గరమ్ హవా | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎం.ఎస్.సత్యూ |
రచన | కైఫీ అజ్మీ షామా జైదీ |
కథ | ఇస్మత్ చుగ్తాయ్ |
నిర్మాత | అబూ శివాని ఇషాన్ ఆర్య ఎం.ఎస్.సత్యూ |
తారాగణం | బలరాజ్ సాహ్ని ఫారూఖ్ షేఖ్ దీనానాథ్ జస్తి బదర్ బేగమ్ గీతా సిద్ధార్థ్ షౌకత్ కైఫీ ఎ.కె.హంగల్ |
ఛాయాగ్రహణం | ఇషాన్ ఆర్య |
కూర్పు | ఎస్.చక్రవర్తి |
సంగీతం | బహదూర్ ఖాన్ కైఫీ అజ్మీ (lyrics) |
విడుదల తేదీ | 1973 |
సినిమా నిడివి | 146 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ/ఉర్దూ |
బడ్జెట్ | ₹10,00,000 (US$ Formatting error: invalid input when rounding) |
గరమ్ హవా (హిందీ: गर्म हवा) 1973లో విడుదలయిన హిందీ చలన చిత్రం. యూనిట్ 3 యం.యం. బ్యానర్ పై ఈ సినిమా యం.ఎస్.సత్యు దర్శకత్వంలో వెలువడింది. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గీస్ దత్ ఉత్తమ జాతీయ సమైక్యతా చలనచిత్ర పురస్కారం లభించింది. ఈ సినిమా ఇస్మత్ చుగ్తాయ్ వ్రాసిన ఒక అముద్రిత కథ ఆధారంగా తీయబడింది.
మీర్జా సలీం ఆగ్రాలో పాదరక్షల వ్యాపారం చేసే వ్యక్తి. ఆ వ్యాపారం ఎక్కువగా ముస్లింల చేతుల్లోనే వుండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, అతని సహచరులు చాలా మంది భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో సలీం వ్యాపారం బాగా దెబ్బతిన్నది. సలీం అన్న హలీం మీర్జా కూడా భార్యను, కొడుకు ఖాజింను తీసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. సలీం కూతురు అమీనాను, ఖాజిం కు యిచ్చి వివాహం చేయాలన్న ప్రతిపాదన ఉంది. అయితే, కాజిం పాకిస్తాన్‌లో స్థిరపడిన వెంటనే ఆగ్రా వచ్చి, సలీం కుమార్తెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాని అదేం జరగలేదు. ఖాజీం తల్లిదండ్రులు పాకిస్తాన్ వారితోనే వియ్యం పొందాలనుకున్నారు.
మీర్జా సలీమ్ కాపురం వుంటున్న తాతల కాలం నాటి ఇల్లు అన్న హలీమ్ పేరిట ఉండటం వల్ల అతను వెళ్ళిపోగానే వాళ్ళకు ఆ ఇంటిమీద అధికారం పోయింది. ఒక సింధీ కాందిశీక వర్తకుడు ఆ ఇంటిని వశం చేసుకున్నాడు. సలీమ్ కుటుంబం దగ్గర్లోనే వున్న ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని వెళ్ళి పోయింది.
కొంతకాలం తర్వాత కాజిమ్‌కు విదేశ స్కాలర్‌షిప్ వచ్చింది. విదేశం వెళ్ళేముందు అతను అమీనాను చూడాలని ఆత్రుత పడి, సరిహద్దు దాటి ఆగ్రా వచ్చి అమీనాను కలుసుకున్నాడు. అదే అవకాశంగా భావించి సలీమ్ దంపతులు పెళ్ళికి ఏర్పాట్లు చెయ్యసాగారు. అంతలోనే పోలీసులు వచ్చి, కాజిమ్‌ను అరెస్టు చేశారు.
షంషాద్ సలీమ్ సోదరి కొడుకు. అతను అమీనాను చేసుకోవాలని తహతహలాడాడు. కానీ అతని అక్కకు ఇంకా పెళ్ళి కానందువల్ల అతని వివాహ ప్రయత్నం ఫలించలేదు. సలీమ్ మీర్జా వ్యాపారం సరిగ్గా సాగడంలేదు. అన్నలాగే అతనూ డబ్బు, దస్కం తీసుకుని పారిపోతాడేమోనన్న అనుమానంతో బ్యాంకులు అతని వ్యాపారానికి అప్పులు ఇవ్వడం మానేశాయి. దానికితోడు సింధీ పంజాబీ కాందిశీకులు చర్మ వ్యాపారాన్ని చేపట్టారు. సలీమ్ మీర్జాకు వ్యాపారం దుర్భరం కాసాగింది. ఆ వ్యధలో అతను తాను కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలను కున్నాడు.
షంసాద్ తండ్రి అక్రమ వ్యాపారం చెయ్యడం మొదలెట్టాడు. విషయం బయట పడబోతున్న సమయంలో అతను కొడుకు షంషాద్‌తో సహా పాకిస్తాన్‌కు ప్రయాణం కట్టాడు. ఆ సమయంలోనే సలీమ్‌తల్లి మరణించింది.
ఒకరోజు రోడ్డుమీద జరిగిన చిన్నప్రమాదం, దాంతో చెలరేగిన మత సంబంధమైన అల్లర్ల కారణంగా ఏ పాపం ఎరుగని సలీమ్ చావు దెబ్బలకు గురయ్యాడు. అతని ఫ్యాక్టరీ కూడా అగ్నికి ఆహుతయ్యింది.
తన కుమార్తెకూ, కొడుకుకూ పెళ్ళి ఏర్పాట్లు చెయ్యాలని షంషాద్ తల్లి ఆగ్రా వచ్చింది. అది చూసి అమీనా ఎంతో సంబరపడింది. సలీమ్ భార్య వివాహం తేదీ వివరాలు అడగబోతే ఆమె షంషాద్‌కు అమీనాను చేసుకోవడం లేదని, పాకిస్తాన్‌లో వున్న సంబంధాన్నే చూశామని చెప్పింది. అనుకున్న ఈ పెళ్ళికి కూడా అంతరాయం కలగడంతో అమీనా ఆత్మహత్య చేసుకున్నది.
మీర్జా సలీమ్ పూర్తిగా నిస్సహాయుడయ్యాడు. ఇంక లాభం లేదని, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. రైలు ఎక్కడానికి కొడుకుతో సహా, స్టేషన్‌కు బయల్దేరాడు. దారిలో వాళ్ళకు ఒక వూరేగింపు ఎదురైంది. జీవనోపాధికి సరైన మార్గం కావాలని చేస్తున్న ఆందోళన అది. సలీమ్ కొడుకు ఒక్కసారిగా, టాంగా దూకి ఆ సమూహంలో కలిశాడు. ఒక్క క్షణం ఆలోచించి సలీమ్ కూడా ఆ గుంపులో కలిశాడు. అతని దేశాభిమానమే అతనికి ఆశ్రయం ఇచ్చింది.[1]
సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్దిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
1974 | అకాడమీ పురస్కారాలు | ఉత్తమ విదేశీ భాషా చిత్రం | అబూ శివాని, ఇషాన్ ఆర్య, ఎం.ఎస్.సత్యూ[2] | ప్రతిపాదించబడింది |
1974 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ | గోల్డెన్ పామ్ కాంపిటీషన్ సెక్షన్ | అబూ శివాని, ఇషాన్ ఆర్య, ఎం.ఎస్.సత్యూ[3] | ప్రతిపాదించబడింది |
1974 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ జాతీయా సమైక్యతా చిత్రానికి నర్గీస్ దత్ అవార్డు | అబూ శివాని, ఇషాన్ ఆర్య, ఎం.ఎస్.సత్యూ[4] | గెలుపు |
1975 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ సంభాషణలు | కైఫీ అజ్మీ | గెలుపు |
1975 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ స్క్రీన్‌ప్లే | కైఫీ అజ్మీ, షమా జైదీ[5] | గెలుపు |
1975 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ కథ | ఇస్మత్ చుగ్తాయ్ | గెలుపు |