ఖైరతాబాదు | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ | హైదరాబాదు |
ఏర్పాటు | 1626 |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
• ఎమ్మెల్యే | దానం నాగేందర్ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 004 |
Vehicle registration | టిఎస్ 09 |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు |
శాసనసభ నియోజకవర్గం | ఖైతరాబాదు |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఖైరతాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక నివాసప్రాంతం.[1] ఇది హైదరాబాద్ జిల్లాలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఒక మండలం. ఇక్కడి నుండి సోమాజీగూడా, అమీర్ పేట, హుసేన్ సాగర్, లక్డీకాపూల్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, షాదన్ గ్రూప్, ఈనాడు మొదలైనవి ఉన్నాయి. ఈ జోన్‌లో మెహిదీపట్నం (12), కార్వాన్ (13), గోషామహల్ (14), ఖైరతాబాద్ (17), జూబ్లీహిల్స్ (18) అనే ఐదు సర్కిళ్లు ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఖైరతాబాద్ (91), సోమాజిగూడ (97), అమీర్‌పేట్ (98), సనత్‌నగర్ (100) అనే నాలుగు వార్డులు ఉన్నాయి.
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది. ఖైరతాబాద్ మసీదు పక్కనే ఉన్న అతని సమాధి స్మారక చిహ్నం ఉంది. ఈ సమాధి 2002లో విలియం డాల్రింపుల్ (చరిత్రకారుడు) రచించిన వైట్ మొఘల్స్ పుస్తకంలో పేర్కొన్న జేమ్స్ అకిలెస్ కిర్క్‌పాట్రిక్ భార్య ఖైర్-అన్-నిస్సా కావచ్చు.[ఆధారం చూపాలి]
నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ అని పిలువబడే ఐదు రోడ్ల జంక్షన్‌ను కలిగి ఉంది. ఆ రోడ్లు సోమాజిగూడ, అమీర్‌పేట్, హుస్సేన్ సాగర్, లక్డీ-కా-పుల్, ఆనంద్‌నగర్‌లకు వెలుతున్నాయి. తెలంగాణ గవర్నర్ నివాసం ఉన్న రాజ్ భవన్ రోడ్ ఒక్కడికి సమీపంలో ఉంది.[2]
ఇక్కడ 1954 నుండి సింగరి కుటుంబం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.[3] గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఖైరతాబాదు వినాయకుడు ఎత్తైన వినాయకుడిగా పేరుగాంచాడు. పండుగ రోజుకు మూడు నెలల ముందు విగ్రహం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ పెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పి నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు మూడు నెలల పాటు పగలు రాత్రి శ్రమిస్తారు.
ఇది 1967లో ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009 పునరవ్యవస్థీకరణతో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలు విడిపోయి అప్పటివరకు అంబరు పేట నియోజకవర్గంలో ఉన్న హిమయత్ నగర్, అమీర్ పేటలను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు కాంగ్రెస్ పార్టీగెలిచింది. పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి, అతని మరణానంతరం కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి గెలిచారు.
ఖైరతాబాదు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ ఖైరతాబాదు మెట్రో స్టేషను కూడా ఉంది.
ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను 2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పోరేటర్ విజయారెడ్డి, ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5]
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా ఖైరతాబాద్ పరిధిలోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని 2022, ఫిబ్రవరి 3న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు.[6] ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]
17.85 కోట్ల రూపాయలతో 210 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించడంతోపాటు వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యం, దుకాణాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ఒక్కొ ఇళ్ళు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో 8.50 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు డిగ్నిటీ కాలనీగా నామకరణం చేశారు.