గిర్ కేసర్ మమిడి, భారతదేశంలోని గిర్నర్ పర్వత ప్రాంతాల్లో పండే మామిడి రకం. దీనిని గిర్ కేసర్ అని కూడా అంటారు. మంచి నారింజ పండు రంగులో ఉండే ఈ మామిడి గుజ్జు వల్ల ఈ రకం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రకం మామిడి పండుకు 2011లో భౌగోళిక గుర్తింపు లభించింది.
1931లో వంథలీలో జునాగఢ్ వాజిర్ సేల్ భాయ్ అనే ఆయన మొట్టమొదటిసారిగా ఈ రకపు మామిడి పండ్లను పండించారు. గిర్నర్ పర్వత ప్రాంతంలోని జునాగఢ్ లాల్ దూరీ ఫార్మ్ దగ్గర ఈ మొక్కలను మొదటగా నాటారు. 1934లో జునాగఢ్ నవాబు మహమద్ మహబత్ ఖాన్ 3 బంగారు నారింజ రంగులో ఉన్న ఈ పండు గుజ్జును చూసి, ఇది "కేసర్(కుంకుమపువ్వు)" వంటి రంగు కలిగినది అని అనడంతో ఈ రకానికి కేసర్ అనే పేరు వచ్చింది. గిర్ ప్రాంతంలో పండటం, కేసర్ అని నవాబు కితాబివ్వడంతో దీని పేరు గిర్ కేసర్ గా స్థిరపడిపోయింది.[1][2]
ఈ గిర్ కేసర్ మామిడి రకం గుజరాత్లోని సౌరాష్ట్రా ప్రాంతంలో జునాగఢ్, అమ్రేలీ జిల్లాల్లో దాదాపు 20,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటల్లో పండుతోంది. ఏడాదికి దాదాపు రెండు లక్షల టన్నుల మామిడి ఇక్కడ పండుతోంది. గిర్ అభయారణ్య ప్రాంతంలో పండే మామిడి పళ్ళను మాత్రమే గిర్ కేసర్ మామిడి అంటారు.[1]
వర్షాకాలం తరువాత అక్టోబరు నుంచీ ఈ రకం మామిడి పంట మొదలవుతుంది. ఏప్రిల్ నుంచీ ఈ పళ్ళు మార్కెట్లో దొరుకుతుంటాయి.[3] మామిడి రకాల్లో అత్యంత ఖరీదైన రకాల్లో గిర్ కేసర్ ఒకటి.[4]
గుజరాత్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ గిర్ కేసర్ మామిడిని భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2010లో అప్లికేషన్ పెట్టగా, చెన్నై భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రీ 2011లో జిఐ ట్యాగ్ ఇచ్చింది. గిర్ కేసర్ పేరుతో ఈ ట్యాగ్ లభించింది. గుజరాత్ నుంచి ట్యాగ్ లభించిన మొట్టమొదటి వ్యవసాయ వస్తువు, భారతదేశంలోని రెండో మామిడి రకం ఇదే కావడం విశేషం.[5][6]