గాజుల లక్ష్మీనర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీనరసింహ శ్రేష్టి (1806-1868) వ్యాపారి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పౌరహక్కుల నాయకుడు, రాజకీయనేత. దక్షిణ భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రారంభానికి కృషిచేసినవారిలో అత్యంత ముఖ్యులు.[1] మద్రాసు ప్రెసిడెన్సీలో హిందువుల అణచివేత, క్రైస్తవ మతమార్పిడులు, ప్రభుత్వ మతపక్షపాతాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయం సాధించిన నాయకుడు.
లక్ష్మీనరసింహ శ్రేష్టి చెన్నపట్టణములోని పెరియామెట్టలోగాజుల బలిజ కులంలో 1806 వ సంవత్సరంలో జన్మించాడు.[2] అతని తండ్రి పేరు సిద్ధుల శెట్టి. ఆయన నీలిమందు వ్యాపారం చేసి సంపన్నుడైనాడు. కాబట్టి ఆయన విద్యాభ్యాసానికి ఎటువంటి లోటూ కలగలేదు. కానీ భారత దేశస్థులు ఆంగ్ల విద్య నభ్యసించడానికి పాఠశాలలేమీ లేకపోవడంతో ఆయన స్వదేశస్థులు స్థాపించిన చిన్న పాఠశాలలో చదువుకున్నాడు. ఆ పాఠశాలలో ఆయన తండ్రి సూచనల మేరకు వ్యాపారం చేయడానికి కావలిసిన లెక్కలు వేయడం, చదవడం, రాయడం మాత్రమే నేర్చుకున్నాడు. ధైర్యగుణం, స్వాతంత్ర్యం పట్ల ఆసక్తి, రాజకీయాలపట్ల ఆసక్తి ఆయనకు చిన్ననాటినుండే అలవడ్డాయి.
చదువు పూర్తయిన తరువాత తండ్రి దగ్గర వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని సిద్ధుల శెట్టి కంపెనీ అనే పేరుతో తండ్రితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు. ఆ కంపెనీ తరపున నీలిమందు మాత్రమే కాకుండా, చెన్నపట్టణములో రుమాళ్ళు కూడా అమ్మి బాగా ధనం గడించారు. ఆ తరువాత తండ్రి మరణించినా ఆయన స్వంతంగానే వ్యాపారం సమర్థవంతంగా నిర్వహించాడు. ఆ కాలంలో అమెరికాలో అంతర్యుద్ధం చెలరేగడంతో అక్కడ దూది ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడం కోసం భారత్, ఈజిప్టు లాంటి దేశాల్లో ఈ వ్యాపారం విరివిగా సాగింది. లక్ష్మీనర్సు కూడా ఆ వ్యాపారంలోకి దిగి లక్షల ధనమార్జించాడు.
కొంతకాలం తరువాత ధనసంపాదనతో సంతుష్టుడై తన దృష్టిని రాజకీయాలవైపు మళ్ళించాడు. ఆనాటికే చెన్నపట్టణానికి చెందిన తెలుగు ప్రముఖులు ఏనుగుల వీరాస్వామయ్య, కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై, వెంబాకం రాఘవాచార్యులు వంటివారు ఉన్నతవిద్య కోసం, స్త్రీవిద్య కోసం నడుపుతన్న సంస్కరణోద్యమాల వల్ల ప్రభావితులయ్యారు. వీరాస్వామయ్య, శ్రీనివాస పిళ్ళై, రాఘవాచార్యులు తదితరులు ప్రారంభించిన హిందూ లిటరరీ సొసైటీ, దాని ఆధ్వర్యంలో దేశచరిత్ర, రాజ్యాంగం, ప్రజల హక్కులు వంటివాటిపై చేసిన వివిధ సభలు, ప్రసంగాలు ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించాయి. ఇటువంటి అనేక కారణాల వల్ల గాజుల లక్ష్మీనర్సు శెట్టి రాజకీయాల్లో ప్రవేశించారు.[1] ఆంగ్లవిద్య లేకపోవడం వలన భారతీయులు చెన్నపట్టణములో ఆంగ్లేయ అధికారులతో అనేక కష్టాలు పడ్డారని గాజుల లక్ష్మీనర్సు శెట్టి భావించారు. చెన్నపట్టణంలో ఉన్నవారిదే సర్వాధికారమని భారతీయులు భావిస్తూ, ఇంగ్లండులో వారికి పై అధికారులు ఉన్నారనీ తెలియక అన్యాయాలకు గురయ్యారు. లక్ష్మీనర్సు ఆ అన్యాయాల గురించి తెలుసుకొని వాటిని ఎదుర్కోవడానికి చెన్నపట్టణ స్వదేశీ సంఘమును స్థాపించాడు. ఈ సంఘం యొక్క ముఖ్యోద్దేశం భారతీయులను ఆంగ్లేయుల అన్యాయాల గురించి చైతన్యవంతులను చేయడం. ధనికులైన వర్తకులు, దొరల కింద ఉద్యోగము చేయని పెద్దమనుష్యులు మొదలగువారు ఆ సంఘంలో పనిచేశారు. వీళ్ళందరూ ప్రజలతో పలుమార్లు సభలు నిర్వహించి వాళ్ళ సమస్యలను ఆంగ్లేయులతో విన్నవించారు.
19వ శతాబ్ది మధ్యభాగంలో, క్రైస్తవ మిషనరీలు బహిరంగ మతమార్పిడులను మద్రాసు ప్రెసిడెన్సీలోని ప్రజాసంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో చేపట్టేవి. వారి మతమార్పిడి కార్యకలాపాలు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ అధికారుల అండతో జరిగేవి. ఆ క్రమంలోనే బ్రిటీష్ అధికారులు ఉద్యోగాల్లో ఉన్నత పదవుల నియామకంలో స్థానిక క్రైస్తవులనే హిందువులకన్నా ఎక్కువగా ఎంచుకునేవారు. ఈ చర్య ద్వారా హిందువులను క్రైస్తవం వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నించేవారు. మద్రాసు ప్రభుత్వ మతవైఖరిని హిందువులు తరచుగా ఖండిస్తూండేవారు. వారిలో ఒకనిగా లక్ష్మీనర్సు హిందువుల వాదనను సమర్థిస్తూ మతమార్పిడులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
1844 అక్టోబరు 2న లక్ష్మీనర్సు శెట్టి హిందువుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పత్రిక క్రెసెంట్‌ను స్థాపించారు. మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్రకెక్కింది.[3] ఐతే స్థాపన నుంచి, పత్రిక ప్రభుత్వం నుంచి గట్టి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. క్రిసెంట్ పత్రిక గురించి ప్రభుత్వ ప్రచురణయైన ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్‌కు పంపిన ప్రకటన కూడా తిరస్కరించబడింది. అనంతర కాలంలో, క్రైస్తవునిగా మతమార్పిడి పొందిన హిందువు తన పూర్వీకుల పరంపరాగతమైన ఆస్తిపై హక్కును కోల్పోడన్న చట్టం చేసేందుకు ప్రభుత్వం తీర్మానించింది. ఈ ప్రయత్నాన్ని లక్ష్మీనర్సు శెట్టి నాయకత్వంలో హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తూ, గవర్నర్‌కు 1845 ఏప్రిల్ 9న మెమోరాండం సమర్పించింది. ఆందోళనకారులతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రణాళికలను గవర్నర్ విరమించుకున్నారు.
ఆపైన కాలంలో, మద్రాసు ప్రభుత్వం మద్రాసు విశ్వవిద్యాలయ విద్యార్థులకు బైబిల్ను ప్రామాణిక పాఠ్యగ్రంథంగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది.[4] విద్యార్థులను తరచుగా క్రైస్తవ మతసిద్ధాంతాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించేవారు. క్రైస్తవ గ్రంథభాగాల విజ్ఞానం లేని వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో తిరస్కరించేవారు. ఈ ప్రమాణాలను మద్రాసు ప్రెసిడెన్సీలోని హిందువులు వ్యతిరేకించారు. 1846 అక్టోబరు 7న పచ్చయప్ప కళాశాలలో జరిగిన నిరసన సమావేశానికి లక్ష్మీనర్సుశెట్టి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం మతవివక్ష, మతమార్పిడులకు ప్రభుత్వం అండగా వ్యవహరించడం వంటివి నిరసిస్తూ ఓ మొమోరాండం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కు పంపుతూ తీర్మానించింది. వారి ప్రయత్నాలు సఫలీకృతమై క్రైస్తవ మత సిద్ధాంతాన్ని పాఠ్యప్రణాళికలో చేర్చే ప్రయత్నాలు రద్దయ్యాయి. తిరిగి 1853లో, ప్రభుత్వం, మరోమారు బైబిల్‌ని విద్యా పాఠ్యప్రణాళికలో చేర్చేందుకు చేసిన ప్రయత్నాలను జార్జి నార్టన్, జాన్ బ్రూస్ నార్టన్, లక్ష్మీనర్సు శెట్టిలు నిరోధించారు.[4]