గయాప్రసాద్ కటియార్ | |
---|---|
![]() గయాప్రసాద్ కటియార్ | |
జననం | 20 జూన్ 1900 జగదీష్‌పూర్, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటీషు ఇండియా |
మరణం | 10 ఫిబ్రవరి 1993 (aged 92) |
గయాప్రసాద్ కటియార్ (హిందీ: गया प्रसाद कटियार) (20 జూన్ 1900 – 10 ఫిబ్రవరి 1993) "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు.
ఇతడు 1900, జూన్ 20వ తేదీన నందరాణి, మౌజీరామ్ దంపతులకు కాన్పూర్ జిల్లా బిల్హౌర్ తాలూకా జగదీష్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్య తర్వాత ఇతడు కాన్పూర్‌లో మెడిసినల్ ప్రాక్టీస్ కోర్సులో చేరాడు. ఇతడు ఆర్యసమాజంలో చేరాడు. అక్కడ అతనికి గణేష్ శంకర్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది.
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్.ఆర్.ఎస్.ఎ)కు చెందిన ఇతర విప్లవకారుల వలె ఇతడు కూడా 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1926లో భగత్ సింగ్, రాజ్ గురులు హోళీ పండగ సందర్భంగా జగదీష్‌పూర్ వచ్చినప్పుడు వారితో ఇతనికి గట్టి అనుబంధం ఏర్పడింది.[1]
ఇతని విప్లవ పార్టీ బాంబుల తయారీ కార్ఖానాలకు చోటు కల్పించడం ఇతని ముఖ్యమైన చర్యగా ఉండేది. ఇతడు ఒక మారుపేరుతో వైద్యశాలను ప్రారంభించేవాడు.[2] ఇతర విప్లవకారులు ఇతని వైద్యశాలలో పనివారుగా నటించేవారు. ఆ వైద్యశాలలో రహస్యంగా బాంబులు తయారయ్యేవి. ఆ సందర్భంగా రసాయనాల నుండి వచ్చే వాసనను మందులు తయారు చేయడంవల్ల వచ్చిందిగా చుట్టుపక్కల వారు భావించేవారు.
డాక్టర్ బి.ఎస్.నిగం అనే మారు పేరుతో ఇతడు ఫిరోజ్‌పూర్‌లోని తూరి బజార్‌లో 1928 ఆగస్ట్ 10 నుండి, 1929 ఫిబ్రవరి 9 వరకూ ఇతడు ఒక ఆసుపత్రి ముసుగులో బాంబుల కార్ఖానా నడిపాడు. దీనిలో శివ్ వర్మ అనే విప్లవకారుడు రామ్‌నారాయణ్ కపూర్ పేరుతో, మహావీర్ సింగ్ ప్రతాప్ సింగ్ పేరుతో, చంద్రశేఖర్ ఆజాద్ పండిత్ జీ పేరుతో, సుఖ్‌దేవ్ బలేజర్ పేరుతో, జయదేవ్ అనే విప్లవకారుడు గోపాల్ అనే మారుపేరుతో పనిచేసేవారు.[3]
పోలీసుల నిఘా చర్యలు అధికం కావడంతో తమ స్థావరాన్ని షరహన్‌పూర్‌కు మార్చారు. అద్దె స్థలాన్ని తీసుకుని ఆసుపత్రిగా మార్చడానికి వారి వద్దనున్న నిధులన్నీ అయిపోయాయి. ఢిల్లీ నుండి హెచ్.ఆర్.ఎస్.ఎ. సభ్యుడు డబ్బు తీసుకుని రావలసింది కానీ రాలేదు. దానితో గయాప్రసాద్ కాన్పూర్ వెళ్ళి కొంత ధనం సమకూర్చుకు రావాలని నిశ్చయించాడు. ఈలోగా పోలీసు ఇన్ఫార్మర్ అయిన ఫిరోజ్‌పూర్ నివాసి కాలూరాం అనే మంగలి స్వంతపని మీద షరహన్‌పూర్ వచ్చి అక్కడ డాక్టర్ నిగమ్‌ను చూసి అతడిని గయాప్రసాద్‌గా గుర్తించి స్థానిక పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.[4]1929, మే 13న పోలీసులు చౌబే పరిష్ ప్రాంతంలోని వీరి స్థావరంపై దాడి చేసి శివ్ వర్మ, జయదేవ్ కపూర్‌లను అరెస్ట్ చేశారు.
కాన్పూరుకు వెళ్ళిన గయాప్రసాద్ నిధులు సమకూర్చుకోలేక 1929 మే 15న షహరన్ పూర్‌కు తిరిగి వచ్చాడు. పోలీసుల కళ్ళుగప్పి తెల్లవారు ఝామున తమ స్థావరానికి వెళ్ళి శివ్ వర్మ, జయదేవ్‌లు ఉన్నారనుకుని తలుపు తట్టాడు. కానీ పోలీసు తలుపు తీశాడు. చీకటిలో అతడిని ఢిల్లీ నుండి నిధులు తెచ్చిన కాశీరాం అని భావించాడు. ఆ పోలీసు కేకలకు అతడిని మరికొంతమంది పోలీసులు చుట్టుముట్టి క్షణాలలో అతడి చేతికి బేడీలు తగిలించారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే సమయంలో గయాప్రసాద్ తన జేబులోని ఒక కాగితంలో కాకోరీ కుట్ర కేసులో నిందితుల తరఫున వాదించిన లక్నో న్యాయవాదులు చంద్రభాను గుప్త, మోహన్‌లాల్ సక్సేనాల పేర్లు ఉండటాన్ని గుర్తు చేసుకుని ఆ కాగితాన్ని పోలీసులకు చిక్కకుండా చేయాలని భావించాడు. దానితో మూత్రవిసర్జన చేయాలని జీపును ఆపమని పోలీసులను కోరాడు. కొంత వాగ్వాదం తరువాత అతని చేతులకు బేడీలు తొలగించి పోలీసులు అతని వెనుకనే నిలబడ్డారు. అతడు వెంటనే ఆ కాగితాన్ని ఉండ చుట్టుకుని నోటిలో పెట్టుకుని మ్రింగడానికి ప్రయత్నించాడు. అది గొంతులో అడ్డం పడి విపరీతంగా దగ్గు వచ్చింది. నీరు కావాలని కానిస్టేబుల్‌కు సంజ్ఞ చేసి నీటితో పాటు ఆ కాగితాన్ని మ్రింగివేశాడు.[5]
ఇతడిని ఇతర హెచ్.ఆర్.ఎస్.ఎ విప్లవకారులతో కలిపి లాహోర్‌కు తరలించారు. ఆక్కడ ఇతడు నిరాహారదీక్ష చేపట్టాడు. లాహోర్ కుట్ర కేసులో ఇతడిని విచారించి జీవితఖైదును విధించి అండమాన్ సెల్యులార్ జైలుకు తరలించారు. ఆ జైలులో ఖైదీల పట్ల చూపుతున్న అమానవీయ చర్యలకు నిరసనగా ఇతడు అక్కడ కూడా 46 రోజుల పాటు నిరాహారదీక్ష చేశాడు.[6] ఇతని హెచ్.ఆర్.ఎస్.ఎ. సహచరుడు మహావీర్ సింగ్ ఈ సమ్మెలో మరణించాడు. దానితో ఇతడిని ఆ జైలు నుండి తరలించారు. మళ్ళీ 1937లో ఇతడిని సెల్యులార్ జైలుకు పంపారు. చివరకు ఇతడిని 1946లో విడుదల చేశారు.[7]
స్వాతంత్ర్యానంతరం కూడా ఇతడు తన విప్లవధోరణితో రైతుల, కార్మికుల పక్షాన పోరాడాడు. ఫలితంగా 1958లో 6 నెలలపాటు, మళ్ళీ 1966-68లో ఒకటిన్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.[8]
ఇతడు 1993, ఫిబ్రవరి 10వ తేదీన మరణించాడు. ఇతని జ్ఞాపకార్థం 2016, డిసెంబర్ 26వ తేదీన భారత తపాలాశాఖ ఒక స్మారక తపాలాబిళ్ళను, ఫస్ట్ డే కవర్‌ను విడుదల చేసింది.[9] 2002లో విడుదలైన "ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్" అనే సినిమాలో ఇతని పాత్రను నీరజ్ షా పోషించాడు.[10]
{{cite book}}
: |last=
has numeric name (help)CS1 maint: multiple names: authors list (link)
{{cite book}}
: |last=
has numeric name (help)CS1 maint: multiple names: authors list (link)