గుమ్మడి వెంకటేశ్వరరావు

గుమ్మడి వెంకటేశ్వరరావు
గుమ్మడి
జననం(1927-07-09)1927 జూలై 9
మరణం2010 జనవరి 26(2010-01-26) (వయసు 82)
వృత్తిసినిమా నటుడు
జీవిత భాగస్వామిలక్ష్మీ సరస్వతి
పిల్లలుఐదుగురు కుమార్తెలు ,ఇద్దరు కుమారులు
తల్లిదండ్రులు
  • బసవయ్య (తండ్రి)
  • బుచ్చెమ్మ (తల్లి)
పురస్కారాలుపద్మశ్రీ, కళాప్రపూర్ణ : రఘుపతి వెంకయ్య అవార్డు

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు [1][2][3] (జూలై 9, 1927 - జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

గుమ్మడి పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల వేషాలు ధరించినా సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు.

ఎన్ టి ఆర్ తో నటించిన తోడు దొంగలు (1954), మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడుగా ఎంపికయ్యాడు. మాయా బజార్ (1957), మా ఇంటి మహాలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు (1962), జ్యోతి (1977), నెలవంక (1981), మరో మలుపు (1982),ఏకలవ్య (1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982), గాజు బొమ్మలు (1983), పెళ్ళి పుస్తకం (1991) గుమ్మడికి పేరుతెచ్చిన సినిమాలలో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు (1962)లో కథానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది

జాతీయ సినిమా బహుమతులకు న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. అతను తనజీవిత చరిత్ర తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు అన్న పేరుతో రచించాడు. అతనుకిద్దరు (1995) లో ఆరోగ్యం సరిగాలేక గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వాడటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. మరల జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర (2008) లో అతను వయస్సు, గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు [4]

బాల్యము , విద్యాభ్యాసం

[మార్చు]

గుమ్మడి స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఇతను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతను తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. ముగ్గురు తమ్ములు, ఒక చెల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల అప్యాయతానురాగాల మధ్య గారాబంగా గుమ్మడి జీవితం గడిచింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు అనుబంధాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి అయనకు అవకాశం కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి జీవితం అతను నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలలో అతను జీవించడానికి సహకరించింది. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్యలు, రక్తసంబంధంతోనే కాక స్నేహానుబంధంతో మెలిగేవారని గుమ్మడి మాటలలో తెలుస్తుంది. గుమ్మడి వెంకటేశ్వరరావు నాయనమ్మకు అమ్మమ్మ 103 సంవత్సరాలు జీవించడం వారి కుటుంబంలో ఒక విశేషం.

విద్యార్థిజీవితం రాజకీయ ప్రభావాలు

[మార్చు]

గుమ్మడి ప్రాథమిక విద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు సొంతూరైన రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ అతను ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఇతను తమ ఊరిలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిష్ట్ సాహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ ఉన్న అయన భావాలకు ఆందోళన చెందిన పెద్దవారు ఆ ఊరి మునసబు దొడ్డపనేని బుచ్చిరామాయ్యను ఆశ్రయించి అతను మనసు మార్చారు. ఐనా వారికి గుమ్మడి మీద సరైన విశ్వాసం కుదరలేదన్నది వాస్తవం. వివాహానంతరం గుమ్మడి గుంటూరు హిందూ కళాశాలలో చేరడానికి అతనుతో వెళ్ళిన పెద్ద వారు. గుమ్మడి కమ్యూనిష్టు భావాలతో ప్రభావితుడై ఉన్నాడని అందువలన కళాశాలలో సీటు ఇవ్వ వద్దని అభర్ధన చేయడం వారికి గుమ్మడి మీద విశ్వాసం కలగలేదన్న దానికి నిదర్శనం. స్వాతంత్ర్య పోరాట వీరుడైన కళాశాల ప్రిన్చిపాల్ తమ విద్యార్థులలో చాలా మందికి రాజకీయప్రవేశం ఉన్నదని తాము వారిని సరైన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చచెప్పి కళాశాలలో చేర్చుకున్నాడు.

వివాహం

[మార్చు]

గుమ్మడి ఎస్.ఎస్.ఎల్.సి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అయ్యాడు. తన తరువాత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కాలేజిలో సాగించాలని ఎంతో అభిలషించినా పెద్దవారు మాత్రం అతనుకు ముందున్న కమ్యూనిష్టు ఆసక్తిని తలచి దారితప్పి వ్యవహరిస్తాడని భావించి ఉన్నత విద్యకు అంగీకరించక వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటికి అతను వయస్సు 17 సంవత్సరాలు కావడం విశేషం. పెద్దల వివాహప్రయత్నాన్ని వద్దని వారించగలిగిన వయస్సు కాని, మానసిక పరిపక్వత కాని లేని ఆ వయస్సులో, అతను వివాహం 1944లో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మ అయిన 103 సంవత్సరాల వృద్ధురాలు, నాయనమ్మ, అమ్మమ్మ వంటి పెద్దల ఆశీర్వచనంతో లక్ష్మీ సరస్వతితో జరిగింది. గుమ్మడిని తను కుమారుడిగా భావించిన అతను అత్త, వివాహానంతరం అతను విద్యాభిలాషను గమనించి గుంటూరు హిందూ కాలేజ్‌‌లో ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించింది. అత్త సహకారంతో గుంటూరు హిందూకాలేజ్‌లో ఇంటర్ వరకు (1944-1946) చదువు సాగింది. అతను సహవిద్యార్థిప్రముఖ చలనచిత్ర నటి సీనియర్ శ్రీరంజని కుమారుడైన ఎమ్. మల్లికార్జునసాహచర్యంతో అతనులో కలిగిన విపరీత చలనచిత్ర మోహం వలన, ఇంటర్ పరీక్షలో అపజయం ఎదురైంది. ఈ అపజయంతో అవకాశం లభించిన పెద్దలు, అతనును వెనుకకు పిలిచి వ్యవసాయపు పనులను అప్పగించారు. అంతటితో అతను విద్యార్థిజీవితం ఒక ముగింపుకు వచ్చింది.

రంగస్థల జీవితం

[మార్చు]

గుమ్మడి వెంకటేశ్వరరావు రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది. అతను ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులలోనే ఉపాద్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడైన పేద రైతుగా నటించాడు. ఆ నాటకంలో అతను నటనకు ఒక గుర్తింపు లభించింది. అలా అతను రంగస్థల అనుభవం మొదలైంది. విద్యాభ్యాసం ముగించి గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ బాధ్యతలు చేపట్టిన తరువాత తీరిక లభించినప్పుడల్లా గ్రామ గ్రంథాలయంలో పుస్తకాలను చదవడం అలవాటుగా ఉండేది. పుస్తకాలంటే అతనుకు విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒకసారి అతను వీరాభిమన్యు నాటకం చదవడం జరిగింది. ఆకాలంలో నాటకాలంటే పద్యాలు అధికం వచనం కొంచెంగా ఉండేది కాని ఈ నాటకంలో వచనం అధికం ఉండడం అతనుకు ఆసక్తిని కలిగించింది. కొంత మంది స్నేహితులను కూర్చుకుని స్వంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించాడు. ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి మాధవపెద్ది వెంకట్రామయ్య వరకు చేరింది. ఒకసారి అతనును మాధవపెద్ది వెంకట్రామయ్య స్వయంగా పిలిచి అతనుకు దుర్యోధన పాత్రకు ఎలా మెరుగు పెట్టాలో నేర్పించి అబ్బురపరిచాడు. ఆ తరువాత వారిరువురికి పెరిగిన పరిచయం మాధవపెద్ది వెంకట్రామయ్య నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు దుర్యోధన పాత్ర వహించి, మాధవపెద్ది వెంకట్రామయ్య కర్ణపాత్ర వహించి నటించే వరకు వచ్చింది. ఆ నాటకంలో నటించిన అనంతరం అతను గుమ్మడి వెంకటేశ్వరరావుతో " నాటకం బాగా చేసావు కాని నాటకంలో నటించడానికి కావలసిన ఆంగికాఅభినయం కంటే సాత్విక అభినయం అధికంగా ఉంది. చలన చిత్రాలలో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు " అని సలహా ఇచ్చాడు. ఆ తరువాత గుమ్మడి మనసు చలనచిత్ర రంగం వైపు మొగ్గింది.

చలనచిత్ర ప్రవేశానికి ప్రయత్నాలు

[మార్చు]

చలనచిత్రాల మీద గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉన్న విపరీతమైన మోహానికి మాధవపెద్ది వెంకటరామయ్య మాటలు తోడయ్యాయి. ఆసమయంలో అతను తోడల్లుడు వట్టికూటి రామకోటేశ్వర రావు, అతను మీద ఉన్న అభిమానంతో, తెనాలిలో, ఆంధ్రా రేడియోస్ అండ్ ఎలెక్ట్రానిక్స్ అనే షాపు పేరుతో వ్యాపారం పెట్టించాడు. వ్యాపారం పెట్టినా, నటనా వాసనలు అతనును వదలని కారణంగా షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది. వ్యాపారం నష్టాలను చవి చూసింది. కుటుంబం ఇద్దరు పిల్లల వరకు పెరిగింది. తెనాలిలో అతనును కలసిన సహవిద్యార్థిమల్లిఖార్జునరావు చలనచిత్రాలలో నటించమని సలహా ఇచ్చాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు తొలి సారిగా చలనచిత్ర నటనాభిలాషతో, మల్లిఖార్జునరావుతో కలిసి మద్రాసుకు ప్రయాణం చేసాడు. మద్రాసులో కె.ఎమ్.రెడ్డి, హె.ఎమ్.రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కొరకు అర్ధించి చూసాడు. వారు అతనుకు సుముఖమైన సమాధానం ఇవ్వక పోవడంతో తిరిగి తెనాలి వెళ్ళి యధావిధిగా జీవితం సాగించాడు.

సినీరంగ ప్రవేశం

[మార్చు]

గుమ్మడి వెంకటేశ్వరరావు ఎదురు చూడని సమయంలో నటనావకాశం లభించింది. ఆసమయంలో లక్షమ్మ, శ్రీలక్షమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. లక్షమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు, కథానాయిక కృష్ణవేణి నిర్మాత. శ్రీలక్షమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శకనిర్మాత కాగా అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి నాయికానాయకులుగా ఉన్నారు. అందులో ఒక పాత్రకు, రంగస్థల నటి శేషమాంబాను ఒప్పించటానికి, ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డి.ఎల్ నారాయణరావు తెనాలి వచ్చాడు. శేషమాంబ భర్త,డి.ఎల్.నారాయణరావును గుమ్మడివెంకటేశ్వరరావు షాపుకు తీసుకువచ్చి, గుమ్మడిని పరిచయంచేసి,అయన రంగస్థల అనుభమున్న నటుడు అని చలన చిత్ర అవకాశం ఇవ్వమని సిఫారసు చేసాడు. డి.ఎల్.నారాయణరావు అతనితో గుమ్మడి వెంకటేశ్వరరావుకు శ్రీలక్షమ్మ అన్న పాత్ర ఇస్తానని చెప్పి వెళ్ళాడు కాని అతను వెళ్ళే సమయానికి ఆ పాత్రకు వేరొకరిని ఎన్నిక చేయడంతో ఆ అవకాశం చేజారింది. అయినప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలు మాత్రం అతను జేబులో అలా ఉండిపోయాయి. శ్రీలక్షమ్మ చిత్రం రీళ్ళను లాబ్‌కు తీసుకు వెళ్ళి, అక్కడ లాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందరరాజ అయ్యంగార్ తో మాట్లాడిన సమయంలో, సౌందరరాజ అయ్యంగార్ తెలుగులో తీయబోయే చిత్రానికి కొత్తవాళ్ళు కావాలని అడగడంతో డి.ఎల్ నారాయణరావు అతను జేబులో ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు ఫోటోలను అందించాడు. వాటిని చూసిన సౌందరరాజ అయ్యంగార్ అతనికీ అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్ర జీవితం ఆరంభమయింది. గుమ్మడి వెంకటేశ్వరరావును తంతిద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి వెయ్యి రూపాయల పారితోషికం ఇచ్చి చెప్పినప్పుడు రమ్మని చెప్పి పంపారు. ఆ చిత్రం పేరు అదృష్టదీపుడు (1950) దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు పాత్ర ముక్కామల అసిస్టెంట్.

సినీరంగ జీవిత ఆరంభం

[మార్చు]

గుమ్మడి సినీప్రవేశం అదృష్ట దీపుడు (1950) సినిమాతో జరిగింది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి, అవకాశాలు లేవని, తిరిగి వెళ్ళాలని భావించిన సమయంలో, ఎన్.టి. రామారావుతో కలిగిన పరిచయం వలన అతను గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్ళవద్దని, తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్.టి. రామారావు అతనుకు తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఎన్.టి.రామారావు తన తరువాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడుదొంగలుగా అయన, ఎన్.టి.రామారావు నటించారు. ఆ చిత్రం విజయం సాధించక పోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం.

చలనచిత్ర జీవితంలో అభివృద్ధి

[మార్చు]

తోడు దొంగలు చిత్రం తరువాతకూడా చిన్నచిన్న వేషాలతో కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు చలచిత్ర జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఆయనుకు అభించింది. అదే అర్ధాంగిలో శాంతకుమారి భర్త, జమీందారు వేషం లభించడం. ఆచిత్ర ఘన విజయం కారణంగా చలచిత్ర రంగానికి గంభీరమైన తండిపాత్రల నటుడు లభించాడు. ఆ చిత్రంలో నటించడానికి, నిర్మాత పుల్లయ్యను కలవడానికి వెళ్ళిన సమయంలో, ప్రముఖ నటీమణి శాంతకుమారి అయన చిన్నవాడని ఆ పాత్రకు తగడని చెప్పినా పుల్లయ్య అంగీకరించక తాను అనుకున్నట్లు ఆ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావును నటింపజేసాడు. ఆ తరువాత ఆయన వెనుచూడకుండా నటజీవితంలో ముందుకు సాగాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు చిన్నవయసులోనే కారెక్టర్ నటునిగా మారాడు. నిజానికి రామారావు, నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్నవాడే అయినా అనేక చిత్రాలలో ఆ ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించాడు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించాడు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించాడు. అత్యంత విరుద్ధమైన వశిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రశంసలు అందుకున్నాడు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించాడు. తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ (డబ్బింగు) మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతోపాటు ప్రతినాయకునిగా (నమ్మినబంటు, లక్షాధికారి) కూడా నటించాడు.

కుటుంబజీవితం

[మార్చు]

గుమ్మడి వెంకటేశ్వరరావు జీవితం ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో పెద్దల ఆదరాభిమానాల మధ్య జరిగింది. వ్యవసాయ కుటంబంలో పల్లెటూరి జీవితంతో ప్రారంభం అయింది. పల్లెవాసులలో ఉండే అప్యాయతలు అనుబంధాలు కొంత వ్యక్తిత్వం మీద ప్రభావం చూపాయి. ఉన్నత పాఠశాల వరకు వెలుపలి ఊరికి వెళ్ళి చదువు సాగించడం వంటి అనుభవాలు ఉన్నాయి. నాటకాల మీద నటన మీద ఉన్న ఆసక్తి చలనచిత్రాల మీద ఉన్న వ్యామోహం వలన చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది. కమ్యూనిష్టు భావాల ప్రభావితుడు అయిన కారణంగా అతను జీవితం గాడి తప్పగలదని భావించిన తల్లితండ్రులు పెద్దల సమక్షంలో 17 ఏట వివాహం జరిపించడం వలన చిన్న వయసులోనే బాధ్యతలను మోయవలసిన అవసరం ఏర్పడింది. అత్తగారి అభిమానం తోడల్లుడి అభిమాన పాత్రుడు అయ్యాడు. సినీజీవితంలో ప్రవేశించే సమయానికి ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. సినీజీవిత ఆరంభంలోనే ఎన్.టి రామారావు పరిచయం కలిగింది. అలాగే ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎన్.టి.రామారావు తన స్వంత చిత్రంలో అవకాశం ఇవ్వగానే అతను తండ్రి గుమ్మడికి కుటుంబాన్ని తీసుకురావడం మంచిదని చొరవగా సలహా ఇచ్చాడు. అతను సలహాను పాటించి కుటుంబాన్ని మద్రాసుకు తీసుకు వచ్చాడు. గుమ్మడి వెంకటేశ్వరరావుకు అయిదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయన తన కుటుంబానికి బాధ్యతాయుతమైన తండ్రిగా వ్యవహరించారు. కుటుంబ శ్రేయస్సు కోరి చిత్రనిర్మాణానికి దూరంగా నిలిచారు. కుమార్తె మరణం, సతీమణి వియోగం కొంత బాధను కలిగించినా తృప్తికరమైన జీవితం అనుభవించినట్లు తన మాటలలో చెప్పుకున్నాడు.

ప్రభావితం చేసిన వ్యక్తులు

[మార్చు]

గుమ్మడి వెంకటేశ్వరరావు ఉన్నత పాఠశాలలో చదివే సమయంలో అతను తెలుగు మాస్టారు అయిన జాస్తి శ్రీరాములు చేత ప్రభావితుడయ్యాడు. ఆకారణంగా అతనుకు తెలుగు భాష మీద అభిమానం ఏర్పడాడానికి కారణం అయింది. ఆకారణంగా తెలుగు మీద ప్రత్యేక ఆసక్తి కలగడం వలన మాస్టారు గుమ్మడికి ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న వయసులో ముసలి పేద రైతు పాత్రను ఇచ్చి నటింపచేసాడు. గుమ్మడి నటించిన ఆ పాత్రకు ప్రశంస లభించి బహుమతి కూడా లభించింది. అతనుకు నటన మీద ఆసక్తి కలగడానికి అది నాంది అయింది. తరువాత గుమ్మడి ప్రభావితుడైంది ఆ ఊరి మునసబు దొడ్డపనేని బుచ్చి రామయ్య. మునసబు ఊరి ప్రజల అభిమానాన్ని గౌరవాన్ని అందుకున్న వాడు గుమ్మడి కంటే చాలా వసు ఉన్నావాడు. కమ్యూనిష్టు నాయకుడు పుచ్చపల్లి సుందరయ్య ప్రసంగంతో గుమ్మడి వెంకటేశ్వరరావు ఉన్నత పాఠశాల జీవితంలో ప్రభావితుడై కమ్యూనిష్టు సహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ తిరగడం వంటివి చూసి ఆందోళన చెందిన పెద్దలు బుచ్చిరామయ్యను ఆశ్రయించడంతో అతను గుమ్మడితో స్నేహపూర్వకంగా మాట్లాడి కాంగ్రెస్ ఔన్నత్యం తెలియజేసి గుమ్మడిని కమ్యూనిష్టు ప్రభావం నుండి దూరం చేసాడు. ఊరిలో గౌరవమధ్యాదలు ఉన్న 50 సంవత్సరాల పెద్దమనిషి 15 సంవత్సరాల పిన్న వయస్కుడైన గుమ్మడితో స్నేహపూర్వకంగా సంభాషించి మార్పు తీసుకువచ్చిన అతను సౌభత్రత్వం గుమ్మడిని చాలా ప్రభావితం చేసింది. ఇలా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన బుచ్చురామయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు జీవితాన్ని ప్రభావితంచేసిన వ్యక్తుల్లో ఒకడు అయ్యాడు. గుమ్మడి వెంకటేశ్వరరావును ప్రభావితం చేసిన మరోవ్యక్తి నాటక నటుడు మాధవపెద్ది వెంకటరామయ్య అతను గుమ్మడి వెంకటేశ్వరరావును స్వయంగా వెతుక్కుంటూ వచ్చి తనతో తీసుకు వెళ్ళి నాటక నటుడిగా తర్పీదు తనతో సమానమైన పాత్ర ఇచ్చి నటింపచేసి చలనచిత్రాలలో నటించే ప్రయత్నాలు చెయ్యమని సలహా ఇచ్చి గుమ్మడి నటుడుగా మారడానికి ఒక కారణం అయ్యాడు.


మరి కొన్ని విశేషాలు

[మార్చు]
  • గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనుకు భార్యగా నటించిన శాంత కుమారి అతనుకంటే 8 సంవత్సరాలు పెద్దది. అలాగే అతనుకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు అతనుకంటే 3 సంవత్సరాలు పెద్ద. అతను చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య అతను కంటే 1 సంవత్స్దరం పెద్ద.
  • ఆరంభకాలంలో చిత్రాలలో నటించడానికి మద్రాసు వచ్చి తీసుకు వచ్చిన డబ్బులు అయిపోయి రెండు రోజుల మంచినీటితో సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్ళినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నాడు. అతను జీవితంలో అతను భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని అతనుమాటల వలన తెలుసుకోవచ్చు.
  • మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలుగా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.
  • గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా వున్న కాశీనాయన పాత్ర పోషించాడు.
  • గుమ్మడి 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరుతో జీవనస్మృతుల్ని అక్షరీకరించాడు. తొలి ముద్రణ ప్రతులన్నీ, కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు.
  • నటుడిగా అవకాశాలు వచ్చినా ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నాడు.

గుమ్మడి పోషించిన పాత్రలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  • 1998 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది.
  • 1982 లో మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.
  • 1970 లో చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.

మరణం

[మార్చు]

గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైద్రాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో 2010, జనవరి 26 న చాలా శరీరఅవయవాలు పనిచేయక మరణించాడు. అతను చివరిగా మాయాబజార్ (రంగులలోకి మార్చిన) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు. "ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి వున్నాను" అని సంతోషం వ్యక్తం చేశాడు.

చిత్రలహరి

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-18. Retrieved 2007-08-08.
  2. ఈనాడు దినపత్రిక, తేది 27-01-2010
  3. "టోటల్ టాలీవుడ్లో గుమ్మడిపై వ్యాసం". Archived from the original on 2007-06-23. Retrieved 2007-08-08.
  4. Telugu Cinema Tribute Archived 2010-01-31 at the Wayback Machine Star Profiles Gummadi

బయటి లింకులు

[మార్చు]