గిరిజా షెత్తర్

గిరిజా షెత్తర్
గీతాంజలి కథానాయకిగా ప్రసిద్ధిచెందిన గిరిజా షెత్తర్ (మే 2008)
జననం
గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్

(1969-07-20) 1969 జూలై 20 (వయసు 55)
వృత్తినటి, పాత్రికేయురాలు, తత్త్వవేత్త, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1989-ప్రస్తుతం

తెలుగు సినీరంగములో గిరిజగా పరిచయమైన గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్ (Girija Emma Jane Shettar) (జ. జూలై 20, 1969) తెలుగు సినిమా నటి. మణిరత్నం దర్శకత్వం వహించిన తెలుగు సినిమా గీతాంజలిలో కథానాయికగా ప్రసిద్ధురాలు. ఈమె వందనం అనే మలయాళ చిత్రము ద్వారా చిత్రరంగములో ప్రవేశించింది.[1] గిరిజ తండ్రి కర్ణాటకకు చెందిన వైద్యుడు, తల్లి ఇంగ్లాండుకు చెందిన వ్యాపారవనిత. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము, మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.[2]

గీతాంజలి

[మార్చు]

గిరిజ చెన్నైలో మణిరత్నం, సుహాసినిల పెళ్ళికి క్రికెట్ ఆటగాడు శ్రీకాంత్ యొక్క చెల్లెలితో వచ్చింది. పెళ్ళిలో ఆమెను చూసిన మణిరత్నం, తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. సీనియర్ అసోషియేట్ డైరెక్టరైన గాదిరాజు కేశవరావుతో ఆమెకు షూటింగుకు ముందు రెండు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. సంభాషణలను ఇంగ్లీషులో వ్రాసుకొని ఈమె కేశవరావుతో కలిసి ప్రాక్టీసు చేసింది. ఆ తరువాత గిరిజ, ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన వందనం అనే మలయాళం సినిమాలోనూ హృదయాంజలి అనే తెలుగు చిత్రంలోనూ నటించింది. హృదయాంజలి 1992లో పూర్తయినా 2002లో విడుదలైంది. ఈ సినిమాలో గిరిజ సరసన సంజయ్ మిత్రా నటించాడు. ఏ.రఘురామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎల్.వైద్యనాథన్ సంగీతము, మధు అంబట్ ఛాయాగ్రహణము సమకూర్చారు. హృదయాంజలి నాలుగు నంది అవార్డులను అందుకున్నది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం, యేసుదాసు పాడిన మంచిన పాటలున్నా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. గిరిజి జో జీతా వహీ సికందర్ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు స్టేజిపై డ్రామా వేసే సన్నివేశంలో ఒక పాటలో కనిపించింది. ఈ సినిమాకు మొదట కథానాయిక పాత్రకు గిరిజను ఎంపిక చేసుకున్నారు. కానీ ఎందుకనో మొదటి షెడ్యూలు తర్వాత ఈమె స్థానంలో ఆయేషా జుల్కాను తీసుకున్నారు.[3] ఆ తర్వాత గిరిజ లండన్ కు తిరిగి వెళ్లిపోయింది. గిరిజ ప్రస్తుతము రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు, సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉంది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల విలేఖరిగా పనిచేస్తున్నది.

గిరిజ నటించిన చిత్రాలు

[మార్చు]
  • గీతాంజలి
  • వందనం (మలయాళం)
  • హృదయాంజలి
  • ఖయామత్ సే ఖయామత్ తక్ (చిన్న పాత్ర)
  • ఇబ్బని తబ్బిదా ఇలెయాలి (కన్నడ) - 2023

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 August 2023). "ఈ హీరోయిన్ గుర్తుందా? 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీ!". Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.
  2. http://www.english-heritage.org.uk/server/show/ConWebDoc.12868
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-20. Retrieved 2009-06-17.

బయటి లింకులు

[మార్చు]