దస్త్రం:Cciclub.gif | |
ఆటలు | క్రికెట్ |
---|---|
పొట్టి పేరు | CCI |
స్థాపన | 1933 |
అనుబంధం | బిసిసిఐ |
మైదానం | బ్రాబోర్న్ స్టేడియం |
స్థానం | ముంబై |
ఇతర కీలక సిబ్బంది | 17 |
Official website | |
![]() |
క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ( CCI ) భారతదేశంలోని క్రికెట్ క్లబ్. ఇది ముంబై చర్చిగేట్‌లోని దిన్షా వాచా రోడ్‌లో ఉంది. దీన్ని భారతదేశంలో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కి ప్రతిరూపంగా భావించేవారు. [1] [2] ఇది దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక క్లబ్‌లలో ఒకటి. CCI క్రికెట్ ఆటల కోసం బ్రాబోర్న్ స్టేడియంను ఉపయోగిస్తుంది. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు అనుబంధంగా ఉంది.
ఈ క్లబ్బులో సభ్యత్వం రాయల్ విల్లింగ్‌డన్ స్పోర్ట్స్ క్లబ్, బాంబే జింఖానా, బ్రీచ్ క్యాండీ క్లబ్‌ల మాదిరిగానే బహిరంగం కాదు. ప్రస్తుత సభ్యుల వారసులు మాత్రమే దానిని పొందగలరు.
1933 నవంబరు 8 న, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీలో రిజిస్టర్డ్ ఆఫీసుతో పరిమితమైన కంపెనీగా ఏర్పడింది. దేశవ్యాప్తంగా క్రీడలను, ముఖ్యంగా క్రికెట్‌ను, ప్రోత్సహించడం సంస్థ ప్రధాన లక్ష్యం.
ఐదు సంవత్సరాల క్రితం BCCIని స్థాపించిన ప్రమోటర్లు, కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఈ క్లబ్బుకు కూడా ప్రమోటర్లు. వాస్తవానికి, వ్యవస్థాపక సభ్యులుగా పిలవబడిన జీవిత సభ్యులు రూ. 100, సాధారణ సభ్యులు ప్రవేశానికి రూ. 10, వార్షిక చందాగా రూ. 15 చెల్లించారు.
క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధమైన చైనా వంటకం చికెన్ మంచూరియన్ కు జన్మస్థలం. ఇక్కడి రెస్టారెంటుకు చెందిన నెల్సన్ వాంగ్ 1975లో CCIలో వంటగాడుగా పనిచేసేటపుడు ఓ కస్టమరు అభ్యర్థన మేరకు దీనిని తయారు చేసినట్లు పేర్కొన్నారు. [3]
2007 వరకు BCCI ప్రధాన కార్యాలయం CCI పరిధిలోనే ఉంది. తరువాత దాన్ని వాంఖడే స్టేడియంలో, ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆవరణలోని ప్రస్తుత స్థానానికి మార్చారు. 1974లో వాంఖడే స్టేడియం నిర్మాణం జరిగే వరకు బ్రాబోర్న్ స్టేడియం ముంబై క్రికెట్ జట్టుకు ప్రాథమిక హోమ్ గ్రౌండ్‌గా ఉండేది.
క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు 1935, 1958 మధ్య 13 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాయి, వాటిలో ఎక్కువ భాగం పర్యాటక జట్లతోనే ఆడాయి. తొమ్మిది మ్యాచ్‌లు బ్రాబోర్న్ స్టేడియంలో జరిగాయి. [4]
క్లబ్ యాజమాన్యంలో బ్రాబోర్న్ స్టేడియం కూడా ఉంది. [2] CCI అనేది ఇతర రాష్ట్ర అసోసియేషన్ల లాగానే BCCIకి అనుబంధంగా ఉంది. కానీ వాటిలాగా రాష్ట్రంలో క్రికెట్ నిర్వహించదు. ముంబై క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోసియేషన్లు ముంబైలో, మిగిలిన మహారాష్ట్రలో క్రికెట్ నిర్వహిస్తాయి. ఈ స్టేడియంలో ఈ ప్రాంతంలో కెల్లా అత్యుత్తమమైన క్రికెట్ పిచ్‌లు, మైదానాలు ఉన్నాయి. ఇందులో టెన్నిస్ కోర్టులు, [5] స్విమ్మింగ్ పూల్, [6] ఫిట్‌నెస్ సెంటర్లు, బిలియర్డ్స్ గది, స్క్వాష్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ టేబుల్‌లు, కేఫ్‌లు, బార్‌లు, లైబ్రరీ, రీడింగ్ రూమ్, బాంక్వెట్ హాల్ ఉన్నాయి. [7] ఈ ప్రత్యేకమైన క్లబ్బులో సభ్యత్వం పొందడం చాలా కష్టం. [8]
2006, 2007 లలో CCI టెన్నిస్ కోర్టుల్లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ టెన్నిస్ ఓపెన్, ATP టూర్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. గతంలో దీన్ని 1995 నుండి 2004 వరకు షాంఘైలోనూ, 2005లో వియత్నాంలోనూ నిర్వహించారు.[5][9] కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధికారిక స్పాన్సర్‌గా ఉంది. ఈ టోర్నమెంట్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.
2006లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్‌లను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. వీటిలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య 2006 నవంబరు 5 న జరిగిన ఫైనల్ కూడా ఉంది. [10]
బ్రాబోర్న్ స్టేడియం 2013 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు ముంబైలోని బాంద్రాలోని MIG క్రికెట్ క్లబ్, కటక్‌లోని DREIMS గ్రౌండ్, బారాబతి స్టేడియం లతో పాటు ఆతిథ్యం ఇచ్చింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఫైనల్ పోటీ కూడా జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను ఓడించింది.
2013 లో క్లబ్బు చేసిన అంతర్గత విచారణలో, అంతకు ముందు మూడేళ్లలో క్లబ్ ఇన్‌సైడర్‌తో కుమ్మక్కై ఫోర్జరీ ద్వారా 80 ఏళ్ల నాటి ఈ సంస్థలోకి కనీసం 11 మంది సభ్యులు ప్రవేశించారని నిర్ధారించారు. మరణించిన కొంతమంది సభ్యుల వ్యక్తిగత వివరాలను తీసివేసి, వాటి స్థానంలో కొత్తగా చేరిన వారి వివరాలను చేర్చి మోసం చేసారని పలువురు CCI సభ్యులు వెల్లడించారు. "కొంతకాలం క్రితం మరణించి, నిద్రాణంగా ఉన్న కొంతమంది సభ్యుల ఫైళ్ళను క్లబ్బు లోపలి వ్యక్తులే ట్యాంపర్ చేసారు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తి తెలిపారు. "మరణించిన పాత సభ్యుడు అసలు క్లబ్ రికార్డులలోనే ఎన్నడూ లేనట్లు కనిపించేలా పాత ఫైళ్ళలో కొత్త సభ్యుల పేర్లను, వారి ఇతర వివరాలనూ చేర్చారు." [11]
నకిలీ సభ్యత్వాల కుంభకోణానికి సంబంధించి ముంబై పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇద్దరు వ్యాపారవేత్తలు కేతన్ థాకర్, నిమాయ్ అగర్వాల్‌లను అరెస్టు చేసింది. [12]