఓడించి ఒరిస్సా సింహాసనాన్ని ఆక్రమించాడు. 1476 లో, బహమనీ రాజ్యంలో కరువు వచ్చినపుడు కొండపల్లి వద్ద ఒక విప్లవం ప్రారంభమైందని కూడా అంటారు. కొండపల్లి దండు తిరుగుబాటు చేసి, కోటను "హామర్ ఒరియా" లేదా హంవీరుడికి అప్పగించింది.[2][3]
పురుషోత్తముడు, గద్దె నెక్కగానే, కొండపల్లి, రాజమండ్రి;లను బహమనీ సుల్తాన్ III నుండి తిరిగి పొందడానికి ప్రయత్నించాడు. అతను రాజమండ్రిని ముట్టడించినపుడు, ఎందుకో తెలీదుగానీ, అతడు సుల్తాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ఫలితంగా బహమనీ, విజయనగర పాలకుల మధ్య సంబంధాలు దెబ్బతిని, చిన్నచిన్న యుద్ధాలు జరిగాయి. కానీ 1481 లో, సుల్తాన్ మహమ్మద్ మరణం తరువాత, బహమనీ సుల్తానేట్ గందరగోళంలో పడింది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని పురుషోత్తం, సుల్తాన్ కుమారుడు మహమ్మద్ షాతో పోరాడి, రాజమండ్రి, కొండపల్లి కోటలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గజపతి పురుషోత్తమ దేవుడు 1497 లో మరణించాడు. అతని కుమారుడు గజపతి ప్రతాపరుద్ర దేవుడు అధికారాని కొచ్చాడు.[2]
1509 లో, గజపతి ప్రతాపరుద్ర దేవుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలపై యుద్ధం ప్రారంభించాడు. కాని బెంగాల్‌కు చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ హుస్సాన్ షా దాడి నుండి రాజ్యాన్ని రక్షించుకోడానికి గజపతి వెనుకకు వెళ్ళవలసి వచ్చింది. పర్యవసానంగా, కృష్ణదేవరాయలు 1515 జూన్ లో కొండపల్లిపై సులభంగా ఆక్రమించుకున్నాడు. 1519 లో జరిగిన చివరి యుద్ధంలో కృష్ణదేవరాయ మరోసారి ఒరిస్సా పాలకుడిని ఓడించాడు. కొండవీడు కోట చాలా బలంగా ఉన్నందున, మూడు నెలల కోట ముట్టడి తరువాత, రాయలు స్వయంగా రంగం లోకి దిగి, కోటపై నియంత్రణ సాధించాడు. ఈ యుద్ధం తరువాత, కృష్ణదేవరాయలు, గజపతి ప్రతాపరుద్ర దేవుడు కుమార్తె కళింగ రాజకుమారి జగన్మోహినిని వివాహం చేసుకున్నాడు. కృష్ణ నది దక్షిణ సరిహద్దు వరకు ఉన్న అన్ని భూములను తిరిగి ఒరిస్సాకు అప్పగించడానికి ఒప్పందం కుదిరింది. ఇందులో కొండపల్లి కూడా ఉంది.[2][4]
కానీ విజయనగర చక్రవర్తితో ఒప్పందం తరువాత, 1519 - 1525 మధ్య, గోల్కొండ సుల్తాన్ సుల్తాన్ కులీ కుతబ్ చేసిన దాడి నుండి తన భూభాగాన్ని కాపాడుకోవలసి వచ్చింది. కానీ తుది దాడిలో, 1531 లో, కొండపల్లి గోల్కొండ సుల్తాన్ పాలనలోకి వచ్చింది. గోల్కొండ సుల్తాన్లతో యుద్ధాన్ని ఒరిస్సా రాజ్యానికి చెందిన కొత్త పాలకుడు గోవింద బిద్యాధర్ కొనసాగించాడు. అతను గజపతి ప్రతాపరుద్ర దేవుడి (1533 లో మరణించాడు) తరువాత గద్దె నెక్కాడు. కాని చివరికి సుల్తాన్‌తో సంధి కుదుర్చుకున్నాడు.[2]
సా.శ.1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కమ్మరాజ్య చివరి ప్రభువు పెమ్మసాని తిమ్మనాయుడిని సంహరించి ఈ కోట ఆక్రమించాడు. 18 వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత, నిజాం ఉల్-ముల్క్, స్వాతంత్ర్యం ప్రకటించుకుని, ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 18 వ శతాబ్దం చివరలో, ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. ఈ భూభాగంపై బ్రిటిష్ వారి నియంత్రణను గుర్తిస్తూ నిజాం అలీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై 1766 నవంబరు 12 న సంతకం చేసారు. ఈ భూభాగం మంజూరు చేసినందుకు బదులుగా కంపెనీ 90,000 పౌండ్ల వార్షిక వ్యయంతో నిజాం సహాయం కోసం తమ దండును నిజాము కోటలో ఉంచడానికి అంగీకరించింది. 1766 లో బ్రిటిష్ వారు జనరల్ కైలాడ్ ఆధ్వర్యంలో ఈ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసారనే మరొక వాదన కూడా ఉంది.[2][5][6]
1768 మార్చి 1 న మరొక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కింద మొఘల్ పాలకుడు షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అందించిన మంజూరును నిజాం గుర్తించింది. కానీ, తమ మైత్రికి గుర్తుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిజాంకు 50,000 పౌండ్ల భత్యం చెల్లించడానికి అంగీకరించింది. అయితే, 1823 లో ఈస్ట్ ఇండియా కంపెనీ, నిజాం నుండి సర్కారులను పూర్తిగా కొనుగోలు చేసింది.[2][5][6]
మొదట్లో ఈ కోటను వ్యాపార కేంద్రంగా ఉపయోగించారు. కాని 1766 లో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని సైనిక శిక్షణా స్థావరంగా మార్చారు.[7] అయితే ఆర్థిక సమస్యలతో సా.శ. 1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు.
చాలా సుందరంగా ఉండే ఈ కోటలో వరుసగా మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారం ఒకే గ్రానైట్ బ్లాకుతో నిర్మించారు. దీన్ని 'దర్గా దర్వాజా' అంటారు. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తూ ఉంటుంది. ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. దర్ఘా దర్వాజాతో పాటు, గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివరన ఉంది, ఇది జగ్గయ్యపేట గ్రామానికి దారితీస్తుంది.
బలమైన కోట గోడకు బురుజులు, బుట్టలూ ఉన్నాయి.[2][8] దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం ఉంది. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం - ఇవన్నీ ఒకే కొండపైనే ఉన్నాయి.
కోటకు ఒక చివర తానీషా మహల్ ఉంది, ఇది రెండు కొండల మధ్య ఒక శిఖరంపై ఉంది. ఈ ప్యాలెస్‌లో నేల అంతస్తులో చాలా గదులు, పై అంతస్తులో భారీ హాలూ ఉన్నాయి. అదనంగా, కోటలో ఇంకా అనేక భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి శిథిలావస్థలో ఉన్నాయి.[2][8]
ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది. ఒక ఊట నుండి దీని లోకి నీళ్ళు వస్తాయి. జలాశయంలోని నీరు చాలా చల్లగా ఉంటుందని, దీని వలన జ్వరం వస్తుందనీ అంటారు. కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులున్నయి. ఇవి వేసవిలో ఎండిపోతాయి. జలాశయానికి ఆవల ఉన్న పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, గబ్బిలాలకు నివాసంగా ఉంది.[8]
కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యారక్ ఇప్పటికీ ఉంది. ఇందులో ఎనిమిది పెద్ద గదులున్నాయి. పక్కనే ఒక ఇల్లు కూడా ఉంది. కోటలో ఆంగ్లేయుల శ్మశానం కూడా ఉంది.[8]
ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం కోట, దాని ఆవరణలో ఉన్న నిర్మాణాల పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను చేపట్టింది. జాతీయ రహదారి నుండి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం, చారిత్రక గోడలను బలోపేతం చేయడం, పునరుద్ధరించడం, జైలు ఖానా (జైలు గృహం), కోనేరు చెరువు మ్యూజియంల పునరుద్ధరణ, కొండ వరకు రోప్‌వే నిర్మించడం, లోపలి రహదారుల నిర్మాణం, ప్రాథమిక సదుపాయాలు మూడు దశల విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాండ్ స్కేపింగ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలు ఈ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల్లో ఉన్నాయి.. ఇక్కడ ఉన్న మ్యూజియంలో కొండపల్లి బొమ్మల ప్రదర్శన, చారిత్రక అవశేషాలూ ఉన్నాయి.[9][10]
కొండపల్లి కమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది.ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు.ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ.
<ref>
ట్యాగు; district
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు{{cite book}}
: |work=
ignored (help)
{{cite book}}
: |work=
ignored (help)
{{cite book}}
: |work=
ignored (help)
{{cite book}}
: |work=
ignored (help)
{{cite book}}
: |work=
ignored (help)